Jump to content

శరద్ మోరేశ్వర్ హార్డికర్

వికీపీడియా నుండి
శరద్ మోరేశ్వర్ హార్డికర్
జననం (1932-06-22) 1932 జూన్ 22 (వయసు: 94)
వృత్తిఆర్థోపెడిక్ సర్జన్
యజమానిహార్డికర్ హాస్పిటల్
భాగస్వామిలీలా శరద్ కర్వే
పిల్లలు1
తల్లిదండ్రులుమోరేశ్వర్ మాలతి
పురస్కారాలుపద్మశ్రీ (2004)

శరద్ మోరేశ్వర్ హార్డికర్ (జననం 22 జూన్ 1932) ప్రముఖ భారతీయ ఎముకల శస్త్రచికిత్స నిపుణుడు. పుణెలోని హార్డికర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు. ఈ ఆసుపత్రికి చెందిన స్వచ్ఛంద సంస్థ 'సుశ్రుత్ మెడికల్ కేర్ అండ్ రీసెర్చ్ సొసైటీ'కి ఈయన నాయకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ గౌరవ సభ్యుడైన హార్డికర్‌ను భారత ప్రభుత్వం 2004లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

హార్డికర్ 1932 జూన్ 22న మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని సతారా జిల్లా ఫల్తన్ పట్టణంలో జన్మించారు.[1] ఈయన తల్లిదండ్రులు మాలతి, మోరేశ్వర్ హార్డికర్.[1] పుణెలోని బి. జె. మెడికల్ కాలేజ్ (BJMC) నుండి వైద్య విద్య (MBBS) పూర్తి చేశారు. 1964లో ఎడిన్‌బరోలోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (FRCS) ఫెలోషిప్ పొందారు.[2] 1965లో ఉగాండా వెళ్ళి అక్కడ కంపాలాలోని మేకెరెరే విశ్వవిద్యాలయం, న్యూ ములాగో ఆసుపత్రిలో కన్సల్టెంట్ సర్జన్‌గా పనిచేశారు. అక్కడ పోలియో క్లినిక్ బాధ్యతలు కూడా నిర్వహించారు.[1]

1967లో భారతదేశం తిరిగి వచ్చి బి.జె. మెడికల్ కాలేజీలో చేరారు. 1992లో పదవీ విరమణ చేసే వరకు సుమారు 25 ఏళ్ల పాటు అక్కడే బోధన, వైద్య సేవలు అందించారు. ఆ సంస్థలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందారు. బి.జె.ఎం.సి.లో పనిచేస్తున్నప్పుడే 1970లో ఎముకల చికిత్స కోసం ప్రత్యేకంగా 10 పడకల సామర్థ్యంతో హార్డికర్ ఆసుపత్రిని స్థాపించారు. అప్పటి నుండి దానికి డైరెక్టరుగా కొనసాగుతున్నారు.[1] కాలక్రమేణా ఈ ఆసుపత్రి 60 పడకల బహుళ విభాగాల వైద్యశాలగా ఎదిగింది.[3] పేదలకు వైద్య సేవలు అందించడానికి 'సుశ్రుత్ మెడికల్ కేర్ అండ్ రీసెర్చ్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.[2] దీని ద్వారా 75 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, 1,500 మంది పిల్లలకు ఎముకల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించారు. పక్షవాతంతో బాధపడే పిల్లల పునరావాసానికి ఎంతో కృషి చేశారు.[1]

కీళ్ల వాతము (arthritis), పోలియో, వెన్నునొప్పి, మోకాలి, భుజం నొప్పులు, సెరిబ్రల్ పాల్సీ, ఎముకల బలహీనత (osteoporosis) వంటి వ్యాధులపై హార్డికర్ పలు పరిశోధనా పత్రాలు ప్రచురించారు. వ్యాగ్నర్ ఎక్స్‌టర్నల్ ఫిక్సేటర్ వంటి వైద్య పరికరాల రూపకల్పనలో, విరిగిన ఎముకల చికిత్సకు అవసరమైన ఇంప్లాంట్ల తయారీలో ఈయన చేసిన ఆవిష్కరణలు గుర్తింపు పొందాయి.[1]

అనుబంధాలు

[మార్చు]

ఈయన 2001 నుండి 2003 వరకు మహారాష్ట్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.[4] 1998-99 కాలంలో అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ASSI) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏ.ఎస్.ఎస్.ఐ పుణె విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.[5]

గౌరవాలు - పురస్కారాలు

[మార్చు]

ఈయన బ్రిటిష్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ గౌరవ సభ్యులు.[1] వైద్య రంగంలో ఈయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హార్డికర్ 1957లో లీలా శరద్ కర్వేను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు పుణెలో నివసిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 "Padmashree Dr. Sharad Moreshwar Hardikar" (PDF). Documbase. 2015. ఒరిజినల్ నుండి 3 జూన్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 నవంబరు 2015.
  2. 1 2 "About Us". Deccan Hospital. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 నవంబరు 2015.
  3. "Hardikar Hospital Pune". Pune Site. ఒరిజినల్ నుండి 13 ఆగస్టు 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 నవంబరు 2015.
  4. "Past Committee". Maharashtra Orthopedic Association. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 నవంబరు 2015.
  5. "Welcome Message". ASSOCON. 2015. the original నుండి 21 నవంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 నవంబరు 2015.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. the original (PDF) నుండి 19 అక్టోబర్ 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)

మూస:వైద్యరంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు