Jump to content

శృంగార వల్లభ స్వామి దేవాలయం

Coordinates: 17°04′59″N 82°05′10″E / 17.08306°N 82.08611°E / 17.08306; 82.08611
వికీపీడియా నుండి
శృంగార వల్లభ స్వామి దేవాలయం
శృంగార వల్లభ స్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
శృంగార వల్లభ స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ పటంలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°04′59″N 82°05′10″E / 17.08306°N 82.08611°E / 17.08306; 82.08611
దేశంIndia
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
ప్రదేశంపెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామం
సంస్కృతి
దైవంశృంగార వల్లభ స్వామి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ
చరిత్ర, నిర్వహణ
స్థాపితం12 వ శతాబ్దికి ముందు
దేవస్థాన కమిటీశ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం

శృంగార వల్లభ స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ జిల్లా, తిరుపతి గ్రామంలో ఉన్న ఒక చారిత్రిక దేవాలయం. ఇది శృంగార వల్లభ స్వామి అనే పేరున్న వేంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చారిత్రక, నిర్మాణ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది.[1] చదలాడ గ్రామానికి సమీపంలో ఉండటం వలన ఈ గ్రామానికి చదలాడ తిరుపతి అనే పేరు వచ్చింది.[2]

ప్రధాన దేవత, శృంగార వల్లభ స్వామి విగ్రహం, నవ్వుతున్న భంగిమలో ఉంటుంది. "శృంగార" అనే పేరును "అంద మైన" అనే అర్థంలో వాడారు. భక్తుడి ఎత్తుకు తగ్గట్టుగా దేవుడి ఎత్తు కూడా కనిపిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.[1] [2] ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి ల విగ్రహాలు కూడా ఉన్నాయి. సంక్లిష్టమైన శాసనాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వరుడి సాంప్రదాయిక విగ్రహాల్లో ఉండే మాదిరిగా కాకుండా, ఇక్కడి విగ్రహంలో శంఖం, చక్రాలు తారుమారయ్యాయి.[1] [2]

ఇది శ్రీమహావిష్ణువు మొదటిసారిగా శృంగార వల్లభ స్వామి రూపంలో కనిపించిన ప్రదేశం ఇదే అనీ, తిరుమలలోని వెంకటేశ్వర ఆలయాని కంటే ముందే ఉందనీ[3] నమ్ముతారు. అందుకే ఈ గ్రామాన్ని తొలి తిరుపతి అని కూడా అంటారు. దాన్నుండే ఈ పేరు వచ్చింది.[1] ఆలయ శాసనాల ఆధారంగా ఈ ఆలయం 12వ శతాబ్దానికి ముందే నిర్మించారని భావిస్తున్నారు. ఇది భారత పురావస్తు సర్వే (ASI) వారి రక్షిత ప్రదేశం.[4] స్థానిక నమ్మకాల ప్రకారం ఈ ఆలయం 9,000 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది.[1]

ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారు. శనివారాల్లో 20,000 మంది సందర్శకులు, మామూలు రోజులలో 3,000 మంది వస్తారని అంచనా.[1]

స్థానం

[మార్చు]

ఈ ఆలయం సామర్లకోట రైల్వే స్టేషను నుండి దాదాపు 15 కి.మీ., కాకినాడ నుండి 31 కి.మీ. దూరంలో ఉంది. కిర్లంపూడి-ప్రత్తిపాడు రహదారి ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.[3] ఇది తిరుపతి గ్రామానికి ఉత్తరాన ఉంది. తూర్పున దివిలి, పశ్చిమాన జగ్గంపేట, ఉత్తరాన కిర్లంపూడి, దక్షిణాన పెద్దాపురం సరిహద్దులుగా ఉన్నాయి. గ్రామానికి దక్షిణంగా ఏలేరు కాలువ ప్రవహిస్తుంది, అయితే ఆలయం ప్రధాన రహదారికి పశ్చిమాన ఉంది. ఆలయ సముదాయం 75 సెంట్ల విస్తీర్ణంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

శృంగార వల్లభరాయ స్వామి ఆలయం 12వ శతాబ్దానికి ముందే నిర్మించబడింది. చారిత్రక రికార్డులు, ముఖ్యంగా ఆలయంలో లభించే శాసనాలు, స్థానిక పాలకులు ఆలయానికి ఇచ్చిన వివిధ భూదానాలను వివరిస్తాయి. ఈ శాసనాలు ఆ కాలంలోని సామాజిక-రాజకీయ, మతపరమైన పద్ధతులను ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడు ప్రోలునాడు ప్రాంతంలో భాగమైన ఈ ప్రాంతాన్ని గుప్తులు, శాతవాహనులు, తూర్పు చాళుక్యులు పల్లి పల్లవులు, కాకతీయులు, రెడ్డి పాలకులు వంటి వివిధ రాజవంశాలు పరిపాలించాయి.[4]

7వ శతాబ్దం నుండి పాలించిన తూర్పు చాళుక్యులు ఆలయ నిర్మాణం, సాంస్కృతిక అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేశారు. కుబ్జ విష్ణువర్ధనుడు వంటి ప్రముఖ పాలకులు ఈ ప్రాంతంలో అనేక దేవాలయాల స్థాపనకు దోహదపడ్డాడు. చాళుక్య-చోళులు, పల్లవులు, గజపతులు, పెద్దాపురం చాళుక్య అగ్నికుల స్థానిక జమీందార్లు వంటి తరువాతి పాలకుల హయాంలో కూడా ఈ విరాళాలు కొనసాగాయి.[4]

1956 లో, ఆలయాన్ని సంరక్షించేందుకూ, మతపరమైన ప్రాముఖ్యతను కొనసాగించేందుకూ ఈ ఆలయాన్ని ఎండోమెంట్స్ విభాగం నిర్వహణలోకి తీసుకువచ్చారు. [4]

