షోడశి - రామాయణ రహస్యములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షోడశి - రామాయణ రహస్యములు
షోడశి - రామాయణ రహస్యములు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: గుంటూరు శేషేంద్ర శర్మ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): పరిశోధన వ్యాసాల సమాహారం
ప్రచురణ: జ్యోత్స్న ప్రచురణలు
విడుదల: 1967

షోడశి - రామాయణ రహస్యములు, గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఒక ఆధ్యాత్మిక సాహితీ విశ్లేషణాత్మక రచన. వ్యాస సంకలనం. సరళమైన గ్రాంధిక భాషలో వ్రాయబడిన ఈ రచన రామాయణ మహాభారతాల గురించి కొన్ని విశేషాల సంగ్రహం. ఇవి ముందుగా 1965లో ఆంధ్రప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడ్డాయి. జ్యోత్స్న ప్రచురణల ద్వారా 1967లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరల 1980లోను, 2000 లోను పునర్ముద్రింపబడ్డాయి. ఈ పుస్తకంలో రెండు ప్రధాన విషయాలు - (1) సుందరకాండ, దాని పేరు, అందులో కుండలినీయోగ రహస్యము (2) మహాభారతం తరువాత రామాయణం వ్రాయబడిందన్న కొందరు విమర్శకులకు నిశితమైన విశ్లేషణాత్మకమైన జవాబు. వీటితోబాటు మరి కొన్ని వ్యాసాలున్నాయి.

ఎన్. రమేశన్ అనే ఐ.ఎ.ఎస్. అధికారి ముందుమాట ఉంది. అందులో రచయిత పరిశోధనాత్మక విశ్లేషణను, పాండిత్యాన్ని ప్రశంసించడమైంది. తరువాత శ్రీమాన్ గుండేరావు హర్కారే అనే సంస్కృత పండితుని ముందుమాట సంస్కతంలో వ్రాయబడింది. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పరిచయ పీఠిక ఉంది. అందులో రచయిత శర్మ పాండిత్యం ఎంత లోతైనదో, శ్రీవిద్యపై రచయితకు ఎంత చక్కని అవగాహన ఉన్నదో, ఈ రచనకై రచయిత రామాయణ మహాభారతాలను ఎన్నిసార్లు చదివి ఉండాలో ఊహిస్తూ విశ్వనాధ సత్యనారాయణ రచయితను కొనియాడాడు.

తరువాత రచయిత "ముందొకమాట" అనే ఉపోద్ఘాతాన్ని వ్రాశాడు. అందులో సాహిత్యానికి (1) కవి (2) రసము అనే అంశాలు అత్యంత ప్రధానమైనవి అని రచయిత వివరించాడు. "వేదమునకేది పరమార్ధమో, శాస్త్రములకేది పరమార్ధమో, అదియే కావ్యమునకు పరమార్ధము. కనుకనే కవి, రసము అను తాత్విక పరిభాష సాహిత్యమున ప్రవేశించినది. ఈ దేశమునకు ఆనందము పరమార్ధము. ఇది ఆనంద భూమి" అని చెప్పాడు. అట్టి పరమార్ధముపై నిర్మింపబడిన ఈ దేశపు సంస్కృతి ఔన్నత్యాన్ని విస్మరించి పరసంస్కృతికై ప్రాకులాడడం సిద్ధాన్నాన్ని వదలుకొని భిక్షాటనం చేయడం వంటిదని చింతించాడు.

సుమారు 45 ఏళ్ళ క్రితం అచ్చయిన ఈ మహా కావ్యం అంతగా జన బాహుళ్యంలో ప్రాచుర్యానికి నోచుకోలేదు. శేషేంద్ర దానికి పూనుకోకపోవడమే ప్రధాన కారణం.

ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన 3వ ప్రచురణతో కొంత వెలుగులోకి వచ్చింది. కొన్ని సమీక్షలు వెలువడ్డాయి. మళ్ళీ 2013లో వెలువడ్డ ప్రచురణతో కాస్త ప్రజల్లోకి వెళ్ళింది.

ఈ 45 ఏళ్ళలో వచ్చిన విభిన్న సమీక్షలతో సమగ్రంగా సర్వాంగ సుందరంగా షోడశి ఈ-బుక్ మన ముందుకు వస్తోంది.

