శల్య పర్వము ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసం
[మార్చు]సుయోధనుడి నిష్క్రమణ గురించి విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నా కుమారుడు సుయోధనుడు మదం బాగా అణిగి గద చేత పట్టి కాలి నడకన ఏటు వెళ్ళాడు. రారాజుకు ఇంత దౌర్భాయపు స్థితి కలిగిందా ! సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు " అన్నాడు. సంజయుడు " మహారాజా ! ఏకాదశ అక్షౌహినులకు అధిపతి అయిన సుయోధనుడు వంధి మాగధులు కైవారములు లేకుండా ఒంటరిగా ఏకాకిగా యుద్ధభూమి వదిలి పోయి అక్కడికి క్రోశడు దూరంలో ఉన్న కృష్ణద్విపాయన మడుగుకు వెళ్ళి మడుగులో దిగి మడుగు అడుగున జలస్థంభన విద్యతో దాక్కుని. నాడు విదురుడి మాట విననందుకు పశ్చాత్తాప పడ్డాడు. సుయోధనుడు వెళ్ళి పోగానే భీమార్జునులు మిగిలిన కౌరవ సైన్యమును సమూలంగా నాశనం చేసారు. మన పక్షాన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రం మిగిలారు. అక్కడే తచ్చాడుతున్న నన్ను సాత్యకి పట్టుకున్నాడు. అక్కడే ఉన్న ధృష్టద్యుమ్నుడు " సాత్యకీ ! వీడిని ఎందుకు పట్టుకున్నావు. వీడి వలన మనకేమి హాని కలుగుతుంది. వీడిని విడిచి పెట్టు " అన్నాడు. సాత్యకి వీడు శత్రు పక్షముకు చెందిన వాడు. శత్రు శేషం మిగలరాదు " అని నన్ను చంపడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడకు వచ్చిన వ్యాసమునీంద్రుడు " సాత్యకీ ! సంజయుని చంపుట అనుచితము. అతడు నిరాయుధుడు. అతడిని విడిచి పెట్టు " అన్నాడు. సాత్యకి వ్యాసునికి నమస్కరించి నన్ను విడిచి పెట్టాడు. నేను బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి కృష్ణ ద్వైపాయన మడుకుకు వెళ్ళాను. అక్కడ సుయోధనుడిని కలుసుకున్నాను. సుయోధనుడు " సంజయా ! మన పక్షమున ఎవరైనా ! బ్రతికి ఉన్నారా ? " అని అడిగాడు. నేను " సుయోధనా ! అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ తప్ప అందరూ చనిపోయారు " అని చెప్పాను. సుయోధనుడు " ఔను సంజయా ! నేను కూడా పాండవుల పాల బడక తప్పించుకోవడం నా అదృష్టం. పాండవులకు లొంగి పోయి వారి దయాధర్మం మీద బ్రతకడం నాకు ఇష్టం లేదు. అయినా యుద్ధమున విజయం సాధించి పాండవులు సంతోషంగా ఉన్నారు. నా సోదరులను బంధు మిత్రులను సంహరించిన పాడవుల సంతోషం నేను చూసి భరించగలనా ! నా తడ్రికి నా విషయం చెప్పు " అని తాను మడుగులో దాక్కున్నాడు.
రధికత్రయం సుయోధనుడి జాడ తెలుసుకొనుట
[మార్చు]యుద్ధభూమి నుండి పారిపోయున అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని సుయోధనుడి కొరకు వెతుకుతూ నన్ను చూసి " సంజయా ! నువ్వు బ్రతికి ఉన్నావా! మన రారాజు ప్రాణాలతో ఉన్నాడా " అని అడిగారు. నేను సుయోధనుడు కృష్ణద్వైపాయన మడుగులో దాక్కున్న విషయం వారికి చెప్పాను. అది విని వారు దుఃఖించారు. " సంజయా ! రారాజుకు మేము రణరంగలో చావకుండా మిగిలామని తెలియదు. మా గురించి బాధ పడుతుంటాడు. మేము బ్రతికి ఉన్నా మమ్ము కలుసుకొనుట దుస్తరమని తలచి మడుగులో దాక్కుని ఉంటాడు. అష్టైశ్వర్యములు అనుభవించిన రారాజుకు ఎంత దుర్గతి పట్టింది. మేము సుయోధనుడితో మాట్లాడుతుండగా పాండవులు తమ సైన్యముతో మమ్ము చుట్టుముట్టారు. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని మేము అక్కడి నుండి పారిపోయాము " అన్నాడు కృపాచార్యుడు. తరువాత రథిక ద్వయం కృష్ణ ద్వైపాయన మడుగులో దాగిన సుయోధనుడిని కలుసుకొనుటకు వెళ్ళారు.
పాండవులు యుయుత్సునితో కౌరవ స్త్రీలను హస్థినకు పంపుట
[మార్చు]యుద్ధం అయిపోయిందని తెలుసుకొని కౌరవ స్త్రీలు తమతమ భర్తల కొరకు రోదిస్తున్నారు. నీ కుమారుడు యుయుత్సుడు అక్కడ ఉన్నాడు. అతడు అక్కడ ఉన్న వారితో " సుయోధనుడు పారిపోయాడు. యుద్ధం పరిసమాప్తం అయింది. ఇక ఈ స్త్రీలను హస్థినకు పంపండి " అన్నాడు. అంతలో ధర్మరాజు అక్కడకు వచ్చి యుయుత్సుని కౌగలించుకుని ఓదార్చి " కౌరవ కాంతలందరిని హస్థినకు పంపవచ్చు " అని చెప్పాడు. యుయుత్సుడు అంతఃపుర స్త్రీలను వృద్ధ కంచుకలతో సహా హస్థినా పురానికి వెళ్ళాడు. విదురుడు వారికి ఎదురు వచ్చాడు. యుయుత్సుడు జరిగినదంతా చెప్పి రారాజు ఒంటరిగా యుద్ధ భూమిని వదిలి వెళ్ళాడు అని చెప్పాడు. అది విని విదురుడు ధుఃఖభారంతో వికలమనస్కుడై " యుయుత్సా ! సంజయుడు వచ్చి ధృతరాష్ట్రునికి జరిగినది వివరించ గలడు. మనమేమి చెప్పనవసరం లేదు నీవు అంతఃపుర స్త్రీలను వారి వారి నివాసములకు చేర్చు " అన్నాడు. కౌరవ సైన్యం అక్కడక్కడా ఉన్నారు. రణరంగం నిశ్శబ్ధంగా ఉంది. పాడవులు శ్రీకృష్ణుడితో సహా సుయోధనుడిని వెదుకుతూ కృష్ణద్వైపాయన మడుకు వచ్చారు. వారిని చూసి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అక్కడ నుండి తప్పుకుని దాక్కున్నారు. సుయోధనుడు ఎక్కడా కనపడ లేదని తిరిగి శిబిరాలకు వెళ్ళారు. కౌరవశిబిరంలోని స్త్రీలకు ఏమీ భయం లేదని నిశ్చింతగా ఉండమని అభయం ఇచ్చాడు
రధిక త్రయం సుయోధనుడిని కలుసుకొనుట
[మార్చు]పాండవులు అక్కడ నుండి వెళ్ళగానే రథిక త్రయం సుయోధనుడిని కలుసుకుని " రారాజా ! పిరికి వాడిలా మడుగులో దాక్కోవడమేమిటి ? లే ముందుకు కదులు మా సాయంతో పాండవుల మీద యుద్ధం ప్రకటించు. పాండవ సేనలను సంహరించు. పాండవులను జయించు. సుయోధనా ! క్షత్రియులకు శత్రువులను జయించడం లేక యుద్ధంలో మరణించి వీరస్వర్గం అలంకరించడమే ధర్మం. అంతేకాని పిరికి వాడిలా ఇలా పారిపోయి దాక్కోవడం ధర్మమా ! " అన్నారు. ఆ మాటలు విన్న సుయోధనుడు రథిక త్రయంతో " యోధులారా ! క్షత్రియ ధర్మం తెలియక కాదు. నా శరీరం గాయాలతో నిండి ఉన్నది. వశం తప్పిన శరీరం విశ్రాంతి కోరుతున్నది. మీరు యుద్ధమున అలసి ఉన్నారు కనుక ఈ రోజుకు విశ్రాంతి తీసుకొండి. రేపటి దినం యుద్ధం చెయ్యవచ్చు " అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ " రారాజా ! ఏల నీకు అనుమానం నేను ఒక్కడినే పాంచాల సైన్యాలను సంహరించి పాండవులను చంపి నీకు నీ తండ్రికి సంతోషం కలిగించగలను " అన్నాడు.
పాండవులకు సుయోధనుడి జాడ తెలియుట
[మార్చు]ధర్మరాజు, భీముడు కొంత మంది బోయవారిని పిలిచి వారు వేటాడినప్పుడు సుయోధనుడు కనిపిస్తే చెప్పమని చెప్పారు. ఆ బోయలలో ఒకరు వేటాడిన జంతువును మోసుకొని వస్తూ సుయోధనుడు రథికత్రయంతో మాట్లాడటం చూసి తనలో " తప్పక ఇతనే సుయోధనుడు అయి ఉంటాడు. ఈ విషయం భీమసేనులు, ధర్మరాజుల వారికి చెప్పి మంచి బహుమానం పొందవచ్చు" అనుకుని పరుగు పరుగున భీమసేనుడి శిబిరానికి వచ్చి విషయం ఎరిగించి అంతు లేని బహుమానాలను భీముని నుండి అందుకున్నాడు. భీముడు ధర్మరాజుతో " అన్నయ్యా ! సుయోధనుడి జాడ తెలిసింది. ఇక్కడికి క్రోసెడు దూరంలో ఉన్న కృష్ణ ద్వైపాయన మడుగులో తనకు తెలిసిన క్షుద్రవిద్యతో దాగుకొని ఉన్నాడట. అతడు వెలుపలకు వచ్చి రధికత్రయంతో మాటాడుట చూసిన బోయ వాడు నాకీ విషయం చెప్పాడు " అన్నాడు. ధర్మరాజు ఆ విషయం కృష్ణాదులకు తెలిపి చతురంగబలంతో సుయోధనుడున్న కృష్ణ ద్వైపాయన మడుగు వద్దకు వెళ్ళాడు. పాండవులు వస్తున్న కోలాహలం తెలిసి అశ్వథ్థామ " రారాజా ! పాండవులకు నీ విషయం తెలిసినట్లు ఉంది. చతురంగ బలంతో ఇటే వస్తున్నారు. ప్రస్థుతం మా కర్తవ్యం ఏమిటి? వారిని ఎదిరించి యుద్ధం చేయాలా ? లేక ఇప్పుడు తప్పుకుని అదును చూసి దెబ్బ తీయాలా ? " అని అడిగాడు. సుయోధనుడు " అశ్వథ్థామా ! ప్రస్థుతం మనమంతా అలసి ఉన్నాము. కనుక ఇప్పుడు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకొని రాత్రి సమయంలో నా వద్దకు రండి తరువాతి ప్రణాళిక ఆలోచిద్దాము. పాండవులు ఇక్కడకు వచ్చినా నా జాడ తెలియదు నేను నాకు తెలిసిన జలస్థంభన విద్యతో మడుగు అడున ఉంటాను " అన్నాడు. ఆ మాటలకు బరువెక్కిన హృదయాలతో రథికత్రయం అక్కడి నుండి వెళ్ళి పక్కన ఉన్న పొదల మాటున దాక్కొన్నారు. నేను కూడా అక్కడు నుండి దూరంగా వెళ్ళి పొదలో దాక్కున్నాను. నాకు అక్కడ ఉన్నా మడుగు వద్ద జరిగేవి స్పష్టంగా తెలియ సాగింది.
సుయోధనుడిని మడుగు నుండి బయటకు తెచ్చే ప్రత్నం
[మార్చు]కృష్ణద్వైపాయన మడుగు వద్దకు వచ్చిన పాడవులతో కృష్ణుడు " ధర్మజా ! సుయోధనుడు నిశ్చయంగా ఈ మడుగులోనే ఉన్నాడు. అతడికి తెలిసిన జలస్థంభన విద్యతో మడుగు అడున దాక్కున్నాడు. అందుకే జలం నిశ్చలంగా ఉన్నది " అన్నాడు. ధర్మరాజు సుయోధనుడు స్వర్గాధిపతి వద్ద దాక్కున్నా నా వద్ద నుండి తప్పించుకొన లేడు " అన్నాడు. కృష్ణుడు " ధర్మరాజా ! ఇలాంటి మాయలు సుయోధనుడు తప్ప వేరెవరు పన్నగలరు. ఇప్పుడు దీనిని మనం వంచనతోనే జయించాలి. కనుక నీవు ఎలాగైనా సుయోధనుడు మడుగు నుండి వెలుపలికి వచ్చేలా చేయాలి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ కొరకు అనేక రాజులు మరణించారు. నీవు మాత్రం ప్రాణములు రక్షించుకోవడానికి ఇలా మడుగులో దాక్కొనడం భావ్యమా ? ఇది నీకు వీరమా ? నలుగురూ నవ్వరా ! నీ అభిమానం ఏమయ్యింది ఇలా యుద్ధంలో వెన్ను చూపడం నీకు తగునా ! క్షత్రియకులజుడవైన నీవు ఇలా నీచపు పనులు చేసిన ఇహము పరము రెండూ చెడవా ! నాడు శకుని, కర్ణుడు, దుశ్శాసనాదులను చూసి విర్రవీగావు నేడు ఇలా భీరువువై దాక్కున్నావు. నీ పిరికితనం వదిలి యుద్ధం చేసి మమ్ము జయించిన ఈ భూమండలాధిపత్యం పొందగలవు ఓడిన వీరస్వర్గం అలంకరించ గలవు. కనుక ప్రస్తుత నీ కర్తవ్యం మాతో యుద్ధం చేయటమే నీవు ఆడదానివి కాకున్న మాతో యుద్ధం చేయి " అని ఎత్తి పొడిచాడు.
