వీరమాచనేని ఆంజనేయ చౌదరి
వీరమాచనేని ఆంజనేయ చౌదరి (డిసెంబర్ 23, 1891 - 1988) స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు.
జననం
[మార్చు]వీరు డిసెంబర్ 23, 1891 తేదీన అనగా నందన నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య, లక్ష్మమ్మ. చిన్నతనంలోనే తల్లితోపాటు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేవాడు. పెద్దగా చదువుకోలేదు. అయినా ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అర్చకులు చదివే శ్లోకాలను ఒక్కసారి విని తిరిగి చెప్పేవాడు.
పది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో మేనమామల గ్రామం రేపల్లె తాలూకాలోని నల్లూరు చేరారు. అక్కడ వ్యవసాయపనులు చేసుకొంటూ తీరికవేళల్లో పురాణ, హరికథా కాలక్షేపాలకు వెళ్ళి భారత, భాగవత, రామాయణ కథా విశేషాలను గ్రహించి అందులోని పద్యాలను కంఠస్థం చేశారు. కొందరు ఆచార్యులను స్నాన మంత్రాలు, సూర్యనమస్కారాలు మొదలైన వాటిని నేర్పడానికి తిరస్కరించారు. ఆ మంత్రాలను తాను ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన మొదలై అన్వేషించారు. తమ పురోహితులు రఘునాయకులు గారు చదివే మంత్రాలకు ఆకర్షితులై వారు గ్రామంలో జరిపించే శుభాశుభ కార్యాలన్నిటికి హాజరై కర్మకాండను గ్రహించారు. కానీ మంత్రభాగం నేర్చుకోలేకపోయారు. కొంతకాలానికి ప్రతాపరామయ్య అనే అద్వైత వేదాంత గురువును ఆశ్రయించి వారిద్వారా శ్రీరామమంత్రోపదేశాన్ని పొందారు.
ఒకనాటి రాత్రి స్వామివారు కలలో ప్రత్యక్షమై తన నాలుకపై బీజాక్షరాల్ని వ్రాసి అంతర్ధానమయ్యారు. తదనంతరం సాధువులను ఆశ్రయించి వేదాంత తత్వాన్ని వింటూ పురాణ స్రవణం చేస్తూ పూజాపునస్కారాలు చేస్తూ కాలం గడిపారు.
ఒకనాడు గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతీ స్వాములవారు దేశ సంచారం చేస్తూ నల్లూరు వచ్చి మూడు రోజులు సభలు జరిపి కమ్మవారికి కూడా వేదాద్యయన, యజ్నోపవీత ధారణ అధికారాలున్నవని వివరించగా ఎందరో బ్రాహ్మణేతరులైన గ్రామస్థులు యజ్నోపవీతాలను ధరించారు. వారిలో ఆంజనేయులూ ఒకరు. అదే గ్రామంలో ఒక కమ్మవారి యింట ఆబ్దికమును సరస్వతీ స్వాములవారు ఆంజనేయులతో చేయించారు. అందుకు అవసరమైన మంత్రభాగాన్ని స్వాములవారు నేర్పించారు. అప్పుడు "కమ్మవారిలో వేదోక్తముగా పౌరోహిత్యం చేయించగలవారు నల్లూరు గ్రామమునందు కలరు. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చును" అని ఆంధ్రపత్రికలో సరస్వతీ స్వామూలవారు ప్రకటించారు. ఆవిధంగా స్వసంఘ పౌరోహిత్యానికి వీరు మూలపురుషుడైనారు. ఆనాటి ప్రసిద్ధులైన బ్రాహ్మణేతరులెందరో వీరిచేత వివాహాదికర్మలు చేయించారు.
స్వాములవారి ఆశీర్వాదంతో నల్లూరు గ్రామంలో వేద పాఠశాలను స్థాపించి వివిధ జిల్లాల నుండి బ్రాహ్మణేతర విద్యార్థులకు పౌరోహిత్యం నేర్పారు. ఈ పాఠశాల తర్వాత సమీపంలోని మైనేనివారిపాలెం అన్న గ్రామానికి మారింది. అక్కడ మైనేని వెంకట్రామయ్య అనే భూస్వామి ఎకరంపైబడిన భూమిని దానం చేశారు. గ్రామస్తుల సహకారంతో అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మింపజేసి దానిని మలయాళ స్వాములవారిచే ప్రారంభం చేయించారు. దానిని శ్రీ సనాతన వేదాంత నిష్టాశ్రమముగా పేర్కొన్నారు. తర్వాత అక్కడ ఒక సంస్కృత పాఠశాలనుకూడా ఏర్పాటుచేశారు. దానికోసం ఆరు ఎకరాల భూమిని ఆంజనేయులు సేకరించారు. కాలక్రమాన ఈ పాఠశాల లౌకిక పాఠశాలగా మార్పుచెందింది.
మరణం
[మార్చు]వీరు 1988లో తన ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచారు. వీరి భౌతిక కాయాన్ని కృష్ణానదీ తీరంలోని ఆశ్రమం వద్దనే సమాధి చేశారు.