ఈ డిజిటల్ శకంలో, నేటి ఈ-యుగంలో శ్రీ జయ విజయదశమి పర్వదిన కానుకగా "షోడశి"ని జగన్మాత ఆశీస్సులుగా అందిస్తున్నారు కవికుమారుడు సాత్యకి.

మానవాళికో పరమౌషధం... వాల్మీకీ ‘రామాయణం’

రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ.

వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా దాగి వున్న రుషి హృదయం. శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే ఆకళింపునకు లొంగుతుందని విశ్లేషించారు. మరి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ అందేది కాదు కదా!

‘‘శాస్త్రములు పండితుల కొరకే’’ అన్న వాదం ‘‘కొందరు స్వార్థపరులైన పండితులు, కొందరు సోమరులైన పామరులు కలిసి చేసిన కుట్ర, కల్పించిన భ్రాంతి’’ అన్నది శేషేంద్రగారి నిశ్చితాభిప్రాయం. సాహిత్యం, శాస్త్రం పట్ల ఇలాంటి నిజాయితీ యుతమైన ప్రజాస్వామిక దృక్పథం ఉన్న శేషేంద్ర రామాయణంలో వాల్మీకి దాచిన రహస్యాల్ని ప్రజానీకానికి విడమరిచి చెబుతున్నారు. వాల్మీకి మహర్షి కుండలినీ యోగమనే పరమౌషధాన్ని మానవాళికి బహూకరించాడని, అనుష్టుప్‌ ఛందస్సులో ఉన్న వాల్మీకి కవిత ఆ ఔషధానికి తేనెపూత అనీ అనన్య అంతర్మథనంతో, అసాధారణ విద్వత్తుతో వ్యాఖ్యానించారు. రామాయణంలో వాల్మీకి ధ్యాన పద్ధతిని ప్రతిపాదించాడని, రామాయణం భారతంకంటే పూర్వ గ్రంథమనీ, వేదానికి రూపాంతరమనీ తేల్చి చెప్పారు. శేషేంద్రలోని అంతర్ముఖత్వం, పరిశీలాన్వేషణా చాతుర్యం రెండు పాయలుగా గ్రంథమంతటా విస్తరించాయి. ప్రతిభా పాండిత్యాల పారవశ్య పరిమళం గ్రంథమంతటా గుబాళిస్తుంది. ఋతుఘోష వంటి అరుదైన పద్యకావ్యం, మండే సూర్యుడు వంటి సంచలనాత్మక వచన కవితా సంకలనం వెలువరించిన శేషేంద్రలోని మంత్ర శాస్త్రం, వేదవాంగ్మయంలో విద్వాంసుడన్న కోణం ఈ గ్రంథం ద్వారా నేటితరం వాళ్ళు తెలుసుకోవచ్చు.

- వై.వసంత , ఆంధ్రప్రభ, ఆదివారం 24 ఆగస్టు 2014

సర్వకళా సంశోభితం

భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాజ్ఞ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథమిది. ‘షోడశి’ అనేది మహామంత్రానికి సంబంధించిన నామం. ఈ పేరును బట్టే ఇదో అధ్యాత్మ ప్రబోధగ్రంథమని గ్రహించవచ్చు. వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత శాస్త్రపరిజ్ఞానం అవసరమో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. అంతేకాదు, వైదికవాజ్ఞ్మయం మీద అధికారం ఉండాలి. శేషేంద్రశర్శగారి లోతైన పరిశీలనా దృష్టిని, పాండిత్యాన్ని సాక్షాత్తు...... కథాసందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి కాలం, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్ని తెలిస్తే కాని వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శర్మగారు తేటతెల్లం చేశారు. దీనికి మకుటాయమానం ‘నేత్రాతుర:’ అనే శబ్దం మీద నిర్వహించిన చర్చ. సుందరకాండ పేరులో విశేషం, కుండలినీ యోగం, త్రిజటా స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర రహస్యం, భారతాన్ని రామాయణానికి ప్రతిబింబంగా భావించడం ` ఇలా ఎన్నో విమర్శనా వ్యాసాలు.. ఇతరుల ఊహకు కూడా అందనివి ఇందులో ఉన్నాయి. తెలుగు సాహితీ లోకం చేసుకున్న పుణ్యఫలం ఈ గ్రంథరాజం.

