షోయబ్ ఉల్లాఖాన్

వికీపీడియా నుండి
(షోయబుల్లాఖాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
షోయబుల్లాఖాన్
పుట్టిన తేదీ, స్థలం(1920-10-17)1920 అక్టోబరు 17
సుబ్రవేడు, ఖమ్మం జిల్లా
మరణం1948 ఆగస్టు 22(1948-08-22) (వయసు 27)
హైదరాబాద్
వృత్తిపాత్రికేయులు
జాతీయతభారతీయుడు
విషయంఉద్యమాలు

షోయబుల్లాఖాన్ (అక్టోబరు 17, 1920 - ఆగష్టు 22, 1948) తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.[1]

జననం

[మార్చు]

షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తర ప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడినారు. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు. తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను అతను ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు. ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు, విశాలభావాలు కలవాడు.

మరణం

[మార్చు]

ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగష్టు 22రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు. ఏ చేతులతోనైతే నిజమును వ్యతిరేకించాడో ఆ చెయ్యి, అంటే షోయబ్ కుడి చెయ్యి నీ నరికి వేసారు.

వృత్తి జీవితం

[మార్చు]

షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాకా జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు. షోయబుల్లాఖాన్ రచనా జీవితం తాజ్వీ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తాజ్వీ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న ఇమ్రోజు పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. ఇమ్రోజు పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.

రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. నిజాం రాజుకీ, అతను ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు అతను దారుణ హత్యకు కారణమయ్యాయి.

బూర్గుల నరసింగరావు కథనం

[మార్చు]

"షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి అతనుకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.కాంగ్రెస్ నాయకులు మందుముల నర్సింగరావు బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు. షోయబుల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇమ్రోజ్’ను స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు. అతను దేన్నయినా గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. అతను రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవాడు. జర్దాపాన్, సిగరెట్ అతను అలవాట్లు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రవీంవూదనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాసేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు.హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం... మలక్‌పేటలో అతను పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే అతను విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంత విచిత్రం? పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. ఇవాళ ఎంతమందికి తెలుసు అతనుంటే? ఇంత నిర్లక్ష్యమా? నిజమే.. ఎంత అలక్ష్యం?"[2]

రావెల సోమయ్య కదనం

[మార్చు]

1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు.స్వతంత్రం వచ్చిన తరువాత పేరు మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది .నిర్దాక్షిణ్యమైన చరిత్రరథం తన గమనంలో పక్షపాతంగా ఎందరో మహానుభావులను ఎక్కించుకోకుండానే వెల్లిపోతుంటుంది. అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు . ఆ రథం మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు . 1990 ల్లో నటరాజన్ అనే అతను అమెరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావుని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ అతని గురించి తెలియని చాలా విషయాలు కింద లింక్స్ లో ఉన్నాయి. మీరే నిర్ణయించండి అతని త్యాగం, గొప్పదనం .[3]

సయ్యద్ నశీర్ అహమద్ కథనం

[మార్చు]

బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగిన ప్రపంచ ప్రజాపోరాటాల చరిత్రలో అన్నివర్గాల ప్రజానీకంతోపాటుగా కలం యోధులైన పాత్రికేయులు, సంపాదకులు పలు నిర్బంధాలకు గురయ్యారు, చిత్రహింసల పాలయ్యారు, ఆంక్షలకు-నిషేధాలకు బలయ్యారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ అరుదైన త్యాగంతో 1857లో చరిత్ర సృష్టించారు. చిరస్మరణీయుడైన మహమ్మద్‌ బాకర్‌ మార్గంలో స్వేచ్ఛ-స్వాతంత్ర్యాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌.

