Jump to content

శరణు రామస్వామి చౌదరి

వికీపీడియా నుండి

శరణు రామస్వామి చౌదరి (1900-1977) : స్వాతంత్ర్య సమరయోధులు, గాంధేయ వాది. గ్రంథాలయ ఉద్యమకారుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో (1964-67) సభ్యులు.

జననం, విద్య

[మార్చు]

శరణు రామస్వామి చౌదరి గారు గుంటూరు జిల్లా అమృతలూరు గ్రామంలో1900 లో జన్మించారు. బందరు జాతీయ కళాశాలలో విద్యనభ్యసించి గాంధీజీ పిలుపునందుకొని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోన్నారు.

స్వాతంత్ర పోరాటం లో

[మార్చు]

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు కల్లూరి చంద్రమౌళి గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమాలలో వీరు క్రియా శీలంగా పాల్గోన్నారు. ఉప్పుసత్యాగ్రహం, శాసనోల్లంఘన, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గోన్నారు.[1]

1931లో జరిగిన ఉప్పుసత్యాగ్రహంలో గుంటూరు జిల్లా గణపవరం వాలంటీర్ల శిభిరంలో ఉప్పు తయారుచేసినందులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి కేరళ రాష్ట్రంలో ఉన్న కన్ననూరు జైలులో ఉంచారు.

1940 లో కుచిపూడి గ్రామంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో కళా వెంకట్రావు, కల్లూరి చంద్రమౌళి, మంతిన వెంకట రాజు వంటి స్వాతంత్ర్య యోద్గులతో కలిసి ప్రారంభించగా వీరికి 300 రూపాయలు జరిమాన, ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.

రామస్వామి చౌదరి 1942 ఆగస్టు 12 న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోని రెండు సంవత్సరాలు రాయవెల్లూరు జైలులో ఉన్నారు. ఆనాడు తెనాలిలో జరిగిన ఆ ఉద్యమ సమయంలో రణరంగ చౌక్ వద్ద జరిగిన పోలిసు కాల్పులలో ఎడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు.

గ్రంథాలయోద్యమం

[మార్చు]

తెలుగునాట గ్రంథాలయోద్యమాన్ని జాతీయోద్యమంలో ఒక భాగంగా చేపట్టారు. రామస్వామి చౌదరి గ్రంథాలయోద్యమాన్నిచేపట్టి వాడ వాడల గ్రంథాలయాల స్థాపనలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో విశేషమైన కృషి చేసారు. గుంటూరు జిల్లాగ్రంధాలయ అధ్యక్షులుగా పనిచేసారు. పుస్తకాలపై ఆసక్తి కలిగేలా తొలిసారి పాతురి నాగభూషణం గారి సహకారంతో కృష్ణా బ్యాంక్ కాలువ గుండా పెదవడ్లపూడి నుండి కొల్లూరుల మద్య బోటు గ్రంథాలయాన్ని రామస్వామి చౌదరి గారు 1935 అక్టోబరు 25న లాంచనంగా ప్రారంబించారు.[2] పడవలో ప్రయాణించే వారికి గ్రంథాలయ సేవలను అందించిన బోటు గ్రంథాలయాన్ని1935 నుండి సుమారు ఏడు సంవత్సరాలు 1942 వరకు పెదపాలెం సేవాశ్రమ వాణీ మందిరం వారిచే నిర్వహించబడింది.

రాజకీయ జీవితం

[మార్చు]

స్వార్ద రాజకీయాలకు నిరసనగా కల్లూరి చంద్రమౌళి గారు 1965 లో తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా వచ్చిన ఉప ఎన్నికలో అమృతలూరు నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు (1965 -67) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనారు. ఆతరువాత స్వచ్ఛందంగా రాజకీయాలను విరమించుకున్నారు.

మరణం

[మార్చు]

శరణు రామస్వామి చౌదరి గారు 1977లో పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. గోవర్డన్, బొర్రా (2010). శ్రీ కల్లూరి చంద్రమౌళి జీవిత చరిత్ర. తెనాలి: కొడాలి సుదర్శన్.
  2. నరసింహ శర్మ, సన్నిధానం (2014). పాతూరి నాగభుషణం జీవిత చరిత్ర. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం. pp. 30–37.