- విపుల , విశ్వకథా వేదిక, మే, 2014

ప్రప్రంచ సాహిత్య విమర్శలో, పరిశోధనలో రెండు మహోన్నత శిఖరాలు[మార్చు]

మహాకవి శేషేంద్ర విరచిత షోడశి రామాయణ రహస్యములు, స్వర్ణహంస హర్షనైషద కావ్య పరిశీలన ప్రపంచ సాహితీ విమర్శలో రెండు మహోన్నత శిఖరాలు. సమకాలీన తెలుగు సాహిత్య ప్రజానీకానికి ముఖ్యంగా నేటి తరానికి తెలియని సత్యమిది. వాల్మీకి రామాయణంలో కుండలినీ యోగం, గాయత్రీమంత్రం తదితరాలు సాక్ష్యాత్కరించినట్లే శేషేంద్రకు హర్షుడి నైషధంలో మంత్రయోగ తంత్ర సంపుటి, శ్రీ మహాత్రిపుర సుందరి, చింతామణి తిరస్కరిణి మంత్రాలు సాక్ష్యాత్కరించాయి.

డిగ్రీల ఉత్పత్తి కేంద్రాలయిన మన విశ్వవిద్యాలయాలు రీసెర్చ్‌ పేరుతో టన్నుల కొద్దీ ‘‘సాలిడ్‌ వేస్ట్‌’’ కుమ్మరిస్తుండగా శేషేంద్ర మున్సిపల్‌ కమీషనర్‌ నౌకరీ చేస్తూనే ఋషిగా దార్శినిక పరిశోధనాత్మకత విమర్శ గ్రంథాలు సృజించారు.

ప్రచురణ రీత్యా షోడశి (1967) స్వర్ణహంస (1968) వెలువడ్డా రచనాకాలం దృష్ట్యా స్వర్ణహంస తొలికావ్యం. నన్నయ్య, శ్రీనాథ, మల్లినాథులకు దొరకని రహస్యాలు శేషేంద్రకు సాక్ష్యాత్కరించాయి. ఈ మహనీయత్రయం నైషథంలోని రహస్యాలను తనకు విడిచిపెట్టి వెళ్లడం తన పూర్వజన్మ పుణ్యఫలమని అంటారు శేషేంద్ర వినమ్రంగా.

"ఈ రెండు మహా కావ్యాలు, ఆనాడు కీ.శే. నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలోని ఆంధ్రప్రభ దినపత్రికలో 1963 నుంచి 1966 వరకూ ధారావాహికంగా, ఆదివారం సాహిత్యనుబంధంలో వెలువడ్డాయి. శేషేంద్ర పద్య, గద్య కావ్యాలన్నీ కూడా (సుమారు 6 పుస్తకాలు) ప్రభలో వెలువడ్డ తరువాతే పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి".

ఒక్కొక్కసారి మన మెదడులో ఓ మంచి సృజనాత్మకమైన ఆలోచనో, భళా అనిపించే ఉపాయమో తళుక్కుమంటుంటుంది. ఈ ఊహ ఇంతవరకూ ఎవరూ చేసుండకపోవచ్చు, ఈ కోణంలో ఎవరూ ఆలోచించి ఉండకపోచ్చు అనిపిస్తుంటుంది. కొందరు ఆ ఆలోచనలను ఆలోచన స్థాయిలోనే వదిలేస్తే, కొందరు వాటికి అక్షరరూపమో, కార్యరూపమో ఇస్తుంటారు. ఇటువంటి ఆలోచన మహాత్ములకు వచ్చినప్పుడు అది అద్భుత రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ మహాత్ముడు ఏ కవో, రచయితో అయితే ఆ అద్భుతం అక్షరాకృతిదాల్చి మహాద్భుతంగా మనముందు సాక్షాత్కరిస్తుంది. అలా సాక్షాత్కరించిన ఓ మహాద్భుతం పేరు “షోడశి”. ఆ మహాద్భుత కర్త... మహాపండితుడు, కవి అయిన శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారు. ఆ అద్భుతావిష్కరణకు మూలకారణం పరమపావనమైన రామాయణం. ఆ మూలకారణంలో గంభీరాకృతిలో దాగున్నది…చిదగ్నికుండసంభూత అయిన జగన్మాత.