సుయోధనుడు మడుగు నుండి ధర్మజునితో మాటాడుట
[మార్చు]ఆ మాటలకు రోషపడిన సుయోధనుడు " ధర్మరాజా ! మానవులకు ప్రాణ భయం సహజము కాదా ! నా వద్ద ప్రస్తుతం రథము, సారథి, ఆయుధములు, చక్రరక్షకులు ఏమియును లేవు. నేను యుద్ధమున డస్సి ఉన్నాను. కనుక నేను ఇప్పుడు యుద్ధం చేయ లేను. మీరూ పద్దెనిమిది రోజుల యుద్ధమున అలసి ఉన్నారు కనుక మీరూ విశ్రాంతి తీసుకొని రండి " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! మేము విశ్రాంతి తీసుకొని ఉన్నాము. నీవు మడుగులో విశ్రాంతి తీసుకున్నావు కదా ఇక వచ్చి యుద్ధం చేయి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నా తమ్ములు, బంధు మిత్రులు యుద్ధమున మరణించారు. ఎవరి కొరకు యుద్ధం తలపెట్టానో వారు లేరు కనుక ఎవరి కొరకు నేను యుద్ధం చేయాలి ? నేను గెలిచినా ఆనందించగల వారు ఎవరు. బంధు మిత్రులతో కూడి రాజ్యం చేసిన ఆనందమే కాని ఒంటరిగా రాజ్య పాలన చేయుటలో ఆనందం ఏమి ? నీకు నీ తమ్ములు అంతా ఉన్నారు కనుక నీవు ఇక ఈ రాజ్యాన్ని ఏలుకో. నేను ఈ రాజ్యాన్ని నీకు ధార పోసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. యుద్ధమున ఓడిన నాకు అభిమానం కోపం లేవు. గజ, తురగ, రథాధి సైన్య రహితమైన ఈ రాజ్యం నాకు వద్దు నీవే ఇక దీనిని నీ తలకు కట్టుకో " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీ మిత్రుడు కర్ణుని మరణానంతరం శల్యుడిని సైన్యాధ్యక్షుని కావించి యుద్ధము చేసినది రాజ్యకాంక్షతో కాదా ! ఒట్టి మాటలు కట్టి పెట్టి యుద్ధముకు రా ! శత్రుశేషం ఉండగా రాజ్యాన్ని ఏలుకొనుట ధర్మం కాదు. కనుక నిన్ను గెలిచి రాజ్యాన్ని ఏలగలను. నీకు చేతనయితే నా తమ్ములతో నన్ను గెలిచి రాజ్యానికి పట్టభద్రుడివి కా ! అయిదూళ్ళు అడిగిన నిరాకరించిన నీవా నాకు రాజ్యాన్ని ధార పోసేది. రాయబారానికి వచ్చిన కృష్ణుడితో సూది మొన మోపినంత చోటు ఇవ్వనని ఇంత రక్తపాతానికి కారకుడవైన నీవు రాజ్యమును ధారపోస్తావా ! ఇక గెలుచుట అసాధ్యము అని తెలిసి ఇలా మాట్లాడుతున్నావు. నీ వద్ద రాజ్యం ఉంటే కదా నాకు ధార పోసేది. నీ దయా భిక్ష మీద వచ్చే రాజ్యాన్ని నేను స్వీకరించను. నిన్ను సంహరించి కాని రాజ్యభారం వహించను. మా ప్రాణములు నీ చేత ఉన్నాయి, నీ ప్రాణములు మా చేత ఉన్నాయి కనుక యుద్ధమున నిన్ను చంపక తప్పదు. మాకు విషము పెట్టించావు, నీళ్ళలో త్రోయించావు, లక్క ఇంట పెట్టి కాల్పించావు, మాయాజూదంతో రాజ్యమును అపహరించి మమ్ము అడవుల పాలు చేసావు ఇక నీ మత్సరమును సహించి నీ కుట్రలకు మేము బలి కాలేము. కనుక మారు మాటాడక వచ్చి యుద్ధం చెయ్యి " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! మీరు అయిదుగురు నేను ఒక్కడిని, మీకు రథ, గజ, తురగ సమేత సైన్యము ఉంది. నేను ఇప్పుడు ఒంటరిని నిరాయుధుణ్ణి కనుక నేను నీకు కృష్ణుడికి వెరచి ఇక్కడ దాక్కున్నాను మీరు నాతో ఒక్కొక్కరుగా యుద్ధం చేసారంటే నేను మిమ్ము అందరిని యుద్ధమున హతమార్చి భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదుల ఋణం తీర్చుకొని రాజ్యాన్ని పొందగలను. నీకు యుద్ధ నీతి తెలియజేసాను " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! నీధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మమ్ము అందరినీ ఒంటి చేత్తో సంహరించగనని అనుకోవడం సహజమే. కాని నేను అధర్మపరుడను కాను. నీకు అవసరమైన రథము, ఆయుధములు అన్నీ తీసుకో మాలో ఒక్కడితో యుద్ధం చేయి నీవు గెలిచిన రాజ్యాన్ని నీవే ఏలుకో బంధు మిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మయుద్ధం చేస్తాడు " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! రథములతో అస్త్రశస్త్రములతో యుద్ధం చేసి విసిగి ఉన్నాను ఇక నేను భూమి మీద నిలిచి మల్ల యుద్ధం చేస్తాను. గదతో నిన్ను నీ తమ్ములను తృటిలో ఓడిస్తాను " అన్నాడు. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అదే అదనుగా తీసుకొని సుయోధనుడు బుసలు కొడుతూ మడుగు నుండి బయటకు వచ్చాడు.
సుయోధనుడు మడుగునుండి వెలుపలకు వచ్చుట
[మార్చు]వెలుపలకు వచ్చిన సుయోధనుడి చూసి పాంచాలురు, పాండవులు అపహాస్యంగా చిరునవ్వు నవ్వారు. సుయోధనుడు " అలా నవ్వకండి. నేను మిమ్మంతా ఒక్కొక్కరుగా బలి తీసుకుంటుంటే అప్పుడు తెలుస్తుందిలే " అన్నాడు. సుయోధనుడికి ఇంకా పాండవులు పాంచాలురతో కలిసి ఒక్కుమ్మడిగా తన మీద దాడి చేస్తారని శంకిస్తూ " నేను యుద్ధమున అలసి ఉన్నాను మన ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరుగా నాతో యుద్ధానికి రండి " అన్నాడు. ధర్మజుడు నవ్వి " సుయోధనా ! నాడు అభిమన్యుని మీదకు ఒక్కుమ్మడిగా యుద్ధముకు పోయినట్లుగా భావించ వచ్చు కదా ! " అని " భయపడకు నువ్వు చేసిన అకృత్యమును గుర్తు చేసాను కాని ఆడిన మాట తప్పను. యుద్ధ నీతికి వ్యతిరేకముగా ప్రవర్తించను. నీవు వెంటనే సరి చేసుకొని కవచము, శిరస్త్రాణం ధరించి యుద్ధ సన్నద్ధుడివి అయి మాలో ఒకరిని ఎంచుకొని యుద్ధం చెయ్యి. మాలో నీకు నచ్చినవాడిని జయించిన రాశ్యలక్ష్మిని వరించు లేకున్న వీర స్వర్గం అలంకరించు ఇది నా ప్రతిజ్ఞ. నీకు నచ్చిన ఆయుధములు ధరించు నీవు నాకు తమ్ముడివి కనుక నీవు అడిగినవి ఇస్తాను ప్రాణములు తప్ప " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నీ సత్య వాక్పరిపాలనా నాకు తెలియనిదా ! నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది ! మనం మనం అన్నదమ్ములం కదా ! " అని కవచాదులను ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. చేతిలో గద ధరించి మేరు పర్వతంలా మెరుస్తూ " ధర్మజా ! సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో లేక నీవో నాతో యుద్ధానికి రండి నా గదకు మిమ్ము ఒక్కొక్కరిగా ఎర వేస్తాను. నాతో గదా యుద్ధం చేయ సాక్షాత్తు ఈశ్వరుడే సాహసించరు మీరెంత " అని డంబంగా అన్నాడు.
ధర్మజుడి మాటకు కృష్ణుడు ఆందోళనపడుట
[మార్చు]సుయోధనుడి ప్రగల్భములకు కృష్ణుడు ధర్మరాజును చూసి " ధర్మరాజా ! నీవిలా అవివేకముతో మాటాడుట ఏమీ బాగా లేదు. నీవింత బుద్ధిహీనుడవని అనుకో లేదు. ఇదేమైనా శకునితో ఆడిన జూదమా ! ఒక్కరిని గెలవగానే రాజ్యం ఇవ్వడానికి. సుయోధనుడు భీముని తప్ప మీలో ఎవరిని కోరుకున్నా గదా యుద్ధముతో మిమ్ము హతమార్చగలడు. ఆఖరుకు ఇది పందెం యుద్ధం అయింది. ఇందుకేనా ఇంత మారణ హోమం జరిగింది ఇంత మంది రాజులను సైన్యాలను యుద్ధానికి బలి ఇచ్చింది ? ఇలా పందెంలో ఓడే కదా నీవు నీ తమ్ములతో కలిసి అడవులలో ఇడుములు అనుభవించింది " అన్నాడు. కనుక ధర్మరాజా ! ఇందుకు నేను ఒప్పుకోను. ఒక్కొక్కరుగా యుద్ధం చేసే పని అయితే భీమసేనుని కూడా పంపడాబనికి అంగీకరించను. దుర్యోధనుడు గధావిద్యలో నైపుణ్యం గడించాడు. అతడి నైపుణ్యం ముందు భీముని బలం చాలదు. నీ ఇష్టం జాగర్త " అన్నాడు.
భీముని కృష్ణుడు ప్రశంసించుట
[మార్చు]కృష్ణుడి మాటలు విన్న భీమసేనుడు " అన్నగారి అనుమతి నీ అనుగ్రహం ఉండాలే కాని దుర్యోధనుడే కాదు ఈ మూడు భువనాలలో ఉన్న ఎవరినైనా నేను తృటిలో జయించగలను. ఈ సుయోధనుడు ఒక లెక్కా ! ఈ మాత్రం దానికి అన్నగారిని అంత మాట అనవలెనా ! ఈ రోజు నేను నా గధా ఘాతంతో సుయోధనుడిని చంపి నీకు సంతోషం కలిగిస్తాను " అన్నాడు. కృష్ణుడు భీముని భుజం ప్రేమగా తట్టి " భీమసేనా ! బకాసురుడిని, హిడింబుని, జరాసంధుని, కిమ్మీరుడిని సంహరించిన నీ భుజబలం నాకు తెలియనిదా ! ఏదో మీ మీద ప్రేమతో కలిగిన కలవరంతో అన్నాను కాని వేరేమి లేదు. దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం త్రాగుతుంటే చూస్తూ ఊరుకున్నాడే కాని ఏమి చేయని సుయోధనుడి పరాక్రమం నీ ముందెంత ? నా మాటలు పట్టించుకోకు. నాడు కురుసభలో ద్రౌపది జుట్టు పట్టి ఈడ్చినపుడు నీవు చేసిన ప్రతిన ఒకటి నెరవేర్చుకున్నావు. ఇక రెండవది మిగిలి ఉంది సుయోధనుడి తొడలు విరిచి నీ రెండవ ప్రతిజ్ఞ నేరవేర్చి నీ అన్నను పట్టాభిషిక్తుడిని చేసి మీరందరూ సుఖములు అనుభవించండి. నీవిక నీ పరాక్రమం చూపి నీ గధకు పండుగ చెయ్యి నీ వెనుక నేను ఉన్నాను. ఈ రోజు నీ చేత సుయోధనుడు నిర్జీవుడౌతాడు అన్నాడు. కృష్ణుడి మాటలకు భీముడు పొంగి పోయాడు. కృష్ణుడు " భీమసేనా ! ఒక్క మాట సుయోధనుడు గదా యుద్ధంలో నిష్ణాతుడన్నది మరువ వద్దు. ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమతో సాధించిన నైపుణ్యం జాగ్రత్త " అని హెచ్చరించాడు.
