శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాషువా కవీంద్రుని కలంనుండి జాలువారిన మరో అద్భుత ఖండకావ్యం శ్మశానవాటిక.

మానవులు జీవించి వుండగా వెళ్ళటానికి చూడటానికి యిష్టపడని ప్రదేశాలు రెండు.ఒకటి వైద్యశాల.రెండు శ్మశానం,/వల్లకాడు,/రుద్రభూమి.జాతస్య హి ద్రువం మృత్యు. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు.చావును తప్పించుకున్న వాడెవ్వడూ లేడు ధరణిలో.అందరు ప్రస్దానముకేగవలసిన వారే.అయినను శ్మశానం అనే పేరు వినగానే మనస్సు కీడు శంకిస్తుంది.ఏదో భీతి,మదిలో గుబులు. రాత్రుళ్ళూ, మధ్యాహ్నం అటువైపు వెళ్ళటానికే జంకు. అట్టి శ్మశానాన్ని తన కవితా వస్తువుగా ఎంచుకున్నాడు జాషువా కవి. కవి ఎప్పుడూ తనచుట్టూ ఉన్న లోకాన్ని ఇతరులకన్న భిన్నంగా, లోతుగా గమనిస్తాడు, అర్ధం చేసుకుంటాడు. తన భావాలను అక్షరరూపంలో పాఠకుల ముందుంచుతాడు.

శ్రీశ్రీ తన మహప్రస్ధానములో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'.

అంతకు కొన్ని దశాబ్దాలముందే,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు.ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్ళెదుట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి.అన్ని అణిముత్యాలాంటి పద్యాలే.

దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు.

జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.ఈ రుద్రభూమిలో తమబిడ్దలను పొగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవిహృదయం చూడండి.

   ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
   గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
   యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
   కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం.....

కవికలం ఎమంటున్నది.?

   ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో
   ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్
   గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
   దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!

ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది.

కవిహృదయం ఏమంటుందో చూడండి.

  ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
     కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
  యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
  యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
  యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!


  ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
  గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
  ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
  నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాల యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం.

  ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
  బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ
  ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?
  హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో

కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!.

మరి కవిమనస్సు ఏమంటున్నది.

  కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
  గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
  రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
  ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై.

శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో?

  ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో
  నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో!
  యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
  యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?

వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి.

  ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా
  నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య
  త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ
  ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్

మారుతున్న,పరిగెడుతున్న కలికాలంలో ఆర్థికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాథ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాథపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా?

  వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో
  రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
  యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ
  నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్