సుందరకాండ పారాయణ చేసేవారికి, ఆదిత్యహృదయం చదువుకునే వారికి రామాయణంలో కొన్ని శ్లోకాలైన నోటికొచ్చుంటాయి. నిజమైన ఉపాసకులు వాటి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ఉంటారు. అయితే పైకి కనపడే అర్థం కాకుండా రామాయణం నిండా గుప్తంగా మరేదో పరమార్థం నిక్షిప్తమై ఉందన్నది ఎందరో పెద్దలు చెప్పేమాట. 24,000 శ్లోకాల రామాయణంలో గాయత్రీ మంత్రం నిక్షిప్తమై ఉందన్నది ఋషులవంటివారు చెప్పిన మాట. బ్రహ్మాండపురాణం రామాయణాన్ని మంత్రమని, సుందరాకాండను సమస్త మంత్ర రాజోయమని చెప్పెనట. అయితే అంతటి ఈ రామాయణంలో ఇమిడి ఉన్న ఆ రహస్యమేమిటి. ‘ఇదే ఆ రహస్యం’ అని దృష్టాంతాలు చూపిస్తూ కచ్చితంగా ఎవరైనా చెప్పగలరా అన్న సందేహాలకు సమాధానమే ఈ “షోడశి”.

ఎప్పటినుండో ఈ పుస్తకాన్ని చదవాలన్న కుతూహలం ఉంటూనే ఉండేది. ఆ ఉత్సుకతకు మూలం ఈ పుస్తకం ఉపశీర్షిక - “రామాయణ రహస్యాలు”. ఇంకొక కారణం ఈ పుస్తకానికి విశ్వనాథవారు రాసిన పీఠిక. శేషేంద్రశర్మగారి జయంతికో, వర్థంతికో ఏదైనా టపా పెట్టాలనుకున్నప్పుడల్లా “షోడశి” నావంక మందస్మిత వదనంతో చూస్తున్నట్టే అనిపించేది. కొద్దిరోజుల క్రితం షోడశి (హిందీ) పుస్తకాన్ని కినిగెలో ప్రచురణ నిమిత్తం పంపించారు శేషేంద్రశర్మ గారి అబ్బాయి సాత్యకి గారు Saatyaki Sonof Seshendra Sharma . ఇదివరకే తెలుగు, ఇంగ్లీషు భాషలలో “షోడశి” కినిగెలో ఈ-పుస్తకంగా ప్రచురింపబడింది. ఈసారి మళ్ళా ఆ కవర్ పేజీ నా వంక చూసే సరికి...శ్రీరామాజ్ఞ అయ్యిందేమో అనిపించింది. చదవడం మొదలుపెట్టాను.

“రసము”అంటే ఏమటి?, విద్వాంసుడనగా ఎవరు?, రససిద్ధి ఎలా కలుగుతుంది? మొదలైన విషయాలను వివరిస్తూ మొదలవుతుంది షోడశి. ఆ తరువాత నుండి రామాయణకర్త అయిన వాల్మీకిమహర్షి హృదయావిష్కరణ మొదలవుతుంది. శ్లోకాల వాచ్యార్థము, వాటి వెనుక ఉన్న నిగూడార్థము వివరించే దారిలో మన ప్రయాణం కొనసాగుతుంటుంది. మధ్యమధ్యలో వాల్మీకిమహర్షి ప్రయోగించిన ఉపమానాల వివరణ హృదయోల్లాసం కలిగిస్తుంటుంది.

“ప్రాస్పంద తైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మ మివాహి తామ్రం” - తామర కొలనులో విహరించుచున్న చేప తోక తగిలి కదిలిన ఎర్ర తామర పువ్వు వలె సీత ఎడమ కన్ను అదరెనట. ఇది సీతాదేవికి కలిగిన శుభశకునమును చెప్పడం కోసం వాల్మీకి మహర్షి వాడిన ఉపమానం. అసలు ఈ పోలిక ఊహించుకుంటుంటేనే అమితానందం కలుగుతుంది. ఇటువంటి ఉపమానాలు రామాయణం నిండా ఎన్నో ఉన్నాయట. ఇటువంటి ఉపమానాలు వాడటంలో వాల్మీకి తరవాత స్థానం కాళిదాసుదేనంటారు రచయిత. ఆ మాట చదవగానే నాకెందుకో “కావ్యానందం”లోనో లేక “సాహిత్యోపన్యాసములు”లోనో విశ్వనాథ వారు కాళిదాసు అలంకార వైభవాన్ని చెబుతూ చెప్పిన ఒక శ్లోకభావం గుర్తుకు వచ్చింది…స్థూలంగా దాని భావం ఏమిటంటే... పార్వతీదేవి, పరమశివుణ్ణి పతిగా పొందడానికి శివోపచర్యలు చేస్తున్న సందర్భంలో..ఒకరోజు పార్వతీదేవి పరిగెత్తుకు వెళుతుంటే అనుకోకుండా పరమేశ్వరుడు తారసపడ్డాడట. అప్పుడు అమ్మవారు తన పరుగుని నిభాయించుకుని, సిగ్గుపడుతూ మెల్లిగా స్వామి పక్క నుండి వెళ్ళిపోయినదట. అదెట్లా ఉన్నదంటే ఉధృత నదీప్రవాహం ఒక మహాగిరిని గుద్దుకొని శాంతించి మెల్లిగా గిరికి ప్రక్కవైపుగా ప్రవహించినట్లుగా ఉందట. ఆ వాక్యాలు కనీసం పదిసార్లైనా మళ్ళీమళ్ళీ చదువుకున్నాను అప్పట్లో. ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. అసలు కాళిదాసుకి స్ఫూర్తి వాల్మీకేనంటారు శేషేంద్రశర్మ గారు. అందుకు మేఘసందేశంలోని ఎన్నో వర్ణనలు రామాయణం నుండి తీసుకున్నవేనంటూ సోదాహరణంగా నిరూపిస్తారీ రచనలో.