భీమసుయోధనులు ఎదుర్కొనుట
[మార్చు]సాత్యకి మొదలైన వారు భీముడిని పొగిడారు వారందరిని చూసి భీముడు " ధర్మజా ! ఈ కులనాశకుని మీద నాకు అమిత కోపం ఉంది. అర్జునుడు ఖాండవవనదహనం చేసిన విధంగా నేడు నేను సుయోధనుడిని సంహరిస్తాను. నిన్ను ఈ భూమికి పట్టాభిషిక్తుని చేస్తాను. ఈ రోజు ధృతరాష్ట్రుడు తన కుమారుడి మరణవార్త విని ఏడవక తప్పదు " అని తన గధ తీసుకుని సుయోధనుడి ఎదుట నిలువగానే భీమునిలో పగ రగిలి పోయింది. భీముడు " సుయోధనా ! మమ్ము లక్క ఇంట్లో పెట్టి కాల్పించావు. మా అన్న ధర్మరాజుతో మాయా జూదం ఆడించి మా రాజ్యాన్ని అపహరించావు. ద్రౌపదిని నిండు సభలో అవమానించిన ఫలం ఊరికే పోతుందా అనుభవించు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యుల వంటి మహా వీరులంతా నీ కొరకు బలి అయ్యారు. నీవు వెంట తెచ్చిన రాజులంతా యుద్ధభూమిలో మరణించారు. ఈ మహా మారణహమానికి మూల పుషుడివైన నిన్ను నేను చంపి ఈ లోకం లోని కాలుష్యాన్ని కడిగి వేస్తాను " అన్నాడు. సుయోధనుడు " బీమా ! అతిగా మాట్లాడకు యుద్ధం చేసి నా చేతిలో చచ్చిపోయి. నన్ను రాజ్యాభి షిక్తుడిని చెయ్యి. నాతో గదా యుద్ధం చేయడానికి ఇంద్రాదులు కూడా భయపడతారు నీ వెంత " అన్నాడు.
బలరాముని రాక
[మార్చు]తన ప్రియ శిష్యుడైన సుయోధనుడు భీమునితో ద్వంధ యుద్ధానికి సిద్ధపడ్డాడని తెలిసి తీర్ధయాత్ర నుండి వస్తున్న బలరాముడు అది చూడాలన్న కుతూహలంతో అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో బలరామునకు ఎదురేగి అర్ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించి ఉచితాసనమున కూర్చుండ చేసాడు. బలరాముడు వారితో ప్రియసంభాషణ చేసి ఆనందపరచాడు. శ్రీకృష్ణుడు సాత్యకి అన్నగారికి పక్కనే కూర్చున్నారు. మిగిలిన వారందరూ బలరాముని కుశల ప్రశ్నలు వేసారు. బలరాముడు వారందరిని చూసి " ఈ యుద్ధములో పాల్గొనడానికి ఇష్టపడక నేను తీర్ధయాత్రకు వచ్చాను. మిమ్ము చూసి చాలా రోజులైందనీ భీమసుయోధనులు యుద్ధం చేస్తున్నారని తెలుసుకుని చూడాలన్న కుతూహలంతో ఇక్కడకు వచ్చాను " అన్నాడు. భీముడు, సుయోధనుడు బలరామునకు ఎదురెదురుగా నిలిచి నమస్కరించారు. ధర్మరాజు లేచి భీముడు సుయోధనుడితో ఎందుకు ద్వంధ యుద్ధం చేస్తున్నాడో వివరించి వారి ద్వంధ యుద్ధానికి అనుజ్ఞ ఇమ్మన్నాడు. బలరాముడు అలాగే అనుజ్ఞ ఇచ్చాడు " అన్నాడు సంజయుడు.
ప్రభాస తీర్థం
[మార్చు]జనమేజయుడు వైశంపాయునితో " మునివర్యా ! యుద్ధారంభంలో బలరాముడు శ్రీకృష్ణుని పాండవపక్షపాతి అని నిందించి యుద్ధములో పాల్గొనడానికి తీర్ధర్తత్రకు వెళ్ళాడు. అలాంటి బలరాముడు భీమసుయోధనుడి ద్వంధయుద్ధానికి ఎలా వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏమి జరిగింది " అని అడిగాడు. వైశయంపాయనుడు " జనమేజయా ! బలరాముడు యజ్ఞానికి కావలసిన సంభారములు సమకూర్చుకుని బ్రాహ్మణులు వెంటరాగా సరస్వతీనది సాగరసంగమం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశాన్ని ప్రభాసతీర్థం అంటారు. బలరాముడు ఆతీర్ధాన్ని దాని సమీపతీర్ధాలను సేవించి బ్రాహ్మణులకు గోవులను ధనమును దానం ఇచ్చాడు. ఆ మాట వినగానేజనమేజయుడు ప్రభాసతీర్ధ మహత్యం వివరించమని వైశంపాయనుడిని కోరాడు.
బలరాముని యాత్రా విశేషములు
[మార్చు]జనమేజయుని కోరికపై వైశంపాయనుడు " జనమేజయా ! ఈ క్షేత్రమున చంద్రుడు స్నానమాచరించి తన క్షయరోగమును పోగొట్టుకున్నాడు. ఆ కథ వివరించెదను విను. దక్షప్రజాపతి తన కుమార్తెలైన ఇరవై ఏడు మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసాడు. వారిలో అతి రూపవతి అయిన రోహిణి మీద మక్కువ చేత చంద్రుడు మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసాడు. మిగిలిన కుమార్తెలు వ్యధ చెంది తమ బాధను తమ తండ్రికి చెప్పాడు. దక్షుడు చంద్రుడిని పిలిచి అందరినీ సమానంగా చూసుకోవడం ధర్మమని బుద్ధిమతి చెప్పి పంపించాడు. చంద్రుడు దక్షుని మాటను నిర్లక్ష్యం చేసాడు. దక్షుడు కుపితుడై చంద్రుడికి క్షయవ్యాధి పీడితుడవై పొమ్మని శపించాడు. చంద్రుని అందు కల ఓషధీ శక్తులు నశించి పోయి అతడు రోజు రోజుకు క్షీణించ సాగాడు. ఇదంతా తెలుసుకున్న దేవతలు చంద్రుడి వద్దకు వచ్చి కృశించి పోవడానికి కారణ ఏమిటని అడిగి తెలుసుకుని చంద్రుడిని తీసుకుని దక్షుని వద్దకు వెళ్ళారు. దేవతలు చంద్రుడిని శాపప్రభావం నుండి రక్షించమని వేడుకున్నారు. దక్షుడు వారి ప్రార్థనను మన్నించాడు. భార్యలంరనీ సమానంగా చూడాలని ఎప్పుడూ స్త్రీలనూ, బ్రాహ్మణులను అవమానించ కూడదని చంద్రుడిని కోరాడు. ఆ తరువాత చంద్రుడు సరస్వతీ సాగర సంగమ తీర్థంలో స్నానమాచరించి క్షయ వ్యాధిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి చంద్రుడు ప్రతి అమావాస్యకు ఇక్కడ స్నానమాచరించి పౌర్ణమి వరకు వృద్ధి చెందుతూ 15 రోజుల పాటు వృద్ధిని 15 రోజులు క్షయాన్ని చెందసాగాడు.
చమసోద్భేదనం
[మార్చు]బలరాముడు ప్రభాస తీర్థంలో స్నానమాచరించి చమసోద్భేదనం అనే తీర్ధమున ఒక రాత్రి విశ్రమించాడు. ఆ తీర్ధ విశేషమును చెప్తాను విను. త్రితుడు, ద్వితుడు, ఏకతుడు అనే ముగ్గురు ముని కుమారులు ఉన్నారు. ఆ ముని కుమారులు క్షత్రియులకు యజ్ఞదీక్ష ఇచ్చి గోవులను దానంగా పొంది ఇంటికి వస్తుండగా పెద్ద వారిద్దరూ మూడవ వాడైన త్రుతుడిని మోసగించి అతని గోవులను కూడా అపహరించాలని అనుకున్నారు. ఇంతలో ఒక తోడేలు వారిని తరమగా పరుగెత్తుతున్న త్రితుడు బెదిరి పాడుబడ్డ బావిలో పడ్డాడు. మిగిలిన ఇద్దరూ గోవులన్నిటినీ తోలుకుని ఇంటికి వెళ్ళారు. బావిలో పడ్డ త్రితుడికి దిక్కు తోచ లేదు. ఇందులో నుండి బయటపడటానికి యజ్ఞం చేసి సోమపానం చేయడమే మార్గమని ఎంచి సంకల్పం చేత మనసులోనే యజ్ఞం చేసాడు. ఆ యజ్ఞానికి దేవతలందరూ ఆహ్వానించబడి వచ్చి హవిస్సులు స్వీకరించారు. ప్రీతి చెందిన దేవతలు త్రితుడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగారు. త్రితుడు సరస్వతీ నదిని ప్రార్థించి తనకు పుణ్యజలాలను ఇమ్మని కోరాడు. సరస్వతీ కరుణించి ఆ బావిని తన జలాలతో నింపింది. అప్పటి నుండి ఈ బావిలో నీటితో స్నానమాచరించిన వారికి యజ్ఞం చేసి సోమపానం చేసిన ఫలం లభిస్తుంది అని వరమిచ్చి దేవతలు వెళ్ళారు.
బలరాముని యాత్రలు
[మార్చు]తరువాత బలరాముడు వినశన తీర్ధానికి వెళ్ళాడు. ఆ తీర్థం తక్కువ జాతి వారికి కనపడితే నశిస్తుంది. కనుక అది వినశనము అయ్యింది. ఆ తరువాత బలరాముడు అప్సరసలు నాట్యం చేసే భూమిక అనే తీర్థం చేరి దానిని సేవించాడు. ఆతరువాతబలరాముడు విశ్వావసుడు లాంటి గంధర్వులు తపస్సు చేసి తపస్సిద్ధి చెందిన గంధర్వ తీర్థం చెంతకు వెళ్ళాడు. అక్కడి నుండి బలరాముడు గర్గ క్షేత్రముకు వెళ్ళాడు. అక్కడ గర్గుడు చాలా కాలం నివసించాడు. శంఖ తీర్థం, నైసర్గికం, నాగదన్వానికి వెళ్ళాడు. నాగదన్వం వాసుకి నివసించిన ప్రదేశం. అది వాసుకి దేవతల చేత అభిషిక్తుడైన ప్రదేశం. అక్కడి నుండి బలరాముడు నైమిశారణ్యం వెళ్ళాడు. నైమిశారణ్యానికి సరస్వతీ నది చాలా దూరంలో ఉంది. అప్పుడు నైమిశారణ్య వాసులు ఒక క్రతువు ఆచరించి సరస్వతీ నదీమ తల్లి అనుగ్రహం పొంది ఆమెను తమ చెంత ప్రవహించమని కోరారు. సరస్వతీ నది వారి కోరిక మన్నించి తన గతి మార్చుకుని నైమిశారణ్య ప్రాంతంలో ప్రవహించ సాగింది.
మంకణ మహర్షి
[మార్చు]తరువాత బలరాముడు సప్తసారస్వతముకు వెళ్ళాడు. అక్కడ మంకణుడు అను మహా ముని నివసిస్తున్నాడు. పూర్వం అక్కడ గంగ బ్రహ్మదేవుడు చేసిన యాగముకు, నైశారణ్యంలోని మునులు చేసిన యాగముకు, వశిష్ఠుడు చేసిన యాగముకు, గురువు చేసిన యాగముకు, గయుడు చేసిన యాగముకు, ఉద్దాలకుడు చేసిన యాగముకు సరస్వతీనది స్త్రీ రూపమున వచ్చి వారి చేత అత్యంత గౌరవ మర్యాదలు పొందింది. అందువలన అది సప్తసారస్వతం అయింది. ఒక రోజు మంకణుడు సరస్వతీనదిలో స్నానం చేసే సమయంలో అక్కడికి సమీపంలో స్నానం చేస్తున్న స్త్రీని చూడటంతో అతనికి రేతఃపతనం అయింది. మంకణుడు దానిని ఒక కుండలో భద్రపరిచాడు. అది ఏడుగురు మహా మునులకు జన్మ ఇచ్చింది. ఒక రోజు తాపసి చేతి వేలికి చిన్న దర్భ గుచ్చుకుంది. ఆ గాయం నుండి రక్తం బదులుగా ఆకుపసరు కారసాగింది. అది చూసి మంకణుడు అది చూసిన మంకణ మహర్షి తన తపస్సు ఫలించిందని ఆనందంతో నృత్యం చేయసాగాడు. ఆ నృత్యముకు లోకములన్నీ క్షోభించాయి. అప్పుడు దేవతలు అందరూ పరమశివుని వద్దకు వెళ్ళి జరిగినది అంతా చెప్పారు. అప్పుడు ఈశ్వరుడు మంకణమహర్షి వద్దకు వెళ్ళి " ఇదేనా నీ తపస్సుకు ఫలితం. ఇదేనా ఇక నీ నాట్యం ఆపు " అన్నాడు. అని తన వేలిని మరో వేలితో గీరాడు భస్మం రాలింది. " చూసావా ఈ మాత్రం దానికేనా ఈ నాట్యం " అన్నాడు. అది చూసిన మంకణుడు సిగ్గుపడి నాట్యం ఆపివేసి ఈశ్వరుడిని శరణు వేడాడు. ఈశ్వరుడు మంకణుడి తప్పస్సు క్షీణించ కుండా వరం ఇచ్చాడు.
