సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ
నవాబ్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, ఇమాదుల్ ముల్క్ బహదూర్, సి.ఎస్.ఐ (1842-1926)[1][2][3] భారతీయ పాలనాధికారి, రాజకీయనాయకుడు, అఖిల భారత ముస్లిం లీగు యొక్క తొలి నాయకుల్లో ఒకడు.
ప్రారంభ జీవితం
[మార్చు]సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, 1844లో గయ సమీపంలోని సాహిబ్‌గంజ్‌లో జన్మించాడు. సాదత్-ఏ-బిల్‌గ్రామీ నుండి వలస వచ్చిన కుటుంబంలో జన్మించాడు. వీరి పూర్వీకులు మహమ్మద్ ఘోరీతో పాటు భారతదేశం వచ్చారని చెప్పుకుంటారు. ఈయన తండ్రి సయ్యద్ జైనుద్దీన్ హుస్సేన్ ఖాన్ బీహార్లో డిప్యుటీ కలెక్టరు మాజిస్ట్రేటు.[4] ఈయన కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఈయనకు 1864లో వివాహం అయ్యింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. 1897లో భార్య మరణించింది. సయ్యద్ హుస్సేన్ 1910లో హైదరాబాదుకు చెందిన ఆంగ్లేయ వైద్యురాలు ఈడిత్ బోర్డ్‌మాన్ ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు.[5]
ఉద్యోగ జీవితం
[మార్చు]1866 నుండి 1873 వరకు లక్నోలోని కాన్నింగ్ కళాశాలలో అరబిక్ ఆచార్యునిగా పనిచేసి[1] ఆ తర్వాత హైదరాబాదు నిజాం కొలువులో చేరాడు.[2] సాలార్‌జంగ్ మరణించేదాకా ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆ ఉద్యోగంలో ఉండగా హుస్సేన్ బిల్‌గ్రామీ, సర్ సాలార్‌జంగ్‌తో పాటు, 1876లో బేరార్‌ను నిజాంకు దత్తం చేయాలని విక్టోరియా మహారాణిని కోరటానికి ఇంగ్లాండు వెళ్ళాడు.[6] ఈ చిరస్మరణీయమైన ఇంగ్లాండు పర్యటనలో, ఈయనకు విక్టోరియా మహారాణిని కలిసి, ముచ్చటించే భాగ్యం కలగటమే కాక, డిజ్రేలి, గ్లాడ్‌స్టోన్, లార్డ్ సాలిస్‌బరీ, జాన్ మార్లీ తదితరులను కలిశాడు.[4]
ఆ తర్వాత, అనేక హోదాల్లో హైదరాబాదు నిజాం యొక్క ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. 1887 నుండి 1902 వరకు నిజాం రాజ్యంలో ప్రభుత్వ బోధనకు నిర్దేశకుడిగా పనిచేశాడు. 1901 నుండి 1902 వరకు యూనివర్సిటీస్ కమీషన్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ వెనువెంటనే ఇంపీరియల్ శాసనమండలిలో సభ్యుడిగానూ, 1907 నుండి 1909 వరకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క కౌన్సిల్లోనూ పనిచేశాడు 1907లో అనారోగ్య కారణాలవల్ల నిజాం కొలువునుండి విరమణ పొందాడు.[1]
ఈయన నిర్వహించిన కార్యాలలో అతి ముఖ్యమైనది, విద్యావేత్తగా చేసిన కృషి. ఈయన స్థాపించిన విద్యాసంస్థనే ఆ తర్వాత కాలంలో నిజాం కళాశాలగా రూపుదిద్దుకుంది. 1885లో ఈయన దేశంలోనే మొదటిదైన బాలికల పాఠశాలను స్థాపించాడు.[7] ఈయన క్షీణిస్తున్న పరిశ్రమలను పునరుద్ధరించడానికి, నిజాం రాజ్యంలోని మూడు ప్రధాన పారిశ్రామిక కేంద్రాలైన ఔరంగాబాదు, హైదరాబాదు, వరంగల్లలో మూడు పారిశ్రామిక పాఠశాలలను స్థాపింపజేశాడు. హైదరాబాదులోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం కూడా బిల్‌గ్రామీ స్థాపించినదే.[8]
ఈయన చేసిన కృషికిగాను, నవాబ్ అలీ యార్ ఖాన్ బహదూర్, మోతమన్ జంగ్, ఇమాదుద్దౌలా, ఇమాదుల్ ముల్క్ అనే బిరుదులు పొందాడు. బ్రిటీషు ప్రభుత్వానికి చేసిన సేవలకు, భారత ప్రభుత్వం ఐ.ఎస్.ఐ సత్కారాన్ని పొందాడు.[4] 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పొందిన తొలి వ్యక్తి ఈయనే.[9]
ప్రచురణలు
[మార్చు]- Life of Sir Salar Jung
- Lectures and Addresses
- Historical and Descriptive Sketch of His Highness the Nizam’s Dominions, 2 vols.
- Verses[10]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 The Indian Biographical Dictionary. 1915.
- ↑ 2.0 2.1 Robinson, Francis (1974). Separatism Among Indian Muslims: The Politics of the United Provinces. Cambridge University Press.
- ↑ Eminent Mussalmans. G. A. Natesan Publishers, Madras. India. 1925.
- ↑ 4.0 4.1 4.2 "Eminent Mussalmans". archive.org. Retrieved 2016-03-29.
- ↑ Pakistan Perspectives, Volume 5. Pakistan Study Centre, University of Karachi. 2000. p. 101. Retrieved 17 November 2017.
- ↑ Burke, Edmund (1927). The Annual Register, Volume 168. Rivingtons. p. 138. Retrieved 23 November 2017.
- ↑ Bilgrami, Syed Husain (1925). Addresses Poems And Other Writings. Hyderabad, India: Govt Central Press. pp. v–xi.
- ↑ "Eminent Mussalmans". archive.org. Retrieved 2016-03-29.
- ↑ "ఆ డాక్టరేట్‌కు ఎంతో గౌరవం". సాక్షి. Apr 24, 2017. Retrieved 18 November 2017.
- ↑ Bilgrami, Syed Husain (1898). Verses. Hyderabad, India: The Nizam's Govt. Printers Press. p. 52.