శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ కృష్ణదేవ రాయలు కొలువులో ఉండి ఆయనకు సేవచేసిన ప్రముఖ రాజసేవకులు వీర్లు.

అమరం తిమ్మరసయ్య

[మార్చు]

తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాలవల్ల కృష్ణదేవరాయలవారి కొలువులో అవసరం తిమ్మయనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటికావలి ద్వారపాలకుల పై అధికారియై ఉన్నట్టున్నూ, అతడు వేయిమంది సైనికులకథికారి అని, చిన్న సంస్థానమునేలే సామంతమండలేశ్వరుడిన్నినీ, అతనిని అమరం తిమ్మరసయ్య, తిమ్మప్పనాయకుడు అనిపిలిచేవారని, ఆయనకు రాయలవారిదగ్గర చాలా చనువు ఉన్నట్లు, చాలా మందికి ఆయన రాయలవారి దర్శనం చేయించి అనేక సందర్భాలలో చాలా ఉపకారాలు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలో ఉన్న దానశాసనాలలో అవసరం నరసయ్య, తిమ్మయ్య, నరసయ్య, అనే ముగ్గురు అన్నదమ్ములపేర్లు, వారితల్లి బసవమ్మగారి పేరున్నూ కనబడుతూఉంది. శా.శ. 1434కు సరియైన ఆంగీరసనామ సం. క్రీ. శ. 7-8-1512 నాటి శాసనంలో ఈ కుటుంబంవారికి తిరువెంగళనాధుడు ఇలువేల్పు అన్నట్లు, అవసరం నరసయ్య తిమ్మయ్యగార్లు "రాయర బాగిల అవసరద" - అనగా రాయలవారి తలుపుల దగ్గర ఉండే ద్వారపాలకులైనట్లున్నూ వివరింపబడింది. ఈయననే వాకిటికావలి తిమ్మన్న అని చెప్పుదురు.

సేలంజిల్లా అరగలూరు గ్రామదేవాలయం రొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికులనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటి గురుంచి శ్రీ కృష్ణదేవ రాయల వారికి స్వయంగా చెప్పుకుందామని వారు రాజధాని అయిన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయల వారి ద్వారము వద్దనుండే ప్రధానుద్యోగి అయిన అమరం తిమ్మరసయ్యగారు వీరిని రాయలవారిదగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం చేయించి వారి యిబ్బందులను తొల్గింపజేయడమే కాక వారికొక హారము, తలపాగ, గుర్రము, గొడుగున్నూ బహుమతి చేయించాడట. ఈసంగతి శా.శ. వర్షములు 1441 సరియైన ప్రమాది సంవత్సర (సా.శ. 10-6-1519) నాటి శాసనంలో ఉదహరింపబడింది.

ఈ అమరం తిమ్మర్సయ్య గారే వాకిటి కావలి తిమ్మన్న అంటారు. 'అమరం మనగా పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ అని శబ్దరత్నాకరములు అర్ధం చెప్పియున్నారు. బత్తెము, సైనిక బలము, జమీనుగల ఒక గొప్ప హోదా కలవారికి ఈఎ బిరుదు ఉంది. విజయనగర సామ్రాజ్యములోని వివిధ ప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనే వారు. వీరురాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన నాయకులు. రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యదార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు, అనే వివిధ హోదాలవారు కనబడుతున్నారు.

గోర్లంట గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చాడని, ఆయన వాకిటి ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడిన్ని 1912 వనాటి మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు 55వ పేరాలో ఉదహరింపబడింది.

అవసరం తిమ్మయని, అమరం తిమ్మయని, వాకిటి తిమ్మయ్యని అని వేరు పేర్లు గల తిమ్మప్ప నాయకుడు రాయల ముఖ్య రాజ సేవకుడుగా చెప్పుచుందురు.

ఊడియం ఎల్లప్పనాయకుడు

[మార్చు]

ఊడియం ఎల్లప్పనాయకుడనే రాజోద్యోగి రాయలవారికీ, ఆయనతరువాత రాజ్యం చేసిన అచ్యుత దేవరాయలవారికీ సన్నిహితభృత్యుడిగా ఉండేవాడు. ఊడియమనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు "కల్ తేరు" అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లూ, తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి దానం చేసినట్లున్నూ సా.శ. 1524 నాటి శాసనం వల్ల కనబడుతూ ఉంది.

