సవానా


సవానా అనేది అటవీ, గడ్డిభూముల మిశ్రమ (అంటే గడ్డితో కూడిన అటవీ భూమి) బయోమ్ పర్యావరణ వ్యవస్థ. దీని ప్రధాన లక్షణం - చెట్లు ఒకదానికొకటి తగినంత దూరంలో ఉండటం వలన వాటి పందిరి నేలపై మూత వెయ్యదు. ఈ తెరిచిన పందిరి కారణంగా, గడ్డితో కూడిన అవిచ్ఛిన్నమైన గుల్మ పొరను పోషించడానికి తగినంత కాంతి నేలను చేరుతుంది.[1] సవానాలో నాలుగు రూపాలు ఉన్నాయి; సవానా వుడ్‌ల్యాండ్ (తేలికపాటి చెట్లు ఉండే సవానా), ఇక్కడ చెట్లు, పొదలు తేలికపాటి పందిరిని ఏర్పరుస్తాయి; ట్రీ సవానా (కాస్త దట్టంగా చెట్లు ఉండే సవానా), ఇక్కడ చెట్లు, పొదలు చెల్లాచెదురుగా ఉంటాయి; ష్రబ్ సవానా (పొదలుఉండే సవానా), ఇక్కడ పొదలు విస్తరించి ఉంటాయి; గ్రాస్ సవానా (కేవలం గడ్డి ఉండే సవానా), ఇక్కడ చెట్లు పొదలు దాదాపుగా ఉండవు.
సవానాల్లో వృక్ష సాంద్రత అధికంగా ఉన్నప్పటికీ, చెట్ల పందిరి మాత్రం పల్చగానే ఉంటుంది. సవానాలలో చెట్లు దూరదూరంగా, చెల్లాచెదురుగా ఉంటాయి. అయితే, అనేక సవానాలలో, అడవులతో పోలిస్తే చెట్ల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. చెట్లు మరింత క్రమమైన దూరంలో ఉంటాయి. దక్షిణ అమెరికా సవానా రకాలైన సెర్రాడో సెన్సు స్ట్రిక్టో, సెర్రాడో డెన్స్ లలో సాధారణంగా దక్షిణ అమెరికా ఉష్ణమండల అడవులలో కనిపించే దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ చెట్ల సాంద్రత ఉంటుంది.[2][3][4] సవానాలో హెక్టారుకు 800 నుండి 3300 చెట్లు, ప్రక్కనే ఉన్న అడవులలో 800–2000 చెట్లు ఉంటాయి. అదేవిధంగా గినియన్ సవానాలో 129 ఉంటాయి. నదీతీర అడవులలో ఉన్న 103 సాంద్రతతో పోలిస్తే,[5] ఇక్కడ హెక్టారుకు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే తూర్పు ఆస్ట్రేలియన్ స్క్లెరోఫిల్ అడవులలో సగటు చెట్ల సాంద్రత హెక్టారుకు సుమారు 100 ఉంటుంది, ఇది అదే ప్రాంతంలోని సవానాలతో పోల్చదగినది.
