శాంతి పర్వము చతుర్థాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చతుర్ధాశ్వాసం[మార్చు]

వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను చెప్పసాగాడు. భీష్ముడు ధర్మరాజుతో నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాను. నీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడుగు. నాకు తెలిసినంత వరకు నీకు అన్ని విషయాలు చెప్పాను. ఐరావతం

ఉత్తమ ధర్మము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఇప్పటి వరకు రాజోచితప్రవర్తన, ధర్మాలు తెలియ చెప్పారు. ఇక ప్రజల మంచిచెడులు వారి ధర్మాలు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! లోకంలో ధర్మం పలువిధముల విస్తరించి ఉంది. అన్ని ధర్మములు అనుసరించ తగినవే అయినా తత్వం తెలిసినవారు మాత్రమే మోక్షమే ఉత్తమమార్గమని చెప్తారు. ఇష్టం, అయిష్టం మరచి ద్వందాతీతంగా సంపదను అనుసరించడమే మోక్షమార్గం. ఇందుకు ఉదాహరణగా నీకొక కథ చెప్తాను. పూర్వం సేనజిత్తుడు అనే మహారాజుకు పుత్ర వియోగం కలిగింది. అతడి వద్దకు ఒక ఆప్తుడైన బ్రాహ్మణుడు వచ్చి " మహారాజా ! చింతించడం ఎందుకు పుట్టిన వారికి మరణం తప్పదు. నీ కుమారుడికి మాత్రమే మరణం సంప్రాప్తించిందా ! మూర్ఖత్వంతో ఇలా ఎందుకు చింతిస్తున్నావు ? " అని పలికాడు. మహారాజు " మరి ఈ దుఃఖం పోవాలంటే ఏమి చేయాలి " అని అడిగాడు. బ్రాహ్మణుడు " మహారాజా ! నదీప్రవాహములో ఎన్నో దుంగలు కొట్టుకుని పోతున్నాయి. వాటిలో రెండు దగ్గరకు చేరుతాయి. కొంచెం దూరం పోగానే తిరిగి విడిపోతాయి. భార్యా, పుత్రులు, బంధువులు కూడా అంతే జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. కనుక శాశ్వతంకాని ఈ శరీరాల కొరకు చింతించడం మూర్ఖత్వంకాదా ! నీ శరీరమే నీ స్వాధీనంలో ఉండదు. ఏది ఎప్పుడు రోగగ్రస్థమౌతుందో నీకు తెలియదు. ఎప్పుడు శాశ్వతంగా పోతుందో నీకు తెలియదు. ఇక భార్యా, పుత్రుల గురించి మోహం ఎందుకు ? మోహం లేనప్పుడు చింత లేదు. మానవునికి సుఖం, దుఃఖం ఒక దాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి. సుఖమూ నిలువదు దుఃఖం నిలువదు. వివేకులు సుఖం వచ్చినప్పుడు పొంగి పోరు. దుఃఖం వచ్చినప్పుడు కుంగి పోరు. మనిషి నాది అనుకున్న వస్తువు దూరమైనప్పుడు దుఃఖిస్తాడు. నాది అన్న సంగం వదిలినప్పుడు దుఃఖం లేదు కదా ! పూర్వజన్మ సంస్కారం అనుసరించి సంయోగ వియోగములు సంభవిస్తాయి. పండితుడికి, పామరుడికి కర్మఫలములు ఒకటిగానే సంభవించినా పండితుడు వాటికి కలతచెందడు. పామరుడు దానిలో లీనమౌతాడు. కనుక ద్వందాతీతంగా ఇష్టం, అయిష్టం వదిలి సుఖదుఃఖాలకు చలించక ప్రవర్తించిన చింతలు ఉండవు. దీని గురించి పింగళ అనేవేశ్య ఇలా చెప్పింది. పింగళ ఒక సారి తన ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎంతకీ అతడు రాకపోయేసరికి తనలో " నేను ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ పిచ్చిదాన్ని అయ్యాను. కాని అతడు ఇలా పిచ్చి వాడు కాలేదుకదా ! అలాంటి వాడికొరకు నేను ఎందుకు బాధపడాలి. కనుక నేనిక కళ్ళుమూసుకుని నిద్రపోతాను. నా వద్దకు రాని వాడికొరకు బాధపడే కంటే వచ్చిన వాడే ప్రియుడను కోవడం మంచిది. రానివాడి మీద ఆశపెట్టుకుని కుంగిపోతూ పిచ్చిదానినై సర్వనాశనం అయ్యేదాని కంటే ఆశవదులుకుని ఉన్న దానితో తృప్తిపడుతుంటాను. కనుక మహారాజా ! లేని దాని కొరకు బాధపడక ఉన్న దానితో సుఖంగా జీవించు. ధర్మనందనా ! ఈ కథలోని అంతరార్ధం గ్రహించి ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకో తృప్తినిమించిన సుఖం, సంపద మరొకటి లేదు.

ప్రళయం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఈ లోకంలోని జీవజాలం అంతా నశిస్తుందని అనిపిస్తుంది. అలాంటి సమయంలో జనులు ఏమి చేయాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇందు కొరకు నీకు ఒక కథ చెప్తాను విను. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతడు వేదవేదాంగములు అభ్యసించాడు. ఒక రోజు మేధావి తండ్రితో " తండ్రీ వయసు పెరిగే కొద్దీ జనులకు ఆయుష్షు తగ్గుతుంది కదా ! ఈ విషయంలో జనులు ఎలా ప్రవర్తించాలి ? " అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు " కుమారా ! తరుణ వయసులో వివాహం చేసుకుని సంతానం పొంది యజ్ఞ యాగాదులు చేయాలి. తరువాత వానప్రస్థం స్వీకరించి తుదకు మోక్షం పొంద వచ్చు. జనులు ఇలా ప్రవర్తించి మృత్యువును జయించాలి. " అని చెప్పాడు. కుమారుడు " తండ్రీ ! నీవు మృత్యువు, నీ ఆధీనంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. మానవుడు తల్లిగర్భం నుండి బయట పడి నాటి నుండి మృత్యువు నిత్యమూ వెన్నంటి ఉంటూ ఎప్పుడు కబళించాలా అని ఎదురుచూస్తూ ఉంటుంది. మానవుడి ఆయుషు సదా ఎండపడి మడుగులోని నీరు ఆవిరై పోతున్నట్లు తరుగుతూ ఉంటుంది. ఇక భార్యాబిడ్డల వ్యామోహంలో ఉన్న వాడికి మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో ఎరుగజాలడు. జరిగింది తలుస్తూ జరగబోయే దానికి ప్రణాళికలు వేసే వాడికి మృత్యువు జాడ తెలియనే తెలియనిది. మనిషి కాలం ఆధీనంలో ఉన్నాడు కాని కాలం మనిషి ఆధీనంలో లేదు. మృత్యువుకు స్వపరబేధాలు ఉండవు. బాలుడా, ముదుసలా, స్త్రీయా, పురుషుడా, మేధా, మూర్ఖుడా, ధనికుడా, పేద వాడా అన్న భేదం లేదు. మృత్యువు అందరినీ సమానంగా కబళిస్తుంది. లోకంలో జీవిస్తున్న ప్రతి జీవిని కబళించడానికి ప్రయత్నిస్తున్న మృత్యువుని చూసి జంకక మోహంవదిలి సంసార బంధాలను తెంచి వేయాలి. కనుక నాదన్నది త్యజించి లోకం అసత్యం అని గ్రహించి మృత్యువును జయించాలి. అంతే కాని పెళ్ళి చేసుకుని పిల్లలను కని యజ్ఞయాగాదులు చేసి వానప్రస్థం స్వీకరించి మోక్షపదం చేరవలసిన అవసరం లేదు. యజ్ఞ, యాగాదులలో జీవహింస ఉంటుంది. నేను యజ్ఞం చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది కనుక అది మోక్షమార్గం కాదు. మనస్సు, వాక్కును శరీరాన్ని నియమబద్ధంగా నిగ్రహించి మోక్షాన్ని పొందాలి. అమృత తుల్యమైన ఆనందం పొందాలంటే అరిష్డ్వర్గాలను వదిలి ప్రాంపంచిక వ్యవహారాలను మరచి ధ్యాననిమజ్ఞుడై నిన్ను గురించి నువ్వు తెలుసుకో " మేధావి తండ్రికి చెప్పాడు. కనుక ధర్మనందనా ! ఈ తండ్రి కుమారుల సంవాదం నుండి నీకు నీవుగా ధర్మ సూక్ష్మం గ్రహించి మోక్షాన్ని పొందు " అని చెప్పాడు.

సంపద సుఖం[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! లోకంలో ధనికులు, పేదవారు ఉన్నారు కదా ! ఎవరు ఎక్కువగా సుఖపడుతున్నారు ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ధనవంతులు పేదవాళ్ళను త్రాసులో ఉంచి తూచినప్పుడు ముల్లు పేదవారి వైపే మొగ్గుతుంది. సంపన్నులకు పేదవారికి ఉన్న గుణదోషాలు చెప్తాను విను. ధనము, సంపద, ఆస్తులు కలిగిన వాడు ఎప్పుడూ తనసంపదను ఎవరు దోచుకుంటారో అని కలతచెందుతూ ఉంటాడు. ఎప్పుడూ మృత్యు ముఖంలో ఉన్నట్లు అశాంతిగా ఉంటాడు. ధనవంతుడు ఉన్నది చాలక అత్యాశకు పోయి మనసు వికలం చేసుకుంటాడు. ధనాన్ని కాపాడు కోవడానికి నిరంతరం చింతింస్తుంటాడు. ధనకారణంగా ఎప్పుడూ ఆగ్రహానికి గురి ఔతాడు. కనుక ధనవంతులకు సుఖం దొరకడం కఠినమే. ధనంలేని వాడు స్వతంత్రుడు, నిర్భీతికలవాడు, ఆగ్రహం రానివాడు, సకల ప్రదేశములలో సంచరించ గలవాడు. మోసం చేయాలన్న ఆశలేక, అత్యాశలకుపోక ప్రశాంత చిత్తతంతో ఉండగలడు. కనుక పేదవాడే సుఖవంతుడు. ధనం చంచలమైనది కనుక తరిగి పోతూ ఉంటుంది. కనుక అది దుఃఖ కారకం. ధనం శాశ్వతం కాదని తెలుసుకుని దాని మీద వ్యామోహం విడిచిన వాడు సుఖవంతుడు.

ధనతృష్ణ[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు. భీష్ముడు " ధర్మజా ! ధనము సంపాదించిసంపాదించి విసుగుపుట్టి ధనంసంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను. ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతోబంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి. అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో " అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంప్రదించాలి అనుకున్నాను అది సాధ్యంకానిది అని తేలి పోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలికాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవివ్యర్ధమేకదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరికవదలక ఉన్న సుఖం ఉండదు. కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందగలడు. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నా లోని ధనాపేక్ష తగ్గింది. నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడిపాడు.

దుఃఖ విముక్తి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు " మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది " అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.

కీర్తిప్రతిష్టలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! తానుచేసే కర్మఫలం, తనకున్న సిరిసంపదలు, తనకు ఉన్న బుద్ధిబలం, బంధువులకు ఉన్న సిరి సంపదలు వీటిలో వేటి వలన మానవుడికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మానవుడు తన స్వయం ప్రజ్ఞవలన మాత్రమే కీర్తిప్రతిష్టలు పొందగలడు. కనుక మానవుడికి ప్రజ్ఞ అత్యవసరం. ప్రజ్ఞవలనే మానవుడికి కార్యసఫలత కాగలదు. బలి, ప్రహ్లాదుడు, మంకి తన ప్రజ్ఞ వలనే తమ సమస్యలకు పరిష్కారం వెతికి కీర్తిప్రతిష్టలు పొందారు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకసారి ఒక గంధర్వుడు తోలే రధంతగిలి కిందపడి ఆ అవమాన భారంతో కుమిలి పోతూ ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఒక నక్క రూపంలో వచ్చి అతడికి ప్రజ్ఞకలిగించి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించాడు. కనుక మానవుడికి ప్రజ్ఞ ఉండడమే శ్రేష్టం " అని భీష్ముడు చెప్పాడు.

పుణ్యకార్య ఫలం[మార్చు]

ధర్మరాజు " మానవుడు తన దైనందన జీవితంలో దానాలు, ధర్మాలు, తపసు, తల్లితండ్రులకు పెద్దలకు సేవ చేయడం అత్యం నిష్టతో ఒక యజ్ఞంలా చేసినప్పుడు అవి మానవుడికి ఏ రూపంలో ఫలితాన్ని ఇస్తాయి. వివరంగా చెప్పండి " అని అడిగాడు. ధర్మరాజా ! మేలు మీద మేలు కీడు వెంట కీడు ఒక దాని వెంట ఒకటి వస్తుంటాయి పోతుంటాయి. ఒక మనిషి పాపం చేసినట్లైతే ఒక కష్టం వెంట ఒకటి వస్తూనే మనిషిని దారుణంగా దెబ్బ తీస్తుంటాయి. అదే మనిషి పుణ్యాత్ముడైతే అతడికి సుఖం వెంట సుఖం వస్తూనే ఉంటుంది కనుక నిరంతర సుఖసంతోషాలలో మునిగి తేలుతుంటాడు. ధాన్యంలో తాలుగింజలు ఉన్నట్లు మనుష్యులలో పాపాత్ములు ఉంటారు. వారు సమాజానికిపనికిరారు . కాని హానిచేస్తుంటారు. మనిషి చేసిన పాపపుణ్యాలు నిరంతరం అతడిని వెన్నంటి ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు అతడు చేసిన పాపపుణ్యాలు అతడిని వెన్నంటడమే కాక చనిపోయిన తరువాత కూడా పాపపుణ్యాలు వాసనల రూపంలో అతడి వెంటవెడతాయి కనుక మనిషి బ్రతికి ఉన్నా చనిపోయినా పాపపుణ్యాల నుండి తప్పించుకో లేడు. తగిన ఋతువులలో చెట్లు చిగిరించి పుష్పించి కాయలు కాశీ పండ్లుగా మారిన విధంగా మనిషి చేసిన పాపపుణ్యాలు తమ ఫలాలను కష్టసుఖాలను కలిగిస్తాయి. సాధారణంగా మానవులు మంచిప్రవర్తన కలిగి ఉంటారు. ధాన్యంలో తాలుమాదిరి అక్కడక్కడా దుర్మార్గులు ఉండి ఓర్పు వహించేవారిని, మంచి ప్రవర్తన కల వారిని చేతగాని వారిలా పరిగణిస్తారు. మంచి వారువారి మాటలు పట్టించుకొనక సన్మార్గంలో ప్రవర్తిస్తూ ఫలితంగా సుఖాన్ని పొందుతారు. కనుక ధర్మనందనా ! న్యాయధర్మాలు ఆచరించే వారు తప్పక ఫలితాన్ని పొందగలుతారు " అని చెప్పాడు భీష్ముడు.

