శ్రీ కృష్ణ స్వామి ఆలయం, అంబలప్పుళ
| అంబలపుఝ శ్రీ కృష్ణ స్వామి ఆలయం | |
|---|---|
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 9°23′01″N 76°22′10″E / 9.3836°N 76.3695°E |
| దేశం | భారత్ |
| రాష్ట్రం | కేరళ |
| ప్రదేశం | అంబలపుఝ |
| సంస్కృతి | |
| దైవం | కృష్ణుడు |
| చరిత్ర, నిర్వహణ | |
| నిర్మించిన తేదీ | మలయాళం శకం 790 |
| సృష్టికర్త | చెంబకశేరి పూరాడం తిరునాళ్–దేవనారాయణన్ తంపురాన్ |
అంబలపుఝ శ్రీ కృష్ణ స్వామి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రం, ఆలప్పుఝ జిల్లా, అంబలపుఝ పట్టణంలో ఉన్న కృష్ణునికి అంకితమైన ఒక ప్రముఖ హిందూ ఆలయం. ఈ ఆలయం 15వ శతాబ్దంలో స్థానిక పాలకుడైన చెంబకశేరి పూరాడం తిరునాళ్– దేవనారాయణన్ తంపురాన్ చేత నిర్మించబడినదిగా నమ్మకం. ఇది ఒకప్పుడు ట్రావంకోర్ ప్రాంతంలోని ఏడు మహా ఆలయాలలో ఒకటిగా పరిగణించబడింది.[1] ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాలులలో ఒకటిగా కూడా గుర్తించబడింది.
అంబలపుఝ ఆలయంలోని విగ్రహం విష్ణువు యొక్క పార్థసారథి రూపానికి సమానంగా ఉంటుంది. ఈ విగ్రహంలో కృష్ణుడు తన కుడిచేతిలో కొరడా (చాబుకం)ను, ఎడమచేతిలో శంఖాన్ని పట్టుకుని ఉంటాడు. 1789లో టిప్పు సుల్తాన్ దండయాత్రల సమయంలో, గురువాయూర్ ఆలయంలోని శ్రీ కృష్ణ విగ్రహాన్ని భద్రత కోసం మూడు సంవత్సరాలపాటు అంబలపుఝ ఆలయానికి తరలించారు.
ఈ ఆలయంలో ప్రసిద్ధమైన నైవేద్యం పాయసం. ఇది బియ్యం, పాలు, చక్కెరతో తయారు చేసే తీపి వంటకం. గురువాయూరప్పన్ ప్రతిరోజూ ఈ ఆలయానికి వచ్చి ఈ పాయసాన్ని స్వీకరిస్తాడనే విశ్వాసం ఉంది.
పురాణ కథ
[మార్చు]పురాణ గాథ ప్రకారం, ఒకసారి కృష్ణుడు ఒక ముని రూపంలో చెంబకశేరి రాజు సభకు వచ్చి, అతనిని చదరంగం (లేదా చతురంగం) ఆడమని సవాలు చేశాడు. చదరంగంపై ఆసక్తి ఉన్న రాజు ఆ సవాలను సంతోషంగా స్వీకరించాడు. ఆటకు ముందే బహుమతి నిర్ణయించుకోవాలని రాజు కోరగా, ముని తాను చాలా చిన్న కోరిక మాత్రమే కోరుకుంటానని, కొన్ని బియ్యం గింజలే చాలని అన్నాడు. అయితే ఆ బియ్యం పరిమాణం చదరంగపు పలక ఆధారంగా లెక్కించాలి అని చెప్పాడు. మొదటి గడిలో ఒక బియ్యం గింజ, రెండవ గడిలో రెండు, మూడవ గడిలో నాలుగు, నాల్గవ గడిలో ఎనిమిది, ఐదవ గడిలో పదహారు – ఈ విధంగా 64వ గడి వరకు ప్రతి గడిలో రెండింతలు పెరుగుతూ ఇవ్వాలని నిబంధన విధించాడు.[2]
ఆటలో రాజు ఓడిపోయాడు. ముని కోరిన బహుమతిని ఇవ్వడానికి ప్రయత్నించగా, కొద్దిసేపటికే రాజుకు తన రాజ్యంలోని ధాన్యాగారాలు ఖాళీ అవుతున్నాయని అర్థమైంది. ఈ బియ్యం సంఖ్య ఘాతాంక వృద్ధిగా పెరుగుతుందని, 64 గడుల చదరంగపు పలకకు అవసరమైన మొత్తం బియ్యం సంఖ్య 18,446,744,073,709,551,615 గింజలు అవుతుందని రాజు గ్రహించాడు. ఇది ట్రిలియన్ల టన్నుల బియ్యానికి సమానం.
రాజు పరిస్థితిని గమనించిన ముని తన నిజ స్వరూపంలో కృష్ణుడిగా దర్శనమిచ్చి, ఆ ఋణాన్ని వెంటనే తీర్చాల్సిన అవసరం లేదని చెప్పాడు. ప్రతిరోజూ ఆలయంలో భక్తులకు ఉచితంగా పాలు–పాయసం సమర్పిస్తూ ఉండాలని, ఆ విధంగా ఋణం తీర్చవచ్చని వరం ఇచ్చాడు.
ఉత్సవాలు
[మార్చు]అంబలపుఝ ఆలయ ఉత్సవం 15వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ కాలంలో ఆలప్పుఝ జిల్లా మధ్యభాగాన్ని చెంబకశేరి దేవనారాయణ వంశం పాలించేది. ఈ వంశ పాలకులు పరమ భక్తులు కావడంతో, కారింకుళం ఆలయం నుండి కృష్ణుని విగ్రహాన్ని అంబలపుఝ శ్రీ కృష్ణ స్వామి ఆలయానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విగ్రహ ఆహ్వానాన్ని స్మరించుకుంటూ నిర్వహించే వేడుకే అంబలపుఝ ఆలయ ఉత్సవానికి ఆరంభంగా మారింది. దీనిని చంపకుళం మూలం జల ఉత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మిథునం నెలలో వచ్చే మూలం నక్షత్ర రోజున నిర్వహించబడుతుంది. ఆరాట్టు ఉత్సవం మార్చి–ఏప్రిల్ నెలలలో వచ్చే తిరువోణం రోజున జరుగుతుంది.
చిత్రాల గ్యాలరీ
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ Ramaswamy, Sudha (5 September 2013). "Krishna – as sweet as Madhuram". The Hindu. Retrieved 15 November 2020.
- ↑ V., Meena (1974). Temples in South India (1st ed.). Kanniyakumari: Harikumar Arts. p. 54.