వశిష్టాశ్రమం
[మార్చు]తరువాత బలరాముడు వశిష్టాశ్రమమునకు వెళ్ళాడు. అది పూర్వం విశ్వామిత్రుడి ఆశ్రమం. విశ్వామిత్రునకు వశిష్టుడి మీద మత్సరం ఉంది. విశ్వామిత్రుడు ఒకసారి సరస్వతీనదిని తలచి ఆమె ప్రత్యక్షంకాగానే వశిష్టుని తీసుకురమ్మని చెప్పాడు. వశిష్ట, విశ్వామిత్రుల తపస్సు తెలిసిన సరస్వతీనది మారు పలుక లేక వశిష్టుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. వశిష్ఠుడు సరస్వతీనదిని చూసి " విశ్వామిత్రుని మాట వినని ఎడల మహర్షి నిన్ను శపించగలడు కనుక నేను నీతో వస్తాను " అన్నాడు. వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో వశిష్టుని తన అలలతో కోసుకుని తీసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చింది. విశ్వామిత్రుడు వశిష్టుని చంపబూనగా సరస్వతీనది వశిష్టుని తప్పించింది. విశ్వామిత్రుడు సరస్వతినది మీద కోపించి ఆమెను రక్తపుటేరుగా మారి పొమ్మని శపించాడు. రక్తము రాక్షసులకు ప్రీతి కనుక ఒక సంవత్సర కాలం సరస్వతీనది రాక్షసులకు ప్రీతిపాత్రం అయింది. ఒక సారి సరస్వతీనది వద్దకు వచ్చిన మహామునులు ఆమె అవస్థ చూసి ఆమెను అడిగి జరిగిన విషయం తెలుసుకొని తమతమ తపోబలంతో సరస్వతీ నదీ జలాలను పరిశుద్ధం చేసి పుణ్య స్నానాలు చేసారు. అప్పుడు అక్కడకు వచ్చిన రాక్షసులు కొందరు మునులతో " మహామునులారా ! మేము ఇంత వరకు బ్రాహ్మణులను ద్వేషించాము, నరమాంసం భక్షించాము, గురుజనులను పీడించాము, మహా పాతకములను చేసాము. మాకు నిష్కృతిని ప్రసాదించండి " అని వేడుకున్నారు. మహామునులు సరస్వతీ నదిని వేడుకుని రాక్షసులకు నిష్కృతి కలించమని అడిగారు. సరస్వతీనది అరుణానదిని తనలో అంతర్వాహినిని చేసి అందులో రాక్షసులను మునగమని చెప్పింది. రాక్షసులు సరస్వతీ నదిలో మునిగి రాక్షస దేహాలు విడిచి దైవత్వం పొందాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న ఇంద్రుడు తాను నముచి అను రాక్షసుడిని నమ్మించి మోసగించి చంపి మూట కట్టుకున్న పాపాన్ని సరస్వతీనదీ జలాలలో మునిగి పోగొట్టుకున్నాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.
సోమతీర్థం
[మార్చు]తరువాత బలరాముడు సోమతీర్ధముకు వెళ్ళాడు. అక్కడ సోముడు రాజసూయయాగం చేసాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుడు షణ్ముఖుని దేవసేనకు అధిపతిగా అభిషిక్తుడిని చేసాడు. ఆ తరువాత షణ్ముఖుడు తారకాసురుడిని సంహరించాడు. పరమేశ్వరుడు ఒకసారి తన రేతస్సును దేవతల కోరిక మీద అగ్ని ఆ తేజస్సును భరించ లేక బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రాహ్మ ఆ తేజస్సును గంగా నదిలో దాచమని చెప్పాడు. గంగానది కూడా ఆ తేజస్సును భరించలేక హిమాలయాల మీద ఒక తటాకంలో రెల్లు పొదలలో ఉంచింది. అప్పుడు కుమార జననం జరిగింది. అప్పుడు అతడికి కృత్తికలు ఆరుగురు తమ పాలు ఇచ్చి పోషించి కుమారుడికి తల్లులు అయ్యారు. బృహస్పతి స్వయంగా కుమారునికి జాతకకర్మలు గావించాడు. ఒక రోజు పరమశివుడు పార్వతి సమేతుడై, రుద్రగణాలతో అక్కడకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దిక్పాలకులు, మరుత్తులు, పితృగణాలు అక్కడకు వచ్చారు. అప్పుడు శివుడు అక్కడ తాను, పార్వతీ, గంగ, అగ్ని ఉన్నారు కదా కుమారుడు ముందు ఎవరికి ముఖ్యత్వం ఇస్తాడు అనుకున్నాడు. అలాగే మిగిలిన వారు అలాగే అనుకున్నారు. వారి మనోగతం తెలుసుకున్న కుమారుడు నాలుగు రూపాలతో వారి వద్దకు వెల్లాడు. పరమ శివుడు బ్రహ్మను చూసి " దేవా ! మహా తేజశ్వి అయిన ఈ కుమారునికి తగిన పదవిని మీరే నిర్ణయించండి " అన్నాడు. బ్రహ్మ " మహాదేవా ! ఇతడు దేవతల హితం కోరే వాడు కనుక ఇతడికి దేవ సైన్యాధిపత్యం ఇవ్వండి " అన్నాడు. అక్కడి వారంతా బ్రహ్మదేవుడి మాటకు ఆమోదం తెలిపారు. అందరూ సరస్వతీనదీ తీరం చేరి షన్ముఖుడిని బంగారు సింహాసనం మీద కూర్చుండ పెట్టి బృహస్పతి హోమ కార్యం నిర్వహిస్తుండగా దేవసేనకు అభిషిక్తుడిని చేసాడు. ఈశానుడు, విష్ణువు అభిషేకద్రవ్యాలను పూర్ణకలశాలను పట్టుకున్నారు. గంధర్వులు, అప్సరసలు మంగళ గీతాలు ఆలపించారు. మహామునులు పుణ్యాహవాచనములు నిర్వర్తించారు. లక్ష్మీదేవి, సరస్వతి, శచీదేవుల ఆశీర్వాదంతో షణుముఖునికి ఇక్కడ అభిషేకం జరిగింది. శంకరుడు , విష్ణువు, దేవతలు తమ బలంలో కొంత భాగాన్ని అతడికి కానుకగా ఇచ్చారు. శంకరుడు ఉదయభాస్కరునితో సమానమైన పతకాన్ని, బ్రహ్మదేవుడు రాక్షస సంహారానికి అవసరమైన శక్తిని, విష్ణువు వనమాలను ఇచ్చాడు. పార్వతీ దేవి మాయని పట్టుబట్టలను ఇవ్వగా, గంగాదేవి ఉజ్వలమైన అమృతమయమైన కమండలం ఇచ్చింది, గురువు దండమును, గరుడుడు నెమలిని, వరుణుడు తామర తూడులను, కుబేరుడు మేకలను, బ్రహ్మ కృషాజినం బహూకరించాడు. అతడి వైభవమును చూసిన ఈశ్వరుడు " ఇతడు తప్పక రాక్షసులను సంహరిస్తాడు " అని అతడికి భూతమయమైన సైన్యాన్ని ఇచ్చాడు. అప్పుడు అందరూ భేరీ నాదం చేస్తూ శంఖనాదం చేసారు. కుమారుడు " మీరు చంపమన్న శత్రువును చంపుతాను " అని వారితో పలికాడు. ఆ తరువాత కుమారుడు దేవతలను తారకాసురుడు బాధించడం తెలుసుకొని తారకారురుడిని శక్తిఆయుధ ప్రయోగంతో ససైన్యంగా సంహరించాడు. ఆ తరువాత లోక కంటకుడైన బలిచక్రవర్తి కుమారుడైన బాణుడిని తన శక్తిఆయుధముతో సంహరించి ముల్లోకాలకు శాంతి కలిగించాడు.
అగ్ని తీర్థం
[మార్చు]సోమతీర్థం నుండి బలరాముడు అగ్ని తీర్థం వద్దకు వెళ్ళాడు. ఇక్కడ " భృగు శాపానికి గురి అయిన అగ్నిదేవుడు అలిగి ఇక్కడ ఉండగా దేవతలు అతడిని బుజ్జగించి సర్వ భక్షకుడివి కమ్మని భృగువు ఇచ్చిన శాపం జరిగినా ఏది భక్షించినా అగ్ని పవిత్రత చెడదని వరమిచ్చారు. అగ్ని సంతసించి తిరిగి తన విధి నిర్వహణకు పూనుకున్న ప్రదేశం ఇదే. అందు వలన ఈ ప్రదేశానికి అగ్నితీర్థం అనే పేరు వచ్చింది. బలరాముడు ఆ తరువాత కుబేర తీర్ధానికి వెళ్ళాడు.
బదరి పాచనము
[మార్చు]కుబేరతీర్థం నుండి బదరిపాచనం వెళ్ళాడు. పూర్వం భరధ్వాజుని కుమార్తె అయిన ప్రభావతి ఇంద్రుడిని భర్తగా కోరి తపస్సు చేసింది. ఇంద్రుడు వశిష్టుడి వేషంలో ఆమె వద్దకు వచ్చాడు. ప్రభావతి తన కోరికను చెప్పింది. ఇంద్రుడు కొన్ని రేగుపండ్లను ఆమెకు ఇచ్చి పచనం చెయ్యమని చెప్పాడు. ఆమె శుచిగా స్నానం ఆచరించి వాటిని పొయ్యి వెలిగించి వండనారంభించింది. అవి ఎంతకూ ఉడక లేదు. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమై పాకం చెడుతుందని తన కాళ్ళను పొయ్యిలో పెట్టి ఉడకపెట్ట సాగింది. ఆమె నిష్ఠకు మెచ్చి ఇంద్రుడు " శుభాంగి నీ నిష్ఠకు మెచ్చితిని. నీవు ఈ శరీరం విడిచి దివ్యదేహం ధరించి దేవలోకం వచ్చిన ఎడల నీ కోరిక తీర్చగలను. ప్రభావతి అలాగే చేసిన పుణ్య ప్రదేశం ఇది కనుక ఈ ప్రదేశం సర్వపాపహరమైంది. రేగుపండ్లకు బదరీఫలం అనే మరొక పేరు ఉన్నది కనుక బదరిపాచనం అయింది. ఆ తరువాత బలరాముడు ఇంద్రతీర్థం వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసాడు.
రామ తీర్థం
[మార్చు]ఆ తరువాత బలరాముడు రామతీర్థం వెళ్ళాడు. పరశురాముడు 21 మార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేసి అంతటితో తృప్తి చెందక అశ్వమేధ యాగములు, రాజసూయ యాగములు, వాజపేయములు చేసిన ప్రదేశం అది. పరశురాముడు కశ్యపుని ఆధ్వర్యంలో ఆ యాగములు నిర్వహించి తాను జయించిన భూమినంతా కశ్యపునికి దక్షిణ నిమిత్తం ఇచ్చేసిన ప్రదేశం అది. అక్కడ నుండి బలరాముడు యామున క్షేత్రంకు వెళ్ళాడు. అక్కడ వరుణుడు ఎన్నో రాజసూయ యాగములు చేసాడు. అవి పూర్తి కాగానే దేవాసుర యుద్ధం సంభవించింది. అక్కడి నుండిబలరాముడు అదిత్యతీర్థం వెళ్ళాడు. ఆ తీర్థంలో సూర్యుడు యాగము చేసి జ్యోతిషాధిపత్యం పొందాడు. అక్కడ నుండి బలరాముడు సారస్వతం అనే పేరుగల వశిష్టతీర్థం వెళ్ళాడు. పూర్వం అక్కడ దధీచి అనే ముని ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం చేయాలని అనుకుంటాడు. దధీచి తపో భంగం చేయడానికి అలంబుస ' అనే అప్సరసను పంపాడు. దధీచికి అలంబసని చూసి రేతః పతనం అయింది. ఆ రేతస్సును సరస్వతీనది తనలో దాచుకుంది. ఆ కారణంగా సరస్వతీనది ఒక కుమారుని కని అతడిని తీసుకుని వెళ్ళి " మహామునీ ! ఇతడు నీ కుమారుడు. నీ నుండి పతనమైన రేతస్సును భద్రపరచి కుమారుడిని కన్నాను " అని చెప్పింది. దధీచి ఆ కుమారుని ఆలింగనం చేసుకుని సరస్వతీవదితో " అమ్మా ! నీవు బ్రహ్మసరస్సున పుట్టావు, పుణ్యనదులలో మేటివి, నీ జలములలో పితృదేవతలకు తర్పణం విడిచి విశ్వదేవతలు, పితృదేవతలు, గంధర్వులు తృప్తి చెందుతారు. ఈ కుమారుడు నీ పేరుతో సారస్వతుడు అని పిలువబడతాడు. ఇప్పటి నుండి రాబోయే 12 సంవత్సరాలకు తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. సారస్వతుడు మహా మునులను ఆ కరువు నుండి రక్షించి వేదాధ్యయనం చేయిస్తాడు " అని చెప్పి ఆ కుమారుడిని సరస్వతీనదికి ఇచ్చివేసాడు. ఆ సమయంలో దేవాసురయుద్ధం వచ్చింది. ఇంద్రుడికి అసురసంహారానికి ప్రశస్థమైన ఆయుధం కావలసి వచ్చింది. దేవతలు ధధీచిని ప్రార్ధించి అతడి వెన్నెముకను ఆయుధము నిమిత్తం అడిగాడు. ధధీచి తన దేహత్యాగం చేసి వెన్నెముకను ఇచ్చాడు. ఇంద్రుడు ఆ ఆయుధముతో యుద్ధం చేసి రాక్షసులను జయించాడు . తరువాత 12 సంవత్సరాలకు తీవ్ర క్షామం వచ్చింది. సారస్వతుడు మహా మునులందరినీ చేరదీసి సరస్వతీనదీ తీరమున వేదాధ్యనం చేయించాడు.
