షంషేర్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షంషేర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంమహబూబ్ షంషేర్ ఖాన్
జననం1930 ఆగస్టు 2
కైతేపల్లి
మరణం2017 అక్టోబరు 15
కైతేపల్లి
స్వగ్రామంకైతేపల్లి
క్రీడ
దేశంభారతదేశం
క్రీడఈత
పోటీ(లు)200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్,
200 మీ. బట్టర్‌ఫ్లై
సాధించినవి, పతకాలు
జాతీయ ఫైనళ్ళుభారత జాతీయ క్రీడలు
1954, 1955
ఒలింపిక్ ఫైనళ్ళు1956

షంషేర్ ఖాన్ (1930 ఆగస్టు 2 - 2017 అక్టోబరు 15) ఒలింపిక్స్ కు వెళ్ళిన తొలి భారతీయ ఈతగాడు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్ క్రీడల్లో ఈత పోటీలో రెండు విభాగాల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతడు ఐదవ స్థానంలో నిలిచాడు. ఇది భారత ఒలింపిక్ రికార్డు. 2020 నాటికి కూడా ఈ రికార్డు పదిలం గానే ఉంది.

జీవిత విశేషాలు[మార్చు]

మహబూబ్ షంషేర్ ఖాన్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లెలో 1930 ఆగస్టు 2 వ తేదీన జన్మించాడు.[1] తన గ్రామంలోనే ఈత నేర్చుకున్నాడు. 1949 లో ఖాన్ భారత సైన్యంలో, బెంగళూరు లోని సదరన్ కమాండ్‌లో, చేరాడు. అక్కడి ఈత కొలనులో సాధన చేసి, ఈతలో మెళకువలు నేర్చుకుని నైపుణ్యం సంపాదించాడు.[2] జాతీయ పోటీల్లోను, 1956 ఒలింపిక్ పోటీల్లోనూ షంషేర్ ఖాన్ పాల్గొన్నాడు.

ఒలింపిక్ క్రీడల కోసం మెల్బోర్న్ వెళ్ళేందుకు అయిన విమానం చార్జీలను మాత్రమే ప్రభుత్వం పెట్టుకుంది. అక్కడ తన ఖర్చుల కోసం సైన్యం నుండి 300 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తరువాత సైన్యం అతడి జీతంలోంచి ఆ డబ్బును కోసుకుంది.[3]

మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సైన్యంలో విధుల కారణంగా ఈతకు దూరం కావాల్సి వచ్చింది. 1962 చైనా యుద్ధం లోను, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లోనూ పాల్గొన్నాడు.[4] 1973 లో ఖాన్, సుబేదార్ హోదాలో సైన్యం నుంచి రిటైరయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసాడు. ఆ తరువాత స్వగ్రామానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు.

షంషేర్ ఖాన్ ఒక చిన్న పల్లెటూరినుంచి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగి ఎలాంటి గుర్తింపుకు నోచుకోక అనామకుడుగా మిగిలిపోవటాన్ని స్విమ్మింగ్ ఫెడరేషన్, భారతీయ స్విమ్మింగ్ అసోసియేషన్ అధికారులు గుర్తించారు. 2016 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అతడికి 25 లక్షల రూపాయల సత్కారం ప్రకటించింది.[5] 2017 లో నరసరావుపేటలో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల్లో ఆయన ప్రభుత్వం నుండి రూ.25 లక్షల చెక్కును అందుకున్నాడు. [1]

షంషేర్ ఖాన్, 2017 అక్టోబరు 15 న తన స్వగ్రామం కైతేపల్లెలో గుండెపోటుతో మరణించాడు.[6]

ఈత పోటీల్లో[మార్చు]

1954 లో 200 మీటర్ల బట్టర్‌ఫ్లై పోటీలో షంషేర్ ఖాన్ జాతీయ రికార్డును స్థాపించాడు. 1955 లో బెంగళూరులోజరిగిన పోటీల్లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టాడు.

1956 లో మెల్బోర్న్ లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఖాన్ పాల్గొన్నాడు.ఆ క్రీడల్లో పాల్గొన్న 59 మందిలో అతడు ఒకడు. ఖాన్ తో పాటు శ్రీచంద్ బజాజ్ అనే ఆటగాడు కూడా ఈతపోటీల్లో పాల్గొన్నాడు. హీట్స్‌లో ఖాన్, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ లో 5 వస్థానం లోను, 200 మీటర్ల బట్టర్‌ఫ్లై విభాగంలో 6 వ స్థానం లోనూ నిలిచాడు.[7] ఇది ఒలింపిక్ క్రీడల్లో భారత రికార్డు. 2020 వరకు భారత ఈతగాళ్లలో ఈ రికార్డుకు చేరినవారు గాని, ఛేదించిన వారు గానీ లేరు.[8]

అయితే 2012 లో, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయుడు సందీప్ సెజ్వాల్ అని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తప్పుగా ప్రకటించింది. 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న సెజ్వాల్ హీట్స్‌లో 36 వ స్థానంలో నిలిచాడు.[8]

బెంగుళూరులో ఇప్పటికీ షంషేర్ ఖాన్ పేరుతో సదరన్ కమాండ్ లో స్విమ్మింగ్ అకాడమీ ఉంది. ఆయన దగ్గర ఈత నేర్చుకొని జాతీయ పతకాలు పొందిన శిష్యుడు, మాజీ సైనికుడు తల్లాబాబు 2016 జూలై 24 న హైదరాబాదు నుండి కైతేపల్లెకు వచ్చి పాదాభివందనం చేశాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "భారత తొలి ఒలింపియన్‌ స్విమ్మర్‌ షంషేర్‌ ఖాన్‌ మృతి". Sakshi. 2017-10-16. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
  2. "అక్టోబర్ 2017 వ్యక్తులు". sakshieducation.com. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
  3. "First Olympian swimmer Mehboob Shamsher Khan dead". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2017-10-16. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
  4. "యూట్యూబ్‌లో షంషేర్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో". www.youtube.com. Retrieved 2020-06-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Reporter, Staff (2017-10-15). "India's first Olympic swimmer, Shamsher Khan, dead". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-30.
  6. Oct 15, Samdani MN | TNN |; 2017; Ist, 19:26. "Mehboob Shamsher Khan: First Indian Olympic swimmer Shamsher Khan dies of cardiac arrest | More sports News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-30. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  7. "Shamsher Khan". Olympedia.org. Archived from the original on 2023-02-17. Retrieved 2023-02-17.
  8. 8.0 8.1 Jul 27, MN Samdani | Updated:; 2012; Ist, 05:26. "Robbed: 1956 Swimming hero Shamsher of his Olympic feat | undefined News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-30. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)