భూతసృష్టి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఈ భూతసృష్టి ఎలా జరిగింది. ఎవరి వలన జరిగింది వివరించండి " అని అడిగాడు. ధర్మనందనా ! ఈ విషయం ఇంతకు ముందు భృగుమహర్షి భరద్వాజుడికి వివరించాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను. సర్వవ్యాపి ఆది, అంతం లేని విష్ణువు సృష్టిచేయ సంకల్పించి తననుండి వెయ్యోవంతు భాగంతో అవ్యక్తం అనే పదార్ధాన్ని సృష్టించాడు. అవ్యక్తమునుండి మహత్తత్వం అనే ప్రకృతితత్వం పుట్టింది. ఆ ప్రకృతిలోనుండి ఒక పద్మం పుట్టింది. పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుడి సంకల్పంతో ఆకాశం ఉద్భవించింది. తరువాత ఆకాశంనుండి జలం ఉద్భవించింది. జలం నుండి అగ్ని ఉద్భవించింది. అగ్ని నుండి వాయువు ఉద్భవించింది. అగ్నివాయువుల సమ్మిళితంగా భూమి పుట్టింది. పంచభూతములు బ్రహ్మ అందు ఉన్నాయి. కనుక ఈ భూమి అంతా బ్రహ్మమే. కొండలు పర్వతములు బ్రహ్మకు ఎముకలు, భూమి మాంసము, సముద్రాలు నదీనదాలు బ్రహ్మదేవుడి రక్తం. ఆకాశం బ్రహ్మఉదరం, వాయువు అతడి ఉచ్వాసనిశ్వాసాలు, అగ్ని అతడి తేజస్సు, సూర్య చంద్రులు బ్రహ్మదేవుడి కళ్ళు, ఊర్ద్వలోకం బ్రహ్మశిరస్సు, పాతాళము బ్రహ్మదేవుడి పాదాలు, నాలుగు దిక్కులు బ్రహ్మదేవుడి నాలుగు చేతులు ఇలా అనంతుడైన విష్ణువు నుండి ఈ ప్రకృతి ఉద్భవించింది. అప్పుడు భరద్వాజుడు పంచభూతములు రూపం ఏమిటి ? వాటి పరిమాణం ఏమిటి ? " అని అడిగాడు. భృగువు " ఒక పదార్ధము నుండి పుట్టిన పదార్థం ఆ పదార్థం పోలి ఉంటుంది. అలాగే సర్వవ్యాపి, అనంతుడు అయిన విష్ణువు నుండి పుట్టిన ప్రకృతి పంచభూతములు విష్ణు స్వరూపంలాగే ఉండి అంతటా వ్యాపించి ఉంటాయి. చెట్టు నుండి చెట్టు, పక్షి నుండి పక్షి, జంతువు నుండి జంతువు పుడతాయి. అలా పుట్టిన సర్వమూ తాను దేని నుండి పుట్టాయో దాని స్వరూపంతో ఉండం ప్రకృతినియతి. అలాగే అనంతుడైన విష్ణువు నుండి పుట్టిన పంచభూతములు విష్ణు వలెనే సర్వత్రావ్యాపించి ఉంటాయి " అని భృగువు చెప్పాడు.

బ్రహ్మ పుట్టుక[మార్చు]

భరద్వాజుడు భృగుమహర్షిని " మహర్షీ ! బ్రహ్మ పద్మమునుండి పుట్టాడు కదా ! అంటే బ్రహ్మ కంటే ముందే పుట్టిన పద్మాన్ని ఎవరు పుట్టించారు ? ఎలా పుట్టింది ? " అని అడిగాడు. భృగువు " భరద్వాజా ! సర్వవ్యాపి అయిన విష్ణుమానస పుత్రుడు ఆద్యుడు. బ్రహ్మకు ఆసనంగా పద్మము పుట్టింది అంతే కాని ఈ సృష్టిలో ముందు వెనుకలు లేవు. పద్మము అంటే మనం అనుకునే పద్మముకాదు పద్మము అంటే భూమి. భూమిపైన ఉన్న ఎత్తైన మేరుపర్వతం పద్మానికి కర్ణిక. పద్మము నుండి సమస్త చరాచర జగత్తు ఉద్భవించింది " అని భృగువు చెప్పాడు. భరద్వాజుడు " మహర్షీ ! పంచభూతాలు దేని నుండి ఉద్భవించాయి ? అవి అయిదురూపాలుగా ఎలా మారాయి ? " అని అడిగాడు. భృగువు " భరద్వాజా ! వాయువు నిరంతరం కదిలేది. చైతన్య రూపమైన ఆకాశం శబ్ధస్వరూపం. నీరు ద్రవస్వరూపము. అగ్ని వేడిమికి వెలుతుకు ప్రతీక. భూమి ఘనస్వరూపముకు ప్రతీక. వీటి అయిదింటి వలన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలో ఉన్నవి రెండుజాతులు. ఒకటి స్థావరం అంటే స్థిరమైనవి. రెండవది జంగమములు అంటే జీవముతో కదిలేవి.

పంచభూతముల గుణాదులు[మార్చు]

భరద్వాజుడు " మహర్షీ ! పంచభూతములు ఎలా ప్రవర్తిస్తాయి " అని అడిగాడు. భృగువు " భరద్వాజా ! కదలని వాటికి ప్రతీక అయిన చెట్టు పిడుగుపాటుకు అల్లాడుతుంది కనుక వృక్షాలకు వినికిడిశక్తి ఉన్నట్లేకదా ! గాలికి అనుకూలంగా కదులుతుంది కనుక వృక్షం గాలినిగ్రహిస్తుంది. సూర్యరశ్మి ఉన్న వైపుగా పెరుగుతుంది కనుక వృక్షానికి వెలుతురును గ్రహించే శక్తిఉంది. వేళ్ళతో నీటిని గ్రహించిన వృక్షం అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది కనుక వృక్షాలకు నీరుతాగే గుణం ఉంది. వృక్షం సుగంధపూరితమైన పుస్పాలను పుష్పించి కాయలు పండ్లు ఇస్తుంది కనుక వృక్షానికి భూమికి ప్రతీక అయిన ఘ్రాణశక్తి ఉంది. అలాగే కొండలు, పర్వతాలలో కూడా పంచభూత లక్షణాలు ఉంటాయి.

రసము వాసనా తేజము గురించి వివరించండి[మార్చు]

" పంచభూతగుణాలైన రసము, వాసనా, తేజము వేటిలో ఉంటాయి. వాటిని ఎలా అనుభవిస్తారు " అని అడిగాడు. భృగువు " భరద్వాజా ! విషయములు, ఇంద్రియములు, మనసు. మనలో ఉన్న అంతరాత్మ విషయవాంఛలను మనసు ద్వారా సంకల్పించి ఇంద్రియముల ద్వారా అనుభవించి వాటి వలన కలిగే సుఖదుఃఖములను అనుభవిస్తూ ఉంటుంది. జీవుడు క్షేత్రజ్ఞుడనే పేరుతో మనిషి శరీరం అంతా వ్యాపించి ఉంటాడు. ఈ క్షేత్రజ్ఞుడు మానవ సహజమైన సత్వతమోరజో గుణాలకు అతీతంగా సాక్షీభూతంగా ఉంటాడు. ఈ జీవుడు తన జన్మస్థానమైన కైవైల్యంవైపు చూస్తూ ఉంటాడు. విజ్ఞులైన వారు సూక్ష్మమైన నిర్మల బుద్ధితో క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకుని అనంతుడిమీద మనసులజ్ఞం చేసి పరమ శాంతివంతమైన చివరకు శాశ్వత ఆనందంపొందుతారు.

చాత్రుర్వర్ణ సృష్టి[మార్చు]

తొలుత బ్రహ్మదేవుడు సత్యము, ధర్మము, సదాచారము, తపస్సుకు ప్రతీకగా బ్రాహ్మణ సృష్టి చేసాడు. తరువాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను సృష్టించాడు. వారికి తగిన వర్ణములు కల్పించాడు. బ్రాహ్మణులు తెల్లగానూ, క్షత్రియులు ఎరుపురంగు లోనూ, వైశ్యులు పసుపురంగు లోను, శూద్రులను నలుపురంగు లోనూ పుట్టించాడు. ఈ నాలుగువర్ణాల వారు తమవృత్తి వదిలి వేరువృత్తి చేసిన ఆ వృత్తి కొనసాగించాలి. అలా కాక అనేక వృత్తులు చేసిన జారవృత్తి చేసిన వారు ఔతారు. చత్రుర్వర్ణాల వారు వారి వృత్తులను బట్టి ఒకరికంటే ఒకరు తక్కువగా పరిగణించ పడతారు.

త్రిగుణములు[మార్చు]

అన్ని ధర్మముల కంటే సత్యము ఉత్కృష్టమైనది. సత్యమేబ్రహ్మము, సత్యమేతపము, సత్యం ప్రజలను సృష్టిస్తుంది. సత్యంవలన సృష్టి నిలిచి ఉంది. సత్యము అసత్యము చేత మరుగునపడుతుంది. ఫలితంగా ధర్మము అధర్మము, వెలుగు చీకటి, జ్ఞానము అజ్ఞానము, స్వర్గము నరకము, సుఖము దుఃఖము అని రూపాంతరం చెంది ఉంటాయి అని పెద్దల వలన తెలుసుకుని పెద్దలు అసత్యముకు దూరంగా ఉండి నియమ నిష్టలతో గడుపుతుంటారు. బాధలు రెండురకాలు. బాధులు రెండువిధాలు. తన శరీరానికి వచ్చే వ్యాధులు, ముసలితనం అనేది ఒకటి. రెండవది బంధువులకు వచ్చేది అయిన మానసికబాధ. వాటిని మానవుడు తన నియమ నిష్టలతో అధికమించి సుఖపడవచ్చు. స్థిరచిత్తుడు ఈ రెండు బాధలను జయించి వాటికి లొంగక వైరాగ్యంతో పరమపదము పొందుతాడు " అని భృగువు చెప్పాడు.

ఆచారవిధానాలు[మార్చు]

భరద్వాజుడు " మహర్షీ ! నాకు ఆశ్రమ ధర్మముల గురించి వివరిస్తారా ! " అని అడిగాడు. భృగుమహర్షి " భరద్వాజా ! బ్రహ్మచారి లక్షణములు వివరిస్తాను. బ్రహ్మచారి గురుభక్తి కలిగి పరమ శ్రద్ధతో వేదాధ్యయనం చేస్తూ, శుచిత్వంతో, వినయంతో, మూడు వేళలలో హోమహుచేస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. గృహస్థు ధనమును, ధాన్యమును ధర్మబద్ధంగా సంపాదించాలి. అతిధిసత్కారములు చేయాలి. అన్నపానములు భోగములు పరిమితంగా చేయాలి. ఇది గృహష్తాశ్రమ ధర్మం. వానప్రస్థులు కంద మూలములు, ఆకులు, ఫలములు భుజించాలి, భూశైనము చేయాలి. సన్యాసి భిక్షాటన చేస్తూ దొరికినదానిని తిని ప్రశాంతంగా జీవించాలి. ఫలాపేక్ష లేకుండా ఈ నాలుగు ఆశ్రమాలను నిర్వర్తిస్తే మోక్షపదము లభిస్తుంది " అని భృగువు చెప్పాడు.

ఆధ్యాత్మవిద్య[మార్చు]

భరద్వాజుడు " పరలోకం ఇహలోకం గురించి వాటికి కల భేదం గురించి వివరించండి " అని అడిగాడు. భృగువు " భరద్వాజా ! ఇహలోక సుఖములకు పరలోక సుఖములకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉన్నది. ఈ లోకంలో సుఖాలకు ఆలవాలమైన ఇళ్ళు, మంచములు, పడకలు, సింహాసనములు, మంచి దుస్తులు, సుగంధద్రవ్యములు, పూలు, సంగీతము, నాట్యము, వినోదములు, ఆరామాలు, స్త్రీజనములు వీటిలో ఒక దానికి ఒకటి పరస్పర బేధము కలిగి ఉంటాయి. పరలోక సుఖాలకు ఇలాంటి భేదం ఉండదు. పాపచింత కలవారు అధోలోకముకు పోతాడు. అక్కడ దుఃఖమే కాని సుఖము ఉండదు. విషయవాంఛల మీద మమకారం లేని వాడికి పాపపుణ్యములు అంటక శాశ్వతానందం పొందుతాడు " అని భృగువు భరద్వాజుడికి చెప్పాడు.