సవానాల్లో నీటి లభ్యత కాలానుగుణంగా ఉంటుంది. అధిక వర్షపాతం ఒక్క కాలానికే పరిమితమై ఉంటుంది. వీటికి అనేక రకాల బయోమ్‌లతో సంబంధం ఉంటుంది. తరచుగా అడవి, ఎడారి లేదా గడ్డి మైదానం మధ్య పరివర్తన మండలంలో ఉంటాయి. అయితే, ఎక్కువగా ఎడారి నుండి అడవికి పరివర్తనగా ఉంటాయి.[6] భూమిపై ఉన్న మొత్తం నేలలో సవానాలు సుమారు 20% ఉంటాయి. చల్లని శీతాకాలాలుండే ఉత్తర అమెరికాలోని ప్రయరీలు, యురేషియాలోని స్టెప్పీల వలె కాకుండా, సవానాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, భారతదేశం వంటి - వెచ్చని నుండి వేడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.[7]
పంపిణీ
[మార్చు]
19వ శతాబ్దం మధ్యకాలానికి ముందు, ఉష్ణమండల సవానా శీతోష్ణస్థితి భావన స్థిరపడక ముందు, అనేక గడ్డి భూభాగాలు, చెట్లు, పొదలు, గడ్డి జాతుల మిశ్రమ సమూహాలను సవానాగా వర్ణించారు. వృక్షసంపదను వర్ణించడానికి ఇప్పుడు వాడుకలో ఉన్న సాధారణ పదం, సరళీకృతమైనప్పటికీ విస్తృతంగా ఉన్న శీతోష్ణస్థితి భావనతో విభేదిస్తుంది. ఈ వ్యత్యాసం కొన్నిసార్లు కాంగో, అమెజాన్ నదులకు ఉత్తరాన, దక్షిణాన ఉన్న విస్తారమైన సవానాల వంటి ప్రాంతాలను సవానా వర్గాల నుండి మినహాయించడానికి కారణమైంది.[8]
ఉత్తర అమెరికాలోని వివిధ ప్రాంతాలలో, "సవానా" అనే పదాన్ని " బంజరు భూములు ", " ప్రైరీ ", " గ్లేడ్ ", "గడ్డి మైదానం", " ఓక్ ఓపెనింగ్ " అనే పదాలకు పర్యాయపదంగా ఉపయోగించారు.[9] వివిధ రచయితలు సవానా చెట్ల విస్తీర్ణాన్ని దిగువ పరిమితిగా 5–10% గాను, ఎగువ పరిమితిగా 25–80% గానూ నిర్వచించారు. అన్ని సవానా పర్యావరణాలకు కామన్‌గా ఉండే అంశాలు రెండు - సంవత్సరానికి వర్షపాతంలో వచ్చే వైవిధ్యాలు, పొడి కాలంలో సంభవించే కార్చిచ్చులు. అమెరికా ఖండాలలో, ఉదాహరణకు మధ్య అమెరికాలోని బెలిజ్‌లో, మెక్సికో నుండి దక్షిణ అమెరికా, కరేబియన్ వరకూ సవానా వృక్షసంపద ఒకే విధంగా ఉంటుంది.[10] అటవీ ప్రాంతం, సవానా మధ్య వ్యత్యాసం అస్పష్టంగా ఉంది. అందువల్ల ఈ రెండింటినీ ఒకే బయోమ్‌గా కలపవచ్చు. ఎందుకంటే అటవీ ప్రాంతాలు, సవానాలు రెండింటిలోనూ సాధారణంగా ఒకదానితో ఒకటి ముడిపడని కిరీటాలతో (ఎక్కువగా 25–60% విస్తీర్ణాన్ని ఏర్పరుస్తాయి) బహిరంగ పందిరి చెట్లు ఉంటాయి.
అనేక పెద్ద ఉష్ణమండల ప్రాంతాలలో, ప్రధాన బయోమ్ (అడవి, సవానా లేదా గడ్డి మైదానం)ను కేవలం వాతావరణం ద్వారా మాత్రమే అంచనా వేయలేము. ఎందుకంటే కార్చిచ్చుల వంటి చారిత్రక సంఘటనలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రాంతాలలో, అనేక స్థిరమైన బయోమ్‌లు ఉండటం సాధ్యమవుతుంది. వార్షిక వర్షపాతం 500 mm (19.69 in) నుండి 1,270 mm (50.00 in) దాకా ఉంటుంది. సంవత్సరానికి వర్షపాతం ఆరు లేదా ఎనిమిది నెలల పాటు ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత కరువు కాలం వస్తుంది. సవానాలను కొన్నిసార్లు అడవులుగా వర్గీకరించవచ్చు.[7]
వాతావరణ భూస్వరూప శాస్త్రంలో, అనేక సవానాలు పెడిప్లెయిన్స్, ఇన్సెల్‌బర్గ్‌ల ప్రాంతాలలో సంభవిస్తాయని గమనించబడింది.[11] నదీ కోత అంత ప్రముఖంగా ఉండదని, కానీ సవానా భూభాగాల్లోని నదులు అంచుల కోత ద్వారా ఎక్కువగా కోతకు గురిచేస్తాయి.[11] సవానా మైదానాలలో వరదలు, తత్సంబంధిత షీట్ వాష్ ప్రధాన కోత ప్రక్రియలు.[11]
ముప్పు
[మార్చు]సవానా పర్యావరణ వ్యవస్థలలో అత్యంత చెక్కుచెదరకుండా ఉన్నవి మూడు శాతం లోపే అని అంచనా వేసారు.[12] సవానా క్షీణతకు కారణాలు అనేకమైనవి, అవి క్రింద వివరించబడ్డాయి.