ఇక సుందరకాండ కుండలినీ యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తులనుండి మంత్రశ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు.

వాల్మీకి అశోకవనంలో ఉన్న సీతను “వేష్యమానాం తథావిష్టాం పన్నగేంద్ర వధూమివ” అని వర్ణించాడట. అంటే ఆమె ఆడుపామువలె చుట్టుకుని ఉన్నదట… సీతమ్మవారు కుండలినీ శక్తి అని చెప్పడానికి రచయిత చెప్పిన ఎన్నో ఉదాహరణలో ఇది ఒకటి.

హనుమ సాక్షాత్ శ్రీవిద్యోపాసకులలో ఒకడైన నందీశ్వరభగవానుడనే అంటారు రచయిత. అందుకే ఇంద్రజిత్తు హనుమంతుని బంధించి రావణుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు - రావణుడు హనుమను జూచి, “కిమేష భగవాన్నందీ భవే త్సాక్షా దిహాగతః”అనెను. అంటే - సాక్షాత్ నందిభగవానుడే ఇక్కడకు వచ్చెనా అనుకొనెను.

ఇంకా రామాయణంలో కొన్నిచోట్ల హనుమను పింగేశుని మంత్రి అని చెబుతారు మహర్షి. అంటే వానరరాజుకి మంత్రి అని ఒక అర్థం. ఇంకొకటి...పింగ అంటే దుర్గాదేవి. ఆవిడయొక్క ఈశుడు అంటే పరమశివుడు. అతని మంత్రి నందీశ్వరుడు. కనుక హనుమ నందీశ్వరుడే. అసలు సుగ్రీవుడన్నది శివునకున్న విశేషణమే. ఆ సుగ్రీవము కల శివుని మంత్రి నందీశ్వరుడు.

ఇక త్రిజటా స్వప్నము సాక్షాత్ గాయత్రీ మంత్రమేనట. త్రిజటకు కలలో నాలుగుసార్లు శ్రీరామచంద్రుడు కనపడతాడు. ఆ నాలుగుసార్లు నాలుగు విధాలుగా రకరకాల వాహనాలలో కనపడతాడు. ఆ నాలుగు కలలు కూడా ఈ త్రిజటా స్వప్నం గాయత్రీ మంత్రమే అని చెబుతాయి.

మొదటిసారి కనిపించిన రాముడు ఏనుగు దంతాలతో చేసినదీ, వేయి హంసలు పూన్చినది, ఆకాశ మార్గమున పోవునట్టిది అగు పల్లకీ ఎక్కి వచ్చాడట. ఈ శ్లోకములో గజదంతమయి అనుచోట గజ శబ్దము చేత ఎనిమిది అని చెప్పి గాయత్రి అష్టాక్షరి అను విషయం సూచింపబడినది. దంత శబ్దముచేత గాయత్రీ మంత్రము యొక్క మొత్తం అక్షరాలు 32 అని చెప్పబడినదట. ఇలా ఇంకా ఎన్నో ప్రమాణములతో ఆ నాలుగు స్వప్నాలనూ వివరిస్తూ త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమేనని నిస్సందేహంగా చెబుతారు. నిజానికి త్రిజట అనునది గాయత్రికి చెప్పబడిన వేయి నామములలో ఒకటి కూడానట.