ఆచార విధులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఆచారవిధులను గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చెడుప్రవర్తన మంచి వాళ్ళను చెడువాళ్ళను బాధపెడుతుంది కనుక మంచిప్రవర్తన కలిగి ఉండడం శ్రేయోదాయకం. రాజమార్గంలో, రచ్చబండల వద్ద, పశువులను కొనుచోట మలమూత్ర విసర్జన చేయ రాదు. ఉదయం సాయంత్రం నదీస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అసురసంధ్యవేళ నిద్రించరాదు. స్నానం, సంధ్యావందనం చేసిన పిదప భుజించాలి. తినే ఆహారాన్ని నిందించకూడదు. ఆహారాన్ని బ్రహ్మస్వరూపంగా పూజించాలి. తడి కాళ్ళతో నిద్రించరాదు. ఇవి సదాచారములు. ఉదయించే సూర్యుడిని చూడరాదు. ఇతర స్త్రీలను వస్త్రహీనలుగా చూడరాదు. చేసిన పాపం బహిర్గతం చేసి విముక్తిపొందాలి కాని దాచరాదు. దాంపత్యాన్ని జీవితాన్ని బహిర్గతం చేయకూడదు. గురుశుశ్రూష చెయ్యడం, బ్రాహ్మణులను పూజించడం మనిషి ఆయువును వృద్ధిచేసి, లక్ష్మీ కటాక్షం కలిగించి స్వర్గలోకప్రాప్తి కలిగిస్తుంది.

ఆధ్యాత్మ విధ్య[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఆధ్యాత్మవిధ్య గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మానవునిలో భూమి నీరు, ఆకాశము, వెలుగు, గాలి అను పంచ భూతములు వాటి గుణములైన శబ్ధము, రసము, గంధము, చలనము, తేజస్సు సముద్రంలో కెటాల వలె పుడుతూ ఉంటాయి అంతమౌతూ ఉంటాయి. ఇంద్రియములు పంచ భూతములకు వశులై వర్తిస్తుంటాయి. మనసు ఇంద్రియాలకు ఆధారమై ఉంటుంది. మనసు ఒక నిర్ణయానికి రావడానికి బుద్ధి తోడ్పడుతుంది. పురుషుడు ఇలా విషయాలను గ్రహిస్తుంటాడు. అలా కాక పురుషుడు భాహ్య విషయాలను వదిలి అంతర్ముఖుడై మనసుని కట్టడి చేసి, బుద్ధితో విషయాలను క్షేత్రజ్ఞుడైన ఆత్మను దర్శనంచేయాలి. ఈ ఆత్మ క్షేత్రజ్ఞుడని, పురుషుడని, భూతాత్ముడని, పరమేశ్వరుడని, బుద్ధి సాక్షి అని, జనన రహితుడని పిలుస్తుంటారు. పురుషుడు అంతఃచేతనాన్ని అనుభవంతో తెలుసుకుంటాడు. భాహ్య విషయాలను మాయ అని, కల అని, మిధ్య అని మాయకారణంగా అని తెలియక మానవుడు మోసపోకూడదు. మాయకు సత్వ రజతమో గుణాలు శరీరం. కనుక రజ, తమో గుణాలను వదిలి సత్వ గుణాలన్ని పెంపొందించుకుని జ్ఞాన వంతుడై చివరకు సత్వగుణాన్ని కూడా వదిలి ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యాలి.

యోగము[మార్చు]

ధర్మజా ! యోగము గురించి చెప్తాను విను. ఎప్పుడూ తామరాకు మీది నీటిబొట్టు లాగా, మేఘములో మెరుపు తీగలా సదా చలించే మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి. మనసుకు ఉచ్వాస, నిశ్వాసములు ఆధారములు. వాటి మీద దృష్టినిలిపి క్రమపరచి ఏకాగ్రత సాధించాలి. కష్ట సాధ్యమైన దీనిని అభ్యాసముతో సాధించాలి. అలా యమ, నియమములను అభ్యసించి ఆలోచనలను నిగ్రహించాలి. అప్పుడు క్రమబద్ధం చేసిన శ్వాశ అంతర్నాడి ద్వారా బ్రహ్మపదము చేరి నిశ్చలమైన ఆనందం ఇస్తుంది.

జపము[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! నాకు జపము దాని మహిమ గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! జపము గురించి యముడు, మృత్యుదేవత, కాలము, బ్రాహ్మణుడు, ఇక్ష్వాకులకు మధ్య జరిగిన సంవాదము గురించి చెప్తాను. ఈ జపకర్మ వేద విదుల చేత ఆమోదించబడిన కర్మ. జపము చేయువారు అత్యంత శుచిగా ఒక చదునైన ప్రదేశంలో ధర్భాసనం మీద దర్భలు చేత పట్టుకుని కూర్చుని ఇంద్రియములను నిగ్రహించి, మనసును నిగ్రహించాలి. ఇంద్రియములను విషయాసక్తి, డంభము, మత్సరము, అహంకారము, మానము, అవమానము తొలగించి బ్రహ్మచర్యము పాటించాలి. ఈ విధ నియమములను అనుసరించి జపమును ఆచరించిన పురుషుడు సర్వ లోకములను జయించి తుదకు మోక్షము సాధిస్తాడు. అలా కాక అశుచిగా, దుర్గుణముతో, నీచమైన ఆలోచనతో, మనస్సు నిశ్చలము లేకుండా జపము ఆచరించిన పురుషుడు నరకానికి పోతాడు.

కౌశికుడు ఇక్ష్వాకుడు[మార్చు]

పూర్వము వేదవేదాంగ పారంగతుడైన కౌశికుడు అనే బ్రాహ్మణుడు అత్యంత నిష్టతో సావిత్రీదేవిని గురించి జపము చేసాడు. ఆ నిష్టాపూర్వక జపముకు మెచ్చిన సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకొమ్మని అడిగింది. కౌశికుడు తనకు జపమునందు నిష్ఠ కావాలని కోరాడు. సావిత్రీదేవి " ఓ కౌశికా ! నీకు ఉత్తమగతులు కలుగుతాయి. యముడు, కాలము, మృత్యువు నీ వద్దకు వచ్చి మాట్లాడుతారు " అని వరమిచ్చి వెళ్ళింది. కౌశికుడు అలా నూరు సంవత్సరాలు జపతత్పరుడై గడిపాడు. అతడి జపముకు తృప్తి చెంది ధర్మదేవత సాక్షాత్కరించి " కౌశికా ! నీ జపము సిద్ధించింది. నీవు సిద్ధి పొందావు. నీవిక ఈ శరీరము విడిచి పుణ్యలోకముకు వెళ్ళు " అని చెప్పింది. కౌశికుడు " ధర్మదేవతా ! నేను జపము చేయాలంటే నాకు ఈశరీరము కావాలి కదా ! కనుక నేను ఎంత దుఃఖమైనా ఓర్చుకుంటాను కాని పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఈ దేహము వదలను " అని అన్నాడు. ధర్మదేవత " కౌశికా ! పుణ్యలోకాలకు వెళ్ళకుండా ఎప్పటికైనా వదలవలసిన ఈ శరీరాన్ని వదలనని చెప్పడం ధర్మమా ! " అని అడిగింది. కౌశికుడు " నా తపసుకు ఆలంబనమైన ఈ శరీరమును నేను విడువను " అన్నాడు. ధర్మదేవత " నిన్ను పుణ్యలోకాలకు తీసుకు పోవడానికి యముడు, మృత్యువు, కాలము వచ్చారు చూడు " అని చెప్పింది. అప్పుడు మృత్యువు, యముడు, కాలము ముందుకు వచ్చి తమని తాము పరిచయము చేసుకున్నారు. యముడు " నువ్వు చేసిన జపము ఫలించింది " అని చెప్పాడు. కాలపురుషుడు " నీకు పుణ్య లోకాలకు వెళ్ళ వలసిన కాలము సమీపించింది " అన్నాడు. మృత్యుదేవత " కాలపురుషుని ఆదేశం మేరకు నేను నిన్ను తీసుకు రావడానికి వచ్చాను " అని చెప్పింది. కౌశికుడు మారి మాటను పెడ చెవిన పెట్టి " మీరు చెప్పిన పని కాక నేను మీకు ఏమిచేస్తే సరిపోతుంది " అని అడిగాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఇక్ష్వాకుడు అక్కడ ఉన్న దేవతలకు నమస్కరించాడు. కౌశికుడు ఇక్ష్వాకుడికి మర్యాదలు చేసి " మహాత్మా ! నేను నీకు ఏవిధంగా సత్కరించగలను " అని అడిగాడు. ఇక్ష్వాకుడు " మహాత్మా ! క్షత్రియులమైన మేము దానాలు ఇస్తాము కాని దానాలు పట్టము. నీకేమి కావాలో అడుగు నేను తీరుస్తాను " అన్నాడు. కౌశికుడు " ఇహలోక మమకారం ఉన్న వాళ్ళకు మర్యాదలు కావాలి కాని నాకు ఎందుకు ? నా అతిథివైన నీకు నేను కానుకలు సత్కారంగా ఇస్తాను. కనుక అవి దానము కాదు " అన్నాడు. ఇక్ష్వాకుడు " నీకు ఇవ్వాలని అనుకుంటే నీ జపఫలము సగము నాకు ఇవ్వు " అని అడిగాడు. కైశికుడు " నీకు కావాలంటే పూర్తిగా అయినా ఇస్తాను. ఎంత కావాలి " అని అడిగాడు. ఇక్ష్వాకుడు " నీ జపఫలము ఏమిటి ? " అని అడిగాడు. కైశికుడు " నేను ఫలితమును ఆశించి రాలేదు కనుక నా జపఫలము ఏమిటో నాకు తెలియదు. నా జపఫలము ముందు తీసుకుని తరువాత ధర్మవిధులను అడిగి తెలుసుకో " అని అడిగాడు. ఇక్ష్వాకుడు " కైశికా ! ఫలితము తెలియకుండా దానము ఎలా స్వీకరించగలను. నాకు వద్దు " అన్నాడు. కైశికుడు " రాజా ! నీవు అడిగావు, నేను ఇస్తాను కనుక ఇప్పుడు మనకు అసత్య దోషము అంటదా " అని అడిగాడు. ఇక్ష్వాకుడు " నవ్వి క్షత్రియుడనైన నేను నీతో మాటల యుద్ధము చేసాను " అన్నాడు. కౌశికుడు " మహారాజా ! నీవు ఏమి చేసావో కాని నేను త్రికరణ శుద్ధిగా నా జపఫలితాన్ని ఇస్తున్నాను నువ్వు తీసుకుంటాననిన్నావు. ఇప్పుడు నీవు తీసుకోవడానికి నిరాకరిస్తే క్షత్రియుడివైన నీకు బ్రాహ్మణుడినైన నాకు సత్యవ్రతభంగము వాటిల్ల ఉంది. ఇది ధర్మముకాదు. రాజా ! సత్యవ్రతమే తపస్సు, సత్యమే యజ్ఞము, సత్యమే వేదము, శాంతి, ఇంద్రియ నిగ్రహము. ఆ సత్యవ్రతానికి భంగం వాటిల్లినప్పుడు నేను ఇప్పటి వరకు చేసిన జపతపములు ఫలించవు " అన్నాడు. వీరి మాటలు వింటున్న ధర్మదేవత " మీలో మీకు వాదన ఎందుకు దానము ఇచ్చిన ఫలము కౌశికుడికి, సత్యవ్రతమును పాటించే ఫలము ఇక్ష్వాకుడు పొందగలరు " అని అన్నాడు. అప్పుడు పుణ్యలోకము మానవాకృతిలో వచ్చి " అయ్యా ! మీలో మీకు వాదన ఎందుకు. ధర్మదేవత ! చెప్పినట్లు చేయండి. మీరిద్దరూ సమాన ఫలితం పొడుతారు " అన్నది. ఇక్ష్వాకుడు బ్రాహ్మణుడు కూడా తానిచ్చేది స్వీకరించాలని పట్టుపట్టాడు. కైశికుడు " నేను నియమనిష్ఠలు, జపతపాదులలో నిమజ్ఞమై ఉన్నాను. నేనేదీ కోరను కనుక నేనేది స్వీకరించను. ఇక్ష్వాకుడు " నీకు తగినదే నేను ఇస్తాను. నేను చేసిన సుకృతములఫలము నీకిస్తాను తీసుకో " అన్నాడు. ఇంతలో వికృతమైన వేషధారులు ఇద్దరు అక్కడకు వాదులాడుకుంటూ వచ్చారు. ఇక్ష్వాకుడు వారిని ఎందుకు వాదులాడుకుంటారని అడగగానే " అయ్యా ! నేను గోదానము చేసాను. ఇతడు ఆ గోదానఫలితాన్ని ఇమ్మని అడిగాడు. నేను అలాగే ఇచ్చాను. ఇతడు అది తనకు చాలదని చెప్పి రెండు మంచి జాతి ఆవులను కొనిఆ గోవులను అర్హుడికి దాన మిచ్చాడు. తరువాత ఆదాన ఫలితం నాకు ఇస్తానని చెప్పాడు. నేను మొదట అంగీకరించి తరువాత నిరాకరించాను. అదే మా వాదులాట. మీరే చెప్పండి నేనేం చేయడము ధర్మము " అని అండిగాడు. రెండవ వాడు " అయ్యా ! ముందు అంగీకరించి తరువాత నిరాకరించడం న్యాయమా ? " అని అడిగాడు. ఇది విన్న కౌశికుడు " మహారాజా ! చూసారా వీరి వాదులాట మనవంటిదే. నీవు అంగీకరించినటుల దానం స్వీకరించు లేకున్న నిన్ను శపిస్తాను " అన్నాడు. ఇక్ష్వాకుడు ఇక తప్పదనుకుని దానము స్వీకరించడానికి అంగీకరించి కౌశికుడి వద్ద నుండి దానం స్వీకరించి బదులుగా తాను చేసిన యజ్ఞఫలమును దానంగా స్వీకరించమని కోరాడు. అప్పుడు అక్కడకు వచ్చిన మానవులు వారితో " అయ్యా! మేము కామము, క్రోధము. మీరిద్దరు ధర్మదేవత చేతను, యముడి చేతను మా చేత పరీక్షింపబడ్డారు. అంతే కాని ఇవ్వడము తీసుకోవడము దైవ నిర్ణయాలు మీ చేత ఏమీలేదు " అన్నారు. అప్పుడు కౌశికుడు " మహారాజా ! నా జపతపాలకు అదిష్టాన దేవత అయిన సావిత్రిదేవి. ఆమె నుండి నేను బలము, శ్రద్ధను పొందాను. ఇక నేకు జపత్పాదులు చేయనవసరం లేదు. నీవు నా పుణ్యఫలమును స్వీకరించి నాకు అవసరం లేకున్నా నీ యజ్ఞఫలాన్ని నాకు ఇచ్చావు. ఇక నీ దారి నీది నా దారి నాది " అన్నాడు. వారి ధర్మ నిష్ఠకు మెచ్చిన దేవతలు వారి మీద పూలవృష్టి కురిపించి దేవదుందుభులు మ్రోగుతుండగా కిందకు దిగి వచ్చి వారిని అభినందించారు. ఆకాశవాణి " అయ్యలారా ! మీరిద్ధరు సిద్ధి పొందారు. మీకిక ఉత్తమ గతులు కలుగుతాయి " అని పలికింది. అప్పుడు కౌశికుడు భవబంధాలు తెంచుకుని అక్కడ ఉన్న ధర్మదేవతకు, యమధర్మరాజుకు, మృత్యుదేవతకు, కాలపురుషుడికి నమస్కరించి, మనసును నిలిపి ప్రాణాలను కనుబొమల మధ్య నిలిపి, ప్రాణాన్ని బ్రహ్మరంధము వద్ద నిలిపి నిశ్చలంగా నిలిపి ప్రాణములను విడిచాడు. అతడి ప్రాణములు దేదీప్యమాన కాంతిగా బయటకు వెడలింది. ఆకాంతికి బ్రహ్మదేవుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. బ్రహ్మదేవుడు " ఉత్తమ నిష్టతో జపము చేసే యోగులకు వారి పుణ్యవశమున పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. నిష్టతో జపము చేయడము వలన తమకు తాముగా శరీరము నుండి విడివడి ఉత్తమ లోకములకు వెళ్ళగలరు. కైశికా రా " అనగానే బ్రహ్మరంధ్రం ద్వారా శరీరం నుండి విడివడిన కౌశికుడి ఆత్మ బ్రహ్మదేవుడి ముఖములో ప్రవేశించి బ్రహ్మదేవుడిలో ఐక్యమైంది. తరువాత ఇక్ష్వాకుడు కూడా తనకు తానుగా శరీర త్యాగం చేసి బ్రహ్మదేవుడిలో ఐక్యము అయ్యాడు. అది చూసిన దేవతలు ఆశ్చర్య పోతూ కౌశికుడిని, ఇక్ష్వాకుడిని పొగిడారు " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! నిష్ఠతో జపము చేసిన వారు బ్రహ్మైక్యము పొందగలరు " అన్నాడు.