గాంధీ విజయవాడ యాత్ర - షోయబ్ బాల్యం

[మార్చు]

అది 1920 సంవత్సరం. జాతీయోద్యమం పరవళ్ళు తొక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ విజయవాడకు వెడుతున్నారు. అతను ప్రయాణిస్తున్న రైలు ప్రస్తుత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ రైల్వేస్టేషను‌ విూదుగా సాగుతోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు హబీబుల్లా ఖాన్‌ అను పోలీసు అధికారిని నియమించారు. అతను డ్యూటీలో ఉండగా గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు రానే వచ్చింది. గాంధీజీని సమీపం నుండి చూసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ డ్యూటీని ముగించుకున్న హబీబుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్ళారు. అతను ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు అక్టోబరు17. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బిడ్డను చూసిన అతను మరింతగా సంతోషిస్తూ, అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే ...అవే కళ్ళు...అదే నుదురు. అచ్చం గాంధీలానే ఉన్నాడు, అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్‌ అని నామకరణం చేసినా హబీబుల్లా ఖాన్‌ మాత్రం తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయాబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు. ఆ బాలుడు చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ విద్యార్థిగా అతను రచనలను విస్తృతంగా చదువుతూ వచ్చాడు. ఆక్రమంలో గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన అతను గాంధీజీ బాటను తన జీవితమార్గంగా నిర్ణయించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం షోయాబుల్లా ఖాన్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు. నైజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించగల అవకాశం ఉన్నా జాతీయోద్యమానికి సేవలందించేందుకు షోయాబుల్లా ఖాన్‌ జర్నలిజాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టారు. ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం, గౌరవం గల షోయాబుల్లా ఖాన్‌ తొలుత నుండి నిరంకుశ పాలకులను వ్యతిరేకించారు. ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న తేజ్‌ ఉర్దూ వారపత్రికలో అతను చేరారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానాధీశులైన నిజాం పాలకుల నిరంకుశత్యం, ఆ పాలకుల తాబేదార్లయిన రజాకారుల, భూస్వాముల అమానుషకృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అతను వ్యాసాలు సహజంగానే పాలకవర్గాలకు రుచించలేదు. ఆ కారణంగా తేజ్‌ పత్రిక నిషేధానికి గురయ్యింది. ఆ తరువాత స్వాతంత్ర్యసమర యోధులు మందుముల నరశింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న రయ్యత్‌ ఉర్దూపత్రికలో షోయాబుల్లా ఖాన్‌ చేరారు. నిజాం పాలకుల దాష్టీకాలను, రజాకారుల చర్యలను తీవ్రంగా ఎండగడ్తూ రచనలు చేయడాన్ని అతను కొనసాగించారు. ఆ కారణంగా షోయాబుల్లా ఖాన్‌ను హెచ్చరిస్తూ అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు రాసాగాయి. ఆ బెదిరింపులను అతను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చివరకు రయ్యత్‌ పత్రిక కూడా పాలకవర్గాల ఆగ్రహానికి ఎరకాక తప్పలేదు. అతను అధైర్యపడలేదు. ప్రజల పక్షంగా అక్షరాయుధంతో నిరంకుశ పాలకుల విూద పోరాటం సాగించాల్సిందేనని షోయాబుల్లా ఖాన్‌ నిశ్చయించుకున్నారు. స్వయంగా జాతీయ భావాలను పెంపొందించగల పత్రికను ఆరంభించడానికి పూనుకున్నారు. భార్య, తల్లి ఆభరణాలను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఇమ్రోజ్‌ ఉర్దూ దినపత్రికను ప్రారంభించారు. ఇమ్రోజ్‌ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న విడులయ్యింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడ్తున్నా, ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. ప్రభువుల నిరంకుశత్వం, ఉన్మాదుల మత దురహంకారం మీద తిరుగులేని సమరం కొనసాగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ ఇండియన్‌ యూనియన్‌లో కలసి పోతున్నాయి. జునాఘడ్‌, రాంపూర్‌ లాంటి కొన్ని సంస్థానాలతో పాటుగా తొలుత నుండి బ్రిటీష్‌ పాలకులతో స్నేహం నెరపిన నైజాం సంస్థ్ధానాధీశులు ఇండియన్‌ యూనియన్‌లో తమ సంస్థానాలను విలీనం చేయడానికి నిరాకరించారు. ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో నైజాం పాలకులు చర్యలు చేపట్టారు. ఆ విపత్కర వాతావరణంలో ఇమ్రోజ్‌ పత్రికా సంపాదకునిగా షోయాబుల్లా బృహత్తర బాధ్యతలను నిర్వర్తించారు. నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం ఎంతటి అవసరమో వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుక గల స్వార్ధ రాజకీయాలను తూర్పార పడుతూ వ్యాసాలు ప్రచురించారు. హైదరాబాద్‌ సంస్థానం పరిధిలోని ప్రజలలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్‌ రాతల ప్రభావం వలన రోజురోజుకూ విలీనానికి అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు.