సుందరకాండమే రామాయణ హృదయము. సుందరకాండ హృదయము త్రిజటా స్వప్నము. ఈ త్రిజటా స్వప్నము రామాయణములో ఉన్న 24 వేల శ్లోకాలకి మధ్యలో ఉన్నదట. ఇది అత్యంత శక్తివంతము పవిత్రము అయిన గాయత్రీ మంత్రమగుట చేతనే ఇలా రామాయణ హృదయస్థానంలో వాల్మీకి మహర్షి నిక్షేపించారన్న రచయిత మాటకు కవిసమ్రాట్ దగ్గరనుండి నావంటి అర్భకుని వరకూ అందరూ ఆనందంగా తలాడించవలసినదే.

ఇంకా మహాభారతం రామాయణానికి ప్రతిబింబమని, శాకుంతలమందలి నాందీశ్లోకము దేవీస్తోత్రమేనని ఎన్నో శ్లోకాలను ఉటంకిస్తూ ఋుజువు చేస్తారు.

రామాయణం కంటే భారతమే పురాతనమన్న వాదనను ఖండిస్తూ శేషేంద్రశర్మ గారు ఉదహరించిన విషయాలు ఒకప్రక్క ఆశ్చర్యాన్ని మరోప్రక్క ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే రామాయణమున విష్ణుపారమ్యము కంటే ఇంద్రపారమ్యమే ఎక్కువ ఉన్నదన్న రచయిత భావనతో మాత్రము విశ్వనాథవారు విభేదించినట్లు ఆయన రాసిన ముందుమాట వలన తెలుస్తుంది.

ఈ “షోడశి”లో ఆయన పేర్కొన్న ఒక్కొక్క విషయాన్ని ఋుజువుచేయడానికి లలితాసహస్రం భాస్కరరాయలవ్యాఖ్య నుండి, సౌందర్యలహరి లక్ష్మీధరవ్యాఖ్య నుండి, తైత్తరీయ, కఠ ఉపనిషత్తులనుండి, పరాశరసంహితనుండి, వేదాలనుండి ఇలా శేషేంద్రశర్మగారు ఉదహరిస్తున్న శ్లోకాలను వాటి భావాలను చదువుతుంటే కొన్ని పదులసార్లు ఆయనలో ఉన్న సరస్వతికి మోకరిల్లుతుంటాం.ఈయన కచ్చితంగా ఋషే అన్న భావనను మనస్సులో స్థిరపరచుకుంటాం.

“భారత రామాయణములను కలిపి వీరు చదివినట్లు చదివిన సంఖ్య లేదనియే చెప్పవలెను. మహామేధావులైన వారితో నిండియుండిన యీ ప్రపంచములో లేరనుటకు వీలులేదు గాని యున్నచో భారతదేశమున నొకరిద్ద రుందురేమో!” అని శేషేంద్రశర్మ గారి కోసం విశ్వనాథవారన్న మాటలు గుర్తుచేసుకుంటూ, శేషేంద్రశర్మగారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ స్వస్తి!

- రాజన్ పి.టి.ఎస్.కె

వ్యాసాలు - విషయ సంక్షిప్తం[మార్చు]