వృద్ధ కన్యాశ్రమం
[మార్చు]సారస్వతం నుండి బలరాముడు వృద్ధకన్యాశ్రమం వెళ్ళాడు. వృద్ధకన్యాశ్రంలో ఖని అనే కన్య స్వర్గం మీద ఉన్న ఆపేక్షతో తీవ్ర తపమాచరించి వృద్ధురాలైంది. అప్పుడు నారదుడు ఆమె వద్దకు వచ్చి ఆమె కోరిక తెలుసుకొని " కన్యకా ! నీవు అవివాహితవు. అవివాహితలకు స్వర్గం నిషిద్ధం " అన్నాడు. అప్పుడు ఆమె " తన తపస్సులో సగం ధారపోసి యవ్వనవతియై గాలవుడు అనే ముని యొక్క కుమారుడిని వివాహము చేసుకొని ఒక్క రోజు మాత్రమే సంసారం సాగించి స్వర్గానికి బయలుదేరింది. అందుకు ఆ మునికుమారుడు బాధపడ్డాడు. ఆ వృద్ధకన్య మునికుమారుడి బాధను నివారించే విధంగా ఆ క్షేత్రంలో ఎవరైనా ఒక్క రోజు ఉపవాసం ఉండి దేవతలను, పితృ దేవతలను తృప్తి పరచిన ఎడల 50 సవత్సరాలు బ్రహ్మచర్య వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది " అని చెప్పి స్వర్గానికి వెళ్ళింది.
కురుక్షేత్రం
[మార్చు]బలరాముడు వృద్ధాశ్రమంలో ఉండగా కురుక్షేత్రంలో కౌరవులందరూ మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. తరువాత కురుక్షేత్ర సమీపంలో ఉన్న శమంతక పంచకం' వెళ్ళి అక్కడి మునులను అడిగి కురుక్షేత్రంలో జరిగిన విషయాలు తెలుసుకున్నాడు. వారు " ఈప్రదేశమును కురుమహారాజు దున్నడం వలన ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. కురుమహారాజు అక్కడ పుట్టిన వారందరూ స్వర్గలోకం వెళ్ళాలన్న కోరికతో భూమిని దున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు భూమిని దున్నితే స్వర్గ లోకం ప్రాప్తిస్తుందా ! అని హేళన చేసాడు. అయినా కురుమహారాజు పట్టు విడువక దున్నసాగాడు. అతడి పట్టుదలను చూసి దేవేంద్రుడు ఆ ప్రదేశంలో ఉపవసించి మరణించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు " అని ఆ ప్రదేశ ప్రాశస్త్యం గురించి చెప్పారు. అప్పుడు అక్కడకు వచ్చిన నారదుడు అక్కడకు వచ్చి " ఈ 18 రోజుల యుద్ధంలో కురుసైన్యంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే రథికత్రయం తప్ప మిగిలిన వారంతా మరణించారు. సుయోధనుడు మాత్రం ఒంటరిగా కృష్ణద్వైపాయన మడుగులో జలస్తంభన విద్య ద్వారా దాక్కొని ఉండగా ధర్మరాజు మాటలకు బయటకు వచ్చి భీమునితో యుద్ధము చేయ సిద్ధముగా ఉన్నాడు. వారిరువురు నీ శిష్యులు కనుక నీవు వెళ్ళి వారి యుద్ధం తిలకించు " అని చెప్పాడు. వెంటనే బలరాముడు కురుక్షేత్రం చేరుకున్నాడు. అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడని సంజయుడు వివరించి " మహారాజా ! బలరాముని చూసి నీ కుమారుడి ముఖం వికసించింది. తన పక్షమున తన గురుదేవుడు ఉన్నాడనుకుని సంతసించాడు. సుయోధనుడు ధర్మనందనుడిని జూసి " ధర్మనందనా ! ఇక్కడికి సమీపంలో శమంతక పంచకంలో మరణించిన వారికి ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి కనుక యుద్ధం అక్కడ జరగడం మంచిది కదా ! " అన్నాడు. బలరాముడు ఆ మాటను సమర్ధించడం వలన అందరూ అక్కడకు వెళ్ళారు.
భీమ సుయోధనులు సమరం
[మార్చు]శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, యాదవులు, పాంచాలురు చతురంగబలాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమ సుయోధనులు యుద్ధానికి సన్నద్ధ మయ్యారు. భీముడు " ధర్మరాజా ! ఈ నీచుడు ఎన్నో పాపాలు చేసాడు. ఇతడికి ఈ రోజుతో ఆయుస్షు తీరింది. నాడు సభలో నేను చేసిన శపధం ఈ రోజు వీడి తొడలు విరిచి నెరవేర్చుకుంటాను " అన్నాడు. సుయోధనుడు కూడా " ఈ రోజు నీకూ నా చేతిలో చావు మూడింది. నాతో గధా యుద్ధం చేయడానికి ఈశ్వరాదులే వెనకడుగు వేస్తాడు. ఇక నీ వెంత ! నిన్ను చంపి సర్వం సహా కురు సామ్రాజాధిపత్యం వహిస్తాను " అన్నాడు. ఇలా ఒకరిని ఒకరు దూషించుకుంటుండగా యుద్ధ ప్రారంభసూచిక మ్రోగింది. భీమసుయోధనులు మహా ఉద్రేకంతో యుద్ధం చేయతలపడ్డాడు. బలరాముడు ఆసక్తిగా చూస్తుండగా ఒకరిని ఒకరు బెదిరించుకుంటూ గుండ్రంగా తిరుగుతూ గదలతో మోదుకుంటూ ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వారి పదఘట్టనలతో భూమి కంపిస్తుంది. వారి కిరీటములు కింద పడ్డాయి, ఆభరణములు క్రిందరాలాయి కవచాలు విరిగి పోయాయి. ఒకరి గదను ఒకరు చుట్టి లాగుతున్నారు. అంతలోనే వెనక్కు తగ్గుతున్నారు. ఏనుగుల మాదిరి ఢీకొట్టుకుంటున్నారు, ఒకరు కొట్టే దెబ్బలు ఒకరు తప్పించుకుంటూ తిరిగి దెబ్బతీస్తూ ఉన్నారు. గదాఘాతముల వలన ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయినా వెనక్కి తగ్గ లేదు. కాసేపు సొమ్మసిల్లి తిరిగి బలం పుంజుకుని తిరిగి యుద్ధం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జయాపజయాలు నిర్ణయించడం చాలా కష్టం అయింది.
కృష్ణార్జునులు యుద్ధరీతిని గురించి చర్చించుట
[మార్చు]అప్పుడు అర్జునుడు " కృష్ణుడితో " కృష్ణా ! చూసావు కదా భీమసుయోధనులు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వీరిలో ఎవరిది గెలుపంటావు " అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు " అర్జునా ! ఇద్దరూ విద్యనేర్చుకున్నది ఒకరి వద్దనేగా ! భీముడిది శారీరక బలమే కాని బుద్ధి బలం తక్కువ. సుయోధనుడికి శారీరక బలం, గదాయుద్ధంలో అత్యంత ప్రావీణ్యం, బుద్ధి బలం ఎక్కువ. ఎదుటి వాడు మాయోపాయాలు పన్నుతూ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ధర్మయుద్ధం చేయడంలో ప్రయోజనం లేదు. మనమూ మాయోపాయములు పన్నాలి. నాడు భీముడు కురు సభలో సుయోధనుడి తొడలు విరుగకొడతానని శపథం చేసాడు కనుక నాభికి క్రింది స్థానంలో కొట్టడం గదాయుద్ధంలో అధర్మమే అయినా భీముడు శపథం నెరవేర్చుకునే నిమిత్తం కొట్టాడని సమర్ధించ వచ్చు. లేకున్న విజయం సిద్ధించుట దుర్లభం. కనుక మనకు సుయోధనుడి తొడలు విరుచుట ఒక్కటియే మన కర్తవ్యం.
ధర్మరాజు వలన కలిగిన సంకటం
[మార్చు]అదియును కాక ధర్మజుని మాట మనలను చిక్కుల్లో పెట్టింది. భీముడు గెలువకున్న మీరు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదులను సంహరించి కష్ట పడి గెలుచుకున్న సామ్రాజ్యం కుటిలుడు, అధర్మపరుడు, దుర్మార్గుడైన సుయోధనుడి హస్థగతం ఔతుంది కనుక భీముడు గెలుచుట అత్యంత అవసరం. అయినా ధర్మజుడు ఇంత బుద్ధి హీనుడు అనుకోలేదు. సమస్త సైన్యాల నాశనం కావడానికి, బంధువులను, మిత్రులను కోల్పోవడానికి కారకుడైన సుయోధనుడిని చుట్టుముట్టి చంపక ద్వంధయుద్ధానికి అంగీకరించడం ఒక్కరిని ఓడించిన సామ్రాజ్యానికి అధిపత్యం ఇస్తానని పలకడం ఎంత మూర్ఖత్వం. భీమసేనుడిని గెలువడం సుయోధనుడి చిరకాలవాంఛ. సుయోధనుడు వచ్చిన అవకాశం జారవిడుస్తాడా ! కనుక ఇక ఆలస్యం చేయక సుయోధనుడిని అధర్మమే అయినా జయించడం అవసరం లేకున్న భీముని గెలిచి సుయోధనుడు సామ్రాట్టు ఔతాడు. తిరిగి అతడి చేతిలో మీకు ఇడుములు తప్పవు జాగ్రత్త " అన్నాడు.
సుయోధనుడు నేల కూలుట
[మార్చు]అర్జునుడు విషయం గ్రహించాడు. కృష్ణుడు భీమసేనుడి వంకనే చూస్తూ అతడు తన వంక చూడగానే తొడ చూపి అక్కడ కొట్టమని సైగ చేసాడు. ఆ సైగను భీముడు గ్రహించాడు. అధర్మ యుద్ధానికి కృష్ణుడే అనుజ్ఞ ఇచ్చాడు. ఇక ఆలసించకూడదని అనుకున్నాడు. సుయోధనుడి తొడలు విరువడానికి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ముందుగా భీముడు ముందుగా సుయోధనుడిని ఒక్క బెబ్బ కొట్టాడు. ఆ దెబ్బను తప్పించుకుని సుయోధనుడు భీముని తన గధతో సొమ్మసిల్లేలా గట్టిగా మోదాడు. సుయోధనుడు ఒళ్ళు మరచి గాలిలో ఎగురుతూ గిరగిరా తిరుగుతూ భీముని చంపడానికి గధను బలంగా పైకి ఎత్తాడు. ఇది సరి అయిన సమయమని తెలుసుకున్న భీముడు తనకు అనువుగా ఉన్న సుయోధనుడి తొడలు విరుగ కొట్టాడు. సుయోధనుడు తొడలు విరిగి మొదలు నరికిన చెట్టులా నేల మీద పడ్డాడు. సుయోధనుడు నేల మీద పడగానే భీముడు " సుయోధనా ! నాడు కురుసభలో ఏకవస్త్ర అయిన పాంచాలిని సభకు ఈడ్పించి కూర్చోమని తొడ చూపినందుకు ఫలితం అనుభవించు " అంటూ ఎడమ కాలితో ఎగిసి సుయోధనుడి తలను తన్ని " సుయోధనా ! ఇది వంచనతో గెలువడానికి ఇది యక్షక్రీడ కాదు ఇది యుద్ధం. ఒరేయ్ ! మమ్మలిని పశువులనీ, మృగములనీ, బానిసలనీ ఎగతాళి చేసినందుకు ఫలితం అనుభవించు " అని అరిచాడు. " కృష్ణా ! అర్జునా ! పాంచాల వీరులారా ! చూడండి తాకకూడని పరిస్థితిలో ఏకవస్త్ర అయిన ఒక స్త్రీని సభకు ఈడ్పించి ఫలితం అనుభవిస్తున్న ఈ దుర్మార్గుడిని చూడండి. పాంచాలి కోపాగ్నిలో మాడి మసి అయి పోతున్న పాపాత్ముడిని చూడండి. మమ్ము వ్యర్ధులని, బానిసలని అవమానించిన దుర్మార్గులను ససైన్యంగా సమూలంగా నాశనం చేసాము. ఇక మేము స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఒక్కటే " అంటూ కుడి కాలు సుయోధనుడి మెడ మీద పెట్టి ఎడమ కాలితో తలను తన్నాడు.
భీమసేనుడిని ధర్మరాజు మందలించుట
[మార్చు]యుద్ధ పరిమాణాన్ని చూసి ధర్మరాజు ఆవేశపడి అవేదనగా " భీమసేనా ! ఆగు ఏమిటీ పిచ్చితనం. ఈ పిచ్చి ప్రేలాపన ఏమిటి. ఆ తల తన్నడం ఏమిటి ! ఇది అధర్మం అన్యాయం చూడ్డానికే సిగ్గు, అసహ్యం వేస్తుంది. యుద్ధంలో సకల సైన్యాలనూ, బంధు మిత్రులనూ పోగొట్టుకుని నా మాట మన్నించి నీతో గదా యుద్ధానికి సిద్ధమై వీరోచితంగా పోరాడి నేలకూలిన సుయోధనుడి తలను తన్నడం న్యాయమా ! ధర్మమా ! లోకం హర్షిస్తుందా ఇంత వరకు భీమసేనుడు ధర్మం తప్పడని పేరు పొందావు. నేడు గర్వంతో విర్రవీగుతున్నావు నీకు ఇందు కలిగిన ప్రయోజనం ఏమిటి ! నీకిది అపకీర్తి కాదా ! " అని భీమసేనుని మందలించి " సుయోధనా ! విధి వక్రించి మన మధ్య వైరం ఏర్పడింది. ఒకరిని ఒకరు ద్వేషించుకుని సర్వం పోగొట్టుకుని ఈ స్థితికి వచ్చాము. బాల్యం నుండి నీకు అలవడిన లోభం, మదం, మాత్సర్యం, అధర్మం నిన్నీ పరిస్థితికి చేర్చాయి. నీ వలన మన ఇద్దరి బంధుమిత్రులు నశించారు. ధృతరాష్ట్రుడి కోడళ్ళందరకూ వైధవ్యం ప్రాప్తించింది. ఇందుకు నువ్వే కారణమని లోకం నిందిస్తుంది " అని సుయోధనుడిని ఓదార్చాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు.
బలరాముని ఆవేశం
[మార్చు]సంజయుడు చెప్పిన దృష్టాంతం విని ధృతరాష్ట్రుడు " సంజయా ! భీమసేనుడు అధర్మంగా నా కొడుకు తొడలు విరుగ కొట్టి పడత్రోయటం చూసిన బలరాముడు తన శిష్యుడైనన భీమసేనుని ఏమీ అనలేదా ! " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! భీమసేనుడు సుయోధనుడిని తొడలు విరిచి పడ గొట్టగానే బలరాముడు కోపంతో పైకి లేచి అక్కడి మహారాజులను చూసి " చూసారా ! ఈ భీమసేనుడి ఆగడం. ఈ అధర్మ యుద్ధం ఎక్కడైనా చూసారా ! గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం కాదా ! భీముడు ఇలా సుయోధనుడిని నాభి క్రింద కొట్టి కూల్చడం న్యాయమా ! " అని హలాయుధం పట్టుకుని భీమసేనుడి వైపు పోసాగాడు.
శ్రీకృష్ణుడు బలరాముని ఆపుట
[మార్చు]అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని వద్దకు వెళ్ళి ఆయనను రెండు చేతులతో పట్టి వారించి " అన్నయ్యా ! తాను తనమిత్రులు వృద్ధిలోకి రావడం శతృవు అభివృద్ధిని నిరోధించడం మానవ లక్షణం. మిత్రునికి ద్రోహం జరుగుతున్నప్పుడు ఆదుకొనడం ధర్మం పాండవులు మనకు బంధువులు, మిత్రులు, విశేషించి మనకు మేనత్త కొడుకులు. అర్జునుడు మన చెల్లెలు సుభద్రకు భర్త. వారంతా అధర్మపరులైన కౌరవుల చేత అవమానించబడి ఇడుముల పాలయ్యారు. కనుక పాడవులను ఆదుకోవడం అభివృద్ధికి తోడ్పాటు అందించడం మన ధర్మం కాదా ! క్షత్రియులకు ప్రతిజ్ఞ చేయుట ధర్మం భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట అధర్మం ఎలా ఔతుంది. అన్నయ్యా ! సుయోధనుడి తొడలను భీమసేనుడు తన గదతో భగ్నపరచగలడు అని మైత్రేయ మహర్షి చెప్ప లేదా ! మహా ముని శాపం అసత్యం ఔతుందా ! ఇందు భీమసేనుడి దోషం ఏముంది కనుక నీ అకారణ కోపం ఉపశమింప చేసి శాంతింపుము " అని బలరాముని అనునయించాడు. కాని బలరాముని కోపం తగ్గ లేదు. " కృష్ణా ! ధర్మార్ధ కామ మోక్షములు ఒక దానికి ఒకటి అనుసంధానింపబడి ఉన్నాయి. అవి ఒక దానిని ఒకటి నాశనం చేసుకోవచ్చా ! పురుషార్ధములలో ధర్మాన్ని పక్కన పెట్టి మిగిలిన పురుషార్ధములను పొందు వాడు నిందితుడు కాదా ! నీవు భీముని ప్రతిజ్ఞ, ముని శాపం అంటున్నావు. వాటిని నెరవేర్చుట కొరకు ధర్మం తప్పి ప్రవఎర్తించుట న్యాయమా ! ఏది ఏమైనా భీముడు గదాయుద్ధంలో ధర్మం తప్పి ప్రవర్తించాడనడం కాదన లేని సత్యం " అని చెప్పాడు. కృష్ణుడు " అన్నయ్యా ! ఈ లోకం నిన్ను లవలేశం అయినా దోషం లేని వాడు, ధర్మ నిరతుడు, చక్కని నడవడి కల వాడుగా కీర్తిస్తుంది. ఈ అకారణ కోపం వదిలి పెట్టు భీముడు తన ప్రతిజ్ఞా పాలన చెయ్యడం ఎలా అధర్మం ఔతుంది. అన్నయ్యా ! భీమసేనుడు సుయోధనుడు నిలబడి ఉన్నప్పుడు నాభి క్రింద కొట్ట లేదు అతడి క్రింద ఉండి సుయోధనుడు పైకి ఎగిరి గదతో భీముని చంపుటకు ప్రయత్నించే సమయంలోనే కదా తన ప్రతిజ్ఞా పాలన కొరకు పదమూడేళ్ళు వేచి ఉన్న భీముడు నాభిక్రింద కొట్టింది. అలా చెయ్యక పోతే భీమసేనుడు మరణించడా ! ఆపత్కాలంలో ప్రాణాపాయకాలంలో ధర్మాధర్మ విచక్షణ చేయడం కుదురుతుందా ! భీముని ప్రతిజ్ఞ తెలిసిన సుయోధనుడు తగిన జాగర్త ఎందుకు తీసుకో లేదు. అన్నయ్యా చిన్నతనం నుండి పాండవులను హతమార్చుటకు సుయోధనుడు చేసిన కుటిల ప్రయత్నాలు నీకు తెలియనివా ! కుటిలుడిని కుటిలోపాయంతో చంపడం అధర్మం కాదే ! మన చెల్లెలు కుమారుడైన అభిమన్యుడిని కుటిలోపాయంతో అధర్మంగా చంపిన సుయోధనుడిని చంపడంలో అధర్మం ఏమి ఉన్న దోషమేమి ! ధర్మానికి ధర్మం అధర్మానికి అధర్మం చెల్లుకు చెల్లు అధర్మాన్ని అధర్మం జయించింది " అన్నాడు. బలరాముడు " కృష్ణా ! నీ వాదనాపఠిమతో అధర్మాన్ని ధర్మం అని నిరూపించలేవు. నీ దృష్టిలో ఇలాంటి నీచమైన గెలుపు సాధించిన భీముడు నీకు ప్రశంశాపాత్రుడు ఔతాడేమో ! కాని యుద్ధనీతిని అక్షరాలా పాటించిన సుయోధనుడు ఉత్తమ లోకాలను పొందుతాడు " అని రథం ఎక్కి ద్వారకకు వెళ్ళి పోయాడు.
చింతాక్రాంతుడైన ధర్మరాజును కృష్ణుడు ఓదార్చుట
[మార్చు]అప్పుడు శ్రీకృష్ణుడు చింతాక్రాంతుడైన ధర్మరాజు వంక చూసాడు. తల వంచుకుని చింతాక్రాంతుడై నిలబడి ఉన్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాపకర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఇందుకు బాధపడ వలసిన పని ఏమి " అని పలికిన కృష్ణుడిని చూసి ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరుగ కొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. కాని సుయోధనుడి తల తన్ని అవమానించడం న్యాయమా ! అసలే కురువంశ నాశనముకు నా మనస్సు విచలితమౌతుంది. భీముని చర్య నాకు అమిత దుఃఖం కలిగించింది. భీమసేనుడికి మేము పడిన కష్టాలు గుర్తుకు వచ్చి అలా చేసి ఉంటాడులే ! ఇప్పుడిక పాప పుణ్యాల ప్రసక్తి ఎందుకు " అన్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! కురువంశ వినాశకుడు అయిన సుయోధనుడు నేల కూలాడు. ఇప్పుడు నీవు సర్వంసహా కురు సామ్రాజ్యానికి నీవు చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడితో " నీ ధైర్యం, భుజబలం, శ్రీకృష్ణుడి సాయంతో సుయోధనుడిని నేల కూల్చిన నీకు నా అభినందనలు " అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.
కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుట
[మార్చు]బలరాముని మాటలకు చింతాక్రాంతుడై చూస్తున్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాప కర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఇందుకు చింత పడటం ఎందుకు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరిచి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. అయినా సుయోధనుడి తల తన్నడం ఎందుకు. అసలే కురువంశ నాశనం అయినందుకు నా మనస్సు పరితాపం చెందుతున్న నాకు భీమసేనుడి చర్య అమిత బాధను కలిగించింది. భీమసేనుడికి తాను పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి అలా ప్రవర్తించి ఉంటాడులే. ఇక పాప పుణ్యాలను పోనీలే కృష్ణా ఆలోచించి ఏమి ప్రయోజనం " అన్నాడు. కృష్ణుడు " ధర్మ నందనా ! మీ అవమానాలకు కష్టాలన్నిటికీ కారకుడు కుల నాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు నేలకొరిగాడు. ఇక ఈ సర్వం సహా సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు " భీమసేనా ! నీ సాహసం ధైర్యం శ్రీకృష్ణుడి సహాయంతో సుయోధనుడిని నేల కూల్చావు. నీకు నా అభినందనలు " అన్నాడు. " అని సంజయుడు చెప్పాడు.
యోధులు సుయోధనుడి మరణాన్ని విమర్శించుట
[మార్చు]సంజయుడి మాటలు విని ధృతరాష్ట్రుడు " సంజయా ! నా కుమారుడు నేలకొరిగిన తరువాత పాండవులు, పాంచాలురు, యాదవులు ఏమి అనుకున్నారో వివరించు " అన్నాడు. సంజయుడు మహారాజా ! సుయోధనుడు నేల కొరగగానే పాండవులు పాంచాలురు ఆనందోత్సాలతో చేసిన భేరీనాదాలు, శంఖ ధ్వనులు మిన్నంటాయి. అందరూ పెద్దగా కేకలు వేస్తూ భీమసేనా ! గదాయుద్ధంలో అత్యంత నేర్పరి అయిన సుయోధనుడి తొడలు విరిచి నేల కూల్చావు. నీవు సుయోధనుడిని కూల్చుతున్నప్పుడు మాకు కలిగిన గుగుర్పాటు ఇంకా తగ్గ లేదు " అని భీమసేనుడిని ప్రశంసించారు. కాని కొంత మంది మాత్రం భీమసేనుడు సుయోధనుడిని అధర్మంగా పడగొట్టాడు " అని తమలో తాము అనుకోవడం విన్న శ్రీకృష్ణుడు " మహా వీరులారా ! భీముడు సుయోధనుడిని అక్రమంగా నేలకూల్చాడని అనుకోవద్దు. ఈ దుర్మార్గుడు ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు విప్పమని ఆజ్ఞాపించాడు. పాండవులను అనేక విధముల ఇడుముల పాలు చేసిన సుయోధనుడి అక్రమాలు మన్నించి మరచి అర్ధరాజ్యం అడుగుతూ సుయోధనుడితో సంధిని కోరాడు. కాని ఈ పాపాత్ముడు సంధికి అంగీకరించ లేదు. ఈ అధర్మవర్తనుడిని అధర్మంగా నేల కూల్చడంలో దోషం లేదు. విదురాది మహాత్ములు అనేకులు చెప్పినా పెడచెవిని పెట్టి యుద్ధాన్ని కోరుకుని, కురువంశ వినాశనానకి కారణమైన ఈ పాపాత్ముడి గురించి ధర్మాధర్మ విచక్షణలతో పని లేదు. మీ మీ స్థానములకు కదలండి " అని పలికాడు.
సుయోధనుడు కృష్ణుడిని నిందించుట
[మార్చు]ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో " ఓ కంసుడి దాసుడైన వసుదేవ కుమారుడా ! నీ తప్పులు నీవు తెలుసుకోకుండా సిగ్గు విడిచి ప్రేలుతున్నావా ! నీవు చెప్పిన మాటలు విని అర్జునుడు చేసిన సైగను గ్రహించి భీముడు అధర్మంగా నా తొడలు కొట్టి నన్ను పడగొట్టాడు. లేకున్న ఈ భీములు పది వేలు వచ్చినా నన్ను గధాయుద్ధమున జయించగలరా. లేని ఎడల నేను ఒక్కడినే మీ అందరిని చంపగలను. శిఖండిని ముందు పెట్టి భీష్ముని పడగొట్టించావు, ధర్మరాజుతో అబద్ధం పలికించి ద్రోణుడిని చంపించావు. భూమిలోకి క్రుంగిన రధచక్రమును పైకి తీస్తున్న కర్ణుడి మీద శర ప్రయోగం చేసి కర్ణుడి చంపించావు. ఇన్ని అధర్మములకు ఒడి కట్టిన నిన్ను ఏమనాలి. నీ అక్రమాలకు హద్దు లేదా ! భీష్మ, ద్రోణ, కర్ణ, జయధ్రదులను అధర్మంగా కాక ధర్మంగా పడగొట్టుట నీకు నీ పాండవులకు సాధ్యమా " అన్నాడు.
