వి.వి.స్వామి
వి.వి.స్వామి తెలుగు సినిమా నటుడు, రంగస్థల కళాకారుడు.
జీవిత విశేషాలు[మార్చు]
వి.వి.స్వామి ప్రకాశం జిల్లా వేములపాడు (హనుమంతునిపాడు) గ్రామంలో 1934వ సంవత్సరం ఉప్పుటూరి కోటయ్య చెంచమ్మలకు జన్మించారు. ఆయన చీరాలలో ఇంటర్, కావలి విశ్వోదయ కళాశాలలో బిఎ చదివారు. చింతామణి నాటకంలో పాత్ర అయిన సుబ్బిశెట్టికి జీవం పోశారు[1]. తిరుపతి యూనివర్శిటీలో జరిగిన నాటక పోటీల్లో బెస్ట్ కమెడియన్ అవార్డు, 1956లో ఢిల్లీలో జరిగిన అఖిల భారత నాటక పోటీల్లో రాష్టపతి నుండి బహుమతులు, ప్రశంసా పత్రాలు, నర్సాపూర్ నాటక పరిషత్‌లో దగాకోరు దాసయ్యగా బెస్ట్ కమెడియన్‌గా అవార్డు అందుకున్నారు. 1957లో చీరాలలో వైకుంఠ సమారాధన నాట్యమండలిని స్థాపించారు. పల్నాటి యుద్ధం సినిమాలో కొడాలి గోపాలరావు తో కలిసి డైలాగులను రాశారు. ఆ సినిమాలో నటించారు. నామాల తాతయ్య, తోకలేనిపిట్ట సినిమాల్లో నటించారు. పెళ్ళిచేసిచూడు, చల్ మోహన్‌రంగా సీరియల్స్‌లోను ఆయన నటించారు. డబ్బారాయుడు- సుబ్బారాయుడు అనువాద చిత్రంలో నగేష్ కు డబ్బింగ్ చెప్పారు. అదేవిధంగా హెచ్‌ఎంవి కంపెనీలో చీరాల చంద్రమతి, చీరాల శశిరేఖ, చీరాల సావిత్రి, సినిమాపిచ్చి, పెళ్ళిబేరం, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, పూజామందిరం, రాధిక విలాపం, భక్తిపాటలు, షిర్డీసాయిబాబా భక్తి గీతాలు, కుర్చీల కుమ్ములాట- ఇంటింటా నవ్వులాట క్యాసెట్లను రూపొందించి రాష్ట్ర ప్రజలకు అందించారు. కన్యకాపరమేశ్వరి నాటకాన్ని ఫిలోజీ రుషేంద్రుల చరిత్ర హరికథ, బుర్రకథగా రచించారు. కళ్ళెంలేని గుర్రాలు, విక్రమార్క సింహాసనం, రేడియో నాటికలను రచించారు. 1969లో వివి స్వామి సోదరుడు చీరాల సుబ్బయ్య, ఆయన వి లతాలక్ష్మి గారితో నరసరావుపేటలో శ్రీలక్ష్మి నాట్యమండలి సమాజాన్ని స్థాపించారు. అప్పటి నుండి నేటివరకు శ్రీహరి, చింతామణి, సుబ్బిశెట్టి వంటి ప్రధాన పాత్రలతో చీరాల సుబ్బయ్య, వివి స్వామి, లతాలక్ష్మి కలిసి ఐదారువేలకు పైగా ప్రదర్శనలను ఇచ్చారు[2][3]. చింతామణి నాటకంలోసుబ్బిశెట్టి పాత్రగా, శెట్టిగారి పెత్తనం, లంచం ఇస్తే మంచం, యమలోకంలో సుబ్బిశెట్టి[4], భూలోకంలో సుబ్బిశెట్టి, కామెడీ రికార్డులను ప్రజలకు అందించారు. ఆయన నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాల్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2003వ సంవత్సరంలో ఆయన సతీమణి చింతామణి ఫేం లతాలక్ష్మి చనిపోవడంతో ఒంటరయ్యారు. స్వామికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు.11.3.2012న కన్నుమూశారు.