Jump to content

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

వికీపీడియా నుండి
(వేంకటేశ్వర సుప్రభాతము నుండి దారిమార్పు చెందింది)
వేంకటేశ్వర స్వామి

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్థన తెలుగునాట, ఇతర చోట్లా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్థనా గీతాలలో ఒకటి. అనేక వెంకటేశ్వరస్వామి మందిరాలలోను, ఇండ్లలోనూ ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు.

సుప్రభాత సేవ

[మార్చు]

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవతో ఆ రోజు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరుమలలో ప్రతిరోజు నేటికి ప్రప్రథమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ప్రతిదినం తెల్లవారు జామున సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధి లోని శ్రీవైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారు వాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు. సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. సన్నిధి గొల్ల వెనుకనే వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పుపై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారువాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు సమర్పిస్తారు. తర్వాత శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కని అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంతసేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తుల లోనికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

సుప్రభాతకర్త అణ్ణన్ స్వామి

[మార్చు]

సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణన్ స్వామి రచించాడు.[ఆధారం చూపాలి] ఇతడు సా.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు, ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించాడు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవాడు. ఇతని గురువు మణవాళ మహాముని.

సుప్రభాతంలో విభాగాలు

[మార్చు]

సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా "తిరుమామణి మంటపం"లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.

  • వెంకటేశ్వర సుప్రభాతం - దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు - ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
  • వెంకటేశ్వర స్తోత్రం - భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
  • వెంకటేశ్వర ప్రపత్తి - భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు - శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
  • వెంకటేశ్వర మంగళాశాసనము - పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు - ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.

ఒక్కొక్క భాగంలోని శ్లోకాల సంక్షిప్త వివరణ (అనువాదం కాదు), ఉదాహరణ శ్లోకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

సుప్రభాతం

[మార్చు]
ఆరంభ శ్లోకం

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1

"కౌసల్యాదేవి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. నిదుర లెమ్ము." - రామాయణం బాలకాండలో ఈ శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు విద్యాబోధ చేసే సందర్భంలో చెప్పినది. మరికొన్ని ఇతర వైష్ణవ సుప్రభాతాలు కూడా ఈ శ్లోకంతోనే ఆరంభమవుతాయి.

ఉదాహరణగా మరి కొన్ని శ్లోకాలు


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌

శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతాగృహభుజాతంర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌

లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌

సుప్రభాత శ్లోకాల సారాంశం

కౌసల్యా కుమారా! పురుషోత్తమా! రామా! తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన కర్తవ్యములు ఆచరింపవలసి ఉంది. ఓ గోవిందా! గరుడ ధ్వజా! లక్ష్మీవల్లభా ! లెమ్ము. ముల్లోకములకును శుభములు కలిగింపుము. జగన్మాతా! విష్ణు వక్షస్థలముననుండుదానా! కమలాయతాక్షీ! ఆశ్రితుల కోరికలను నెరవేర్చు తల్లీ! వేంకటరమణుని రాణీ! సరస్వతి, పార్వతి, శచీదేవి నిన్ను పూజించుచుందురు. దయానిధీ! నీకు సుప్రభాతమగు గాక.

సప్తర్షులు నీ పాదములను పూజించుటకు సిద్ధముగానున్నారు. ఓ వేంకటాచలపతీ! శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. లేత చిగురులు, పూల సువాసనలతో మలయమారుతము వీచుచున్నది. పెంపుడు చిలుకలు విలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము.

నారదుడు నీ దివ్య చరిత్రమును గానము చేస్తున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక. తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించబూనుచున్నవి. గొల్లపడుచులు పెరుగు చిలుకుచున్న సవ్వడులు నలుదిక్కుల నిండినవి. శ్రీమాన్! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకబంధువుడవు. శ్రీనివాసా! దయాసముద్రుడవు. లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానముచేసి ద్వారము కడ కాచుకొనియున్నారు. నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషబాధ్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. అష్టదిక్పాలకులు నీ సేవకై కాచుకొనియున్నారు. గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడా కోరరు. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయాగుణనిధివి. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. నీవు పద్మనాభుడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. చక్రధారివి. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణాగతుల పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

మన్మధుని తలదన్నే సుందరాకారా! కాంతాకుచపద్మముల చుట్టూ పరిభ్రమించే చూపుగలవాడా. నీవు కీర్తిమంతుడవు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. భక్తులు పరిమళభరితములైన పవిత్రగంగా జలమును బంగారు కలశముల నింపి తెచ్చి నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీవేంకటేశా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సత్పురుషులు, యోగులును నీ పూజకై మంగళ సామగ్రితో నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక. శ్రీవల్లభా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంత వేద్యుడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.

స్తోత్రం

[మార్చు]
ఉదాహరణగా కొన్ని శ్లోకాలు

కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్‌
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే.

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.

అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే.

ప్రపత్తి

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]