స్థల పురాణం

[మార్చు]

శృంగార వల్లభ స్వామి ఆలయ పురాణం విష్ణు పురాణం, భాగవత పురాణాలలో కనిపించే ధ్రువోపాఖ్యానం కథతో ముడిపడి ఉంది. ఉత్థానపాదుడికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. ఇద్దరు కుమారులు: సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. సురుచి ధృవుడిని చూసి అసూయపడి తన కొడుకు ఉత్తముడే రాజు కావాలని కోరుకుంది.[3]

ఒకరోజు, ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించాడు. అయితే ఉత్తముడు అప్పటికే అక్కడ ఉన్నాడు. సురుచి అతన్ని దూరంగా నెట్టి, అతను తన కొడుకు కానందున, రాజుతో కూర్చోవడానికి అతనికి హక్కు లేదని చెప్పింది. గుండె పగిలిపోయిన ధ్రువుడు తన తల్లి వద్దకు వెళ్ళాడు. బలం పొందేందుకు విష్ణువు కోసం తపస్సు చెయ్యమని ఆమె కుమారుడికి సలహా ఇచ్చింది. [3]

అప్పుడు ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. నారద మహర్షి అతనికి మార్గనిర్దేశం చేసి, "ఓం నమో భగవతే వాసుదేవాయ" జపించమని సలహా ఇచ్చాడు. ఆరు నెలల తపస్సు తర్వాత, విష్ణువు ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే ధ్రువుడు, విష్ణువు అపారమైన పరిమాణం, తేజస్సు కారణంగా స్వామిని చూడలేకపోయాడు. అతనికి సహాయం చేయడానికి, విష్ణువు చిన్న రూపాన్ని ధరించి, ధ్రువుడు తనను స్పష్టంగా చూసేలా వీలు కలిగించాడు. అప్పుడు విష్ణువు, భక్తుడు ఏ పరిమాణాంలో ఉంటే తానూ అదే పరిమాణంలో కనిపిస్తానని ప్రకటించాడు.[3]

తోలి తిరుపతి అనేది విష్ణువు ధ్రువుడిని అనుగ్రహించిన ప్రదేశం అని నమ్ముతారు, కాబట్టి ఈ కథలో ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది.[3]

నిర్మాణ శైలి

[మార్చు]

ఈ ఆలయం సాంప్రదాయిక ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ప్రధాన ద్వారం నాలుగు స్తంభాలపై ఉంది. లోపల, ఆలయంలో ఎనిమిది చక్కగా చెక్కిన స్తంభాలతో రంగ మండపం, పదహారు స్తంభాలతో ముఖ మండపం ఉన్నాయి. వీటిలో దాదాపు 13 చారిత్రక శాసనాలు ఉన్నాయి. ఈ స్తంభాలు విష్ణువు, కృష్ణుడి జీవితాల దృశ్యాలతో సహా వివిధ పౌరాణిక ఇతివృత్తాలను వర్ణిస్తాయి. [4]

ఈ ఆలయ గర్భగుడిలో ప్రధాన దేవత శృంగార వల్లభరాయ స్వామి, ఆయన భార్యలు శ్రీదేవి, భూదేవిలతో కలిసి నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. విగ్రహం సుమారు 4.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం, ఏడు ద్వారాలతో కూడిన రాతి గోడలు ఉన్నాయి, వాటిలో కొన్ని కాలక్రమేణా దెబ్బతిన్నాయి లేదా నేలలో కూరుకుపోయాయి.[4]

శాసనాలు, విరాళాలు

[మార్చు]

ఆలయ శాసనాలు వివిధ విరాళాలను, ముఖ్యంగా కపిలేశ్వరపూర్ రాయలు వంటి పాలకులు చేసిన భూదానాలనూ, 15వ శతాబ్దంలో ప్రతాపవత్సవ అయ్యప్ప మహారాజు చేసిన విరాళాలనూ చూపిస్తాయి. అనపోతారెడ్డి, వేమారెడ్డి వంటి స్థానిక జమీందార్లు, రెడ్డి పాలకులు కూడా ఆలయ నిర్వహణ కోసం వనరులు, భూములను విరాళంగా ఇచ్చారు. [4]

పండుగలు, ఆచారాలు

[మార్చు]

ఈ ఆలయం వైఖానస ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ప్రధాన వార్షిక పండుగలలో చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే కల్యాణోత్సవం, ధనుర్మాస సమయంలో ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. [1] బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు వంటి పండుగలలో గ్రామంలో దేవతల ఊరేగింపులు జరుగుతాయి. ఇవి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తాయి. [4]

ఈ ఆలయంలో ఒక శివాలయం, ఆలయానికి ఆగ్నేయంగా ఉన్న బొడ్డ బావి అనే చదరపు ఆకారపు బావి కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ బావిలో స్నానం చేయడం వల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Srungara Vallabha Swamy temple attracts devotees for centuries". The Hans India (in ఇంగ్లీష్). 10 December 2020. Retrieved 5 December 2024.
  2. 2.0 2.1 2.2 "Chadalada Tirupathi". East Godavari District Web Portal (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 5 December 2024.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Dr. B. N. V. Parthasarathi (12 October 2023). "Srungara Vallabha swamy temple, Toli Tirupati, Andhra Pradesh". HinduPost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 5 December 2024.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 Dr. B. Sowjanya (2016). "Sri Srungara Vallabharaya Swamy Devalayam, Tirupathi, East Godavari district". Proceedings of the 40th Session. Andhra Pradesh History Congress. pp. 112–115. ISSN 2320-057X. Archived from the original on 2024-12-05. Retrieved 2026-01-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)