జ్ఞానయోగము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు అన్ని యోగాలకంటే మిన్న అయిన జ్ఞానయోగము గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు" ధర్మనందనా !ఒకప్పుడు మనువు, బృహస్పతి సంవాదము వినిపిస్తాను విను. మనువు దేవ గురువును జ్ఞానయోగము వివరించమని కోరగా బృహస్పతి " అనఘా ! జ్ఞానయోగముకు మూలము సత్కర్మాచరణమే. ఇష్టమైనది పొందుటకూ ఇష్టము కానిది విడుచుటకు మానవుడు కర్మాచరణ చేస్తుంటాడు. అటువంటి కర్మలు ముందు సుఖము కలిగించి తరువాత దుఃఖమును కలిగిస్తాయి. కర్మఫలాన్ని ఆశించకుండా చేసే కర్మలు సుఖదుఃఖాలను కలిగించవు. అతడి అరిష్డ్వర్గాలకు అతీతంగా ఉండి జ్ఞానయోగ సిద్ధి పొంది చివరకు జ్ఞానం పొందుతాడు. పరతత్వము ఆధారరహితము. శబ్ధ, గంధ, రస, రూపాదులు లేనిది. అది అగోచరమైనది. పరతత్వానికి స్త్రీ పురుష నపుంసక భేదము లేదు. అది జ్ఞానస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది. దేదీప్యమానమైన దీపము చుట్టూ ఉన్న వస్తువులను వెలిగించినట్లు జ్ఞానము ఇంద్రియములను, మనసును వెలిగించి వాటికి పట్టిన జాడ్యములను వదిలిస్తుంది. రాజుకు మంత్రులు సాయపడినట్లు జ్ఞానము అనుదిన కార్యములలో ఇంద్రియములకు, మనసుకు తోడ్పడుతుంది. చెట్టులో దాగిన అగ్ని గొడ్డలితో నరికినప్పుడు కనిపించదు అయినా ఒకటికి ఒకటి రాచుకున్నప్పుడు దానిలోని అగ్ని ప్రజ్వలించినట్లు మన శరీరంలో ఉన్న పరతత్వమనే గురువుతో వెగించబడేదే జ్ఞానం. అంతే కాని ఈ శరీరాన్ని హింసించినా బాధపెట్టినా జ్ఞానంకలుగదు. పరతత్వము ఇంద్రియ గోచరము కాదు. అందువలన ప్రతత్వము అస్తిత్వము లేనిదికాదు. వలతో మృగములను పట్టినట్లు, గాలంతో చేపలుపట్టినట్లు, కందకముతో ఏనుగును పట్టుకున్నట్లు, పరతత్వాన్ని జ్ఞానముతో మాత్రమే తెలుసుకోగలము. కనుక జ్ఞానిమాత్రమే పరతత్వము తెలుసుకోగలడు. పాము కాలును పాము గ్రహించినట్లు పరతత్వాన్ని జ్ఞాని మాత్రమే గ్రహించగలడు. అమావాస్యనాడు చంద్రుడు లేనంత మాత్రాన చంద్రుడు లేడని అనగలమా ! అలాగే పరతత్వము కనపడనంత మాత్రాన పరతత్వము లేదని అనగలమా ! రాహువు మింగిన సూర్యుడు కనిపించనంత మాత్రాన సూర్యుడు లేడని అనగలమా రాహువు విడువగానే సూర్యుడు కనిపించినట్లు జ్ఞాననేత్రము తెరవగానే పరత్వము నిర్మలమైన నీటిలో ప్రతిబింబంలా భాసిస్తుంది. అరిషడ్వర్గాలకు లొంగి ఇంద్రియములను బయట ప్రపంచంలో తిరుగునట్లు విడిచిన దుఃఖమును నివారించుట అసాధ్యము. ఇంద్రియములను నిగ్రహించి దృష్టిని ఏకాగ్రతచేసి అంతరావలోకనము చేసి ఆత్మను ఉద్దరించాలి. నిశ్చలమైన మనసు మలినము లేని అద్దంలా భాసిస్తుంది. ధ్యానయోగము చేత మనసును కట్టడి చేసి విషయవాంఛల నుండి దూరము చేసి త్రిగుణాతీతుడై ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. అదే మోక్షము.

మాయ త్రిగుణాలు[మార్చు]

జ్ఞానమును మాయ కప్పి ఉంచుతుంది. ముందుగా మానవుడు మాయ గురించి తెలుసుకోవాలి. పక్షులు పోయే మార్గము ఎలా తెలుసుకోలేమో మాయ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోలేము. మాయకు ఆకారము లేదు కంటికి కనిపించదు. సత్వరజోతమో గుణాలే మాయకు ఆకారము. త్రిగుణాలను తొలగించిన మాయ దానంతట అదే తొలగి పోతుంది. ఆత్మను ఆవరించి ఉన్న త్రిగుణాలను వైరాగ్యము అనే కొడవలితో కోసి వేయాలి. మణులు, మాణిక్యాలు, బంగారు పూసలు, వెండి పూసలను ఒకే దారం ఎలా మాలలా కట్టి ఉంచుతుందో పరమాత్మ జీవాత్మలలో అంతర్లీనంగా ఉండి ఈ లోకాలను నడిపించి ఉంచుతాడు. ఒకే సారము ఉన్న భూమిలో అనేక విధల ఔషధీమొక్కలు ఉన్నట్లు ప్రాణులందు ఉన్న బుద్ధి అనేక విధముల కర్మలకు కారణం ఔతుంది. భూమికంటే జలము, జలము కంటే తేజస్సు, తేజస్సు కంటే వాయువు, వాయువు కంటే ఆకాశము విశాలమైనది. వీటన్నిటికంటే మనసు పెద్దది. మనస్సు కంటే బుద్ధి విశాలమైనది. ఇవి అన్ని కాలానికి లోబడి ప్రవర్తిస్తాయి. ఆ కాలాన్ని శాసించకలిగిన వాడు పరమాత్మ. పరమాత్మకు ఆది, మధ్య, అంతము లేదు. అతడు అవ్యయుడు, వేదములకు అధిపతి. అతడి తలపుకు అందడు, పలుకుకు అందడు, కర్మలకు గోచరము కాడు. అతడే సకల ప్రాణులను భవబంధ విముక్తులను చేయగలడు. మనసును తరువాత బుద్ధిని తరువాత జ్ఞానమును అంతరింపజేసిన అక్షరుడు జ్ఞానమయుడు అయిన విష్ణుసాయుజ్యమును పొందగలడు. ఆ పరతత్వము అవ్యయము, అచ్యుతము, అమలము, అమేయము, అమృతము, అమేయము, అనంతము. అట్టి పరమాత్మను మనసును యమ నియమాలతో మనసును నియంత్రించి మాత్రమే తెలుసుకొనగలము. ఇలా బృహస్పతి మనువుకు పరమాత్మ తత్వము బోధించాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణతత్వం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు శ్రీకృష్ణతత్వము గురించి తెలుసుకోవాలని ఉంది " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నారదాది మునుల వలన నేను తెలుసుకొన్నది ఇప్పుడు నీకు చెప్తాను. శ్రీకృష్ణుడే పరమాత్మ అయిన విష్ణుమూర్తి. అతడు తన వినోదము కొరకు భూమి, ఆకాశము, నీరు, వాయువు అను పంచ భూతములను కల్పించాడు. అలా కల్పించిన జలములో ఒక భవ్యమైన తల్పము మీద అతడు శయనించి ఉన్నాడు. అతడి నాభినుండి ఒక కమలము ఉద్భవించింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ తన సంకల్పంచేత ఏడుగురు మానస పుత్రులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యపప్రజాపతి జన్మించాడు. కశ్యపుడి వలన దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. అత్రి మహామునికి చంద్రుడు జన్మించాడు. ఈ సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు అనేక సంవత్సరాలు రాజులై ఈ భూమిని పాలించారు. దేశ కాల పరిస్థితులను అనుసరించి రాజవంశస్థులు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. ఆ రాజ వంశీయులు తమలో తాము కలహించుకుని విభేదించి యుద్ధములు చేసుకున్నారు. ఆ యుద్ధముల కారణంగా విష్ణువు జనక్షయం చేస్తూ వచ్చాడు. ఆ దేవదేవుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దుడు అనే నాలుగు దివ్యరూపములతో దివ్యనామలతో వినోదించాడు " అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుడిని చూపి " ధర్మనందనా ! ఈ మహాపురుషుడిని సామాన్య మానవుడిగా చూడటము మన అజ్ఞానము. శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు, తన కటాక్షవీక్షణాలతో భక్తుల కోరికలను తీరుస్తుంటాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.