1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్‌ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం' అను శీర్షికతో షోయాబుల్లా రాసిన సంపాదకీయం ఈ క్రింది విధంగా సాగింది. '...ఈనాడు గ్రామస్థులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. ఇంత వరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏవిధంగా రాజ్యం చేస్తోందో అందరికి తెలుసు ... ఇత్తేహదుల్‌ ముసల్‌విూన్‌ సభ్యులు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ గ్రామాలను దోచుకుంటున్నారు. బాధ్యతయుతమైన పదవుల్లో వున్న వ్యక్తులు వీటినన్నిటిని సాధారణ చోరీ నేరాల క్రింద త్రోసివేస్తున్నారు...మా అభిప్రాయంలో ఈ అరాచక వ్యవస్థ ఒక విషవలయంగా పరిణమించింది. ఒక గ్రావిూణుడు బాధతో 'పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది' ఆన్న మాట సత్యదూరమేవిూ కాదు...ఇత్తేహదుల్‌ ముస్లివిూన్‌ సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలను ఎందుకు విధించకూడదు? ప్రజలందరికి ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని యెందువల్ల ఏర్పాటు చేయదు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి పరిపాలన సాగిస్తేనే ఏమైనా, ఏ ప్రభుత్వమైనా మనగలుగుతుంది...'[4]

ఈ పరిణామాలు నిజాం పాలకవర్గాలకు కంటక ప్రాయమయ్యాయి. కలం యోధుడు షోయాబుల్లాను నయానా, భయానా నచ్చచెప్పి అతను కలాన్ని నియంత్రించాలని పాలక వర్గాలు శతవిధాల ప్రయత్నించాయి. అన్నిరకాల ఆశలు చూపాయి. తమ ప్రయత్నాలు ఏమాత్రం నెరవేరకపోవడంతో, భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, చివరికి పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశాయి. ఆ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయక, నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాల్సిందేనని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిజాం సంస్థ్ధానాన్ని స్వతంత్ర రాజ్యం కానివ్వరాదన్న పట్టుదలతో రచనలు చేస్తూ వచ్చిన షోయాబుల్లా ఖాన్‌ ఆ హెచ్చరికలను గడ్డిపోచ క్రింద జమకట్టారు. అనునిత్యం హెచ్చరికలను ఎదుర్కొంటూ కూడా వజ్ర సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్న షోయాబుల్లా అంటే ప్రేమాభిమానాలు గల స్వాతంత్ర్యసమరయోధులు బూర్గుల రామకృషారావు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అతనుకు సలహలిచ్చారు. ఆ సలహాలకు సమాధానంగా, సత్యాన్వేషణలో ఒక వ్యక్తి మరణిస్తే అది గర్వించదగిన విషయమని గాంధీజీ చెప్పారుకదా! అటువంటప్పుడు నేనెందుకు భయపడాలి' అంటూ షోయాబుల్లా ఖాన్‌ ప్రత్యుత్తర మిచ్చి బూర్గులను ఆశ్చర్యచకితుల్ని చేశారు.

మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జీవించాలని కోరుకుంటూ తన రచనల ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్న షాయాబుల్లా ఖాన్‌ వలన కలుగుతున్న నష్టాలను రజాకారులు, నిజాంను సమర్థిస్తున్న భూస్వామ్యవర్గాలు గమనించసాగాయి. మతం పేరుతో ప్రజలను విడదీసి, స్వతంత్ర రాజ్యాన్ని నిలుపుకోవాలనుకుంటున్న స్వార్థపరశక్తులకు షోయాబుల్లా రచనలు భరించరానివిగా తయారయ్యాయి. మతసామరస్యం ఐక్యత, పరస్పర సదవగాహన, మత మనోభావలను గౌరవించడం లాంటి ప్రయత్నాలు నైజాం పాలకవర్గాల కలలను కల్లలు చేస్తాయని నైజాం అనుకూడ శక్తులు నిర్ణయానికి వచ్చాయి. ఒక చిన్న ఉర్దూ పత్రిక సంపాదకుడు బలమైన నైజాం ప్రభువుల అభీష్టానికి వ్యతిరేకంగా రాయడాన్ని, ప్రభువు పక్షాన వెలువడిన ఆజ్ఞలను ఎదిరిస్తూ ముందుకు సాగుతున్న షోయాబుల్లా ఖాన్‌ను ఏమాత్రం నియంత్రించలేక పోవడాన్ని అవమానంగా భావించారు. ఆ విధంగా ఆగ్రహించిన పాలకవర్గాల తొత్తులు నైజాం సంస్థ్దానానికి, రజాకారులకు వ్యతిరేకంగా పత్రికల్లో రాసేవారి, ప్రజల్లో మాట్లాడేవారి అంతు చూస్తామని బహిరంగంగా ప్రకటించారు.

