సరస్వతుల రామ నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరసి
సరస్వతుల రామ నరసింహం
జననం(1956-07-05)1956 జూలై 5
India బోడపాడు ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాదు
ఉద్యోగంరిటైర్డ్ రిసోర్సింగ్ అసిస్టెంట్ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
ప్రసిద్ధిప్రముఖ కార్టూనిస్ట్, రచయిత
మతంహిందూ
భార్య / భర్తరత్నం
పిల్లలుకృష్ణ చైతన్య (కుమారుడు), భారతి (కుమార్తె)
తండ్రివెంకటేశ్వర్లు
తల్లివెంకట రమణమ్మ

సరస్వతుల రామ నరసింహం కార్టూనిస్టు, రచయిత. అతను సరసి పేరుతో కార్టూన్లు వేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్‌లోని అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానందరెడ్డి తైల వర్ణచిత్రాలు ఇతను వేసినవే. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ అవార్డులు వచ్చిన చిత్రకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

సరస్వతుల రామ నరసింహం, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టాడు. ఆయన ఎం.ఎ. (ఫిలాసఫి), ఎల్. ఎల్.బి పూర్తి చేసారు. 'సరసి' కలం పేరుతో కథా రచనలు, కార్టూన్లు రచించాడు. గురువు తమ్మా సత్యనారాయణ శిక్షణలో సాంప్రదాయిక చిత్ర కళను నేర్చుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. రాష్ట్ర శానసభలో సహాయ కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యాడు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, తనకిష్టమైన చిత్రకళను, కథా రచననూ సాగించాడు.[1]

ప్రచురణలు[మార్చు]

నాలుగు వందలకు పైగా కథలు, వేల సంఖ్యలో కార్టూన్లను వెలువరించాడు. అతని కథలు పలు మాస, వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నవ్య వారపత్రికలో పన్నెండేళ్ళ పాటు మనమీదేనర్రోయ్ పేరుతో వేసిన కార్టూన్లను, అదే పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించాడు. 'సరసి కార్టూన్లు' పేరుతో నాలుగు సంపుటాలు ప్రచురించాడు. [2]

భావాలు అనుభవాలు[మార్చు]

 • ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికైనా జీవితం అందంగానే కనిపిస్తుంది. కానీ, పరిస్థితులు కాస్త వికటించినప్పుడు ప్రతిదీ వికటాట్టహాసం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కాకపోతే ఆ వికటత్వంలోని పేర డీని అర్థం చేసుకుంటే ఆ వికారం నుంచి బయటపడి హాయిగా నవ్వుకోవచ్చు. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడే కాదు జీవితపు ఒడిదుడుకుల మధ్య కూడా హాయిగా నవ్వుకోవడానికి కార్టూన్లు ఎంతో కొంత ఉపకరిస్తాయి.
 • మా అమ్మ పద్యాలు రాసి మాకే వినిపించేది. మా నాన్నగారు ఎంతో చమత్కారంగా మాట్లాడేవారు. భోజన సమయంలో మా అమ్మతో "వంట బాగానే చేశావు కానీ, నువ్వు రాసే ఆ పద్యాల వాసనకే వంట పాడైపోయింది లాంటి మాటలు అంటూఉండే వారు. అంతటితో ఆగక ఆమె రాసిన పద్యాలమీద పేరడీలు చె ప్పేవారు. అది విని మేమంతా ఘుెల్లుమనే వాళ్లం. నేను కార్టూన్లు వేయడానికి ఆ వాతావరణమే బీజంగా పనిచేసిందేమో అనిపిస్తుంది.
 • అయితే కార్టూన్ల పట్ల నాకు విపరీతమైన ఆసక్తి ఏర్పడటానికి, చివరికి నేను కార్టూనిస్టుగా స్థిరపడటానికి మాత్రం పరోక్షంగా బాపు గారి స్ఫూర్తే కారణం. బొమ్మలు వేయడం మాత్రం నాకు తమ్మా సత్యనారాయణ గారు నేర్పారు. నేను వేసిన అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల తైల వర్ణచిత్రాలు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిలిచే యోగ్యతను పొందడానికి ఆయనే కారణం.
 • నేను అసెంబ్లీ రిపోర్టర్‌గా ఉన్న రోజుల్లో అంటే 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అంబేద్కర్ తైలవర్ణ చిత్రాన్ని పెట్టాలని సంకల్పించి నాకు చెబితే నేను వేశాను. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లోనే ఒక ఖాళీ సమయాన ఎన్‌టి రామారావు గారి చేతుల మీదుగా ఆ చిత్ర ఆవిష్కరణకు ఏర్పాట్లు జరిగాయి. ఎంఎల్ఏలు, మంత్రులతో ఆ స్థలమంతా నిండిపోయింది. రామారావు గారు పెయింటింగ్ వద్దకు వస్తూండగానే అప్పటిదాకా ఆ పెయింటింగ్ వద్దనే ఉన్న నన్ను భద్రతా సిబ్బంది వచ్చి దూరంగా వెళ్లిపొమ్మన్నారు. నేను ఆశ్చర్యపోయి "అయ్యా ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్‌ను నేనే. పైగా నేను అసెంబ్లీ స్టాఫ్ మెంబర్‌ను. ఆ పెయింటింగ్‌ను ఆవిష్కరిస్తున్న సమయంలో నన్ను వెళ్లిపొమ్మంటారేమిటి? అన్నాను. అయినా వాళ్లు నా మాట వినిపించుకోకుండా బయటికి నెట్టేశారు.చివరికి పెయింటింగ్ వద్దకు రామారావు గారు వచ్చారు. చిత్రపట ఆవిష్కరణకు కొద్ది క్షణాల ముందు రామారావు గారు "ఇంతకీ ఆ చిత్రకారుడేడీ? అన్నారట. అప్పటికి గానీ నా అవసరం భద్రతా సిబ్బందికి తెలిసి రాలేదు. వెంటనే ఆవిష్కరణ చోటికి వచ్చేయాలంటూ పిలిచారు. ఎక్కడో వెనక ఒక మూలన నిలుచున్న నేను ఎలాగోలా స్టేజ్ మీదికి వచ్చాను. ఆవిష్కరణ అయిపోగానే రామారావు నన్ను ఉద్దేశించి 'సరసి గారూ! మీరు వేసిన ఈ చిత్రం శాశ్వతం. మీరూ, నేనూ అశాశ్వతం' అన్నారు.ఎన్‌టి రామారావు గారు వెళ్లిపోయారు. ఆ పెయింటింగ్ మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఉంది. వెనకో ముందో నేనూ వె ళ్లిపోతాను. అయినా ఆ పెయింటింగ్ అక్కడే ఉంటుంది. కళారూపాలకు ఉండే ఆ శాశ్వతత్వమే కళాసృష్టిలో ఉండే ఎంతటి కష్టాన్నయినా భరించే శక్తినిస్తుంది.
 • మా ఊరు బోడపాడుకూ చింతపల్లికీ మధ్యన వెంకయ్య కాలువ అని ఒకటుంది. దాన్ని దాటే వెళ్లాలి ఎవరైనా. అలా వెళ్లాలంటే దోనెలో వె ళ్లడం ఒక్కటే మార్గం. గోదావరి నుంచి వచ్చే ఆ కాలువ చాలా వడిగా పయనిస్తుంది. ఎంతో బలంగా గడకర్ర వేస్తే తప్ప కాలువ దాటడం సాధ్యం కాదు.సహదేవుడు అనే ఒకే ఒక వ్యక్తి ఆ దోనె నడుపుతాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అతని పని అదే. అతనికిప్పుడు దాదాపు 80 ఏళ్లు. ఆ రోజునుంచి ఈ రోజు వరకు ఆ పని అతనొక్కడే చేస్తున్నాడు. వేరెవరూ ఆ పనికి రారు. కొత్త బాటసారులెవరైనా వస్తే కొంత డబ్బు ఇస్తారు కానీ, తెలిసిన గ్రామస్థులు మాత్రం పంట మీద కొంత ధాన్యం ఇస్తారు. కాలవకు ఆవల అతనికో గుడిసె ఉంటుంది. ఎప్పుడు వండుకు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో ఏమో కానీ, ఉదయం నుంచి అర్థరాత్రి దాకా ఎప్పుడు చూసినా దోనె మీదే కనిపిస్తాడు.అర్థరాత్రి దాటాక పిలిచినా దోనె తోసుకుని వస్తాడే తప్ప రానని అనడు.ఆ మధ్య ఎవరో ఒక పాపను పెంచుకుంటున్నాడన్న వార్త ఏదో వచ్చింది. దోనె నడపడం అతని జీవితంలో భాగమైపోయిందే తప్ప అది అతని జీవనాధారమని కూడా కాదు. పరిసర గ్రామ ప్రజలంతా ఎప్పటికైనా వంతెన పడుతుంది, అతనికి ఆ కష్టం తీరుతుందని అనుకుంటారు గానీ, అదొక కలగానే ఉండిపోయింది.. ఇప్పటికి రెండు సార్లు ఆ వంతెన కోసం నిధులు మంజూరు అయ్యాయి. మంత్రులు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంత వరకు ఆ పని జరగలేదు. అతనింకా ఆ దోనె నడుపుతూనే ఉన్నాడు. అందరినీ ప్రవాహాన్ని దాటించి గమ్యానికి చేరుస్తున్నాడు గానీ, అతను మాత్రం ఆ ప్రవాహాన్ని దాటడం లేదు. ఆ ప్రవాహమే అతని జీవనగా మనం అనుకోవాలేమో! నాకైతే నిష్కామ కర్మకు అతనో నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తాడు.[3]

గుర్తింపు[మార్చు]

 • ఒక జాతీయ అవార్డుతో పాటు నాలుగు అంతర్జాతీయ అవార్డులు
 • వొకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు (రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్)
 • ఉగాది పురస్కారం (తిరుపతి సిటీ ఛాంబర్)
 • స్వరఝురి (విజయవాడ)

మూలాలు[మార్చు]

 1. "సంభాషణ: "కార్టూన్ - కథా విరించి సరసి" అంతరంగ ఆవిష్కరణ". సంచిక. Archived from the original on 2022-05-23. Retrieved 2022-05-23.
 2. "సరసి కార్టూన్లు- 'మనమీదేనర్రోయ్‌'". lit.andhrajyothy.com. Archived from the original on 2022-05-23. Retrieved 2022-05-23.
 3. http://www.andhrajyothy.com/node/38078ఆంధ్రజ్యోతి[permanent dead link] 6.12.2013