శ్రీకృష్ణుడు సుయోధనుడి అకృత్యములు ఎత్తి చూపుట
[మార్చు]అమాటలు అన్న సుయోధనుడిని చూసి కృష్ణుడు " సుయోధనా ! నీవు చేసిన అక్రమాలు నీకు గుర్తు లేదా ! బాల్యప్రాయంలోనే ప్రాంరంభించిన అక్రమాలను మరచినటులున్నావు విను. భీముని చేతులు, కాళ్ళు కట్టి నీటిలోకి త్రోయించావు, భీముని చేత విషాహారం తినిపించావు, పాములతో కరిపించావు. కుంతీ సహితంగా పాండు సుతులను లక్క ఇంట పెట్టి దహించాలని చూసావు. ధర్మాత్ముడైన ధర్మరాజును మాయాజూదముకు ఆహ్వానించి మోసంతో అతడి రాజ్యాన్ని అపహరించి యాజ్ఞసేనిని సభకు ఈడ్పించి ఘోర అవమానాల పాలు చేసి వారందరిని అరణ్యవాసానికి పంపావు. అరణ్యవాసంలో ఉన్న పాడవులను అవమానించాలన్న తలంపుతో ఘోష యాత్రకు వెళ్ళావు. అజ్ఞాతవాసం ముగియ కుండానే వారిని బయటకు ఈడ్పించి తిరిగి అరణ్యాల పాలు చేయనెంచి గోగ్రహణం పేరొతో యుద్ధానికి తలపడ్డావు. నీ ఆగడాలను మరచి ధర్మరాజు నన్ను సంధికి పంపించాడు దానిని నీవు తిరస్కరించి ఫలితం అనుభవిస్తున్నావు. నీ లోభత్వం వలన, పాపచింతన వలన, దుర్మదం వలన శాంత చిత్తులైన భీష్మ, ద్రోణులకు హాని కలిగింది. ఇంకాచెప్తాను విను. ద్రుపదుడు భీష్మ, ద్రోణులను పడగొట్టాలని చేసిన యజ్ఞంలో నుండి జన్మించిన శిఖండి, ధృష్టద్యుమ్నుడు భీష్మ, ద్రోణ మరణాలకు నిమిత్తమాతృలే కాని అసలు వారు పతనం కావడానికి కారణం నువ్వే. నీవే ఈ అకారణ యుద్ధానికి కారణం. యుద్ధములో డస్సిఉన్న సాత్యకిని భూశ్రవసుడు చంపడానికి కత్తి దూసే సమయంలో అతడిని చంపడం అధర్మమా ! బంధువుల మరణిస్తుంటే వీరులెవరైనా చూస్తూ ఊరుకుంటాడా. బాలుడైన అభిమన్యుని అనేకులు చుట్టు ముట్టి చంపడం నీకు అధర్మంగా కనిపించ లేదుకాని. చెల్లెలి వరుస అని చూడక అడవులలో ద్రౌపదిని చెరపట్టిన జయధ్రధుని యుద్ధభూమిలో చంపక వదలడానికి అర్జునుడు వెర్రి వాడా ! ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించడానికివెళ్ళి గంధర్వుల చేత చిక్కిన నిన్ను అర్జునుడు కాపాడిన విషయం మరచుట నీకు ధర్మమా ! గోగ్రహణ సమయంలో సమ్మోహనాస్త్రం ప్రభావితుడవైన నిన్ను అర్జునుడు ప్రాణములతో విడుచుట మరవడం ధర్మమా ! నీవు చేసిన అకృత్యములకు మూల పురుషుడైన కర్ణుడు యుద్ధ భూమిలో చిక్కిన కర్ణుడిని అర్జునుడు ఊరక విడుస్తాడా ! అర్జునుడు విడిచిన బ్రాహ్మణ శాపగ్రస్తుడైన కర్ణుడి రథం పైకి లేవగలదా ! యుధిష్టరుడు శల్యుడిని చంపడం అధర్మమం అననందుకు పరమ సంతోషం. సుయోధనా ! నీవు బాల్యం నుడి నీ అన్నదమ్ములైన పాండవులను ద్వేషించావు. కాని పాండవులు నిన్ను ఎన్నడూ ద్వేషించలేదు. కురువంశానిని కూకటి వేళ్ళతో పెకలించడానికి మాయాజూదం అనే గునపం పట్టింది నీవే. నీతొడలు విరుగకొడతానని చెప్పిన భీముడు నిన్ను పిడి గుద్దులు గుద్ది వదులుతాడా ! కనుక వృధా మాటలు కట్టిపెట్టు " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు " కృష్ణా ! నేను అనేక యజ్ఞ యాగాదులు చేసాను, వేద వేదాంగములను చదివాను. ఎందరో మహారాజులతో నీరాజనాలు అందుకున్నాను. నా శత్రువుల మదం అణచి బంధుమిత్రుల సహితంగా స్వర్గసుఖములను అనుభవించడానికి వెళుతున్నాను. మీ దృష్టిలో నేను దుర్మార్గుడనే అయినా మీరంతా మీ శేష జీవితం పశ్చాత్తాపంతో గడపవలసిందే " అన్నాడు.
పాండవులను కృష్ణుడు ఒదార్చుట
[మార్చు]పాండవులు సుయోధనుడి మాటలు విని భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా పడగొట్టామా అని తలలు దించుకున్నారు. వారిని చూసిన కృష్ణుడు " మీరు భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా చంపామని బాధ పడవలదు. మహా యోధులైన వారిని ధర్మయుద్ధంలో చంపుట కష్టం కనుక అనేక ఉపాయములతో వారిని పడగొట్టవలసి వచ్చింది. ఆ మహాయోధులు మామూలుగా మరణించరు. అదియును కాక వారి పూర్వజన్మ సుకృతం వారికి మరణం సంభవించేలా చేసింది. దైవ సంకల్పం తప్పించడం మీ తరమా ! ఈ సంతోషసమయాన మీరిలా చింతించ తగదు " అన్నాడు. అప్పటికి పొద్దు వాలింది. కృష్ణుడు పాంచజన్యము, ధర్మరాజు అనంత విజయము, భీముడు పౌండ్రకము, అర్జునుడు దేవదత్తము, నకుల సహదేవులు సుఘోష అనే శంఖములను పూరించారు. భేరీ మృదంగ నాదములు మిన్నంటాయి. అక్కడి వారు ధర్మరాజు విజయుడు అయినందుకు వేనోళ్ళ కొనియాడారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. సాత్యకి కూడా వారితో వెళ్ళాడు. ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుని దాయాదులు, ద్రౌపదీ సుతులు, మిగిలిన మహారాజులంతా ధర్మజుని అనుమతి తీసుకొని ససైన్యంగా తమ శిబిరాలకు వెళ్ళారు. మరునాడు హస్థినాపురం వళ్ళాలని అనుకున్నారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. నీ కుమారుడి శిబిరం, నాటకం ముగిసిన రంగస్థలం వలె నిశ్శబ్ధంగా ఉంది. అక్కడి పరిచారికలు ధర్మరాజును సత్కరించి గంధపుష్పాక్షితలు సమర్పించారు.
అర్జునుడి రథం దగ్ధంకావడము
[మార్చు]కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! నీ గాండీవం అక్షయ తుణీరం తీసుకుని ముందు నీవు రథం దిగు తరువాత నేను రథం దిగుతాను అన్నాడు. అర్జునుడు అలాగే అని చెప్పి గాండీవ సహితంగా రథం దిగాడు. తరువాత కృష్ణుడు పగ్గములను నొగల మీద ఉంచి తాను కూడా రథం దిగాడు. కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు భూతగణ సహితంగా తను కూడా రథమును విడిచి వెళ్ళాడు. వెంటనే ఆరథం భగభగ మండి పోయింది. అర్జునుడు ఆశ్చర్యచకితుడై " కృష్ణా ! ఏమిటీ వింత ! " అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " అర్జునా ! ఇప్పటి వరకు యుద్ధంలో గెలవడం నీ మహిమ అనుకుంటున్నావు. కాని కర్ణుడి అస్త్ర ధాటికి ఈ రథం ఎప్పుడో ధగ్ధం అయిపోయింది. కాని నొగల మీద నేను ధ్వజం మీద హనుమంతుడు ఉన్నాము కనుక ఇప్పటి వరకు నిలిచి ఉంది. అందుకే నేను నీ తరువాత రథం దిగాను. హనుమంతుడు ఎగిరిపోగానే రథం ధగ్ధం అయింది. ఇందులో వింత ఏముంది " అన్నాడు. అన్నాడు.
కృష్ణుడు అర్జునుడిని ధర్మరాజుకు అప్పగించుట
[మార్చు]కృష్ణుడు ఆతరువాత ధర్మరాజుకు అర్జునుడిని అప్పగిస్తూ " ధర్మరాజా ! యుద్ధారంభంలో ఉపప్లాయంలో నీవు నాన్ను వస్త్రములతో సత్కరించి అర్జునుడిని నాచేత పెట్టి " కృష్ణా ! వీడిని నీవు కాపాడాలి " అని అర్ధించావు. నేను అందుకు అంగీకరించాను. ఇడుగో యుద్ధంలో విజయుడై వచ్చిన అర్జునుడిని సురక్షితంగా నీకు అప్పగిస్తున్నాను " అన్నాడు. ధర్మరాజు " అదేమిటి కృష్ణా ! నీవు లేకున్న మేము ఈ పద్దెనిమిది రోజుల యుద్ధంలో జరిగిన ఈ యుద్ధసాగరాన్ని దాటగలమా ! నాడు వ్యాసుడు చెప్పనే చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే అని. నీ కరుణ వలనే కదా ! మాకీ విజయం ప్రాప్తించింది " అన్నాడు ధర్మరాజు. కృష్ణుడు " ధర్మజా ! ప్రారంభంలో అర్జునుడికి యుద్ధం చేయుట ఇష్టం లేదు. నేను గీతను బోధించి అతడిని రణోన్ముఖుని చేసాను. కానీ ఇప్పటికీ అర్జునుడికి ఈ మారణకాండమున యుద్ధమున ఆసక్తి లేదు. లేకున్న ఇంద్రకుమారుడైన అర్జునుడు ఏపని చేటకైనా సమర్ధుడే. ముల్లోకాలను తృటిలో నాశనం చేయగలడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు " అన్నాడు. ఆ ప్రకారం అందరూ సరససల్లాపంలో తేలియాడారు. ధర్మరాజు అత్యధిక సంపదలు కలిగిన సుయోధనుడి ధనాగారం స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన కౌరవ సేనలను చూసుకుంటూ ఆనందంగా తిరుగున్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! సుయోధనుడు లేని ఈ మందిరం పాడుబడింది. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు. వేరొక ప్రశాంత ప్రదేశముకు పోదాము " అన్నాడు. తరువాత కృష్ణుడు పాండవులను ఓఘవతీ తీరానికి తీసుకు వెళ్ళాడు. ధర్మరాజుకు భయం పట్టుకుంది " అర్జునుడు చేసిన సైగతో భీముడు సుయోధనుడి తొడ విరిచాడు. అది చాలక కాలితో సుయోధనుడి తల నరికాడు. కనుక గాంధారి నన్ను శపిస్తుంది. కనుక ఆమెను శాంతింప చేయాలి. ఈ పని చేయడానికి శ్రీకృష్ణుడే తగిన వాడు " అనుకుని శ్రీకృష్ణుడిని హస్థినాపురం పంపాడు.