పరమాత్మసిద్ధి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఎవ్వని తలచుకుంటే మానవుడు పరమాత్మను చేరగలడు. ఏ ఉపాయంతో మానవుడికి పరమాత్మచింతన అలవడుతుంది " అని అడిగింది. భీష్ముడు " ధర్మనందనా ! ఈ విషయము నేను నారదుడి ద్వారా విన్నాను. అది ఇప్పుడు నీకు చెప్తాను. అని నారదుడిని, మహా విష్ణువును మనసున తలచుకుని " ఒక సారి నారదుడు " నిన్ను దేవదేవా ! పొందగోరు జనులు నిన్ను ఏ విధంగా తలుస్తారు. ఏ జపము చేస్తారు నాకు తెలపండి " అని అడిగాడు. అప్పుడు విష్ణువు " నారదా ! నన్ను ధ్యానించడానికి మూడు లక్షణాలు కావాలి. ఒకటి పరమభక్తి, రెండవది నిర్మలమైనశ్రద్ధ, మూడవది ఇంద్రియనిగ్రహము. అకల్మషహృదయము కల వారికి ఈ మూడుగుణాలు సులభంగా లభ్యమౌతాయి. నిరంతరము నన్ను ధ్యానం చేయడం వలన మనసులోని కల్మషము హరించబడి నిష్కల్మషులౌతారు. ఓం కారముతో మొదలై నమహ్ అనే పదము వద్ద ఆరు గుణములు కలిగిన ఐశ్వర్యవాచకము, ఈ పదములకు శివ నామంతో చేరిస్తే అది మహామంత్రము ఔతుంది. ఈ మంత్రము వలన ధర్మార్ధ కామ మోక్షములు సిద్ధిస్తాయి. తరువాత నారదుడు అనుస్మృతి గురించి చెప్పసాగాడు. అవ్యక్తుడిని, శాశ్వతుడిని, అఖిలప్రభవై భూమిని పాలించువాడిని, భక్తవత్సలుడిని, విష్ణువును, పరమపురుషుడిని, అక్షయుడిని చేతులు జోడించి ఆశ్రయించాలి. పుండరీకాక్షుడిని, భువనసాక్షిని, నిత్యుడిని, పురాణపురుషుడిని ప్రార్ధిస్తాను. పరుని, సహస్రాక్షుడిని, అక్షరుడిని, లోకైకనాధుడిని, భవ్యుని కొలిచెదను. భూతభవ్యభవత్ప్రభువును, సర్వతోముఖుని, భూతసంప్రవర్తిని, అమృతుని, అచ్యుతుడిని, అనంతుడిని, హృషీకేశుడిని, రవిసహస్రవిభుడిని, హిరణ్యగర్భుడిని, అబ్జనాభుడిని, సత్యుడిని, ఆద్యంతరహితుడిని, భూగర్భుడిని, ప్రభుడిని, ప్రభువును, భక్తిగమ్యుడిని, ధ్యానిస్తాను. అచలుడిని, సూక్ష్మరూపుడిని, వరేణ్యుడిని, సహస్రశీర్షుడిని, అభయకారుడిని, అశీర్షుడిని, నారాయణుడిని, సనాతుడిని, యోగమూర్తిని, లోకాతిరక్తుడిని, ధ్రువుడిని, ఈశ్వరుడిని, హరిని భక్తితో కొలుస్తాను. ఈ చరాచర జగత్తుకు ఎవడు అధిపతో, ఎవని నాభి నుండి పుట్టిన పద్మము నుండి బ్రహ్మ జన్మించాడో, ఎవరి కారణాన ఈ జగములన్నీ సృష్టించబడ్డాయో ఆ ముకుందుడిని నేను కొలుస్తాను. స్థావరములు, జంగమములు, బ్రహ్మదేవుడు మహాప్రళయములో లయమైన తరువాత ఎవరు శాశ్వతముగా ఉంటాడో ఆ నిత్య స్వరూపూడైన విష్ణువును నియమంతో కొలుస్తాను. కాలపురుషుడు, పర్జన్యుడు, భూమి, పంటలు, అన్నీ తానే అయి లీలలు సాగించు వాడు అయిన ఆ వాసుదేవుడిని నేను సదా కీర్తిస్తాను. ఎవరి వలన అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి, గ్రహములకు, నక్షత్రములకు తేజస్సు కలుగుతుందో ఆస్వయం ప్రకాశకుడిని నేను కొలుస్తాను. యజ్ఞధరుడు, పంచయజ్ఞుడు, లక్ష్మీనివాసుడు, యోగముకు ఆధారమైన వాడు, ఈ సర్వజగత్తుకు ఆధారమైన వాడు, ఈ సర్వజగత్తు ఆరాధింపబడు శ్రీహరిని నేను ఆశ్రయించెదను. నిశ్చలమైన వాడిని, పాంధుడిని, సకలలోకథరుడిని, నిరాకారుడిని, సాగరమంత పరిజ్ఞానము కలవాడిని, అయిదు కాలములను ఎరిగిన వాడిని సకలగుణములు కలిగినవాడిని, నిర్గుణుడిని నేను భక్తితో కొలుస్తాను. అగుపించు సకలముకు కారణమైన వాడిని, ఎవ్వరికి కనిపించక ఆవల ఉండువాడిని, భక్తపరాధీనుడిని, వాక్చాతుర్యము కలవాడిని, సకల శుభములు కలిగించేవాడిని నేను స్తుతిచేస్తాను. జ్ఞానులు, యోగులు, జితేంద్రియులు ఎవరిని పొందిన తిరిగి రారో అతడిని నేను శరణు కోరుతున్నాను. ఈ సమస్తలోకములను తన అంశతో నిర్వహించు వాడిని, దయాకరుడిని, పద్మనాభుడిని నేను స్తుతిస్తాను. పంచభూతాత్మక ప్రకృతిని తన పంఛముఖాలతో అనుభవించు క్షేత్రజ్ఞుడిని, త్రిగుణాలను లీలగా అనుభవించు మహానుభావుడిని ఆత్మానుసంధానం చేసుకుంటాను. జ్ఞానులు సాంఖ్యులు ఎవరి అందు చేరుతారో ఆ పరమాత్మను నేను ధ్యానిస్తాను. సూర్యుడిలో లీనమై, చంద్రుడిలో ఉండి ప్రకాశించే ఆ అంతరాత్ముడిని భజిస్తాను. సూర్యుడిలో, తారలలో, చంద్రూడిలో తేజమై ఉన్నవాడిని నేను దర్శిస్తాను. గుణములకు ఆది అయినవాడు, నిర్గుణుడు, లక్ష్మీవల్లభుడు, అజుడు, సూక్ష్ముడు, అంతటా తానై నిండి ఉన్న వాడైన హరిని ప్రసన్నమయ్యే వరకు ప్రణతిస్తాను. అంతటా నీ ముఖములతోను, కళ్ళతోనూ, నీ తలలతోనూ నిండిన, నిర్వికారుడిని, నిర్మలుడిని, సర్వసాక్షి అయిన గోవిందుని నేను కొలుస్తాను. ఓ నారాయణా ! నిన్ను తెలుసుకుంటే కాని ప్రాణులకు ఈ సంసారబంధాలు వీడవు. మనస్సుకు, ఇంద్రియములకు గోచరము కాను నిన్ను చేరుమార్గము ఏది ? సిద్ధులు అరిష్డ్వర్గాలను ఇడిచి నిన్ను కొలుస్తారు. కర్మఫలాలను జ్ఞానాజ్ఞిలో ఎవరు దగ్ధము చేయుదురో వారే నిన్ను చేరగలరు. అన్ని దేహములలో ఉండే నీవు దేహదారుడివి కాదు. ద్వందాతీతులయిన యోగులను సదా రక్షించే వాడివి నీవే. ఈ ప్రకృతి, సమస్తభూతములు, బుద్ధి, అహంకారము నీ వలెనే ప్రకాశిస్తున్నాయి. సమస్త సృష్టి నీ మయమే సమస్త సృష్టి నీలో ఒదిగి ఉంది. నీ మహిమ వలన భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో అనేకత్వము ప్రకాశిస్తున్నాయి. దారములో ఉన్న మణుల వలె సమస్త జగత్తు నీయందు ఇమిడి ఉంది. నీకు పుట్టుక లేదు. నీవు అకారణుడివి. అన్నిటికి కర్తవు. ఈ భూతకోటిని సృష్టించి చివరకు లయము చేసే వాడివి నువ్వే. తత్వము, అతత్వము నీవే. అందరిలో ఉన్న కూటస్తచైతన్యము నీవే. ఓ ముకుందా నాకు ఏవరి అందు ప్రేమ కాని ద్వేషము కాని లేదు. నాకు యుక్తి, బుద్ధి, అహంకారము, సత్వ, రజో తమోగుణములు నాకులేవు. ఏ కర్తవ్యము నాకు లేదు, ధర్మాధర్మములు, ఇంద్రియలోలత్వము విషయవాంఛలు నాకు లేవు. నాకు బాధల నుండి మరణము నుండి మోక్షము ప్రసాదించు దేవా. నిన్నే శరణు వేడే నామీద కరుణ చూపించు. నా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పంచ భూతములలో కలిపి నన్ను కటాక్షించు. గోవిందా ఈ పంచభూతాత్మక శరీరమందలి నీటిని నీటి అందు, అగ్నిని అగ్ని అందు, వాయువును వాయువు అందు, ఆకాశతత్వమును ఆకాశమందు, చిత్తము చిత్తము అందు, అహంకారమును అహంకారము అందు కలిపి ఈ వ్యక్త శరీరమును అవ్యక్తమున కలిపి నాలోని త్రిగుణములను తన్మాత్రలను నశింపజేసి నాకు ముక్తిని కలిగించు దేవా ! నన్ను నీలోకి తీసుకుని జనన మరణ చక్రము నుండి నన్ను విముక్తుడిని చెయ్యి. నేను హరి అందు ఉన్నాను నా యందు హరి ఉన్నాడు. నాకు సతతము నిన్ను కొలుచే భాగ్యము కలిగించు దేవా. నేను పూర్వజన్మలో చేసిన పాపపుణ్యములు నా అనుభవములోకి రానిచ్చి ఋణవిముక్తుడిని చేయి దేవా ! ఎల్లపుడూ నిన్ను మనమున తలిచే నన్ను నీవు నీ వాడిగా భావించి వాత్సల్యంతో కాపాడు. వాసుదేవా నన్ను మరువకు. నున్ను సదా నాలో నిలుపుకుంటాను. అవ్యయుడవు, సనాతుడవు, అగ్రాహ్యుడవు, చిన్మయుడవు అయిన నిన్ను పునరావృత్తి లేకుండా పునరావృత్తి రహితము కొరకు స్మరిస్తాను. పరమాత్ముడిని, నారాయణుడిని, ఆది అంతము లేని వాడిని, భక్తసులభుడిని, షడ్వైశ్యర్యములను కలవాడిని ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. సర్వకాల సర్వావస్థల అందు నిష్ఠతో నిన్ను కొలిచిన వాడు సకల పాపముల నుండి విముక్తుడై అవ్యయానందము పొందగలడు. అన్ని కల్మషములను ధ్వంసము చేసే ఈ విష్ణు అను స్మృతిని ఎవడు యజ్ఞము చేసే సమయాన, దానము చేసే సమయాన ఎవడు స్మరిస్తాడో అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా తగిన ఫలమును శతాధికంగా పొందగలడు. ఈ అను స్మృతిని దేవతా పూజలలోనూ, పితృ కార్యములోనూ పరమ నిష్ఠతో చదువుతారో అతడికి పుణ్యలో కములు కలుగుతాయి. ఆ అనుస్మృతిని అమావాస్య, పౌర్ణమి దినాలలో స్మరించిన వాడికి సకల సంపదలు కలుగుతాయి. ఈ అనుస్మృతిని విన్న భగవంతుడిని స్మరించిన వాడికి అతడు అంటరాని వాడైనా హీనకులజుడైనా అతడికి ఉత్తమగతులు కలుగుతాయి. ఇక ఉన్నతజాతుల వారి సంగతి చెప్ప పని లేదు " అని విష్ణు మూర్తి నారదుడికి చెప్పాడు. ఇంకా విష్ణుమూర్తి నారదుడితో " ఓ మునీంద్రా ! మానవుడికి కర్మఫలములన్నీ అంతము అయిన తదుపరి మోక్షమును పొందగలడు. అన్ని దానముల కంటే జ్ఞానదానము గొప్పది. జ్ఞాని మరొకజ్ఞానికి బోధించిన అది భూదానము కంటే గొప్పది. కనుక నారదా నేను నీకు చెప్పిన జ్ఞానమును పుణ్యాత్ములకు, పరిశుద్ధ హృదయులకు బోధించు. నారదా ! వేయి అశ్వమేధ యాగల కంటే అధికఫలమూ నా అందు నిశ్చల భక్తి కలిగిన మానవులు పొందగలరు. " అని విష్ణు మూర్తి నారదుడికి చెప్పిన విషయాలను ధర్మనందనా ! నేను నీకు బోధించాను. నీవు కూడా నారదుడిలా ఆ పరమాత్మను నిశ్చలభక్తితో పూజించి కృతార్ధుడవు కమ్ము. కోరిన వరములను ప్రసాదించే ఈ అనుస్మృతి పఠించిన బుద్ధి పెరుగుతుంది. దుఃఖములు, బంధములు నశించి నిత్య శుభము కలుగుతుంది " అని భీష్ముడు చెప్పాడు. అది శ్రద్ధగా విని ధర్మరాజు భీష్ముడికి నమస్కరించాడు.

