శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ నడిబొడ్డులో గల గాంధీనగర్ ప్రాంతంలో శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఉంది.

ఇది ఆనాటి ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త, స్వాతంత్ర సమర యోధుడైన డా.వెలిదండ్ల హనుమంతరావు స్మృతి చిహ్నం గా 1934వ సం లో విజయవాడ పాత బస్తీ లో రధం వద్ద ఒక చిన్న పూరి పాకలో ప్రారంభించబడింది. గ్రంథాలయం ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించి స్వాతంత్ర్య సమరం లో వారిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశ్యంతో హనుమంతరావు సహచరులు గెల్లి రాజగోపాలం, కృత్తి వెంటి కుటుంబరావు, నండూరి వెంకటేశ్వర రావు లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రంథాలయాన్ని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రస్తుత స్థలం లో గ్రంథాలయ శాఖని 1939లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. గ్రంథాలయ భవనాన్ని 1942 లో మహర్షి బులుసు సాంబమూర్తి గారు శంకుస్థాపన చేయగా 1944లో గాడిచెర్ల హరి సర్వోత్తమ రావుగారు ప్రారంభోత్సవం చేశారు. మొదట పూరి పాకలో స్థాపించిన గ్రంథాలయాన్ని కూడా దీనిలో కలిపివేశారు. దీనికి తొలి అధ్యక్షులుగా కాట్రగడ్డ నారాయణ రావు గారు, రెండవ అధ్యక్షులుగా అయ్యదేవర కాళేశ్వర రావు పంతులు గారు వ్యవహరించారు.

పలువురు సాంఘిక, రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, చలనచిత్ర, రంగ స్థల కళాకారులతో ఉపన్యాసాలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూఉన్నారు. ఎంతోమంది సంఘ ప్రముఖులు, సమాజ సేవకులు, కళాకారులు, సాంకృతిక సంస్థలు ఈ గ్రంథాలయానికి స్థలం రూపంలో, విరాళాల రూపంలో, దానాల రూపంలో ఇచ్చి ఈ గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.

చలన చిత్ర కళాకారులు అక్కినేని నాగేశ్వర రావు, శ్రీమతి సావిత్రి, సూర్యకాంతం, జమున, నవలా రచయిత్రి లత, రచయితలు శ్రీ శ్రీ, ఎన్ ఆర్ నంది, యండమూరి, కొమ్మనపల్లి వంటి అనేకులు గ్రంథాలయాన్ని సందర్శిస్తూ అభివృద్ధికి తోడ్పడ్డారు. రాజరామ్మోహన రాయ్ గ్రంథాలయ నిధుల సంఘం, జిల్లా గ్రంథాలయ సంస్థ కు అనుబంధం గా ఉండి నిధులు ఏర్పాటు చేసారు.

కాలక్రమేణా ఏర్పడిన నిధుల కొరత వలన ప్రకృతి వైపరీత్యాలతో సేవలు ఆగిపోయి, అభివృద్ధి కుంటుపడిన ఈ గ్రంథాలయం వనరులు సేకరించుకొని, భవనము, సభామందిరము (ఆడిటోరియం), పఠన మందిరాలు ఆధునీకరించబడి మార్చి 8, 2023న పున: ప్రారంభించబడింది. దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డా. రావి శారద ప్రారంభించారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. రంగమ్మ, సామినేని (May 2023). "వెలిదండ్ల హనుమంతారాయ గ్రంధాలయంతో నా అనుబంధం". గ్రంథాలయ సర్వస్వము. 84 (2): 8–10.
  2. "ఆధునీకరించిన వెలిదండ్ల హనుమంతారాయ గ్రంథాలయం". గ్రంథాలయ సర్వస్వము. 84 (2): 34. May 2023.