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర గాంధారీలను ఓదార్చుట
[మార్చు]కృష్ణుడు ధర్మరాజు మాట మీద హస్థినాపురం బయలు దేరి వెళ్ళి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని సాదరంగా తీసుకు రమ్మని చెప్పాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి అంతఃపురంలోకి ప్రవేశించే సమయానికి అప్పటికే వ్యాసుడు ధృతరాష్ట్ర గాంధారీలను కుమారుల మరణానికి ఓదార్చడానికి వచ్చి ఉండటం చూసి వ్యాసునకు సాష్టాంగ నమస్కారం చేసి ధృతరాష్ట్ర గాంధారీలకు నమస్కరించాడు వారి పక్కన నేల మీద కూర్చుని ధృతరాష్ట్రుడి చేతిని తన చేత పట్టుకుని " మహారాజా ధృతరాష్ట్రా ! నీ కుమారుల వలన మీ వంశం సమూలంగా నాశనం అయింది. ఇలాంటి పరిస్థితి కలుగకూడదని పాండవులు నన్ను రాయబారానికి పంపారని నీకు తెలుసు సంధికి అంగీకరించి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా ! మహారాజా లోకంలో జూదం ఆడటం సహజమే కాని అంతఃపురంలో ఉన్న కుల స్త్రీలను ఏక వస్త్రలను పతివ్రతలను సభకీడ్పించి వలువలు ఊడ్పింఛి అవమానించడం ఎక్కడైనా ఉందా ! అయినా పాండవులకు కోపం రాలేదు 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాత వాసాలలో ఇడుములు అనుభవించినా వారికి కోపం రాలేదు. అందుకే నీకుమారుడు వారికి చేసిన అవమానాలు సహించి మరచి మన్నించి అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలని అర్ధించాడు. నీ కుమారుడు లోభంతో, అహంభావంతో ఆప్రతిపాదన తిరస్కరించాడు. విదురుడు బంధు మిత్రులు మహామునులు ఎంతో చెప్పి చూసారు. కాలోపహతులై నీవు నీకుమారుడు వారి మాటను పెడచెవిన పెట్టారు. విధి నిర్ణయం మార్చలేనిది కనుక ఇక వగచి లాభం లేదు. నిష్కల్మష హృదయులైన పాండవులు వారి మీద కోపగించ వలదని వేడుకుంటూ నన్ను పంపారు. ప్రస్థుతం మీకు కుమారులు లేరు కనుక మీ ఇరువురికి ఉత్తర క్రయలు చేసి ఉత్తమ గతులు కల్పించవలసిన పాండవుల హితం కోరుట మీకు శ్రేయస్కరం. మీకు కలిగిన కష్టానికి ధర్మరాజు ఎంతో దుఃఖిస్తున్నాడు. తన మనో భావాలను తెలుపమని ధర్మరాజు నన్ను మీ వద్దకు పంపాడు అని గాంధారిని చూసి " అమ్మాగాంధారీ ! నీకు సాటి వచ్చు రాజమాతను నేను ఈలోకములో చూడ లేదు. లేకున్న నిండు సభలో పలువురు వినుచుండ నీవు సుయోధనుడికి బుద్ధిమతి చెప్ప ప్రయత్నిస్తావా ! నాడు నీవు పలికిన పలుకులు నా చివులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. కాని సుయోధనుడు లోక విరుద్ధంగా నీ మాటలు పెడచెవినబెట్టాడు. తనకు ఏది మేలో తెలుసుకో లేక పోయాడు. సుయోధనుడు అహంకారంతో తుళ్ళక రాజ్యభాగాన్ని ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా ! నీవు ఆ నాడే చెప్పినట్లు కీడే జరిగింది. కనుక ఇందు పాండవుల దోషం లేదు. కనుక వారిని మన్నించమని వేడుకుంటున్నాను. నీవు కోపించిన ముల్లోకాలూ ధగ్ధం అవుతాయి. నీ పాతివ్రత్య మహిమ అలాంటిది. అందుకనే నిన్ను ప్రార్థిస్తున్నాను " అన్నాడు. గాంధారి " దాని కేముందిలే కృష్ణా ! అంతా నీవు కోరుకున్నట్లే జరిగినది కదా ! నా కుమారుల మరణనానికి దుఃఖిస్తున్న నాకు నీ మాటలు ఊరట కలిగించాయి. ఈ రాజు దీనుడు, అంధుడు, వృద్ధుడు ఈయనను నీవు పాండుకుమారులు కాపాడాలి " అని గాంధారి పటచెరగును ముఖానికి కప్పుకొని ఏడ్చింది. కృష్ణుడు ఆమెను ధృతరాష్ట్రుడిని పలు విధముల ఊరడించి " ధృతరాష్ట్ర మహారాజా ! జరిగిన దానికి బాధపడ వలదు. అశ్వత్థామ కోపగ్రస్తుడు అతడి వలన పాండవులకు అపకారం కలుగుతుందని నా మనసు కలత చెందుతుంది. నేను వెళ్ళి వస్తాను " అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు " త్వరగా వెళ్ళవయ్యా ! కృష్ణా పాండవులు నిన్ను వేయి విధముల నమ్ముకున్నారు. వారి నమ్మకాన్ని నీవు సఫలం చేయాలి కదా ! వెళ్ళు మరలా కనిపించు " అన్నాడు. శ్రీకృష్ణుడు వారి వద్ద శలవు తీసుకుని వెళ్ళాడు. వ్యాసుడు కూడా వారితో " ధృతరాష్ట్రా !గాంధారీ ! శ్రీకృష్ణుని మీ శోకోపశమనానికి పలికిన మాటలు ఆచరించతగినవి " అని వారిరువురిని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు త్వరితంగా అక్కడి నుండి వెళ్ళి ఓఘవతీనదీ తీరానికి వెళ్ళి ధర్మరాజు జరిగినది చెప్పాడు. " అని వైశంపాయనుడు జనమేజయునకు వివరించాడు. ఆ తరువాత భారతకథను వివరిస్తూ జనమేజయ మహారాజా ! ధృతరాష్ట్రుడు సంజయుడితో " సంజయా ! భీమసేనుడు నా కుమారుడి తొడలు విరుగకొట్టిన తరువాత ఏమి జరిగింది. నా కుమారుడి గతి ఏమైంది చెప్పు " అని అడిగాడు.
సుయోధనుడు అశ్వత్థామను సైన్యాధ్యక్షుని చేయుట
[మార్చు]సంజయుడు ధృతరాష్ట్రుతో " మహారాజా ! భీమసుయోధనులు యుద్ధం చేసే సమయంలో నేను పక్కనే ఉన్న పొదలలో ఉన్నాను. వారు వెళ్ళి పోగానే నేను వెలుపలికి వచ్చి సుయోధనుడి వద్దకు వెళ్ళాను. ధూళితో నిండిన ముఖము మీద ఉన్న వెంట్రుకలను తొలగించి కళ్ళ నీరు నింపుకుని సుయోధనుడు " సంజయా ! చతస్సముద్ర వేలావలయుత ధరణీ తలంబును ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన సుయోధనుడి దుర్గతి చూసావా ! ఏకాదశ అక్షౌహినులకు అధిపతిని, అణుకువ కలిగిన సామంతరాజులు కలిగిన వాడిని అత్యంత వైభవమును అనుభవించిన వాడిని అయిన నేను ఎలా ఉన్నానో చూసావా ! లోక నిందకు వెరువక భీముడు అధర్మంగా నా తొడలు విరిచాడని మన వాళ్ళకు చెప్పు. నాడు భీష్ముని, ద్రోణుని, కర్ణుడిని అధర్మ యుద్ధంలో చంపి నేడు నన్ను భీముడు అధర్మ యుద్ధంలో చంపాడు. ఇదీ ఒక విజయమేనా ! ఇందుకు లోకులు పాండవులను పురుగులు పట్టిపోతారని తిట్టరా ! పాండవులకు ఇది వృధా విజయం కాక మరేమి ! నన్ను అధర్మంగా కూలదోసిన భీముడు ఏమి బాగుపడతాడులే ! సంజయా భీముడు నా తొడలు కొట్టి పడతోసింది చాలక తన వామ పాదంతో నా తలను తన్నాడు. లోకులు దీనిని మెచ్చుతారా ! నేను రారాజుగా ఉన్నప్పుడు నన్ను తృణీకరించారు. నేను పడిపోగానే నన్ను కాలితో తన్నారు. లోకులు ఘర్హించరా ! నేను ఎన్నో యజ్ఞాలు చేసాను. ఎన్నోదానధర్మాలు చేసి ఎందరినో శ్రీమంతులను చేసాను. బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చాను. నా బాహు బలంతో దేశాన్ని సుభిక్షంగా పాలించాను. ఇప్పుడీ శమంతక పంచకంలో మరణించి పుణ్యలోకాలకు పోతాను. నా గురించి నాకు చింత లేదు. పాండవులు నన్ను అధర్మ యుద్ధమున గెలిచి నా రాజ్యమును వశపరచుకున్నారు. నీకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కనపడితే జరిగినది వివరించి నా మాటగా " పాండవులు అందరూ అనుకున్నట్లు ధర్మపరులు కాదు అసత్యవాదులు, అధర్మపరులు ధర్మము అనే ముసుగులో లోకమును వంచిస్తున్నారని వారికి చెప్పు. వారిని ఎన్నటికీ నమ్మరాదు " అన్నాడు.
అశ్వత్థామ సుయోధనుడిని చూసి విలపించుట
[మార్చు]అంతలో చుట్టు జనపదములలో ఉన్న వారు, ముని కుమారులు సుయోధనుడిని చూడ వచ్చారు. వారితో పాటు అక్కడికి వచ్చిన కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడి దురవస్థ చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అశ్వత్థామ సుయోధనుడి చూసి " రారాజా ! అనేక రాజన్యులు నీచుట్టూ చేరి ప్రశంసింస్తుంటారే ఇప్పుడిలా ఒంటరిగా పడి ఉన్నావా ! కురుసామ్రాజ్య సింహాసాధిష్టుడవైన నువ్విలా కటిక నేల మీద పడి ఉండమని ఆ విధాత నీ నొసటన వ్రాసాడా ! నీ బల సౌర్యములు ఏమయ్యాయి, అహర్నిశం పట్టు ఆ పట్టు ఛత్రములు ఎక్కడ, నీ సైన్యాధిపతు లేమయ్యారు రారాజా ! ఈ నాడిలా ఒంటరిగా దుమ్ము కొట్టుకుని కటిక నేలను పడి ఉన్నావు. పన్నీటి జలకాలు ఆడవా రారాజా ! భీష్మ, ద్రోణ, కర్ణులు నీ పక్కన ఆశీనులై ఉండగా దుశ్శాసన, వికర్ణుల సేవలందుకుంటూ పరివేష్టితుడవై అష్టశ్వైర్యములు అనుభవించిన నిన్ను రాజులంతా మరచినారా ! ఒక్కరూ రారేమి ! నీ విషయంలో లక్ష్మీ ఇంత చంచలమైందా ! విధి నీ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిందేమి నేనేమి చెయ్యను " అని విలపించాడు.
సుయోధనుడు అశ్వత్థామను చూసి విలపించుట
[మార్చు]అశ్వత్థామను చూసి సుయోధనుడు " గురుపుత్రా ! నీవెరుగనిది ఏమున్నది. మనుజుల విధి విధానములు నీకు తెలియనివి కాదు కదా ! ఆ బ్రహ్మ దృష్టిలో ఆ సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం అన్నిటినీ సమంగా చూడాలి. సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. నా బంధుమిత్రులు మహా వీరులు యుద్ధంలో మరణించిన తరువాత నేను ఒక్కడినే జీవించు ఉండటం ధర్మమా ! నా బాహు బలము, వీర్యము, ధైర్యము సడలి పోగా శత్రువులు నన్ను పడగొట్టి నాకు సద్గతి కలిగించారు. మీరు ముగ్గురూ వారికంట పడక నా కంట పడటం నాకు ఆనందం కలిగిస్తుంది. " అని పాడవులు అక్కడికి వచ్చిన తరువాత జరిగిన విషయములు సవిస్తరంగా వారికి వివరించాడు. అది విని అశ్వత్థామ కోపంతో ఊగి పోయాడు.
అశ్వత్థామ సైన్యాధ్యక్షునిగా అభిషిక్తుడగుట
[మార్చు]అశ్వత్థామ కోపంతో " రారాజా ! నా తండ్రిని అర్జునుడు అధర్మంగా చంపినప్పుడే నా గుండెలు మండి పోయాయి. ఇప్పుడు నిన్ను అక్రమంగా పడతోసారు. ఆ పాడవులను నా అస్త్రములతో దగ్ధం చేయకున్న నేను బ్రతికీ వ్యర్ధమే ! రారాజా ! సుయోధన సార్వభౌమా ! నేను సత్యం పలుకుతున్నాను. పాండవులను, పాంచాలురను వారి బంధుమిత్రులను కృష్ణుడు చూస్తుండగా నేను వధిస్తాను. ఇదే నాప్రతిజ్ఞ నన్ను ఆజ్ఞాపించండి " అని సుయోధనుడి ముందు మోకరిల్లాడు. సుయోధనుని మనసు ఆహ్లాదంతో నిండి పోయింది. " కృపాచార్యా ! వెంటనే పుణ్యజలాలు తెప్పించండి అన్నాడు. వారిని చూడటానికి వచ్చిన ముని కుమారులను అడిగి పుణ్య జలాలను తెప్పించాడు కృతవర్మ. అప్పుడు సుయోధనుడు కృపాచార్యుని చూసి " కృపాచార్యా ! అశ్వత్థామను సైన్యాధ్యక్షిడిగా అభిషేకించండి. అశ్వత్థామ పుట్టుకతో బ్రాహ్మణుడైనా రారాజు కోరిక మీద యుద్ధం చేయుట పరమధర్మం " అన్నాడు. కృపాచార్యుడు పుణ్యాహవాచన మంత్రములు చదివి అశ్వత్థామను కౌరవసేనకు అధ్యక్షునిగా అభిషేకించాడు. తనకు లభించిన గౌరవానికి అశ్వథ్థామ పొంగి పోతూ రారాజును గుండెలకు హత్తుకొని పైకి లేచి సింహ నాదం చేసి " రారాజా ! పాండవులను సమూలంగా నాశనం చేసి నీ దర్శనం చేసుకుంటాను " అన్నాడు. కృతవర్మ, కృపాచార్యుడు వెంటరాగా పాండవశిబిరాల వంకకు వెళ్ళాడు " అని సంజయుడు దృతరాష్ట్రునికి వివరించాడని వైశంపాయనుడు జనమే జయునికి చెప్పాడు.