శ్రీ చక్రపాణి ఆలయం, త్రికరిపూర్
| శ్రీ చక్రపాణి ఆలయం | |
|---|---|
2022లో పండుగ సమయంలో శ్రీ చక్రపాణి ఆలయం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 12°07′50″N 75°10′33″E / 12.1305994°N 75.1758572°E |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| ప్రదేశం | కాసరగోడ్ జిల్లాలోని త్రికారిపూర్ |
| సంస్కృతి | |
| దైవం | విష్ణు |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | కేరళ వాస్తుశిల్పం |
శ్రీ చక్రపాణి దేవాలయం అనేది హిందూ దేవాలయం కాగా, ఇది విష్ణుకు అంకితం చేయబడింది. ఈ దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రం, కాసరగోడ్ జిల్లాలోని త్రికారిపూర్ ప్రాంతంలో స్థితిచేసి ఉంది. పురాణ కథనాల ప్రకారం ఈ దేవాలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు. ఇది కేరళలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది. ఆలయం ఖచ్చితమైన వయస్సు తెలియకపోయినా, ఇక్కడ ఉన్న తమిళ శాసనాలు ప్రకారం ఈ దేవాలయం మలయాళం సంవత్సరం 410 (క్రీ.శ. 1235)లో పునర్నిర్మించబడినట్లు తెలియజేస్తున్నాయి.
చారిత్రక ప్రాధాన్యత
[మార్చు]ఈ దేవాలయం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత గలదిగా భావించబడుతుంది. పరశురాముడు స్వయంగా దీనిని శత్రు సంహారమూర్తి (శత్రువులను నాశనం చేసేవాడు) రూపంలో ప్రతిష్ఠించాడని విశ్వాసం ఉంది.[1] టిపూ సుల్తాన్ సైన్యం ఉత్తర మలబార్ ప్రాంతంలో అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ దేవాలయానికి మాత్రం వారి సైన్యం చేరలేకపోయిందని చెబుతారు.[1] పురాణ కథనం ప్రకారం, దేవాలయంపై దాడి చేయడానికి వచ్చిన టిపూ సైన్యాన్ని ఏనుగుల గుంపు తరిమికొట్టినట్లు విశ్వసిస్తారు.[1]
తమిళ శాసనాలు
[మార్చు]గర్భగృహం, ప్రాకారం గోడలపై చెక్కబడిన శాసనాలు తమిళంలో ఉన్నాయి. ఇవి ఒకప్పుడు ఈ ప్రాంతాలలో ప్రధానంగా మాట్లాడబడిన భాష తమిళమేనని స్పష్టంగా సూచిస్తున్నాయి.[1] ఎం.ఆర్. రాఘవ వారియర్ వంటి చరిత్రకారులు, ఆలయంలో కనిపించే 'సంస్కృతీకరించిన' తమిళ లిపి ఉత్తర కేరళలో కూడా వైష్ణవ సంప్రదాయం ఉనికిని సూచిస్తుందని చెబుతున్నారు.[2] ఆలయం ఖచ్చితమైన వయస్సు తెలియకపోయినా, ఇక్కడి శాసనాలు ప్రకారం ఈ దేవాలయం మలయాళం సంవత్సరం 410 (క్రీ.శ. 1235), మకరం 27వ తేదీన పునర్నిర్మించబడినట్లు పేర్కొంటున్నాయి.[2]
దైవం
[మార్చు]ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. చేతిలో చక్రాన్ని ధరిస్తాడు అనే అర్థంతో చక్రపాణి అనే పేరు విష్ణువుకు మరో నామంగా ఉపయోగించబడుతుంది. నాలుగు భుజాలు కలిగిన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు.[3] ఇక్కడ ఉపదేవతలుగా గణపతి దేవుడు, వనశాస్తా, దుర్గ ఉన్నారు.[3]
ఆలయ కుంటలు
[మార్చు]
పండుగ సందర్భంలో పవిత్ర స్నానాలు నిర్వహించే తామర కుంట ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది. రహదారి తూర్పు వైపున ఉన్న పెద్ద కుంట 90 సెంట్లు విస్తీర్ణంలో ఉంటుంది.[4]
పురాణ కథలు
[మార్చు]గజేంద్ర మోక్షం
[మార్చు]పురాణ కథల ప్రకారం, పాండ్య వంశానికి చెందిన 'ఇంద్రద్యుమ్న' అనే రాజు, మహర్షి అగస్త్యుడు శాపం వల్ల 'గజేంద్ర' అనే ఏనుగుగా మారాడని చెబుతారు. అలాగే దేవతల శాపం వల్ల 'హుహు' అనే గంధర్వుడు మొసలిగా మారాడు.[3] స్నానానికి తామర కుంట (చీర) వద్దకు వచ్చిన గజేంద్రుని కాళ్లను మొసలి కరిచింది.[3] ఒడ్డుకు చేరలేక పోయిన ఏనుగు, కుంటలోని తామర పువ్వును ఎత్తుకుని విష్ణువును ప్రార్థించింది. అప్పుడు గరుడుడుపై ఆసీనుడైన విష్ణువు అక్కడికి వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలి తలను కోసి గజేంద్రుని రక్షించాడు.[3] విష్ణువు అనుగ్రహంతో వారిద్దరికీ తక్షణమే మోక్షం లభించిందని నమ్ముతారు. ఈ కథ ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన పురాణగాథ.[3]
