వెలనాటి చోళులు
వెలనాటి చోడులు 12వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన తెలుగు రాజవంశం. వారిని వెలనాటి దుర్జయులు, వెలనాడు అధిపతులు అని కూడా అంటారు. వారు మధ్యకాల చోళులకు, పశ్చిమ చాళుక్యులకూ సామంతులుగా పనిచేశారు. వారు పూర్వపు గుంటూరు జిల్లాలోని కమ్మనాడు ప్రాంతాన్ని పరిపాలించారు.
వారి వైభవం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, వెలనాటి చోడులు కృష్ణ, గోదావరి నదుల మధ్య ఉన్న వేంగినాడును పరిపాలించారు. వారు తెలుగు మాట్లాడేవారు. ప్రాచీన ఆంధ్రకు చెందిన పురాణ అధిపతి దుర్జయ వంశానికి చెందినవారమని చెప్పుకున్నారు. దీనితో వారికి వెలనాడు దుర్జయులు అనే బిరుదు లభించింది. వారి పాలకులలో ఒకరైన రెండవ రాజేంద్ర చోళుడు "దుర్జయకులప్రకాశ" అనే బిరుదు పొందాడు.[1] తరువాతి చోళులకు విధేయత చూపినందున, వారు గౌరవార్థకంగా వారి పేర్లకు "చోడుడు"ను జోడించుకున్నారు.[2]
చరిత్ర
[మార్చు]తరువాతి చోళులలో ఒకడైన కుళోత్తుంగ I కు సామతుడిగా గోంక I గంగైకొండ చోళపురంలో పరిపాలించాడు. అతని కుమారుడు ముమ్మడి వర్మ వేంగిలో రాజప్రతినిధిగా పనిచేశాడు. కళ్యాణి చాళుక్యులతో పొత్తు పెట్టుకున్న కళ్యాణి చాళుక్యుల తోటీ, వారితో పొత్తు పెట్టుకున్న తిరుగుబాటు సామంతులు కళింగులు, చక్రకూటులతోటీ జరిగిన యుద్ధాలలో అతను సేణాధిపతిగా పోరాడాడు. ముమ్మడి వర్మ చోళ మూల స్తంభ (చోళ సామ్రాజ్యం యొక్క స్తంభం) అనే బిరుదును పొందాడు. అతని రాజ్యం దక్షిణాన గుండ్లకమ్మ నుండి పశ్చిమాన త్రిపురాంతకం వరకూ విస్తరించి ఉండేది. మొదటి రాజేంద్ర చోడుడు తన తండ్రి తరువాత అధిపతిగా, తరువాతి చోళులకు విధేయతను కొనసాగించాడు. అతను సా.శ. 1115 లో కళ్యాణి చాళుక్యులలో ఒకడైన విక్రమాదిత్యుడు VI సైన్యాధిపతి అనంతపాలయ చేతిలో ఓడిపోయి, వారి ఆధిపత్యాన్ని అంగీకరించవలసి వచ్చింది.
1126లో తన తండ్రి విక్రమాదిత్య VI తర్వాత సోమేశ్వరుడు III కల్యాణిలో రాజ్యపాలన చేసాడు. అయితే మొదటి రాజేంద్ర చోడుడు కళ్యాణి చాళుక్యుల పట్ల తన విధేయతను కొనసాగించాడు. వేంగికి చెందిన మల్ల భూపతి కృష్ణ నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రాంతాలను తిరిగి పొందాడు. కానీ ఈ ఘర్షణల సమయంలో వెలనాటి చోడలు సోమేశ్వర III కి చెందినవారుగానే ఉన్నారు. అయితే, సా.శ. 1132 లో, మొదటి రాజేంద్ర చోడుడు తరువాతి చోళులతో కలిసి పోరాడాడు. విక్రమ చోళుడు తన కుమారుడు కులోత్తుంగ II నేతృత్వంలో తన సైన్యాన్ని వేంగికి పంపాడు. వెలనాటి చోడులతో సహా అనేక మంది అధిపతులు అతనితో కలిసి పనిచేశారు. మన్నేరు యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించారు.
అదే సంవత్సరంలో మొదటి రాజేంద్ర చోడుడు మరణించాడు. అతని తర్వాత రెండవ గోంక రాజయ్యాడు. అతను చోడులందరిలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. అతని తండ్రి పాలనలో ప్రారంభ యుద్ధాలలో సేనాధిపతిగా పనిచేశాడు. అతను రెండవ కులోత్తుంగ చోళళుడితో పాటు అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు, వీటిలో ప్రసిద్ధమైన గోదావరి యుద్ధం కూడా ఉంది. దీని ఫలితంగా కళ్యాణి చాళుక్యులు ఆక్రమించిన ప్రాంతాలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అతను నెల్లూరు, కొణిదెన చోడుల వంటి అనేక మంది తిరుగుబాటు అధిపతులను ఓడించాడు. అతని రాజ్యం ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించింది. కాకతీయులలోని రెండవ ప్రోలరాజు సా.శ. 1158లో అతని రాజ్యంపై దాడి చేశాడు. కానీ చోడరాజు రెండవ గొంక ప్రోలరాజును చంపి, కోల్పోయిన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. రెండవ గొంక చాళుక్యరాజ్య మూలస్తంభంతో సహా అనేక బిరుదులను పొందాడు.