ముక్తిమార్గం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు మోక్ష మార్గము ఉపదేశించు " అని కోరాడు. భీష్ముడు " ధర్మనందనా ! వార్ణేయ అధ్యాత్మము అను కథ ఒకటి ఉన్నది. అందులో నీకు తగిన సమాధానము దొరుకుతుంది. పూర్వము వార్ణేయుడు అనే పేరుగల ఒక మాన్యుడైన మునీశ్వరుడు ఉండే వాడు. ఒక రోజు అతడిని అతడి శిష్యుడు నమస్కరించి " గురువర్యా ! మీరు నాకు మోక్షమార్గము ఉపదేశించండి " అని అడిగాడు. అందుకు వార్ణేయుడు " కుమారా ! నీకు భక్తి, జ్ఞానము సమృద్ధిగా ఉన్నాయి. నీవు మోక్షమార్గము ఉపదేశము పొందుటకు అర్హుడవు. కనుక సావధానముగా విను. ఈ కాలచక్రము నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆరంభము అయిందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆగి పోతుందో తెలియదు. ఈ కాలప్రవాహములో సృష్టి లయము జరుగుతుంటుంది. ప్రళయకాలములో సమస్తప్రకృతి లయమైనా పరమాత్మ మాత్రము మిగిలి ఉంటాడు. తిరిగి సృష్టి ప్రారంభమై తిరిగి జీవజాలసృష్టి జరుగుతుంది. పరమాత్మ నుండి ముని శ్రేష్టులు సకల శాస్త్రములు, సర్వవేదములు పొందుతారు. అలా పొందిన జ్ఞానులు దానిని విపులంగా అనేక శాస్త్రములుగా విడదీసి లోకులకు అందిస్తారు. ఈ పరిజ్ఞానము దేతలకైనా దుర్లభము. మునులకు సాధ్యము కూడా కానిది. పరమాత్రకు మాత్రమే అది అవగతము. సకల దుఃఖాలకు ఔషధమైన ఈ పరిజ్ఞానాన్ని పరమాత్మ కరుణించు లోకాలకు అందజేస్తాడు. క్రమక్రమముగా గురు శిష్యపరంపరగా ఆ జ్ఞానము లోకములో విస్తరించింది. ప్రకృతి పురుషుల సమ్మేళనంగా చైతన్యము ఉద్భవించింది. ఆ చైతన్యము నుండి బుద్ధి, బుద్ధి నుండి అహంకారము, అహంకారము చిత్తమును ఆశ్రయించి ఉంటుంది. అహంకారము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుండి జలము, జలము నుండి భూమి పుట్టాయి. బుద్ధిని మహత్వము అంటారు. మహత్వము నుండి ఐదు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఐదు, వీటితో శబ్ధ, స్పర్శ, రూపము, రుచి, గంధము అను అయిదు వాటితో మనస్సును చేర్చి పదహారు వికృతులు ఏర్పడినాయి. కుమారా ! శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన పుణ్యనగరం. ఈ నగరంలో ఊహకందని రీతిలో పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఆ పరమాత్మను పురుషుడు అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, అమలుడు. చెట్టునందు దాగి ఉన్న అగ్నిలా పురుషుడు జీవిలలో అవ్యక్తంగా ఉన్నాడు. ఎండిన చెట్లు రాచుకున్నప్పుడు చెట్టు నుండి నిప్పు పుట్టిన విధంగా జ్ఞానాగ్నిలో ధగ్ధుడైన మానవుడు యోగముతో మనస్సును మధించిన పరమాత్మను కనుగొనగలడు. ఈ పురుషుని ఉనికివలననే ప్రాణులు చూచుట, వాసన చూచుట, స్పర్శజ్ఞానము, రుచి తెలుసుకొనుట వంటివి తెలుసుకుంటాము. కుమారా ! ఈ భూతకోటి అవ్యక్తము నుండి వ్యక్తము ఔతాయి, జీవిస్తున్నాయి, నశిస్తున్నాయి. పుట్టడము, పెరగడము, నశించడము వీటికి పురుషుడు సాక్షీభూతుడు. ఈ కాలచక్రముకు అంచులు ఏడు. దానికి అవ్యక్తము కేంద్రము. ఆ చక్రము చుట్టూ పదహారు వలయాలు ఆవరించి ఉంటాయి. వాటి మీద పురుషుడు అధిష్టించి ఉంటాడు. మానవుడు త్రిగుణములకు లోబడి నడుచుకుంటాడు. విజ్ఞుడు వాటికి లోబడక వివేకంతో నడచుకుంటాడు. ఈ లోకములో వేదాంత విధులు అరుదుగా ఉంటారు. వారు ప్రవృత్తి లక్షణముతో ధర్మాచరణ చేస్తుంటారు. సాధారణ మానవులు సుఖములలో తేలుతుంటారు. అందువలన వారు పుణ్యాత్ములు కాలేరు. ప్రవృత్తి కార్యములు చేస్తూ ఉన్న దేహాభిమానము వదలని వారు కామ క్రోధమును విడువ లేరు. కనుక విజ్ఞులు దేహముపై అభిమానమును వదిలివేయాలి. అరణ్యము వంటి ఈ సంసారములో మానవుడు అత్యంత కుతూహలముతో తిరుగుతూ ఉంటాడు. ఎంత ప్రయాణించినా అవతలి ఒడ్డు చేరలేడు. శరీరానికి వచ్చిన రోగమును ఔషధ సేవనముతో నయము చేసుకున్నట్లు దేహాభిమానము పోవడానికి సత్యము, శౌచము, శమము, దమము పాటించాలి. పంచభూతములకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, ఈ భూమిని ఏలే అధిపతులకు అహంకారము నివాసస్థలము. స్మృతి, సంప్రీతి, ప్రసన్నత మొదలైనవి సత్వగుణము వలన జనిస్తాయి. రాగము, ద్వేషము, మోహము, లోభము రజోగుణ ఉత్పన్నములు. దర్పము, శోకము తామసగుణ ఉత్పన్నములు. జ్ఞానసముపార్జనకు ఈ మూడు గుణములు అవరోధములే అయినా మానవుడు ముందు రజో, తామస గుణములను విడిచి వేసి మనస్సును సత్వగుణ ప్రధానము చేయాలి. సత్వగుణము జ్ఞానసముపార్జనకు తోడ్పడుతుంది. మానవుడు అహంకారముతో చేసే పనులవలన మానవుడికి వెలుపలి ప్రపంచబంధము ఏర్పడుతుంది. అది పునర్జన్మకు కారణ మౌతుంది. స్త్రీగర్భములో రూపుదిద్దుకున్న పిండము నవమాసములు పొర్లుతూ బయట ప్రపంచానికి వచ్చి ఈ సంసారబంధాలలో చిక్కుకుని దు:ఖసాగరంలో మునిగి పోతున్నాడు. ఈ సంసార బంధానికి మూలము ఆశ తీగ. ఆ తీగ స్త్రీ అనే కొయ్యకు చుట్టుకుని పాకుతూ ఉంటుంది. ఆశ అనే తీగను ఆదిలోనే తుంచి మోక్షమును పొందాలి. జ్ఞానముకు అజ్ఞానముకు మూలము బుద్ధి. అందు నేను అనే భావమే జీవుడు. ఆ జీవుడు మనసుకు లోబడి కర్మబద్ధుడౌతాడు. మనసును రంజింపజేయడానికి ఇంద్రియములతో కర్మలు చేస్తుంటాడు. రాగద్వేషములను విడిచినగాని సంసారము నుండి విముక్తి కలుగదు.

ఉత్తముడు[మార్చు]

ఈ చరాచర జగత్తులో మానవుడు ఉత్తముడు, మానవులలో బ్రాహ్మణుడు ఉత్తముడు, బ్రాహ్మణులలో వేదాధ్యయనము చేసిన వారు ఉత్తములు, వారిలో జ్ఞానము కల వారు ఉత్తమోత్తములు. జ్ఞానము మానవుడికి కన్ను వంటిది. అజ్ఞాని గుడ్డి వాడితో సమానుడు. మానవునకు క్షమ, సత్యము, శౌచము ధర్మము. బ్రహ్మచర్యము ఉత్తమధర్మము. అందమైన యువతులతో సంభాషించడము, నిరీక్షించడము చేయకూడదు. అలా చేసిన స్త్రీ పురుషులు ఒకరి మనసులో ఒకరు తిష్ట వేస్తారు. ఈ శరీరము రక్తము, మాంసము, ఎముకల మయమని భావించిన ఆకర్షణ పోతుంది. ఇంద్రియ నిగ్రహము, నాడీశుద్ధి ముఖ్యము. దేహములో పది నాడులు, ఐదు జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటాయి. అన్ని నాడులకు కేంద్రమైన హృదయ స్థానమున దృష్టిని అంతరము లోకి పంపి మనసు నిలిపిన సుఖముల మీద నుండి మరలి పరబ్రహ్మ సాక్షాత్కారం పొందగలడు. ఇంద్రియ సుఖములు సంకల్ప జనితములు, మానవుడు మనసులో కూడా ఇంద్రియ లోలుడు కారాదు. మనసు కూడా ఇంద్రియమే దానికి అధిపతిఇంద్రుడు. యువకులైనా, ముసలివారైనా అజ్ఞాన చేత మూర్ఖులై ఇంద్రియవసులై వర్తిస్తారు. కనుక మానవుడు యమ, నియమాలతో ఇంద్రియములను నిగ్రహించాలి. విషయవాంఛలు బహుచెడ్డవి. వాటికి లోను అయిన మనషుడు మోక్షము పొందలేడు. వాటిన అధిగమించిన కాని పరమపదము చేర లేడు. చావు పుట్టుకల మధ్య రోగములు దుఃఖకారణాలు. వివేక వంతుడు జననమరణ చక్రములో బంధించ బడక మోక్షముకై ప్రయత్నిస్తాడు. వివేకి మనస్సును, వాక్కును, శరీరమును పరిశుభ్రపరచుకుని అహంకారమును వదిలి శాంతము వహించి రాగద్వేషములు వదిలి సాటి జీవులమీద కరుణ కలిగి ఉంటాడు. కపటసన్యాసులు ఇంద్రియనిగ్రహము, త్రికరణశుద్ధి నటిస్తూ ధనసంపాదనకు పాటు పడతాడు కనుక సాధకులు మోక్షగాములు వారిపట్ల జాగరూకత వహించాలి. మంచిబుద్ధి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము కలిగిన వారికి దేవతలు ప్రసన్నులౌతారు. దైవానుగ్రహము వలన మానవుడికి నిర్మలమైన యోగతంత్రములు అలవడతాయి. అప్పుడు మానవుడు నిశ్చల మనస్కుడై అన్నపానాదుల అందు అనాసక్తి కలిగి శారీరక సుఖములకు దూరముగా ఉండాలి . ఆకుకూరలు, కాయకూరలు, కందమూలములు, బిక్షాటనద్వారా లభించిన ఆహారమును సుఖమునందు అనాసక్తుడై ఈ లోకములో నిశ్చలమనస్కుడై మెలగాలి. సాధకుడు జ్ఞానాగ్నితో విజ్ఞానమును ప్రజ్వలింప చేసి జరామరణ దుఃఖము లేని ప్రబ్రహ్మతత్వము పొందగలడు. నిద్రావస్థలో త్రిగుణాత్మకమైన గుణమువలన స్వప్నములు కని తాను సంపాదించిన జ్ఞానము మరచిపోగలడు కనుక యోగి నిద్ర అందు జాగరూకుడై ఉండాలి. నిద్రావస్థలో కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. స్వప్నావస్తలో మనసు పనిచేసి అప్పటి వరకు అనుభవించిన విషయాలను స్వప్నములో కూడా అనుభవిస్తుంటాడు. స్వాప్నికావస్థలో మనసు మిధ్యాసుఖములను అనుభవిస్తుంది. ఆత్మమాత్రము సాక్షీభూతముగా ఉంటుంది. త్రిగుణాలవలన, వాయువుతో కూడిన దోషమువలన నిజరూపములో చూసిన వాటిని మానవుడు మిధ్యారూపములో అనుభవిస్తాడు. స్వప్నావస్థలో వెలుపలి ప్రపంచం ప్రకాశించక పోయినా ఆత్మ మాత్రము ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక స్వప్నావస్థలో మానవుడు అత్యంత తెలివిగా ఉంటాడు. జ్ఞాని త్రిగుణాలకు అతీతుడై నిశ్చల ఆనందం అనుభవిస్తాడు. మృత్యురూపమైనవ్యక్త, అమృతరూపమైన అవ్యక్తము తెలుసుకోకుండా సాధకుడు మోక్షము పొంద లేడు. అవ్యక్తము మూడు లోకాలకు ఆధారభూతము. అది నివృత్తి మార్గము శాస్త్రప్రమాణము. ఈ ప్రకృతి ధర్మము భూత, భవ్యష్యత్తు, వర్తమాన కాలము బ్రహ్మచేత సృష్టించబడ్డాయని ఆగమ శాస్త్రము చెప్తుంది. దేహములో నివసించే వాడు దేహి త్రిగుణాలు అతడు కట్టుకునే వస్త్రము. ఆ వస్త్రముల చేత కప్పిఉన్న పరమాత్మ ఎవరికి గోచరము కాడు. త్రిగుణాతీతముగా ప్రకాశించే నాల్గవ తత్వమే పరమాత్మ అని వేదములు ఘోషిస్తున్నాయి. మనోవాక్కాయ కర్మలతో ఏకత్వము సాధిస్తూ అత్యంత శౌచముతో నిష్ఠతో తపమాచరించిన సాధకుడికి మోక్షము ప్రాప్తిస్తుంది. అన్ని తపస్సులలో ఉత్తమమైనది బ్రహ్మచర్యము, అహింసా వ్రతము. ఇవి రెండు పరమధర్మములు. వీటిని ఆచరించిన సాధకుడు నిర్మలజ్ఞానంతో వెలుగొందగలడు. ఈ సంసారము ఆశాపాశములతో దృఢంగా బంధింపబడి ఉంది. దృఢంగా పెరిగిన ఆశాలతను తపస్సు అనే కత్తితో నరకాలి. అప్పుడే మానవుడు జ్ఞాని కాగలడు " అని ముని తన శిష్యునకు బోధించాడు. ధర్మరాజా ! నీవు కూడా ఆ ముని పలుకలలోని సత్యమును గ్రహించి కృతార్ధుడివి కమ్ము " అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.

