సత్యభామా సాంత్వనము
| శీర్షిక | సత్యభామా సాంత్వనము |
|---|---|
| Form of creative work | పుస్తకము |
| రచయిత | లింగనమఖి శ్రీకామేశ్వర కవి |
| ప్రచురణకర్త | శృంగార కావ్య గ్రంథ మండలి |
| ప్రచురణ తేదీ | 1937 |
| ప్రచురించిన స్థలం | మచిలీపట్నం |
| భాష | తెలుగు |
సత్యభామా సాంత్వనము ఒక ప్రబంధ కావ్యం. ఈ ప్రబంధ కావ్య రచయత లింగనమఖి శ్రీకామేశ్వరకవి.
కావ్య పరిచయం
[మార్చు]దక్షిణాంధ్ర ప్రాచీన వాఙ్మయంలో ప్రశస్తమయిన ప్రబంధములలో సత్యభామా సాంత్వనము ఒకటి. ఆంధ్రవాఙ్మయమున సాంత్వనమను పేరు గల కావ్యములలో ఇది మొదటిది. తరువాత సముఖము వేంకటకృష్ణప్ప నాయఁడు రచించిన రాధికా సాంత్వనము, దాని ననుసరించి ముద్దుపళని రాధికా సాంత్వనము కూడా వచ్చాయి. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమయిన తరువాత తంజావూరు, మధుర, పుదుక్కోట, సేలము, కార్వేటినగరము మొదలగు రాజ్యములు ఆంధ్రసాహిత్య సంపదకు నెలవైనాయి. వాటిల్లో మధురను క్రీ. శ. 1670 ప్రాంతములఁ బరిపాలన మొనర్చిన ముద్దళఘరి నృపాలుడు అళఘరికి ఈ కృతిని అంకితము చేసాడు. కృతిపతి, అళఘరి తిరుమలనాయకుని మనుమడు. ఈ తిరుమలేంద్రుడు, క్షేత్రయ్యను సముఖానికి రప్పించుకొని బహుకాలము నిలుపుకొన్న సరసనాయకుడు. [1]ఈ మధుర శ్రీకృష్ణుని జన్మస్థలము అయిన మధురాపురము కాదు. ఇది పొండ్య మండలములకు రాజధాని యైన దక్షిణ ప్రాంత మధుర.[2]
'ప్రబంధ యుగము-సాహిత్య భాష' రచయత ఖండవల్లి లక్ష్మిరంజనం ఈ కావ్యం గురించి ప్రస్తావిస్తూ "మధురనాయక రాజ్యంలో కూడా తంజావూరునందలి సాహిత్యప్రక్రియలే వర్దిల్లాయి. మధురరాజ్యపు కవుల్లో శృంగారరస సమాశ్రయణం ఓచూపు వాసి విశృంఖలమనే చెప్పాలి. ఇక్కడి విద్వత్కవుల్లో సత్యభామా సాంత్వనము వ్రాసిన లింగనమఖి కామేశ్వరకవి ప్రముఖుడు" అని పేర్కొన్నాడు.[3]
శ్రీకామేశ్వరకవి సత్యభామా సాంత్వనమను శృంగార ప్రబంధాన్ని నాలుగు ఆశ్వాసాలలో రచించాడు.
- మొదటి ఆశ్వాసము అవతారిక. ఆచార ప్రకారం ఇష్టదేవతస్మరణం తరువాత ముప్పయి నాలుగు పుటలలో మధురనాయకుల వంశ క్రమము విపులముగ వర్ణించాడు. ఆ వెనుక కథాప్రారంభమున ద్వారకాపుర వర్ణనము, శ్రీకృష్ణుఁడు ద్వారకను ఏలడమనే విషయం తెలుపారు.
- రెండవ ఆశ్వాసములో ఇంద్రాగమనము ఇంద్రుఁడు నరకాసురుని వృత్తాంతముఁ జెప్పి శ్రీకృష్ణునిచే నరకాసురుని వధింతునని ప్రతిజ్ఞ చేయించుట, వసంతోత్సవవర్ణనము, శ్రీకృష్ణ సత్యభామల విహారము, యుద్ధయాత్రకు బయలుదేరిన సత్యభామని కృష్ణుడు నివారించుట, నరకాసురపుర మగు ప్రాగ్జ్యోతిష సమీపమున దండు విడియుట, ద్వారకలో సత్యభామ విరహము మొదలగు అంశాలు ఉన్నాయి.
