వై.బాలశౌరిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.బాలశౌరిరెడ్డి
బాలశౌరిరెడ్డి
జననం(1928-07-01)1928 జూలై 1
మరణం2015 సెప్టెంబరు 14(2015-09-14) (వయసు 87)
చెన్నై
జాతీయతభారతీయుడు
వృత్తి
  • ప్రిన్సిపాల్, హిందీ శిక్షణ కళాశాల,
    * డైరెక్టర్, భారతీయ భాషా పరిషత్, కోల్‌కాతా,
    * ఛైర్మన్, ఆంధ్ర హిందీ అకాడమీ, హైదరాబాద్,
    * సంపాదకుడు, చందమామ (హిందీ)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అనువాదకుడు, రచయిత
జీవిత భాగస్వామిసుభద్రాదేవి
పిల్లలువై.వెంకటరమణారెడ్డి, భారతి
తల్లిదండ్రులువై.గంగిరెడ్డి, ఓబులమ్మ

వై.బాలశౌరిరెడ్డి హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1928 జూలై 1కడప జిల్లా గొల్లలగూడూరులో ఎద్దుల ఓబులమ్మ, గంగిరెడ్డి దంపతులకు జన్మించాడు.ఆయన కడప, నెల్లూరు, అలహాబాద్, బెనారస్ లలో విద్యాబ్యాసం సాగించారు. ఆయన బాల్యంలోనే మహాత్మాగాంధీ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన ఆదేశంతో హిందీ బోధన రంగంలో స్థిరపడ్డాడు. చెన్నై హిందీ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా, హిందీ చందమామ సంపాదకుడుగా, అనువాదకుడుగా, నాటక, వ్యాసరచయితగా పేరు పొందాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో వందకు పైగా రచనలు చేశాడు. హిందీలో 72 పుస్తకాలు రచించాడు. తెలుగునుంచి హిందీలోకి 24 పుస్తకాలు అనువాదం చేశాడు. బాలశౌరిరెడ్డి నవలల్లో బారిస్టర్‌ (1967), లకుమ (1969), కాలచక్ర (2002) వంటివి ఎంతో పేరు తెచ్చాయి. ఇవికాక రుద్రమదేవి, నారాయణభట్టు (నోరి), రాజశేఖర చరిత్ర (వీరేశలింగం పంతులు), అల్పజీవి (రాచకొండ), కౌసల్య (పోలాప్రగడ) కావేరి (రావూరి బారద్వాజ) తదితర నవలలను తెలుగు నుంచి హిందీలోకి అనువదించాడు. బాలశౌరిరెడ్డి రచనలపై ఇప్పటివరకు 18 పీ.హెచ్‌.డీలు,11 ఎం.ఫిల్‌ డిగ్రీలు వచ్చాయి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ కాశీవిద్యాపీఠం డి.లిట్‌ పట్టాతో ఆయన్ని గౌరవించాయి. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. పలువురు ప్రధానులకు ఆయన సాహితీ సలహాదారుగా వ్యవహరించాడు. సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషుభాషల్లో సమాన ప్రతిభ కలిగిన బాలశౌరిరెడ్డి వ్యక్తిగతంగా నిగర్విగా పేరుపడ్డాడు.

ఆయన హిందీ శిక్షణ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. హిందీ చందమామకు 23 సంవత్సరాలు సంపాదకత్వం వహించిన బాలశౌరిరెడ్డి, కోల్‌కతా లోని భారతీయ భాషా పరిషత్తుకు 1990-94 మధ్య డైరక్టరుగా, ఆంధ్ర హిందీ అకాడమీ- హైదరాబాదుకు చైర్మన్ గా పనిచేశాడు. హిందీ సాహిత్య సమ్మేళన, ప్రయోగ, తమిళనాడు హిందీ అకాడమీకి అద్యాపకులుగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వందకుపైగా అందుకున్నాడు. సాహిత్యంపై ఎనలేని ప్రేమతో హిందీ, తెలుగు భాషల్లో బాలశౌరిరెడ్డి అనేక రచనలు రాయటమే కాకుండా హిందీలో నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు చేశాడు.

సాహితీ రంగంలో శౌరిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2006లో సాహిత్య పురస్కారాన్ని అందించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి సన్మానంతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి ప్రముఖులు నుంచి సన్మానాలు పొందిన బాల శౌరిరెడ్డి సాహిత్య ప్రేమికుడిగా కొనసాగాడు.

భారత ప్రధాని చైర్మన్ గా వ్యవహరించే కేంద్రీయ హిందీ సమితికి సలహాదారుడుగా స్థానం పొందడం ఆయన మేథస్సుకు నిదర్శనం. 88 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యం మీదపడుతున్నా ఆయనలో సాహిత్యాభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే భోపాల్‌కు వెళ్లి ఒక సదస్సులో పాల్గొని వచ్చాడు. త్రివేండ్రంలో జరిగే ఒక సెమినార్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ సెమినార్ కోసం అనేక అంశాలపై విరామం లేకుండా ఎడతెరిపి శోధనలు సాగించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బాలశౌరిరెడ్డికి భార్య సుభద్రాదేవి, కుమారుడు వై.వెంకటరమణారెడ్డి, కుమార్తె భారతి ఉన్నారు.

అస్తమయం

[మార్చు]

వై.బాలశౌరి రెడ్డి (88) చెన్నైలోని తన స్వగృహంలో సెప్టెంబరు 15 2015 న కన్నుమూసారు.

మూలాలు

[మార్చు]
  1. "హిందీ భాషా ప్రవీణ బాలశౌరిరెడ్డి కన్నుమూత". Archived from the original on 2015-09-16. Retrieved 2015-09-16.

ఇతర లింకులు

[మార్చు]