ఈ మేరకు 1948 ఆగస్టు 19న హైదరాబాదులోని జమురుద్‌ సినిమా హాలులో జరిగిన సభలో రజాకారుల నాయకుడు ఖాశింరజ్వీ ప్రసంగిస్తూ, ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. భారతప్రభుత్వ ఏజెంట్లుగా మా సమైక్యతను ధ్వంసం చేయాలన్న కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీలులేదు. ఆ చేతులు క్రిందకు దిగాలి లేదా నరికి వేయబడాలి' అని ప్రకటించాడు.[5] . ఆ ప్రకటను అనుగుణంగా కార్యాచరణ దూపుదిద్దుకుంది.

అది 1948 సంవత్సరం ఆగస్టు 21. అర్థరాత్రి గడిచింది. ఆ రాత్రి షోయాబుల్లా ఖాన్‌ జీవితంలో భయంకర కాళరాత్రి అవుతుందని ఎవ్వరూ ఊహించ లేదు. అతను ఇమ్రోజ్‌ ఉర్దూ పత్రిక కార్యాలయం నుండి సహచరులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌తో కలసి లింగంపల్లి చౌరాస్తా సవిూపాన ఉన్న ఇంటికి బయలు దేరారు. చౌరాస్తా దాటి కొంత ముందుకు వెళ్ళేసరికి వారిని ఎవరో అను సరిస్తున్నట్టు అన్పించింది. అది అతను దారిలో మృత్యువు రూపంలో కాపువేసి ఉన్న గుంపు. అతను దాన్ని ఏమాత్రం పట్టించు కోలేదు. ఆ గుంపు అతనును అనుసరిస్తూ వెనకాల వచ్చింది. ఆకస్మికంగా షోయాబుల్లా ఖాన్‌, అతను సహచరుడు ఇస్మాయిల్‌ విూద దాడి చేసింది. షోయాబుల్లా పైన తుపాకి గుళ్ళ వర్షం గురిసింది. తుపాకి గుండ్లకు గురైన షోయబుల్లా నేల కూలారు. బాధను పంటిబిగువున పట్టి, దుండగుల నుండి తప్పించుకోటానికి ప్రయత్నించారు. అయినా వదలకుండా ఆ హంతక ముఠా అతనును తరిమి తరిమి చేజిక్కించుకుని మతోన్మాద చర్యలను, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ సంపాదకీయాలు రాసిన అతను చేతులను నరికి వేసింది. ఈ విధంగా నైజాం పాలకుల ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా వ్యాసాలు, సంపాదకీయాలు రాసిన షోయాబుల్లా ఖాన్‌ చేతులు తెగి హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున పడ్డాయి. ఆ దుర్మార్గాన్ని అడ్డుకున్న షోయాబుల్లా ఖాన్‌ సహచరులు ఇస్మాయిల్‌ కూడా దాడికి గురయ్యారు. అతను ముంజేతిని దుండగులు దారుణంగా నరికేశారు. అతను మీద కత్తులు దాడులు చేశాయి. అతను మరో చేతి వేలు కూడా తెగిపడింది. అతను కేకలు వేశారు. ఆ కేకలకు సమీపంలోగల ప్రజానీకం ఇళ్లనుండి బయటకు రావడంతో కిరాతకులు పరారయ్యారు. తుపాకి కాల్పుల వలన, కత్తుల దాడి వలన బాగా గాయపడి రక్తంవోడుతున్న షోయాబుల్లా ఖాన్‌ను ప్రజలు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న చివరి క్షణాలలో కూడా తనకు ప్రియమైన ఇమ్రోజ్‌ను సక్రమంగా నడపాలన్న ఆకాంక్షను షోయాబుల్లా ఖాన్‌ వ్యక్తంచేశారు. కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తల్లితండ్రులను సముదాయిస్తూ, మరణం అనివార్యం. చావు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు విూరు సంతోషించాలి, అన్నారు. అసమాన ధైర్య సాహసాలతో చివరిక్షణం వరకు అక్షరసమరం సాగించిన షోయబుల్లా ఖాన్‌ మృత్యువుతో పోరాడుతూ 1948 ఆగస్టు22 తెల్లవారుజామున కన్నుమూశారు. కలంయోధుడు అంతిమ యాత్రకు నైజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అతికొద్ది మంది బంధువులు, జాతీయ కాంగ్రెస్‌్‌ కార్యకర్తలు, బహు కొద్దిమంది జర్నలిస్టులు మాత్రమే అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయమై ఆరా తీసేందుకు ప్రభుత్వ గూఢచారి విభాగం పెద్ద సంఖ్యలో అంతిమ యాత్రను అనుసరించడం వలన భయానక వాతావరణం నెలకొంది. ప్రజల మనస్సులో ఆ కలం యోధునికి అంతిమ శ్రద్ధాంజలి అర్పించాలని ఉన్నా ప్రభుత్వ పోలీసువర్గాల భయం కారణంగా అతను చివరి యాత్రలో పాల్గొనలేక పోయారు. చివరకు షోయాబుల్లా ఖాన్‌ భౌతికకాయాన్ని గోషామహాల్‌ కుంట ఎదురుగా ఉన్న ఖబరస్థాన్‌లో ఖననం చేశారు.

