శమంతకమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది సూర్యునిచే సత్రాజిత్తునకు ఈయఁబడిన మణి. ఇది ప్రతిదినమును ఎనిమిదిబారువుల సువర్ణమును ఒసఁగును. ఒక్కనాడు సత్రాజిత్తు యొక్క తమ్ముఁడు అగు ప్రసేనుఁడు దీనిని కంఠమున తాల్చి అడవికి పోఁగా అతనిని ఒక సింహము చంపి ఆమణిని కొనిపోవుచు ఉండెను. అది చూచి జాంబవంతుడు ఆసింగమును చంపి దానిఒద్ద ఉన్నమణిని కొనిపోయి తన కూఁతురు అగు జాంబవతి యొక్క ఉయ్యాల యందు వ్రేలకట్టెను. అంతకుముందు ఈమణిని కృష్ణుఁడు తనకు ఇమ్ము అని సత్రాజిత్తును అడిగి ఉండినందున ఈమణికై కృష్ణుఁడు ప్రసేనుని చంపెను అని ఒక అపవాదము కలిగెను. అంతట కృష్ణుఁడు ఆనిందను పోఁగొట్టుకొను నిమిత్తము జాంబవంతుఁడు ఉన్నగుహకుపోయి అతనితో ఇరువదియెనిమిది దినములు పోరాడి ఆమణిని కొనివచ్చి సత్రాజిత్తునకు ఇప్పించెను. అంతట సత్రాజిత్తు కృష్ణునిపై లేని అపవాదమును కల్పించితిని, ఇందువలని విరోధము మానునట్టి ఉపాయము ఏది, అని విచారించి తన కొమార్తె అగు సత్యభామను కృష్ణునకు ఇచ్చి అతని వలన మన్నన పడసెను. ఈసత్యభామను తొలుత శతధన్వునకు ఇచ్చనట్లు వాగ్దత్తముచేసి ఉండెను కనుక అట్లు జరుపక తప్పినందులకై శతధన్వుఁడు కోపించి సత్రాజిత్తును చంపి ఆమణితీసికొని పోయి అక్రూరునివద్ద దాచి సత్యభామవలని ప్రేమచే కృష్ణుఁడు తన్ను చంపును అని తలఁచి వెఱచి ఒక వేగముకల గుఱ్ఱమును ఎక్కి మిథిలానగరమును గూర్చి పోయెను. ఆసంగతి కృష్ణుఁడు తెలిసికొని వానిని వెంబడించి తఱిమి పట్టి చంపి వాని వస్త్రములయందు మణిని వెదకి కానకవచ్చి ఆవృత్తాంతము సత్యభామకు చెప్పి మణిపోయిన పోబడి విచారించుచు ఉండెను. అదితెలిసి అక్రూరుఁడు మణి తనవద్ద ఉండుటచే తనకు ఏమి కీడు మూడునో అని ద్వారక విడిచి దేశాంతరము పోయెను. అంతట ద్వారకలో పెక్కులు ఉత్పాతములు పుట్టెను. అందులకు కారణము అక్రూరుఁడు ఊరు విడిచిపోవుటయే అని తెలిసికొని కృష్ణుఁడు అతనిని వెదకి పిలుచుకొనివచ్చి సన్మానించి మణి నీవద్దనె ఉంచుకొమ్ము అని చెప్పెను. అదివిని అక్రూరుఁడు మణి తాను గ్రహించుటకు ఒప్పుకొనక కృష్ణునికే తెచ్చి ఇచ్చి తనంతట తాను పోయెను.

"https://te.wikipedia.org/w/index.php?title=శమంతకమణి&oldid=1012571" నుండి వెలికితీశారు