ఇక్కడ ప్రార్థించే భక్తులు, సంక్షోభాలు మొసలిలా తమ కాళ్లను కరిచినప్పుడు విష్ణువు రక్షకుడిగా వస్తాడని విశ్వసిస్తారు.[3]
విల్వమంగళం సంబంధిత పురాణగాథ
[మార్చు]ఇక్కడ విల్వమంగళం స్వామి ఈ స్థలంలో గురువాయూరప్పన్ సూచన మేరకు భజనలు నిర్వహించి, మోక్షాన్ని పొందారని కూడా ఒక పురాణగాథ ఉంది.[3]
పుష్కరిణికి సంబంధించిన నమ్మకాలు
[మార్చు]ఆలయ పుష్కరిణికి సంబంధించిన కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ పుష్కరిణినే గజేంద్రుడు మోక్షాన్ని పొందిన స్థలంగా భావిస్తారు. దీనిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తులలో విశ్వాసం ఉంది.[4] అందువల్ల ఎంతోమంది ఇందులో పుణ్యస్నానం చేయడానికి ప్రార్థనగా వచ్చి మునుగుతారు.[4]
స్థానము
[మార్చు]శ్రీ చక్రపాణి ఆలయం కాసరగోడ్ జిల్లాలోని త్రికారిపూర్ లో, థంకాయం-ఇలంపచ్చి రహదారి పక్కన ఉంది. ఇది పయ్యన్నూర్ కు సుమారు 5 కి.మీ ఉత్తరంగా, కన్నూర్ జిల్లాలో, త్రికారిపూర్ పట్టణానికి సుమారు 3 కి.మీ దక్షిణంగా ఉంది.[5] సమీప రైల్వే స్టేషన్ త్రికారిపూర్ రైల్వే స్టేషన్ కాగా, సమీప బస్ స్టేషన్ త్రికారిపూర్ బస్ స్టేషన్.
వార్షిక ఉత్సవం
[మార్చు]
శ్రీ చక్రపాణి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగే వార్షిక ఉత్సవం మలయాళం నెల మకరం (మార్చి మధ్య – ఏప్రిల్ మధ్య)లో జరుపుకుంటారు. ఈ ఉత్సవం మకరం నెలలో చతయం నక్షత్రం వచ్చే రోజున ప్రారంభమై, మకరం నెలలోని రోహిణి నక్షత్రం రోజున ముగుస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు
[మార్చు]కాల ప్రభావం కారణంగా ఆలయం ఎక్కువగా దెబ్బతింది. దాంతో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించేందుకు భక్తుల నుండి నిధులు సేకరించారు. ఆలయ గర్భగృహాన్ని 2012లో 10 మిలియన్ రూపాయల వ్యయంతో పునరుద్ధరించారు.[6]
శతాబ్దాల ప్రాచీనమైన ఈ ఆలయ కుంట, వేసవిలో కూడా ఎండిపోకుండా ఉండే ప్రత్యేకత ఉంది. అయితే ప్రస్తుతం అది సంరక్షణ లేకపోవడం వల్ల క్షీణిస్తోంది.[4] పాత రాతి మెట్లు విరిగి నాశనమవుతున్నాయి.[7] నాలుగు వైపులా జరిగిన భూస్కలనాల కారణంగా కుంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.[4][7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Awaiting a new lease of life". The Hindu (in Indian English). 4 April 2013.
- ↑ 2.0 2.1 "Vaishnava cult presence traced in north Kerala". The Hindu (in Indian English). 13 September 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 "പ്രതിസന്ധികളിൽ നിന്ന് മോചനം ലഭിക്കാൻ ഈ ക്ഷേത്രദർശനം". www.manoramaonline.com (in మలయాళం). Malayala Manorama.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "ഇവിടെ മുങ്ങിക്കുളിച്ചാല് ത്വക്ക് രോഗങ്ങള് ഇല്ലാതാകും; പ്രശസ്തമായ ചക്രപാണി ക്ഷേത്രക്കുളത്തിന്റെ ഇന്നത്തെ അവസ്ഥ ഇതാണ്". Samayam Malayalam (in మలయాళం). The Times of India.
- ↑ "Sree Chakrapani Temple |Temples in Kasaragod | Kerala Temple Architecture". www.keralatourism.org (in ఇంగ్లీష్). Department of Tourism, కేరళ ప్రభుత్వం.
- ↑ "ക്ഷേത്രങ്ങള് മനുഷ്യനന്മക്കും പുരോഗതിക്കും-സ്വാമി വിശ്വേശ തീര്ഥ". KasargodVartha: Kasaragod News paper Live, Kannur, Mangalore, Malabar ചുറ്റുവട്ടം കാസർഗോഡ് വാർത്തകൾ (in మలయాళం). 10 March 2012.
- ↑ 7.0 7.1 "നവീകരണം കാത്ത് താമരക്കുളം". www.manoramaonline.com (in మలయాళం). Malayala Manorama.