సమీక్ష
సమీక్ష అంటే ఏదైనా ప్రచురణ, ఉత్పత్తి, సేవ, సంస్థను లేదా సాహిత్యం, రాజకీయాలు, సంస్కృతుల మీద చేసే విమర్శనాత్మక అభిప్రాయం. ఇందులో సమీక్ష చేయడమే కాక ఇతర వాటితో పోలిస్తే ఎంత బాగుందనేది చెప్పడం కోసం రేటింగ్ కూడా ఇస్తుంటారు.
సినిమాలు, వీడియో గేములు, పుస్తకాలు, సంగీత కృతి లేదా భౌతిక ఉత్పత్తులైన కార్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్, ప్రదర్శన కార్యక్రమాలు ఇలా వేటినైనా సమీక్ష చేయవచ్చు. ఆన్‌లైన్ సమీక్ష వేదికల్లో వినియోగదారులు తామ కొన్న ఉత్పత్తులపై సానుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిష్పాక్షిక నివేదికలు ఇవ్వవచ్చు. వీటిని చూసి వ్యాపార సంస్థలు తమ సేవలు, ఉత్పత్తులు మెరుగుపరుచుకోవచ్చు.[1]
వాడుకరి సమీక్ష
[మార్చు]ఒక వినియోగదారుడు తాను వాడిన ఉత్పత్తిని, లేదా అందుకున్న సేవ గురించి చెబుతూ స్వంత అనుభవాలతో సమీక్ష రాయవచ్చు. అమెజాన్.కాం, జాపోస్ వంటి ఇ-కామర్స్ సైట్‌లు, ఇంకా ట్రిప్ అడ్వైజర్, యెల్ప్ వంటి సామాజిక మాధ్యమాలు ఇలాంటి సమీక్షలను కలిగి ఉంటాయి. ఇ-కామర్స్ సైట్‌లు ఉత్పత్తులు, విక్రేతల కోసం వినియోగదారు సమీక్షలను విడిగా కలిగి ఉంటాయి. సాధారణంగా, వినియోగదారు సమీక్షలు సంఖ్యా రేటింగ్‌తో కూడిన అనేక పంక్తుల పాఠ్య రూపంలో ఉంటాయి. ఈ పాఠ్యం కాబోయే కొనుగోలుదారు షాపింగ్ నిర్ణయంలో సహాయపడటానికి ఉద్దేశించినది. ఉత్పత్తి వినియోగదారు సమీక్ష సాధారణంగా తయారీదారు లేదా విక్రేత అందించిన స్పెసిఫికేషన్‌ల ఆధారంగా ఉత్పత్తి అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో వ్యాఖ్యానిస్తుంది. ఇది పనితీరు, విశ్వసనీయత, నాణ్యత లోపాలు, వస్తువు ధరకు సరైనదేనా అనే విషయాల గురించి మాట్లాడుతుంది.
పుస్తక సమీక్ష
[మార్చు]పుస్తక సమీక్షలో ఒక పుస్తకాన్ని అందులో ఉన్న విషయం, దాని శైలి, ప్రశస్తి ఆధారంగా సమీక్ష చేస్తారు. ఇవి పత్రికల్లోనూ, ఆన్‌లైన్ లోనూ, కళాశాలల్లోనూ చేస్తుంటారు. ఇవి ఒక్కో పేరా నుంచి పెద్ద వ్యాసం వరకు అయి ఉండవచ్చు. ఒక వేళ పుస్తకం కవిత్వమో, లేక కాల్పనిక, వాస్తవ సాహిత్యమైతే అదే సాహితీ విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియ అవుతుంది. ఇందులో కాల్పనిక సాహిత్యమైతే అందులో ఉన్న విలువల గురించి, వాస్తవిక సాహిత్యం అయితే అది ఎంత వరకు ఆచరణయోగ్యమైనదీ, చదువరులను ఎలా ఆకట్టుకుంటుంది అనే విషయాలపై సమీక్ష చేస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "True Reviews: Open Platform for Customers to Share Feedback". truereviews.uk (in ఇంగ్లీష్). True Reviews. 2025-04-25. Retrieved 2025-04-25.