వ్రాసిన రామచంద్రు కథ (పద్యం)

వికీపీడియా నుండి
(వ్రాసిన రామచంద్రు కథ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వ్రాసిన రామచంద్రు కథ మొదలుగా కలిగిన పద్యం 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పద్యాల్లో ఒకటి. దీన్ని విఖ్యాత తెలుగు కవి, రచయిత, పండితుడు విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఆయన రచించిన మహాకావ్యం రామాయణ కల్పవృక్షంలోని అవతారికలోనిది ఈ పద్యం. తాను రామాయణ కల్పవృక్షాన్ని ఎందుకు వ్రాస్తున్నానన్న విషయాన్ని తెలియజేస్తూ సాగే ఈ పద్యంలో ఆయన చెప్పిన జీవుని వేదన అన్న ప్రతిపాదన అత్యంత ప్రాచుర్యం పొందింది.

పద్యం[మార్చు]

వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివంచనిపించుకో వృథా
యాసముగాక కట్టుకథ లైహికమా పరమా యటంచు దా
జేసిన తండ్రి యానతియు జీవునివేదన రెండు నేకమై
నా సకలోహవైభవ సనాథము నాథుకథన్ రచించెదన్

తాత్పర్యం[మార్చు]

రాసిన రామచంద్రుని కథనే రాశానని అనిపించుకో కానీ, ఇప్పుడు రాసే కట్టుకథలు ఇహమా, పరమా అంటూ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ, జీవునివేదన - రెండూ ఒక్కటైనాయి. నా సకలమైన ఊహల వైభవానికి ఆటపట్టుగా నా నాథుడు, శ్రీరాముని కథని రాస్తాను. (అని కవి చెప్తున్నారు)

నేపథ్యం[మార్చు]

చిన్నతనంలో విశ్వనాథ సత్యనారాయణ రాసిన కవిత్వం చదివిన ఆయన తండ్రి శోభనాద్రి వాటిని అంతగా ఇష్టపడేవారు కాదు. అతనికి జంటగా రాసే మరో కవి కవితలు మాత్రం నచ్చేవి. విశ్వనాథ శోభనాద్రి మంచి భక్తులు కూడా కావడంతో తన కొడుకుతో ఆ చిన్నతనంలో, "ఈ అల్లిబిల్లి కథలు రాస్తే కూడా గుడ్డా, ముక్తా మోక్షమా. రాసేదేదో రామాయణమే రాయి" అంటూ ఆజ్ఞాపించారు. ఆపైన తన జీవుని వేదన కూడా దానికి కలవడంతో తండ్రి కోరిన 15-20 ఏళ్ళ తర్వాత రామాయణ కల్పవృక్షం రాయడం ప్రారంభించారు. ఆపైన మరో 20 సంవత్సరాలకు ఆ మహాకావ్యాన్ని పూర్తిచేశారు. ఆ క్రమంలో ఈ కావ్యాన్ని రాయడానికి తన ప్రేరణ ఏమిటో అవతారికలోని ఈ పద్యంలో రాసుకున్నారు.[1]

ప్రాచుర్యం[మార్చు]

ఈ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులో కవి ప్రస్తావించిన జీవుని వేదన అన్న అంశాన్ని ఆధారం చేసుకుని ఆయన సాహిత్యాన్ని పలువురు విశ్లేషించారు. ముఖ్యంగా ప్రముఖ విమర్శకులు కోవెల సంపత్కుమారాచార్య జీవుని వేదన అన్న భావన ఆధారంగా విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని విశ్లేషించారు. ఆ పదాన్ని ఆధారం చేసుకుని సర్వేతర సాహిత్యాన్ని విశ్లేషించే అలంకారిక శాస్త్ర గ్రంథం కూడా వెలువడింది.[2][3]

మూలాలు[మార్చు]

  1. విశ్వనాథ, సత్యనారాయణ. ఆత్మకథ. విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్.
  2. జి.వి., సుబ్రహ్మణ్యం. "నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం : విశ్వనాథ". ఆంధ్రభారతి. Retrieved 30 November 2015.
  3. యు.ఎ., నరసింహమూర్తి (జనవరి 2011). "విశిష్ట విమర్శకుడు: సంపత్కుమారాచార్య". ఈమాట. Archived from the original on 24 ఏప్రిల్ 2015. Retrieved 30 November 2015. Check date values in: |date=, |archive-date= (help)