Jump to content

శ్రీకృష్ణ పాండవీయం

వికీపీడియా నుండి
(శ్రీ కృష్ణ పాండవీయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీకృష్ణ పాండవీయం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి త్రివిక్రమరావు
కథ నందమూరి తారక రామారావు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
ఎస్.వరలక్ష్మి,
చిత్తూరు నాగయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
హరనాథ్,
శోభన్ బాబు,
కాంతారావు,
రాజనాల,
కె.ఆర్. విజయ
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య, సి.నారాయణరెడ్డి, కొసరాజు
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్
కళ టి. వి. యస్. శర్మ
నిర్మాణ సంస్థ రామకృష్ణ & ఎన్.ఎ.టి. కంబైన్స్
అవార్డులు నంది అవార్డు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి,13, 1966 లో విడుదలయింది.[1] "పరిత్రాణీయా సాధునాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అని భగవద్గీతలో పలికిన శ్రీకృష్ణుడు ధర్మపథంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి, వారి అభ్యుదయానికి దోహద పడిన విధానం ఈ చిత్రకథ.

చిత్రకథ

[మార్చు]

శ్రీకృష్ణుడి మేనత్తకు కుమారుడు వికృత రూపంలో జన్నిస్తాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ వికృత రూపం పోతుందో అతని చేతిలో అ పిల్లవాడు మరణిస్తాడని ఆకాశ వాణి పలుకుతుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ పసివాడు సహజ రూపం పొందుతాడు. మేనత్త తన కుమారుని కాపాడమని కోరుతుంది. నూరు తప్పులు దాకా మేనత్త కుమారుని మన్నిస్తానని, నూరు తప్పులు కాగానే అతనిని సంహరిస్తానని శ్రీకృష్ణుడు అత్తకు అభయమిస్తాడు. శ్రీ కృష్ణుని ఆ మేనత్త కుమారుడు శిశుపాలుడు.
దాయ ద్వేషంతో దుర్యోధనుడు, పాండవులను రండా పుత్రలుగా కించబరుస్తూ సంబోదిస్తాడు. బదులుగా భీముడు కౌరవులను ముండా పుత్రుడిగా సంభోదిస్తాడు. ఖిన్నుడైన దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీస్తాడు. గాంధారికి వైధవ్య యోగం ఉందని జోస్యుల ద్వారా తెలుసుకున్న గాంధారరాజు ఒక గొఱ్ఱెతో ఆమెకు వివాహం జరిపించి దాన్ని చంపించి వేస్తాడు. పిమ్మట గాంధారి వివాహం దృతరాష్ట్రుడితో జరుగుతుంది. ఇది విని అభిమాన ధనుడైన దుర్యోధనుడు గాంధార రాజును, అతని నూర్గురి కుమారులను పాతాళ గృహంలో బంధించి రోజుకు ఒకొక్కరికి ఒక్కొక మెతుకు, ఒక్క చుక్క నీటిని అందించే ఏర్పాటు చేస్తాడు. ఈ ఆహారం ఎవ్వరికీ సరిపోనిది, ఆహార లోపంతో అందరిని మృత్యువాత పడవేసేది అని ఆలోచించి, కనిష్ఠుడైన శకుని అందరిలో పట్టుదల ఉన్న వాడు, కుటిలుడు కాబట్టి అతనికి అందరి వంతు ఆహారం, నీరు ఇచ్చి అతనిని బ్రతికించు కొని నిరాహారంగా అందరూ మరణించడానికి సిధ్దపడతారు. ఆ విధంగా క్రమక్రమంగా అందరూ మరణిస్తారు. చివరిగా మిగిలిన గాంధారరాజు మరణిస్తూ తన వెన్నెముకతో పాచికలు తయారు చేయమని, అవి శకుని కోరినట్లు పందెం పడుతుందని, వాటి ఆధారంతో కురువంశాన్ని నాశనం చేయమని ఉద్బోదిస్తాడు. మిగిలిన ఒక్కని మీద సానుభూతి కలిగి, పైగా అతడు తమనేమి చేయలేడని తలచి దుర్యోధనుడు శకునిని విడుదల చేస్తాడు. శకుని దుర్యోధనునికి ఆప్తుడిగా ఉంటూ దుర్బోధలతో అతని వినాశనానికి ఎత్తులు వేస్తూ ఉంటాడు. పాండవులను కుంతీ సమేతంగా వారణావ్రతంలో లాక్షా గృహానికి తరలించి, దానిని దహించి పాండవులను మట్టుపెట్టమని దుర్యోధనునికి దుర్బోధ చేస్తాడు శకుని. దీనిని ఆచరణలో పెడతాడు దర్యోధనుడు. ముంచుకు వచ్చే ప్రమాదాన్ని గ్రహించిన శ్రీ కృష్ణుడు, వారణావ్రతం చేరిన పాండవులకు వచ్చి భీమునితో సొరంగ మార్గం త్రవ్వమని ఉద్బోధించడమే కాక, నిద్రమత్తులో ఆదమరచి ఉన్న భీముని ఉత్తేజ పరుస్తాడు. గృహ దహనమయ్యే సమయానికి సోదరులను, తల్లిని సురక్షితంగా కాపాడి అడవికి చేరుస్తాడు. ఆ ప్రాంతంలో నివసించే హిడింబాసారుడు నర సంచారాన్ని కనిపెట్టి, అతని సోదరి హిడింబిను నరుల ఆచూకి తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. హిడింబి భీముని వరిస్తుంది. ఎంతకూ హిడింబి తిరిగి రాకపోవడంతో అక్కడకు చేరుకున్న హిడింబాసురుని భీముడు వధిస్తాడు. తల్లి, అన్న గారి అంగీకారంతో హిడింబిని చేపడతాడు భీముడు. అక్కడ నుండి పాండవులు, కుంతి ఏకచక్రపురానికి చేరుకుంటారు. అక్కడ పురజనులను పీడిస్తున బకాసురుని భీముడు వధిస్తాడు.
పాంచాలరాజు ద్రుపదుడు, అర్జునుడిని వివాహమాడు కుమార్తె, ద్రోణుని చంపు కుమారుని కోసం యజ్ఞం చేసి ద్రౌపదిని, దృష్టద్యముని సంతానంగా పొందుతాడు. లాక్ష్యగృహంలో పాండవులు దగ్ధమైనారని తెలిసి హతాశుడవుతాడు. విజ్ఞుల సలహాపై ద్రౌపది స్వయం వరం ప్రకటిస్తాడు. స్వయంవరానికి పాండువులు చేరుకొని అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. కుంతి మాట మీద, శ్రీకృష్ణుని ఉద్బోధ ననుసరించి పాండవులైదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.
కుండినను పాలిస్తున్న భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి శ్రీ కృష్ణుని కథలు విని అతనిని వరిస్తుంది. ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని పై అకారణ ద్వేషం పెంచుకుంటాడు. శ్రీకృష్ణునికి జన్మతాః విరోధి యైన జరాసంధుని ప్రాపకంలో ఉన్న శిశుపాలునితో రుక్మణి వివాహం చేద్దామనుకుంటాడు రుక్మి. అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి రాయబారం పంపుతుంది రుక్మిణి. వివాహం ముందు దేవీ దర్శనానికి వెళ్లిన రుక్ముణిని తన రథం పై ఎక్కించుకొని తీసుకొని పోతాడు శ్రీ కృష్ణుడు. జరాసంధుని, శిశుపాలుని ఓడించి రుక్మికి సగం మీసం, సగం గుండు గొరికి శృంగ భంగం చేస్తాడు శ్రీ కృష్ణుడు.
పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు వారిని పిలిచి సగ రాజ్యభాగం ఇస్తాడు. ఇంద్రప్రస్ధ నగరాన్ని రాజధానిగా చేసుకొని ధర్మరాజు రాజ్యపాలన మొదలు పెడతాడు. ధర్మరాజు చేత రాజసూయం చేయించ సంకల్పిస్తాడు. శ్రీకృష్ణుడు మగధ రాజైన జరాసంధుని, భీమునిచేత చంపించి రాజసూయానికి మార్గం సుగమం చేస్తాడు. దేవశిల్పి మయుడు ధర్మరాజుకు సభా మండపాన్ని నిర్మించి ఇస్తాడు. రాజసూయానికి విచ్చేసిన దుర్యోధనునికి మయసభ విడిది. పాండవుల వైభవానికి అసూయ పడతాడు దుర్యోధనుడు. మయసభను వీక్షిస్తున్న దుర్యోధనుడు భంగపడతాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోదిస్తాడు. దానిని తప్పుపట్టి శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందిస్తాడు. నూరు తప్పులు పూర్తి కాగానే శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు చక్రాయుధంతో ఖండిస్తాడు. శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనతో చిత్రం ముగుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1965 వ సంవత్సరానికి గాను ఈ చిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి రజిత నంది అవార్డు ప్రకటించింది

నటవర్గం

[మార్చు]
భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు.
పాత్ర పాత్రధారి
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు నందమూరి తారక రామారావు
కుంతీదేవి ఎస్.వరలక్ష్మి
రుక్మిణి కె.ఆర్. విజయ
ధర్మరాజు ఎం. బాలయ్య
భీష్మకుడు చిత్తూరు నాగయ్య
శకుని ధూళిపాల
నారదుడు కాంతారావు
జరాసంధుడు ముక్కామల
భీముడు ఉదయ్ కుమార్
అర్జునుడు శోభన్ బాబు
శిశుపాలుడు రాజనాల

భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు.

