శత్రుసంహార శతకం
| శత్రుసంహార శతకము | |
|---|---|
| కవి పేరు | విక్రాల రంగాచార్యులు |
| వ్రాయబడిన సంవత్సరం | 1891 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| మకుటం | వెసన్ శార్దూల రూపమున చంపుము |
| పద్యం/గద్యం | పద్యం |
| ప్రచురణ కర్త | వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు |
| ప్రచురణ తేదీ | 1951 |
విక్కిరాల/విక్రాల రంగాచార్యులు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు, ఈ కుటుంబాలు అనాదిగా వెంకటగిరి, శ్రీకాళహస్తి, సైదాపురం సంస్థానాలలలో వైద్యులుగా, పండితులుగా, ఉద్యోగులుగా ఉంటూ అగ్రహారాలు సంపాదించుకొన్నారు. విక్రాల శ్రీనివాసాచార్యులు వెంకటగిరి సంస్థానం వైద్యులు, పండితులు, విక్రాల కృష్ణమాచార్యులు క్రీ,శ 1840 ప్రాంతంలో వెంకటగిరి సంస్థానం వైద్యులు.
విక్రాల రంగాచార్యులు ప్లవనామ సంవత్సరంలో జన్మించారు. ఈయన వెంకటగిరి దగ్గరే దగ్గవోలు అగ్రహారీకులు, మిరాశీదార్లు, రంగాచార్యులు వెంకటగిరి స్కూల్లో కొంత కాలం పనిచేశారు. దగ్గవోలు అగ్రహారం పొలాలు వేటకు అనుకూలంగా ఉన్నాయని, తనకు అవసరమని జమీందారు కోరితే రంగాచార్యులు ఇవ్వడానికి నిరాకరించారు, జమీందారు తన అధికార బలంతో దగ్గవోలును అధికార బృందంతో లాగేసుకొంటే, చేసేదిలేక ఆయన కడప వెళ్ళి అక్కడ ఫాదరీలకు తెలుగునేర్పుతూ కాలం గడిపారట. తన అగ్రహారం భూములు లాగేసుకొన్న జమీందారును దూషిస్తూ, శపిస్తూ, జమీందారు వేటాడే సమయంలో పులిరూపంలో వచ్చి అతన్ని వధించమని సమస్త దేవతలనూ ప్రార్ధిస్తూ క్రీ.శ.1891 ప్రాంతంలో రంగాచార్యులు శత్రుసంహార శతకం రాసినట్లు "ఈ కల్యాది గతాబ్దముల్ .." అనే పద్యంలో చెప్పుకొన్నారు. జమీందారీ రైతు ఉద్యమం సమయంలో ఈ శతకం రాతప్రతుల రూపంలోనే బాగా ప్రచారం పొందింది. 1951 లో వావిళ్ల ప్రచురణ సంస్థ ఈ శతకాన్ని అచ్చువేసింది. "ఈ రాజు అనృతం ఆడడు" అని నమ్మి తన అగ్రహారం దానపత్రాలు ఇస్తే, జమీన్ దారు మోసంతో తన భూములు ఆక్రమించినట్లు ఒక పద్యంలో వివరంగా చెప్పాురు. ఈ కుట్రలో దివాను బల్మూరి నారాయణస్వామి, మరికొందరు ఉద్యోగులు కుడా ఉన్నట్లు ఆచార్యులు చెప్పుకొన్నారు. ఈ శతకం తిట్టుకవిత్వం క్రిందకు రాదు. తమకు ప్రుభువులు ఇవ్వలేదని తిట్టినవారే తిట్టుకవులు. ఈయన తన పొలాన్ని అపహరించిన జమీం దారును వేటలో వధించమని దేవతలను వేడుకున్నారు. రంగాచార్యుల ప్రతిపద్యం "వెసన్ శార్దూల రూపమున చంపుము .." అనే మకుటంతో ముగుస్తుంది,కొన్ని పద్యాలలో మకుట నియమం పాటించలేదు. ఆత్మఘోష, ఆశక్తకోపం కనుక, ఆవేశంతో రాశారు, కవి వేదన అంతా పద్యాలలో వివరంగా వ్యక్తమయింది. ఈ కవి 1915 ప్రాంతంలో చనిపోయినట్లు, ఆ జమీందారు వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్ర ఆ మరుసటి సంవత్సరం అంటే 1916లో వేటాడుతూ ప్రమాదవశాత్తూ చనిపోయాడు.
మూలాలు:1. శార్దూలశతకం, వావిళ్ల ప్రచురణ, 1951, 2. వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, ఎం.ఎస్.కొ ప్రచురణ, 2018.