శాంతా ధనంజయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతా ధనంజయన్
వి.పి.ధనంజయన్‌తో శాంతా ధనంజయన్
జననం (1943-08-12) 1943 ఆగస్టు 12 (వయసు 80)
మలేసియా

శాంతా ధనంజయన్ (జ.1943) ఒక భరతనాట్య కళాకారిణి. తన భర్త వి.పి.ధనంజయన్‌తో కలిసి జంటగా భరతనాట్య ప్రదర్శనలు చేసింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె 1943, ఆగష్టు 12వ తేదీన ఒక మలయాళీ నాయర్ కుటుంబంలో మలేసియాలో జన్మించింది. ఈమె పూర్వీకులు కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారు మలేసియాకు వలస వెళ్ళారు. ఈమె బాలమేధావి. నాట్యంపట్ల ఈమెలో నిబిడీకృతమైన ఆసక్తిని గమనించి ఈమె తల్లిదండ్రులు ఈమెను నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దాలని నిరయించుకున్నారు. ఈమె 8వ యేట 1952లో ఈమెను భారతదేశంలోని కళాక్షేత్రలో చేర్పించారు. ఈమె అక్కడ భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. భరతనాట్యంతో పాటు కథాకళి, కర్ణాటక సంగీతంలో కూడా శిక్షణ తీసుకుంది. ఈమె కళాక్షేత్రలో 1955-68ల మధ్యకాలంలో ఒక ముఖ్యమైన నాట్యకళాకారిణి.

కళాక్షేత్రలో ఉన్నప్పుడు ఈమెను వి.పి.ధనంజయన్ తొలిసారి చూశాడు. ఈమె 1952లో ధనంజయన్‌ కంటే ముందే కళాక్షేత్రలో నాట్యం నేర్చుకుంటూ ఉంది. ఈమె నాట్యం, సంగీతం నేర్చుకోవడంలో తలమునకలై ఉన్నప్పటికీ తన 12 యేళ్ళ వయసులో ధనంజయన్ పట్ల మనసులో ప్రేమను పెంచుకుంది. ఈమెకు 18 యేళ్ళ వయసు వచ్చినప్పుడు ధనంజయన్ ఈమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే ఈమె ఏ సమాధానం చెప్పకుండా తన చదువు పూర్తయ్యాక మలేసియా వెళ్ళిపోయింది. తిరిగి 4 సంవత్సరాల తర్వాత భారతదేశం తిరిగి వచ్చినప్పుడు తన సమ్మతిని తెలియజేసింది. వీరి వివాహం 1996లో కేరళ లోని గురువయ్యూర్ దేవాలయంలో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజయ్ అమెరికాలో నివసిస్థున్నాడు. రెండవ కుమారుడు సత్యజిత్ ఒక ఫోటోగ్రాఫర్, నర్తకుడు. అతడు తన భార్యాపిల్లలతో చెన్నైలో నివసిస్తున్నాడు.[1][2]


వృత్తి[మార్చు]

ఈ జంట 1960ల చివరలో కళాక్షేత్ర వదిలి తమ వృత్తిని స్వంతంగా అభివృద్ధి చేసుకున్నారు. వీరు తమ నూతన ఆలోచనలతో జీవత్వం ఉట్టి పడే నాట్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలలోను, విదేశాలలోను ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానాలు అందాయి. వీరు ప్రపంచమంతటా తిరిగి తమ కళాప్రదర్శన గావించారు. ఈ జంట వోడాఫోన్ ప్రకటనలో "ఆశా & బాలా"గా నటించారు.