రుక్మి కైకాల సత్యనారాయణ
హిడింబి జి.రత్న

విశేషాలు

[మార్చు]

ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.
ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు. కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు.
కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది.
గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు.
జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు.
మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియోలో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే వారట కాదట నిర్మాతలు. దానిని గురించి విన్న స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి గారు ఆ సెట్ ను చూద్దామనంటే ఫ్లోర్ లోకి ప్రవేశానికి అనుమతి లభించ లేదట. విషయం తెలిసిన ఎన్.టి.ఆర్, తివిక్రమరావు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకువెళ్లి సెట్ చూపించారట.
పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు దర్శకత్వంలో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్.టి. రామారావు.
పండిత పామరుల మెప్పును పొంది, సంస్ధకు కీర్తిని, కనకాన్ని సంపాదించిన చిత్రం.

పాటలు

[మార్చు]
  1. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్ , రచన :సముద్రాల సీనియర్
  2. కనియేన్ రుక్మిణి చంద్రమండలంతున్ కం¬ఠీరవ (భాగవతంలోని పద్యం) - ఘంటసాల, రచన: బమ్మెర పోతన
  3. కృష్ణా యదుభుషణా గోవిందా .. నమ్మితి నా మనమ్నున ( పద్యాలు) - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల , రచన: సముద్రాల సీనియర్
  4. కన్నుమరుగైన వెన్న మీగడహరించి మాయలెరుగని (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు , రచన: సముద్రాల సీనియర్
  5. ఛాంగ్‌రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్‌రె బంగారు రాజా మజ్జారే - జిక్కి, రచన: సి. నారాయణ రెడ్డి
  6. తలమనక భీష్మనందను అవ్వ తలయును మూతియున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్, రచన: బమ్మెర పోతన
  7. తగునీ చక్రి విధర్భరాజ సుతకున్ తధ్యంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ , రచన: బమ్మెర పోతన
  8. ధుర్మాధాంధుడు భాంధవద్రోహి కపటి పరమనీచుడు (పద్యం) - మాధవపెద్ది సత్యం , రచన: సముద్రాల సీనియర్
  9. నల్లనివాడు పద్మనయనంబులవాడు (పద్యం) - పి.బి. శ్రీనివాస్, రచన: బమ్మెర పోతన
  10. నల్లనివాడేనా ఓ చెలి చల్లని వాడేలే - జిక్కి, ఎ.పి. కోమల బృందం , రచన: సముద్రాల సీనియర్
  11. ప్రణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రముల (పద్యం) - పి.సుశీల , రచన: బమ్మెర పోతన
  12. పిట్టనొకదాని పడమొట్టి గుట్టనెత్తి బురదపామును (పద్యం) - పిఠాపురం , రచన: సముద్రాల సీనియర్
  13. పరమాత్ముడవై కృష్ణా .. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్
  14. పాలుదాపగా వచ్చిన పడతిఉసురు చూరగొన్నావు (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు , రచన: సముద్రాల సీనియర్
  15. ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని జేరీ: నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె - ఘంటసాల, పి.సుశీల - రచన: సముద్రాల
  16. ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుండు పరుల ఆదరంబున - ఘంటసాల - రచన: సముద్రాల
  17. భళా భళా నా బండి పరుగుతీసే బండి బండిలో తిండి చూడ - మాధవపెద్ది సత్యం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
  18. బ్రతుక వచ్చునొడలు ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని (పద్యం) - మాధవపెద్ది సత్యం, రచన: బమ్మెర పోతన
  19. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా: ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదురా- ఘంటసాల - రచన: కొసరాజు
  20. మా సరివాడవా మాపాప గొనిపోవ ఏపాటిగలవాడ ఏదివంశం (పద్యం) - మాధవపెద్ది సత్యం , రచన బమ్మెర పోతన
  21. సాటి రాజందునా శాపోపహతమైన యదు వంశమున (పద్యం) - మాధవపెద్ది సత్యం , రచన: సముద్రాల సీనియర్
  22. స్వాగతం సుస్వాగతం స్వాగతం కురుసార్వభౌమా స్వాగతం - పి.లీల, పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
  23. వచ్చెద విధర్భభూమికి జొచ్చెద భీష్మకుని పురము (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
  24. వేదపఠనం ( రాజసూయ యాగాంతరం ) - వేద పండితులు
  25. వేదం - వేద పండితులు
  26. వికృతరూపుని నిన్ను చూపించిన నాడు అత్తకొసగిన మాట (పద్యం) - ఘంటసాల రచన:సముద్రాల

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిమ్‌ డైరీ. 1966 విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.

బయటి లింకులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.