నార్ల వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
(వీ.ఆర్.నార్ల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నార్ల వెంకటేశ్వరరావు
Narla Venkateswara Rao.jpg
జననండిసెంబర్ 1, 1908
జబల్‌పూర్, మధ్య ప్రదేశ్[1]
మరణంఫిబ్రవరి 16, 1985
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణముగుండెపోటు
ఇతర పేర్లువీ.ఆర్.నార్ల
వృత్తిపాత్రికేయుడు
మతంహిందు
భార్య / భర్తసులోచనా దేవి
పిల్లలు3 కుమారులు, 5 కుమార్తెలు
తండ్రిలక్ష్మణ రావు.
తల్లిమహాలక్ష్మి.

నార్ల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 1, 1908 - ఫిబ్రవరి 16, 1985) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు.

జీవిత విశేషాలు[మార్చు]

మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం కృష్ణాజిల్లాలో జరిగింది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించాడు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 20,000 పుస్తకాలు ఉండేవట. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రజ్యోతి' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు.

సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధుడాయన.[2]

సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ 'శంబూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.

ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు.తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. సంపాదకుడు అనే మాట ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు. ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. 'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.

సెన్సార్ కు సెన్సార్[మార్చు]

జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు -జైలులోకి విడుదలచేయబడ్డ ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని —ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారికి ఉత్తరం రాశారు. తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా వెంకటేశ్వర రావుగారు ఒక రోజు పత్రిక మొదటిపేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికాప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది.

ఇయన చెప్పిన విశేషాలు[మార్చు]

 • ఎన్.టి. రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు.
 • ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ కు నార్లకు అభిప్రాయ భేదాలు వచ్చాయి.రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతి స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆయన్ను చూచి చాలా మంది షేర్లు కొన్నారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త వరవడులు ప్రవేశపెట్టారు. సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. ఆయన రాత ఒక పట్టాన అర్థం అయ్యేదికాదు. ఉడయవర్లు అనే జర్నలిస్టు తిప్పలు బడి రాసి పంపేవాడు.
 • తరచు ఆదివారాలు హైదరాబాదులో అబిడ్స్ ప్రాంతాన పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు వెతికేవారు. ఆయనకు యీ అలవాటు మద్రాసులో మూర్ మార్కేట్ నుండి ఉంది.
 • నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశాడు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు.
 • ఆయనకు త్రిపురనేని రామస్వామి రచనా శైలి నచ్చలేదు. త్రిపురనేని గోపీచందుకు ఆయనకూ పడలేదు. గోపీచంద్ ఆపదలో వున్నప్పుడు సహాయపడినా, విశ్వాసం లేదని నార్ల అనేవాడు. కాని గోపీచంద్ చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం రాశారు.
 • నార్ల దగ్గర వుద్యోగం చేసిన తిరుమల రామచంద్ర ఉద్యోగం పీకేశాడు.
 • నార్ల ఏ రాజకీయ వాదినీ వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన కలానికి గురైన వారే. ఎన్.జి. రంగాపై ధ్వజం ఎత్తినప్పుడు, గోగినేని రంగనాయకులు అని పతాక శీర్షికలతో రోజూ ఆయన వార్తలు ప్రచురించేవారు. రంగా బాధపడ్డారు. అమ్మ నాన్న పెట్టిన పేరు వాడితే అంత గింజులాట దేనికి అని నార్ల అనేవాడు.
 • 1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పిపొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తికొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండి రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించారు.
 • ఎం. చలపతిరావు నార్ల ఇంట్లో వుండేవారు. విపరీతంగా నత్తి వుండేది.
 • నార్లను సభలకు పిలిచినప్పుడు ఆయన ప్రసంగాలు ఆకర్షణీయంగా వుండేవి కావు. విషయం వున్నా, ఆయన సభారంజకుడుకాదు. రచనలలో వున్న పట్టు, ప్రసంగాలలో లేదనిపించేది.
 • వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వాఙ్మయ మహాధ్యక్ష అని బిరుదు తగిలించుకొని, విమర్శనా రచనలు చేస్తుండేవారు. ఆయన ఓరియంటల్ తాళపత్ర గ్రంథాల పీఠానికి, డైరెక్టర్ గా ఉన్నారు. ఎక్కడ పేచీ వచ్చిందో తెలియదు గాని, నార్ల అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతడి సెక్స్ దుర్వినియోగం మొదలు అవినీతి వరకూ బయటపెట్టి ఉతికేశారు. మంత్ర శక్తితో ప్రత్యర్థిని నాశనం చేయగలనని బెదిరించే గోపాలకృష్ణయ్య నార్లను తట్టుకోలేక పోయారు.
 • విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని నార్ల విమర్శించేవారు.
 • నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అనేవాడు.
 • ఇందిరాగాంధి పట్ల తీవ్ర ద్వేషం పెంచుకున్నారు. ఆమె కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు.
 • నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళాఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు. బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ ఆడిగినా వారికి యివ్వలేదు.

రచనలు[మార్చు]

ఆంగ్ల రచనలు[మార్చు]

 1. The truth about the Geetha 1988
 2. An essay on the upanishads 1989
 3. Gods and goblins
 4. East and west
 5. Intellectual poverty in India

నార్ల వారి మాటలు[మార్చు]

 • యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.
 • ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.
 • సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.
 • బడు వాడేవాడు బడుద్ధాయి.

బయటి లింకులు[మార్చు]

 1. India Who's Who. (1969) INFA Publications పేజీ.129
 2. ఈనాడు దినపత్రిక, తేది డిసెంబర్ 1, 2008, పేజీ 4లో ఇందిరాగోపాల్ రాసిన వ్యాసం

మూలాలు[మార్చు]