వీరు ప్రదర్శించిన నృత్యాలలో కొన్ని ముఖ్యమైనవి:[3]

 • పండిట్ రవిశంకర్ రూపకల్పన చేసిన "ఘనశ్యామ్" 1989/90
 • నేషనల్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ న్యూయార్క్ ఆద్వర్యంలో 1000 వివిధ దేశాల బాలబాలికలతో "చక్ర"
 • ఓహియో బ్యాలే కంపెనీ, కుయహోగా కమ్యూనిటీ కాలేజి, క్లీవ్‌లాండ్ కల్చరల్ అలయన్స్ సంయుక్త నిర్వహణలో "జంగిల్ బుక్ బ్యాలే"
 • 1986లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో "సీతా రామ కథ" నృత్య దర్శకత్వం.
 • 1994లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో "సంఘమిత్ర" నృత్య దర్శకత్వం.
 • మహాభారతం నృత్యనాటకం 1998, 1999

బోధన[మార్చు]

ధనంజయన్ దంపతులు అనేక మంది శిష్యులకు భరతనాట్యాన్ని నేర్పించారు. వీరు తమ శిష్యులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి నొక్కి వక్కాణించారు.

భారత కళాంజలి[మార్చు]

వీరు 1968లో అడయార్, చెన్నైలో "భారత కళాంజలి" పేరుతో నాట్యపాఠశాలను ప్రారంభించారు. మొదట కొద్ది మందితో ఆరంభమైన ఈ స్కూలు ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులతో సంగీత నృత్యాలలో ప్రధానమైన సంస్థగా ఎదిగింది.

భాస్కర[మార్చు]

ఈ జంట ధనంజయన్ స్వగ్రామమైన కేరళలోని పయ్యనూర్‌లో భాస్కర అకాడమీని ప్రారంభించింది. ఈ అకాడమీ ద్వారా ప్రతి యేటా వేసవి నాట్య గురుకులం క్యాంపును నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ అకాడమీ మూతపడింది.

యోగావిల్లె[మార్చు]

ఈ జంట అమెరికా వర్జీనియా యోగావిల్లెలోని సచ్చిదానంద ఆశ్రమంలో 1988 నుండి వార్షిక వేసవి గురుకులం క్యాంప్ నిర్వహిస్తున్నది. వీరు నాట్య అధ్యయన గురుకులాన్ని అభివృద్ధి చేశారు. ఇది కళలకు అంకితమైన పూర్తికాల రెసిడెన్షియల్ కోర్సు. ఈ కోర్సులో ఇండో అమెరికన్ విద్యార్థులు, అంతర్జాతీయ విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు.

పురస్కారాలు[మార్చు]

ఈ జంటకు లభించిన ముఖ్యమైన పురస్కారాలు కొన్ని:

 • 2009లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం[4]
 • 2009లో క్లీవ్‌లాండ్ ఆరాధన సంస్థచే "నృత్యరత్నాకర"
 • 2009లో వేల్స్ యూనివర్సిటీ వారిచే "డాక్టరేట్"
 • 1997లో లైవ్ మ్యాగజైన్ అచీవ్‌మెంట్ అవార్డు.
 • 1996లో ఓహియో స్టేట్ గవర్నర్‌చే "ప్లేక్ ఆఫ్ ఆనర్ అవార్డు"
 • 1994లో సంగీత నాటక అకాడమీ అవార్డు
 • 1993లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్
 • 1990లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ వారిచే కళైమామణి పురస్కారం
 • 1989లో ముంబాయి సుర్సినగర్ హరిదాస్ సంగీత సమ్మేళనంలో "నృతవిలాస్" పురస్కారం
 • 1988లో లండన్‌లోని భారతీయ విద్యాభవన్ వారిచే కె.ఎం.మున్షీ సెంటెనరీ కమెమోరేటివ్ అవార్డు
 • 1984లో యునెస్కో వారిచే మెడలియన్ డి మెరిట్
 • 1983లో చెన్నైలోని కృష్ణగానసభ వారిచే "నృత్యచూడామణి"
 • ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ మ్యాగజైన్, న్యూఢిల్లీ వారిచే "స్క్రోల్ ఆఫ్ ఆనర్"

మూలాలు[మార్చు]

 1. "Studio Satyajit official Website". Archived from the original on 8 February 2011. Retrieved 24 July 2019.
 2. Bharata Kalanjali Website – Biography
 3. Dancer on Dance, V.P Dhananjayan, Bharata Kalanjali
 4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.

బయటి లింకులు[మార్చు]