- మూడవ ఆశ్వాసమున దండు విడుదల, శ్రీకృష్ణుని విరహావస్థయు, కలవింకుని హాస్యప్రసంగము, సత్యభామ చిలుక రాయభారము, కృష్ణుఁడు విరహమును సహింపఁ జాలక ప్రద్యుమ్ను కుమారుని సత్యభామ వద్దకు పంపి యామెను రప్పించుటయు వంటి విషయాలు ఉన్నాయి.
- నాలుగవ ఆశ్వాసమున నరకాసురుని బంటు పూర్వజన్మ వృత్తాంతము చిలుక చెప్పుట, వాని ద్వారా నరకాసురుని యుదంతము కృష్ణుడు తెలుసుకొనుట, వర్ష శరదృతు వర్ణనలు, యుద్ధప్రారంభము, సత్యభామ యుద్ధకౌశలము, నరకాసుర సంహారము, అదితి కుండల దానము, భగదత్తపట్టాభిషేకము, నరకుని చెరలోని పదహారువేల స్త్రీ (చేడియ) లను శ్రీకృష్ణుడు పెండ్లి యాడుట, సత్యభామ ప్రణయ కోపమును శ్రీకృష్ణుడు సొంత్వనము సేయుటయు, ఫలశుృతి, ముగింపు ఉన్నాయి.
ఈ కావ్యం శృంగార రస ప్రధాన మైనప్పటికీ వీర, రౌద్ర, హాస్యరసములు కూడా కనపడుతాయి. శ్రీకృష్ణుఁడు నాయకుఁడు, సత్యభామ నాయికగానున్న యీ శృంగార కృతి, వీర రౌద్ర రసములును, అద్భుత రసమును, సత్యభామ యుద్ధవిహారఘట్టము, కలవింకుని హాస్య ధోరణి కనపడుతాయి.[4]
| ఉ. | ఆపురమందుఁ గెంపుజిగి యందపుఁ గోట పయోధికన్యకు౯ | |
| ఉ. | తావులవెంబడిం గదలి తార్కొ నెఁ దేఁటు తేఁటి ఱ్కెలం | |
| ఉ. | చూడక చూచినట్లు తమి సోలుచు సొక్కుచు మోహ ముంచి మా | |
| శా. | భాసిల్లె న్ని సోదరేందుశుభగం భావక్రియా వీక్షణో | |
లింగనమఖి శ్రీకామేశ్వరకవి
[మార్చు]లింగనమఖి శ్రీకామేశ్వరకవి మొదట శ్రీకాళహస్తి నివాసుఁడు. తరువాత మధురాపురమున రాజనమ్మానములను చూసి అక్కడే స్థిరపడ్డాడు. యీతని తలిదండ్రులు కామాక్షమ్మ, నాగనామాత్యుఁడు. ఈతని వంశమున బహుమఖములనాచరించిన లింగనము ప్రసిద్ధుడగుటచేత యింటి పేరు లింగనమఖివారు అయినది. ఈతఁడు సంస్కృతాంధ్రములయందు పండితుఁడు. సత్యభామా సాంత్వనము కావ్య గద్యంలో '"వల్లకీ వాదన ధురీణ " యను విశేషణం వలన ఇతను వీణావాదనముఁలో సంగీతములో ప్రసిద్ధి చెందినవాఁడు అని తెలుస్తున్నది. ఇంకా నీతఁడు గేయకృతులు అనేకం రచియించి నట్లు 'వర్ణ గీతాది గాంధర్వస్వరనవీన కల్పనా ప్రవీణ యనునది స్పష్టపఱచు చున్నది.[2][4]
పేరు వివరణ
[మార్చు]ఈ ప్రబంధ కావ్య రచయత పేరు శ్రీకామేశ్వరకవి యని తెలుస్తున్నప్పటికీ చాలావరకు ఈతని రచనలు ముద్రించినవారందరు ఈయన పేరు గ్రంథకర్త కామేశ్వరకవి అనే ముద్రించారు. ఉదాహరణకి కీర్తిశేషులు వీరేశలింగముపంతుల 'కవులచరిత్రము' లో, ప్రాచ్యలిఖితపుస్తకాగారవివరణము, శృంగారగ్రంథమాలాముద్రణము అయితే ఇతను తన గద్యమున 'శ్రీకరకవితాకరసుజనవిధేయ శ్రీకామేశ్వరనామధేయప్రణీతం బైన' అని వ్రాసికొని యున్నాడు. నిడదవోలు వెంకటరావు తన తాళపత్రగ్రంథముల పరిశోధనలలో కూడా ఈ విధముగానే ఉంది అని పేర్కొన్నారు. ఇదే కాకుండా శ్రీకామేశ్వరకవి తన గురించి ఈ క్రింది కంద పద్యాలలో శ్రీ అని చేర్చి చెప్పడాన్ని గమనించవచ్చు.[4]
| కం. | కాకులవలె నింటింటను | |
| కం. | ఏభాషనైనఁ గృతిపతి | |
మొదటి పద్యమును ప్రాస కొరకు, రెండవపద్యమును యతికొరకును 'శ్రీ' చేర్చినాఁ ఈ క్రింది పద్యంలో శ్రీ బదులు'తిరు' అని చేర్చడం కూడా కనిపిస్తుంది. శ్రీ శబ్దమునకు ద్రావిడమున 'తిరు' అను రూపం వస్తుందని నిడదవోలు వారి వివరణ.