సామాజిక చలనశీలత, క్షత్రియ వాదనలు
[మార్చు]మధ్యయుగ ఆంధ్రదేశానికి చెందిన అనేక చిన్న పాలక రాజవంశాలు, వెలనాటి చోళులు, కొండపాడుమాటులు, కోటలు, నటవాదులు, కాంద్రవాదులు మొదట శూద్ర వర్ణానికి చెందినవారు. ఈ పాలకులు రాజకీయ శక్తి, ఆర్థిక బలాన్ని పొందడంతో, వారు తమను తాము క్షత్రియులుగా గుర్తించుకున్నారు. తమ హోదాను బలోపేతం చేసుకోవడానికి, వారు దుర్జయుడు, ఇక్ష్వాకుడు, రాముడు వంటి పౌరాణిక, అర్ధ-పౌరాణిక వ్యక్తులను వారి వంశావళి కథనాలలో చేర్చారు. ఈ ఆచారం సాంప్రదాయ వంశావళిని స్వీకరించి, దిగువ కుల పాలకులను క్షత్రియ వర్గంలోకి చేర్చే ధోరణిని ప్రతిబింబిస్తుంది. తద్వారా సామాజిక సోపానక్రమ స్థిరత్వాన్ని కాపాడుతుంది. శూద్ర వర్గంలోనే ఉంటూనే, సామంతులు కూడా తరచుగా తమ శాసనాలలో ఈ వ్యూహాన్ని అనుకరించారు.
పతనం
[మార్చు]వెలనాటి చోడుల వైభవం వారి తరువాతి పాలకులైన రెండవ రాజేంద్ర చోడుడు, మూడవ గోంక పాలనలలో కూడా కొనసాగింది. వారు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుండి వచ్చిన తిరుగుబాట్లపై విజయం సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాలపై నియంత్రణ కోల్పోయారు. హైహయులు, వెలనాటి చోడుల బంధువులు, సామంతుల మధ్య జరిగిన పలనాడు యుద్ధంలో చాలా మంది యోధులు హతులయ్యారు. కాకతీయ రాజు రుద్రదేవుని చేతిలో ఓడి, శ్రీశైలం నుండి త్రిపురాంతకం వరకు ఉన్న భూమిని కోల్పోయింది.
ఆ రాజవంశంలో చివరి ముఖ్యమైన రాజు పృథ్వీశ్వరుడు. అతను పిఠాపురం నుండి పాలించాడు. కోల్పోయిన ప్రాంతాలను, ప్రతిష్టనూ తిరిగి పొందడానికి అతను అనేక ప్రయత్నాలు చేశాడు. కాకతీయులకు యాదవులకూ జరిగిన ఘర్షణలో, అతను వెలనాడును తిరిగి పొందగలిగాడు. అయితే, సా.శ. 1201 నుండి, అతను కాకతీయులతో, వారి సామంతులైన నెల్లూరు చోడులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. సా.శ. 1207 లో కాకతి గణపతిదేవుడితో జరిగిన యుద్ధంలో హతుడయ్యాడు. అతని కుమారుడు, మూడవ రాజేంద్ర చోడుడు, మరిన్ని ప్రయత్నాలు చేసాడు కానీ చివరికి మొత్తం రాజ్యాన్ని గణపతిదేవుడికి కోల్పోయాడు.
పాలకులు
[మార్చు]- గొంక I (1076–1108)
- మొదటి రాజేంద్ర చోడుడు I (1108–1132)
- గొంక II (1132–1161)
- రెండవ రాజేంద్ర చోడుడు II (1161–1181)
- గొంకా III (1181–1186)
- పృథ్వీశ్వరుడు (1186–1207)
- మూడవ రాజేంద్ర చోడుడు III (1207–1216)
సంస్కృతి
[మార్చు]వెలనాటి చోడులు కృష్ణ, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించారు. కేయూరబాహు చరిత్రం ప్రకారం, ఈ ప్రాంతం సంపదనూ సమృద్ధినీ అనుభవించింది. కోడిపందేలతో సహా యుద్ధ క్రీడలు ప్రజాదరణ పొందాయనీ, ఈ ప్రాంతంలో సంపన్నమైన నగర మార్కెట్లు ఉన్నాయనీ పలనాటి చరిత్ర పేర్కొంది.
ప్రఖ్యాత తెలుగు కవి నన్నెచోడుడు ఈ రాజవంశం నుండే వచ్చాడు.
మతం
[మార్చు]ఈ కాలంలో, ఈ ప్రాంతంలో శైవ మతం, వైష్ణవ మతాలు రెండూ వ్యాప్తిలో ఉండేవి. వెలనాటి రాజులు, చారిత్రక గ్రంథాలలో ఉల్లేఖించినట్లుగా, శైవ మతాన్ని ఆచరించారు.
మూలాలు
[మార్చు]- ↑ Ranga, N. G. (1971). Kakatiya Nayaks: Their Contribution to Dakshinapath's Independence, 1300-1370 A.D. (in ఇంగ్లీష్). Indian Peasant Institute.
- ↑ Sanikommu Venkateswarlu; S Murali Mohan (2021). "Different political dynasties in Medieval Andhra (CA. 1000-1400 AD): A study" (PDF). International Journal of History. p. 114.