ఈ రచనలో ఉన్న వ్యాసాలు

  1. వాల్మీకి వ్యాఖ్యాతలు - రామాయణమును అర్ధము చేసుకొనటకు వాచ్యార్ధము సహాయపడదు. రామాయణమునకు ప్రకాశార్ధము, రహస్యార్ధము అని రెండు వేరుగా ఉన్నాయి. గుప్తముగా ఉంచిన రహస్య చరిత్రను తెలిసికోవడానికి వివిధ గ్రంథకర్తలు ప్రయత్నించారు. సీతారాముల పరతత్వమును వాల్మీకి గుప్తముగా ఉంచి ధ్వనిరూప మాత్రంగా తెలియజేశాడు.
  2. వాల్మీకిలో వింతలు - వేదోపనిషత్తులకు, రామాయణమునకు గల సంబంధము ఆశ్చర్యకరమైనది. వాల్మీకి రచనలో నిగమాగమ భాష అప్రయత్నముగా దొర్లినట్లుండును. చాలావరకు వాల్మీకి తన ఉపమానములను, భావములను, శబ్దములను శృతులనుండియే తీసికొనెను.
  3. వాల్మీకి శబ్దములు - సీతాదేవియే శ్రీమహాలక్ష్మి అను ధ్వనిని వాల్మీకి తన రామాయణమునందు అనున్యూతముగ నిర్వహించెను. విద్యా, ప్రతిపత్ కళ, ఔపయికి వంటి ఉపమానములు ఈ భావమును సూచించును.
  4. నేత్రాతురః-ఒక చర్చ - "నేత్రాతుర" అనే వాల్మీకి శబ్దమునకు 'నేత్ర రోగము కలవాడు' అన్న అసంబద్ధ వివరణ గురించిన చర్చ.
  5. శ్రీ సుందరకాండకా పేరెట్లు వచ్చినది? - శ్రీ సుందరకాండము వాల్మీకీయ రామాయణమునకు హృదయము. "సౌందర్యం సర్వదాయికం" అనబడిన ఈ బీజకాండములో పరాశక్తి సౌందర్యమును మంత్రరూపమున నిక్షిప్తమైయున్నది. సీతకు ఋషిచే వాడబడిన ఉపమానములన్నియు పరాశక్తి రూపమున అన్వయించును. "వేష్టమానాం పన్నేంద్ర వధూమివ" అన్న వర్ణన కుండలినీశక్తిని స్పష్టముగా సూచించును. "సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధినీ" అన్న వాక్యము ఆమె మానవ కాంత కాదని తెలుపును. భాషామాత్ర పాండిత్యము ఇట్టి పరమార్ధములను తెలిసికోవడానికి అడ్డువస్తుంది.
  6. శ్రీ సుందరకాండ కుండలినీ యోగమే - శ్రీమద్రామాయణమున పరమపూజనీయములైన మహారహస్యములున్నందువలననే అది పారాయణ గ్రంథమైనది. సుందరకాండలో మొదటి శ్లోకంలోని చారిణాచరిత పథము షట్చక్రయుక్తమైన సుషుమ్నామార్గమే. సాగర లంఘనారంభము సాధనావిధానము. మైనాక, సురస, సింహికా వృత్తాంతములు గ్రంథిత్రయ భేదనములు. గిరి వర్ణనము, లంకా వర్ణనము శరీరములోని చక్రస్థానములను సూచించును. సుందరకాండలో వాల్మీకి మహర్షి నాల్గు ముఖ్యమైన రహస్యములను నిక్షేపించెను - (1) హనుమంతుని కుండలినీ యోగము (2) త్రిజటా స్వప్నము అను గాయత్రీ మంత్రము (3) రావణుని కౌళమార్గము (4) సంబంధిత విషయములు.
  7. సుందరకాండ పేరుపై చర్చ - సుందరకాండకు, సుందరహనుమన్మంత్రమునకు ఆపాదింపబడిన సంబంధాన్ని రచయిత ఆమోదించడంలేదు. "త్రిపుర సుందరి" అన్న పరాశక్తి నామమే ఈ కాండము పేరునకు మూలమని రచయిత భావన. హనుమయొక్క నిరంతర దేవీ ధ్యానము, జపము, యోగము సుందరకాండగా దర్శనమిచ్చుచున్నది.
  8. త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్రమే - ఇది రచయిత స్వపరిశోధనతో తెలిసికొన్నవిషయమని, ఇంతకుముందు ఇతరులకు ఈ రహస్యం స్ఫురించినట్లు లేదని రచయిత చెప్పినాడు. అనేక ఆధారాల ద్వారా సుందరకాండలోని త్రిజటా స్వప్నము గాయత్రీమంత్రమేనని రచయిత వివరించాడు. రామాయణమనే హారానికి త్రిజటాస్వప్న వృత్తాంతము నాయకమణివంటిది.
  9. భారతము రామాయణమునకు ప్రతిబింబము
  10. మేఘ సందేశానికి రామాయణముతో ఉన్న సంబంధము
  11. రామాయణమున విష్ణుపారమ్యము కలసనుట కంటే ఇంద్ర పారమ్యము కలదనుట సమంజసము
  12. వేదమున ఇంద్ర విష్ణువులు
  13. రామాయణము భారతమునకంటే అధునాతనమను వాదము
  14. రామాయణము భారతమునకంటే పూర్వగ్రంధమనుటకు నూతన హేతువులు
  15. శాకుంతలమందలి నాందీ శ్లోకము దేవీ స్తోత్రమే

మూలాలు[మార్చు]