| చ. | అనువుగ రుక్మిణీ◆పరిణయంబును మున్ హవణించి యార్యు లౌ | |
ముద్దళఘరి 1659 వరకు మధురను పరిపాలించాడు. క్రీ. శ. 1670 సంవత్సర ప్రాంతమున ముద్దళఘరి సత్యభామాసాంత్వనము గృతిని అందుకున్నాడు కాబట్టి కవి క్రీ.శ. 1670 ప్రాంతములో జీవించాడు అని చెపుతారు.[4]
కవి ఇతర రచనలు
[మార్చు]ఇతని ప్రబంధ కృతులలో సత్యభామా సాంత్వనము తప్ప మిగిలినవి అందుబాటులో లేవు. మొదటగా కవి రుక్మిణీ పరిణయము రచించినట్లు ఈ క్రింది పద్యము వలన తెలుస్తోంది.
| తే.గీ. | | |
కామేశ్వరకవి ధేనుకా మాహాత్మ్యము, ఆచార్య విజయము అను రెండు వచన కావ్యాలు రచించెను. ఇందు మొదటి గ్రంథ మొక్కటే కనబడు చున్నది. "ధీరులు పాక వైరి లోక వికచ కల్పక స్తబక గంధ ధురంధర సూక్తియుక్తి నౌనవునని మెచ్చ నావుల మహ త్త్వమొనర్చితి" నని అతడే చెప్పుకొనియున్నాడు.
శ్రీకామేశ్వరకవి రచించిన 'ధేనుమహత్మ్యము' అనే వచన కావ్యము తంజావూరు పుస్తకశాలలో ఉంది. దీనిని ముద్రించలేదు.[4] ఈ కవి ఇందు గోమహాత్మ్యమును వర్ణించాడు. శైలి సులభ గ్రాంథికము. ఉదా: ఆవుపాలమృతంబని అమరవిభుండు పలుకరించెగనుక, ఆవునిచ్చిన అమృతము నిచ్చిన ఫలము కలుగును. మేపుతో గూడ మేలైన దూడఆవును, వృషభమ్మును నెవ్వ డొసంగు నతండు స్వర్గంబునందు సుఖంబు జెందు.”[5]
కవి సంస్కృతాంధ్ర భాషల యందు పాండిత్యమున్నప్పటికినీ తన పద్యాలలో తెలుఁగుకవిగా జాతీయములను ఉపయోగించాడు. గ్రంథమున తెలుగు పదాలు, నవ్య భాషాపదములు, వాడుక మాటలు, దీర్ఘ సమాసాలున్న పద్యములు కవికి గల గీర్వాణ భాషా పాండిత్యమును తెలియ చేస్తున్నవి.[4]
వికీసోర్స్
[మార్చు]పూర్తి ప్రతి
[మార్చు]- "సత్యభామాసాంత్వనము" 166 పుటల గ్రంథము. ఈ కావ్య రచయిత లింగనమఖి శ్రీకామేశ్వరకవి. కె.జి.మూర్తి శృంగారకావ్యగ్రంథమండలి, మచిలీపట్టణం వారి తరపున 1937లో ప్రచురించాడు. భూమికను నిడుదవోలు వేంకటరావు రచించారు.
వికీసోర్స్ లింక్ - సత్యభామాసాంత్వనము[4]
ఇతర ప్రస్తావనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "సాహిత్య భాషగా తెలుగు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-12-18.
- ↑ 2.0 2.1 2.2 కందుకూరి వీరేశలింగం పంతులు (1911). . pp. 18–19 – via Wikisource.
- ↑ 3.0 3.1 "సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గద్యవాఙ్మయము (తెలుగు) - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-12-18.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 లింగనమఖి శ్రీకామేశ్వర కవి (1937). "భూమిక". . మచిలీపట్టణము: కె. జి. మూర్తి. శృంగారకావ్యగ్రంథమండలి – via Wikisource.
- ↑ "సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గద్యవాఙ్మయము (తెలుగు) - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-12-18.