ఆ మరుసటి రోజున షోయాబుల్లా ఖాన్‌ హత్యోదంతం మీద నైజాం ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సంఘటన విూద గూఢచారి విభాగం దర్యాప్తు జరిపిందని, అది రాజకీయ హత్య ఏమాత్రం కాదని, ఈ హత్యవెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఏమీ లేవని ప్రకటించింది. అది వ్యక్తిగతమైన శత్రుత్వం వలన మాత్రమే జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటూ, ఈ సంఘటన మీద ఇంకా విస్తృతంగా దర్యాప్తు జరుగుతుందని ప్రకటించి నైజాం ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి ముహమ్మద్‌ బాకర్‌ అమరుడైన తరువాత ఒక సంపాదకునిగా జాతీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ, నిరంకుశ పాలకుల కిరాతకత్వానికి బలైన ఏకైక పాత్రికేయుడిగా షోయాబుల్లా ఖాన్‌ మరోచరిత్ర సృష్టించారు. భారతదేశ స్వాతంత్ర్యసంగ్రామ చరిత్రలో 1857లో ముహమ్మద్‌ బాకర్‌, 1948లో షోయాబుల్లా ఖాన్‌ తప్ప, ఆంగ్లేయుల, ఆంగ్లేయుల వత్తాసుదారుల దాష్టీకాలను అక్షరాయుధాలతో ఎదుర్కొని, ఆ క్రమంలో ప్రాణాలను సైతం బలిపెట్టిన మరో సంపాదకుడు గాని, ఇంకో పత్రికాధిపతి గాని కన్పించరు. ఆ విధంగా భారత స్వాతంత్ర్యసంగ్రామ చరిత్ర తొలిథలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలిథలో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్ఠలు సమకూర్చిపెట్టారు.[6]

పాత్రికేయునిగా

[మార్చు]

సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అjఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, అతను తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు.

కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషను రోడ్ లో ముష్కరులు అతను వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. 1948 ఆగస్టు 22 న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేధించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో అతను ఖననం జరిగింది.[7], [8]

మూలాలు

[మార్చు]
  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి ప్రచురణ, 2006, పేజీ ...write it in English as well, thanks.~Jem293
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-21.
  3. https://www.facebook.com/photo.php?fbid=191811704341396&set=a.173030969552803.1073741829.100005377021376&type=1
  4. హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర పుటలు, హిందీ మూలం: శ్రీ ఖండేరావు కులకర్ణి, తెలుగుసేతః శ్రీ నిఖిలేశ్వర్‌, నవభారతి, విజయవాడ, 1979, పేజి.70-71
  5. (హైదరాబాద్‌ అజ్ఞాతచరిత్ర పు.73)
  6. హైదరాబాద్ మిర్రర్ 22.8.2013,,భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు
  7. http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-12-05.