జనకుడు[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! మిధిలా నగరాధీశుడు జనకమహారాజు ఏవిధంగా మోక్షము పొందాడో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! భీష్ముడి వద్ద నూరుమంది ఆచార్యులు ఉన్నారు. జనకమహారాజు సతతము వారు చేసే తత్వ బోధలను శ్రద్ధతో ఆలకించే వాడు. ఆ సమయంలో కపిల అనే స్త్రీకి జనించిన పంచశిఖుడు అనే ముని భూలోకసంచారము చేస్తూ మిధిలా నగరానికి వచ్చాడు. అతడు జనకుడి నూరుమంది ఆచార్యులను తన అతీత తత్వశాస్త్రములో ఓడించాడు. అతడి ప్రతిభకు అచ్చెరువందిన జనకమహారాజు తనకు మోక్షమార్గమును బోధించమని అతడిని కోరాడు. పంచశిఖుడు " మహారాజా ! అజ్ఞానము కోరికలకు మూలము. కోరికలు కర్మలకు మూలము. అవిద్య అనే భూమిలో మోహము, లోభము పెనవేసుకుని అవిద్యా భూమిలో కర్మబీజాలను నాటి అంకురింప చేస్తాయి. ఇది నాకు ఇష్టము ఇది నాకు అయిష్టము అనే భావములు మానవుడి మనసులో చిక్కు బడి అనేక విధములైన కర్మలు చేయడానికి అతడిని పురికొల్పుతాయి. కర్మ బంధములలో చిక్కుకున్న మానవుడు తనను జరా మరణములు కబళిస్తున్న విషయము గమనించ లేడు. మానవుడు బంధువులు, భోగములు, ధనము అస్థిరమైనవని తెలుసుకుని వాటిని దూరము చేసిన మనసుకు శాంతి కలిగి తుదకు మోక్షము కలుగుతుంది " అన్నాడు పంచశిఖుడు. జనకుడు " మహానుభావా ! కేవలము వైరాగ్యము వలనే మోక్షము ప్రాప్తిస్తుందని అన్నారు కదా ! విషయవాంఛల మీద విరక్తుడైన మానవుడికి మోక్షము లభిస్తుందా ! " అని అడిగాడు. పంచశిఖుడు " మహారాజా ! సత్వగుణము అలవరచుకున్న వాడికి సంతోషము, ఇష్టము, సుఖము, ఆనందము, శాంతికలుగుతాయి. రజోగుణ ప్రభావితుడకు ఎల్లప్పుడూ దుఃఖం, కలత, ఏడుస్తుండడమూ, అసహనము, అసంతృప్తి, దేనికో వెంపర్లాడడము అలవడతాయి. తామసగుణ ప్రభావితుడికి విపరీతమైన ఉద్వేగభరితమైన ఆలోచనలు, కలలలో షరించడమూ సోమరితనము, భ్రమలో విహరించడము, ఏమరిపాటు, అన్నిటికీ విజృంభించడమూ, ఉద్రేకపడడము, అలసత్వము, ఆలస్యము అనే గుణాలు అలవడతాయి. త్రిగుణాలు కారణ సహితముగానూ ఒక్కొక్క తరి అకారణముగానూ ఏర్పడి ఒక్కొక్క తరి మానవుడి మీద తిరగబడతాయి. మానవుడు ప్రశాంతముగా ఉన్నప్పుడు అది సాత్వికస్వభామని దుఃఖభరితుడై ఉన్న సమయాన రాజసగుణమని ఏమి చేయాలని లేక స్థబ్ధుగా ఉన్న అది తామసగుణమని ఎరిగి వాటికి దూరముగా ఉండి మనసును నిర్మలము చేసిన మానవుడు మోక్షమును పొందగలడు. మనసును ఆ స్థితిలోకి వైరాగ్యము మాత్రమే తీసుకురాగలదు. త్రిగుణాలను ఆత్మలో లీనముచేసి మనసును తన్మయపరచిన త్రిగుణాలు సముద్రములో కలిసిన నదిలా తమ రూపమును కోల్పోతాయి. త్రిగుణ రాహిత్యముతో మానవుడు కుబుసము విడిచిన పాములా ఆత్మప్రకాశముతో వెలుగొందగలడు " అని వివరించాడు పంచముఖుడు. అలా పంచశిఖుని బోధల వలన వైరాగ్యము చెందిన జనకుడు ఒక సారి మిధిలా నగరం తగులబడి పోతున్నా ధుఃఖించక వైరాగ్యంతో నిశ్చలంగా ఉన్నాడు.

చతుర్వర్ణాలు[మార్చు]

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! ఎట్టివాడు నిర్భయంగా మంగళకరంగా ఉంటాడో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చతుర్వర్ణాల వారికి శాంతి, ఇంద్రియనిగ్రహము అవసరము. అందునా ! బ్రాహ్మణుడికి ఇంద్రియనిగ్రహము అత్యావశ్యము. శుచిత్వము, కోపము లేకుండా ప్రవర్తించుట, అసూయపడకుండుట, దుఃఖము దైన్యములేక ఉండుట, దురభిమానము, ప్రమాదరహితుడై ఉండుట, వితండవాదము లేకుండుట, సకలప్రాణుల అందు దయకలిగి ఉండుట, గురువులను పూజించుట, తననుతాను పొగడకుండా ఉండడము, ఇతరులను నిందించ ఉండుట, సత్యము మాత్రమే పలుకుట, సత్సంగము, అహింస, నిరాశనిస్పృహలకు లోను కాకుండా ఉండడము, మంచిభావనలు, ఇంద్రియ నిగ్రహము వీటిని దమములు అంటారు. పై గుణములు సాధించిన పుణ్యమూర్తికి ఇహలోకములోనే కాదు పరలోకసుఖములు కలుగుతాయి " అని భీష్ముడు చెప్పాడు.

వ్రత విధానములు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కొంత మంది యజ్ఞాలు చేసే సమయంలో వ్రతము మధ్యలో భోజనం చేసిన వ్రతభంగము కాదా ? " అని అడిగాడు. భీష్ముడు " కుమారా ! బ్రాహ్మణుడి కోరిక ప్రకారము చేయు భోజనము వేదోక్త ప్రకారము చేయు భోజనం వలన వ్రత భంగము కాదు. కాని ఎల్ల వేళలా ఉపవసించడం, సదా బ్రహ్మచర్యము పాటించడము, మాంసభక్షణ చేయక పోవడము, దేవతలను పూజించి తృప్తి పరచిన తరువాత భుజించిన, అమృతసమానమైన భోజనం చేసిన, కలత నిద్ర లేకుండా ఉండుట మంచి లక్షనములు. వాటి స్వరూపము వివరిస్తాను. రోజుకు రెండు మార్లు మాత్రమే భుజించి మధ్యలో ఏమీ తనక ఉన్న వాడు సదా ఉపవాసి. సంతానార్ధమై రుతుకాలంలో మాత్రమే భార్యతో కూడిన వాడు సదా బ్రహ్మచారి. మాంసాహారమైనా పితరులకు, దేవతలకు అతిథులకు పెట్టి భుజించే వాడు మాంసాహారి కాడు. సహపంక్తి భోజనము చేసే వాడు దేవతలను, పితృదేవతలను, అతిథులను తృప్తి పరచిన తరువాత భుజించిన వాడితో సమానము. సేవకులకు పెట్టిన తరువాత భుజించే వాడు తినే అన్నము అమృతముతో సమానము. పగలు నిద్ర పోని వాడు కలత నిద్ర పోని వాడితో సమానము " అని భీష్ముడు చెప్పాడు.

కర్మసిద్ధాంతం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నరుడు చేసే కర్మలకు అతడి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి సుఖదుఃఖములు, శుభాసుభములు ఉంటాయి కదా ఆ కర్మల కర్త అతడేనా ! కాదా ! అని నాకు అనుమానంగా ఉంది దానిని వివరించండి " అని అడిగాడు. భీష్ముడు ! ధర్మనందనా ! ఒక సారి ఇంద్రుడు ప్రహ్లాదుడి మధ్య జరిగిన సంవాదము వింటే నీ సందేహము తీరుతుంది. సత్వగుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ సంయమనం పాటించే వాడు, అహంకారము లేని వాడు, కోపమంటే తెలియనివాడు, నిందను స్తుతిని సమానంగా పరిగణించేవాడు, ఇనుమును బంగారమును సమానంగా విలువ కట్టేవాడు అయిన ప్రహ్లాదుడు తన మందిరములో కూర్చుని ఉండగా ఇంద్రుడు అతడి అంతరంగం తెలుసుకోవాలని అక్కడకు వచ్చి " ప్రహ్లాదా ! నీవు సంపద లేకున్నా దుఃఖించవు, శత్రువుల చేతికి చిక్కుతానన్న భయము లేదు, అసలు ఏమీ చేయవు ఇంతటి బేలగా ఉంటే ఎలా ? " అని అడిగాడు. ప్రహ్లాదుడు " ఇంద్రా ! కలిమి లేమి పక్క పక్కనే ఉంటాయి. సంపదలు ప్రయత్నిస్తే వస్తాయి లేకున్న రావు అనుకోవడము నీ బేలతనమే ! సంపదలు సంపాదించనవసరం లేదు విధి అనుకూలిస్తే వచ్చి పడతాయి ప్రతికూలించిన హారతికర్పూరంలా కరిగి పోతాయి. దీనికి మానవ ప్రయత్నముతో పని లేదు. శత్రువులు ఓడించడం, మిత్రులు కాపాడడము, సంపదల రాకపోక అంతా విధిలిఖితమే. మానవుడి మనసును అనుసరించి భావాలుపుడతాయి, పోతాయి. చంచలమైన మనసులోని భావాలు చంచలమైనవే అని తెలుసుకుని మనసుని నిగ్రహించాలి. తన పనులన్నిటికీ తానేకర్తను అనుకోవడము అవివేకము. అలా అయితే మానవులు చేసే కర్మలన్నిటికీ సమ ఫలితాలు ఉండాలి కదా ! అఖిలకర్మలకు కర్త ఆ పరమేశ్వరుడే కాని మానవుడు కాదు. తాను చేసే కర్మలకు తానేకర్తను అన్న అహంకారంతో కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటుకుటుంది. ఫలాపేక్ష లేక కర్మలను చేస్తూ సుఖదుఃఖాలకు లోను కాక మనసు నిలకడగా ఉంచుకున్న వాడు మహనీయుడు. కనుక దేవేంద్రా ! నేను ఈ లోకములో ఉన్న సకల ప్రాణులకూ అనిత్యములే అని అసత్యములని తెలుసుకుని సంసార బంధములో చిక్కక సంతోషముతో ఉంటాను. శాంతితోను ఇంద్రియనిగ్రహముతో ఉండే వాడికి చింతలు దరిచేరవు. నేను అలా నిశ్చింతగా జీవిస్తున్నాను " అని ప్రహ్లాదుడు అన్నాడు. ఇంద్రుడు " దానవేంద్రా ! నీకు ఇంతటి ప్రశాంతచిత్తము ఎలా అలవడింది చెప్పవా ! " అని అడిగాడు. ప్రహ్లాదుడు " దేవేంద్రా ! ఆత్మావలోకనము, మంచిప్రవర్తన, మనసును ప్రసన్నంగా ఉంచుకోవడము, అప్రమత్తత, పెద్దలను వృద్ధులను గౌరవించుట లాంటి ఉత్తమ లక్షణాలు మానవులకు మేలుచేసి మానవుడికి ప్రజ్ఞా శాంతి ఇస్తాయి. ఇది విన్న ఇంద్రుడు ఆశ్చర్యముతో తిరిగి స్వర్గానికి వెళ్ళాడు " అని చెప్పాడు.