అడపం బయ్యప్పనాయకుడు

[మార్చు]

అడపమంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యములుంచే సంచి. దీనిని సంబెళమని కూడా అంటారు. ఆకాలంలో సామాన్యులు కూడా ఎక్కడకువెళ్ళినా ఒక అడపను పట్టుకు వెళ్ళేవారు. రాయలువారు రచించిన ఆముక్తమాల్యద 7వ ఆశ్వాసంలో 7 వ పద్యంలో దీని వర్ణన కనబడుతూ ఉంది. ఇది శ్రీమంతులు అనుభవించే భోగాలలో ఒకటి. కాశ్యపగోత్రుడైన తిమ్మప్పనాయకుడి కుమారుడైన ఈ బయ్యప్ప రాయలవారి కాలంలోను, అచ్యుతరాయలవారి కాలంలోను కూడా ఉద్యోగంచేసినట్లు అతడు తిరుపతివెంకటేశ్వరులకు 55,320 నార్పణములు సమర్పించి సా.శ. 6-9-1538 సం.లో చెక్కించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఇతడింకా కొన్ని గ్రామాల వల్ల వచ్చే సొమ్మునుకూడా దేవుడికి సమర్పించాడు. అందువల్ల ఇతడొక శ్రీమంతుడై ఉండవచ్చును.

కట్టి తిమ్మన

[మార్చు]

జిల్లేళ్ళ బసవనాయకరు కుమారుడైన తమ్మునాయకరు అనే అతడు రాయలవారి కట్టిక, అనగా వెండిబెత్తమును పట్టుకొని ఉండే వేత్రధరుడు. ఇది యొక రాజలాంచనము. అతడొక దళవాయి అని, అతడు తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి నిత్యనైవేద్యనిమిత్తము 1200 నార్పణములు సమర్పించినప్పుడు సా.శ. 1523 సం.లో చెక్కించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఈశాసనమే తెలుగులో కూడా క్లుప్తంగా వ్రాయబడియున్నది. అందులో ఈకట్తితిమ్మన అనుసంధానం రామానుజయ్యగారి శిష్యుడని, అతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య అని ఉదహరింపబడియున్నది. శత్రువుల మీదికి దాడివెడలి జయించినందువల్లనే దాడినేని అనే బిరుదు ఇతనికి వచ్చియున్నది.

విద్వత్సభారాయరంజక శ్రీరంగరాజు

[మార్చు]

రాయలవారి పూర్వుల కాలంనుంచి విజయనగరరాజభవనంలో ఒక నాటకశాల ఉండేది. రాయలవారి కాలంలో ఒక నాట్యశాల, నృత్యశాల ఉండేవి. రాయల వారు తన ఆస్థానంలో సంగీతవిద్వాంసులను పోషిస్తూ సదా విద్యాగోష్ఠిలో కాలక్షేపంచేస్తూ విద్వత్ సభారయలనే బిరుదువహించారు. నృత్యము చేసి సంగీతము పాడి ఆయనను రంజించే ఆటపాటలకు మేళమొకటి ఉండేది. ఈమేళానికి నాయకుడు తిరుమలనాధుని కుమారుడైన శ్రీరంగరాజు. అతనికి విద్వత్ సభారాయరంజక అనే బిరుదు ఉండేది. రాయల వారాయనకు గొప్ప జాగీరు లిచ్చారు. అందులో ఎర్లంపూడి అనే గ్రామాన్ని ఈ శ్రీరంగరాజు క్రీ. శ. 1514లో వెంకటేశ్వరుల స్వామివారికి సమర్పించాడు. ఈ శ్రీరంగరాజు కుమార్తె అయిన రంజకం కుపాయి అనే కుప్పసాని సా.శ. 1512లో చేసిన దానం ఒకటి కనబడుతున్నది.

ఈకుప్పాయికి తిరుమలమ్మ, ముద్దుకుప్పాయి అనే ఇద్దరు కుమార్తెలుండేవారు. తిరుమలమ్మ స్వామివారికి 3000 నార్పణములు సమర్పించినట్లు శాసనములున్నవి. ముద్దు కుప్పాయి అచ్యుతదేవరాయలవారికి అంతఃపురపరిచారికగా ఉంటూఉండి ఆయన ఆజ్ణప్రకారము తిరుపతి స్వామివారికి సేవచేయడానికి వచ్చినట్లు, గోవిందరాజస్వామివారి ఆలయంనుంచి రోజూ ఆవిడకు తినడానికి ప్రసాదం ఇస్తూఉన్నట్లు సా.శ.1531 సం.లో లభించిన శాసనంలో వ్రాయబడియున్నది. ఈ శాసనంలో శ్రీరంగరాజు కుమార్తెయున్నూ, ముద్దుకుప్పాయి తల్లినీ అయిన కుప్పసానికి కూడా "విద్వత్సభారాయరంజకం" అనే బిరుదు ఉండినట్లు చెప్పబడియున్నది.

ఇలాగ విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాలవారూ, శ్రీమంతులూ అనేకులుండేవారని తిరుపతి దేవస్థానములో నున్న శాసనాలవల్ల తెలుస్తున్నది.

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
వీరనరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1509 — 1529
తరువాత వచ్చినవారు:
అచ్యుత దేవ రాయలు

లంకెలు

[మార్చు]