సిరి సంపదలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజు తన సిరిసంపదలు ఎలా పోగొట్టుకుంటాడో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇంద్రుడికి బలికి మధ్య జరిన సంవాదము చెపితే ఈ విషయము నీకు అవగతము ఔతుంది " అన్నాడు. ఒక సారి ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి " బ్రహ్మదేవా ! ఒకప్పుడు బలి సిరిసంపదలతో తుల తూగాడు కదా ! ఆ బలి చక్రవర్తి ఇప్పుడేమి చేస్తున్నాడు ? " అని అడిగాడు. బ్రహ్మదేవుడు " మహేంద్రా ! నీ దుష్టతలపు నాకు తెలిసినా నీవు అడిగావు కనుక చెప్తాను విను. ఒంటె, గాడిద, ఆవు, గుర్రము వీటిలో ఏదో ఒకదానిలో ఉంటాడు. అతడిని చంపడము ఉచితము కాదు. అతడిని చంపనని నాకు మాట ఇచ్చి అసత్యదోషము కలగ కుండా చేసుకో " అన్నాడు. ఇంద్రుడు " అలాగే మాట ఇస్తాను అతడిని చంపనుకాని అతడితో మాట్లాడుతాను " అని స్వర్గానికివెళ్ళాడు. తరువాత అతడు గాలించి బలిని పట్టుకుని " బలీ ! ఆనాడు అనేక గజములు నీ వెంట రాగా భద్రగజము మీద ఊరేగిన నీవు ఇప్పుడిలా గాడిద రూపంలో ఊరేగుతున్నావా ! " అని హేణన చేసి " ఓ బలీ " నాడు బంగారపు ఊపస్థంభాను నిర్మించి యాగము చేసిన నిన్నిలాచూస్తే జాలి వేస్తుంది. ఇప్పుడు నీవు గడ్డి, పొట్టు తింటూ నీ పూర్వపు వైభవము తలచుకుని దుఃఖిస్తున్నావు కదా ! ఉన్న మాటచెప్పు " అని హేళన చేసాడు. బలి " మహేంద్రా ! నీకు నా వైభము కనిపించదులే వాటినిప్పుడు ఒక కొండగుహలో దాచాను. నాకు తోచినప్పుడు వెళ్ళి అనుభవించి వస్తుంటాను. నీవిప్పుడు పెద్దవాడివి కదా మాబోటి పిన్నలసంగతి నీకెందుకు చెప్పు " అన్నాడు. ఇంద్రుడు " అది కాదు బలీ ! అఖిల భూతకోటి సూర్యరశ్మికి కరిగి పోయే మంచులా ఇలా కనపడి అలా వెళ్ళి పోతుంటారు కదా ! చావు పుట్టకలంటే అంతే కదా ! నీ లాంటి బుద్ధిమంతులు వాటికి అతీతులు కదా ! " అన్నాడు. బలి " మహేంద్రా ! వస్తూ పోతూ ఉండే జననమరణాలకు, సుఖదుఃఖాలకు, లాభనష్టాలకు నేను అతీతంగా ఉంటాను. ఇంద్రా ! బుద్ధిమంతులను, బుద్ధిహీనులను, ధనవంతులను, పేదవారిని తారతమ్యము లేకుండా యమధర్మరాజు ప్రాణములు సంహరిస్తుంటాడన్న విషయం తెలిసినవాడు సుఖదుఃఖాలకు తావివ్వక వాటికి అతీతంగా ఉంటాడు. దేవేంద్రా ! నేను ఈ గాడిదరూపంలో పొట్టు, గడ్డి తిన్నా నా మనసు ప్రశాంతిగా ఉంది కనుక నీవెంత హేళనచేసినా నాకు కోపమురాదు. నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి. కనుక నేనెవరో తెలుసుకుని ప్రవర్తించడము మంచిది. వికసించుట వాడిపోవుట విధికృతం. నీలాంటి పెద్దవాడు ఇలా అహంకరించి మాట్ళాడడము నీచమైనది. అలా తుళ్ళిపడడము మాని ఎక్కడకు పోతావోపో. నాకు కోపం వస్తే నీవెంత నీ వజ్రాయుధము ఎంత తుళ్ళిపడకు అని కోపంతో చెప్పి అంతలో తమాయించుకుని నా మనసులో కోపము అహంకారము లేవు కేవలము పరిహాసానికి అన్నాను. విధాత ముందు మనమేపాటి. పోయి శాంతచిత్తుడవై జీవించు " అన్నాడు. ఈ సమయంలో బలిశరీరం నుండి ఒక అందమైన వనిత వెలుపలకు పోతూ ఉంది. ఇంద్రుడు " బలీ ఈమె ఎవరు ? " అని అడిగాడు. బలి " ఆమెను అడిగి తెలుసుకో " అన్నాడు బలి. మహేంద్రుడు " అమ్మా ! నీవు ఎవరు ? " అని అడిగాడు. ఆ స్త్రీ " ఇంద్రా ! నా పేరు లక్ష్మీ , శ్రీ అంటారు. మీ ఇరువురికి నేను ఎవరో తెలియక పోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందు కంటే ముల్లోకాలలో ఇంత వరకు ఎవరు నన్ను గురించి తెలుసుకొన లేదు " అన్నది. ఇంద్రుడు " అది సరే ఇప్పుడు ఈ రాక్షసచక్రవర్తి నుండి ఎందుకు తొలగి పోతున్నావు " అని అడిగాడు. లక్ష్మి " ఇంద్రా ! సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము నా నివాస స్థానములు. పై లక్షణములు ఉన్న పరాక్రమవంతుడైన పురుషుడి వద్ద నేను ఉంటాను. బలిచక్రవర్తి వద్ద ఇప్పటి వరకు అవి అన్నీఉన్నాయి కనుక నేను అతడి అందు ఉన్నాను. కాలక్రమేణా అతడిలో అవినీతి, బ్రాహ్మణులపట్ల అసూయ పెరిగాయి. మంచి లక్షణములను వదిలిన బలిని ఇప్పుడు నేను వదిలివేస్తున్నాను. నీ వద్ద నేను పైన చెప్పిన గుణములే కాక వేదములు, శాస్త్రములు చెప్పిన ఆచారములు, నీ వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకుని నీ వద్ద ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను. కాని నువ్వు బలి మాదిరి కాకుండా ఏమరుపాటు లేకుండా సచ్చరిత్రుడవై ఉండాలి " అన్నది లక్ష్మి. తనను లక్ష్మి వదిలివెళ్ళిన తరువాత బలి " మహేంద్రా ! సూర్యుడు పశ్చిమాన అంతరించినంత మాత్రాన తన తేజస్సు కోల్పోడు తిరిగి తూర్పున ఉదయించక మానడు. అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన నా పరాక్రమము కోల్పోలేదు. నేతిరిగి వచ్చి దేవాసుర యుద్ధములో నిన్ను గెలుస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అప్పుడు చూడవచ్చు ప్రస్తుతము నీతో వ్యర్ధ ప్రసంగం చేసే సమయం లేదు. బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారము నిన్ను చంపక వదిలి వెళుతున్నాను " అని చెప్పి అక్కడ నుండి వెళ్ళాడు. బలి కూడా అక్కడ నుండి దక్షిణం దిక్కుగా వెళ్ళాడు.

నముచి[మార్చు]

భీష్ముడు " ధర్మనందనా ! నముచిని గురించి వినిపిస్తాను. పూర్వము నముచి అనే రాక్షసుడు ఉండే వాడు. అతడికి ఉన్నసంపద అంతా పోయింది. అయినా అతడు చింతపడక ఏకాంతస్థలంలో సంతోషంగా ఉన్నాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చి " దానవరాజా ! ఉన్న సంపద పోగొట్టుకుని ఆదరించే వాళ్ళులేక పేదరికంలో మగ్గుతున్నందుకు ఎంత చింతిస్తున్నావో కదా ! " అని అన్నాడు. నముచి " దేవేంద్రా ! పోయిన సంపదకొరకు చింత ఎందుకు చింతపడితే పోగొట్టుకున్నది వస్తుందా విచారించడము నిరర్ధకము కాదా ! అలారాక పోగాచింత, దుఃఖము మిగులుతాయి. ఇదంతా తెలుసు కనుక నేను పోయిన వాటి కొరకు దుఃఖించడం లేదు. దేవేంద్రా ! ముల్లోకాలనూ శాసించే వాడు ఒకడు ఉన్నాడు. నీరు పల్లముకు పారినట్లు మనము కోరుకున్నవన్నీ మన వద్దకు వస్తాయి. అయినా ఇది నాకు జరగవలసినది అందుకే ఇలా జరిగింది అనుకుంటే దిగులు, చింత, సంతోషము ఆనందము ఎందుకు వస్తాయి " అన్నాడు. మనకు ప్రాప్తము లేని దానిని మనము మన పరాక్రమముతోనూ , ధైర్యముతోనూ, వీరత్వముతోనూ, ప్రజ్ఞతోనూ, శౌర్యముతోనూ సాధించ లేము. ఈ విషయము తెలుసుకున్న బుద్ధిమంతుడు ఈ విషయం ఎరిగి లేని దానికొరకు చింతించడు. దేవేంద్రా ! మేలు కీడు అనేవి మనము కోరుకుంటే రావు వద్దంటే పోవు. కనుక వాటి కొరకు ఆరాటపడడం తగదు " అన్నాడు.

ధైర్యము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మానవుడికి దుర్దశ కలిగినప్పుడు ఎలా ఉంటాడు దానిని ఎలా ఎదుర్కొంటాడో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని రకముల దుర్దశలకు ధైర్యమేమందు. ధైర్యంతో మాత్రమే మనసు గట్టిపడుతుంది. మానవుడు దృఢనిశ్చయంతో ఆ దుర్దశనుండి బయట పడతాడు. ఒకసారి ఇంద్రుడు బలితో చేసిన సంవాదము గురించి చెప్తాను. దేవాసురయుద్ధంలో దేవతలకు మహావిష్ణువు అండదండలతో విజయం లభించింది. అప్పుడు దేవేంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారు పర్యవేష్టించి ఉండగా ఐరావతం ఎక్కి మూడు లోకములలో పర్యటిస్తున్నాడు. అలా విహరిస్తూ ఒక కొండగుహలో దాగి ఉన్న బలిని చూసాడు. అత్యంత వైభవంతో వెలిగి పోతున్న దేవేంద్రుడిని చూసినా బలి చలించక నిబ్బరంగా ధైర్యంగా ఉన్న బలిని చూసి " బలీ ! ఉన్న వైభవమంతా పోగొట్టుకుని దీనావస్థలో ఉన్నా శత్రువునైన నా వైభవము చూసి కూడా చలించక ఉన్నావు. నీకు ఈ నిర్వికారము ఎలా కలిగింది. నీ శౌర్యము వలనా ! పెద్దలకు సేవ చేసిన ఫలమా ! లేక నీవు చేసిన తపో మహిమా నాకు తెలియకున్నది. దేవేంద్రుడినైన నన్ను కూడా లక్ష్యపెట్టక ఉండుటకు కలకారణం ఏమి ? " అన్నాడు. బలి " నేను నిన్ను లక్ష్యపెట్ట లేదని అడుగుతున్నావు. లక్ష్యపెట్టడం వలన ప్రయోజనమేమి ? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న వైభవము ఒక వైభవమా ! దైవవశమున ఇలాంటి దుస్థితి ఎవరికైనా రావచ్చు. దేవేంద్రా ! నేను నిన్ను ఒక సారి ఓడించి నిన్ను హీనావస్థకు తెచ్చాను. కాని అది నేను చేసినది కాదు. విధి విలాసము. అలాగే ఇప్పుడు నేను అనుభ విస్తున్నది విధికృతమే కాని నీ వలన జరిగినది కాదు. వీటిని భరించడానికి ధైర్యమే ముఖ్యము. దానంతట అవే వస్తూపోయే సుఖదుఃఖాలకు సుఖము వచ్చినప్పుడు అంతా నా వలనే సంభవించిందని దుఃఖము కలిగినప్పుడు విలపించడము మంచిది కాదని విజ్ఞులు చెప్ప లేదా ! స్నేహితులు, బంధువులు, ఐశ్వర్యము, కీర్తిప్రతిష్ఠలు ఎన్ని ఉన్నా మానవుడికి కలిగే దుర్దశను నివారించ లేరు. అది ఎరిగిన కాలవశమున ఐశ్వర్యము, దారిద్యమూ వస్తూ పోతుంటాయని అర్ధము ఔతుంది. ఒకప్పుడు నా కాలం కలిసి వచ్చింది నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నీ కాలం కలిసి వచ్చి నీవు నన్ను ఓడించావు. కనుక శుభాశుభములకు కాలమేకర్త అని తెలియ లేదా దేవేంద్రా ! నీకూనాకూ మధ్య ఉన్న శత్రుత్వమూ కాలవశాన వచ్చినదే ! ప్రస్తుతము నాకాలము బాగా లేదు కనుక నేను ఇప్పుడు నిన్ను ఎదిరించలేను. నీ మీద కోపమూ రాలేదు. నాకు లీలా మాత్రంగా కోపము వచ్చినా చాలు నిన్ను నీగర్వాన్ని ఎడమ చేతితో కాల్చగలను. నీకు విజయగర్వము తలకెక్కింది కనుక కిందా మీదా తెలియక ప్రవర్తిస్తున్నావు. నీవు ప్రాభవము చెందే కాలము సమీపంలోనే ఉంది. ప్రస్తుతము నీవు ఇంద్రుడివి నీకు ముందు ఎందరో ఇంద్రులు రాలేదా పోలేదా ! ఇంద్రులే కాదు బ్రహ్మలు కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఇంద్రులు బ్రహ్మలు వస్తూ పోతున్నప్పుడు ఒక దానవుడు ఓటమి చెందిన ఆశ్చర్యము ఏముంది. దీనికి నీవు నిందించపని లేదు. జ్ఞయాగములు, వ్రతములు, పూజలు చెయ్యడం, మంచి నడవడి కలిగి ఉండడము పతనముకావడమూ కాల మహిమే " అన్నాడు బలి. ఇంద్రుడు కొంత తొట్రుపడి దానిని దాచుకుని " ఇంత హీన స్థితిలో కూడా నీ ధైర్యము, వివేకము, వినయము తగ్గలేదు. ఇందుకు కారణమైన నిష్ఠ ఏమిటో చెప్పవా " అని అడిగాడు. బలి " దేవేంద్రా ఎంత వెర్రి వాడివయ్యా ! నేను ధైర్యము, వినయము, వివేకము, శాంతి నేను ఎక్కడి నుండి తీసుకు రాలేదు అవి నాలో స్వతఃసిద్ధంగా ఏర్పడ్డాయి. మానవులకు కలిగే మహాదశలు దుర్దశలు కాలవశాన వచ్చేవే. ఈ కాలము నదీ ప్రవాహము వంటిది. నది కొంచెం కొంచెంగా కొండనుకూడా ఎలా కోస్తూ తుదకు నామ రూపాలు లేకుండా ఎలా చేస్తుందో అలాగే కాలం మనిషిలోని లోభ, క్రోధ, కామములను పడవేసి క్రమక్రమముగా సమూలంగా నాశనం చేస్తుంది. అజ్ఞాని దీనిని తెలుసుకొన జాలక ఇప్పటి వరకు బాగా ఉన్నవాడికి ఇంతటి దుర్దశ ఎలా దాపురించింది అని ఆశ్చర్యపడతాడే కాని ఎప్పుడో తనకూ దుర్దశ ప్రాప్తిస్తుందని తెలుసుకోలేడు. దేవేంద్రా భావమూ లేక అత్యుత్తమ తపసు చేసే వాడికి కాలగతిలోకలిగే మార్పులు కరతలామలకంగా శోభిస్తాయి. అలా కాలగతిని సాక్షిగా చూస్తున్నప్పుడు మనసుకు శాంతిలభిస్తుంది. తాను ఆత్మే కాని శరీరముకాదు. కాలగతిలో కలిగే కష్టసుఖాలు శరీరానికేగాని ఆత్మకు కాదు అన్న విజ్ఞానము కలుగుతుంది " అని బలి పలికాడు. బలికి కలిగిన మానసిక పరిపక్వానికి అచ్చెరువందిన ఇంద్రుడు " రాక్షసరాజా ! ఈ ప్రకారంగా కాలగతిని తెలుసుకుని పవిత్రమైన శీలంతో వెలుగొందుతున్నావు. నీ శీలము ఈ లోకంలో ఎందరికో ఆదర్శం. ఈ లోకమంతా నీ అరచేతిలో దర్శిస్తూ త్రిగుణాతీతుడవై నిర్గుణుడవై వెలుగుతూ ఆత్మావలోకనము చేసుకున్నావు. నీకు నువ్వే శాటి. అతి త్వరలో నీకు కలిగిన దుర్దశతొలగి నీకు మేలుకలిగి సకల సుఖములు పొందగలవు " అని పలికి అక్కడ నుడి వెళ్ళాడు. అమృతోపమాయమైన బలి పలుకులు దేవేంద్రుడికి అమృతం కంటే రుచిగా అనిపించి ఆనందింప చేసాయి " అని భీష్ముడు చెప్పాడు.

బయటి లింకులు[మార్చు]