అగ్ని నిర్వహణలో మార్పులు
[మార్చు]
సవానాలు తరచుగా కార్చిచ్చులకు లోనౌతాయి. ఈ పర్యావరణ వ్యవస్థ మానవులు నిప్పును ఉపయోగించడం వల్ల ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు, స్థానిక అమెరికన్లు అగ్నిని తట్టుకునే మొక్కలు అధికంగా ఉన్న చోట కాలానుగుణంగా కాల్చడం ద్వారా ఉత్తర అమెరికాలోని కొలంబియన్ పూర్వపు అడవులను సృష్టించారు.[13] ఉష్ణమండల ఆస్ట్రేలియా, న్యూ గినియాలో సవానాలు విస్తృతంగా ఏర్పడటానికి నిప్పు కర్రల వ్యవసాయం కారణమైనట్లు కనిపిస్తుంది.[14] భారతదేశంలోని సవానాలు మానవులు నిప్పును ఉపయోగించడం వల్ల ఏర్పడ్డాయి.[15] మధ్యధరా ప్రాంతంలోని మాక్విస్ పొద సవానాలు కూడా మానవ నిర్మిత అగ్ని ద్వారానే సృష్టించబడ్డాయి.[16]
ఉద్దేశపూర్వక నియంత్రిత దహనాలు సాధారణంగా గడ్డి పొరకే పరిమితమైన మంటలను సృష్టిస్తాయి. ఇవి పెద్ద చెట్లకు దీర్ఘకాలిక నష్టం కలిగించవు. ఇది, చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించగల మరింత వినాశకరమైన కార్చిచ్చులను నివారిస్తుంది.[17] అయితే, ఈ మంటలు చెట్ల నారుమొక్కలను చంపుతాయి లేదా అణచివేస్తాయి. తద్వారా నిరంతర చెట్ల పందిరి ఏర్పడకుండా నిరోధిస్తాయి, ఇది మరింత గడ్డి పెరుగుదలను నిరోధిస్తుంది. యూరోపియన్ల స్థిరనివాసానికి ముందు, అగ్నితో సహా ఆదిమవాసుల భూ వినియోగ పద్ధతులు వృక్షసంపదను ప్రభావితం చేశాయి.[18][1][14] ఆదిమవాసుల దహనం నిర్మాణాత్మకంగా మరింత బహిరంగ సవానా ప్రకృతి దృశ్యాన్ని సృష్టించిందని చాలా మంది రచయితలు[18][19] సూచించారు. ఆదిమవాసుల దహనం ఖచ్చితంగా ఆవాసాల మొజాయిక్‌ను సృష్టించింది, ఇది బహుశా జీవవైవిధ్యాన్ని పెంచింది. అడవుల నిర్మాణాన్ని, అనేక అటవీ జాతుల భౌగోళిక పరిధినీ మార్చింది.[14][18] సాంప్రదాయ దహన పద్ధతులను తొలగించడం లేదా మార్చడం వల్ల అనేక సవానాలు అడవులు, పొదలతో కూడిన దట్టమైన ప్రాంతాలుగా మారుతున్నాయని చాలా మంది రచయితలు[19][20] సూచించారు, వీటిలో గడ్డి పొర చాలా తక్కువగా ఉంటుంది.
సవానా అడవులలో ప్రవేశపెట్టబడిన మేత జంతువులు గడ్డిని తినడం వల్ల మండించడానికి అందుబాటులో ఉన్న ఇంధనం పరిమాణం తగ్గింది. దాంతో మంటలు తగ్గాయి.[21] విదేశీ పశుగ్రాస చిక్కుడు జాతులను ప్రవేశపెట్టడం వల్ల కూడా పచ్చని పెరుగుదలను ఉత్పత్తి చేయడానికి కాల్చవలసిన అవసరం తగ్గింది. ఎందుకంటే చిక్కుడు జాతులకు ఏడాది పొడవునా అధిక పోషక స్థాయిలు ఉంటాయి. మంటలు చిక్కుడు జాతుల జనాభాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది మండించడానికి విముఖతకు కారణమవుతుంది.[22]
మేత మేసే, ఆకులు తినే జంతువులు
[మార్చు]
వేదల్పాటి ఆకులుండే చెట్లతో కూడిన అడవులు, వర్షారణ్యాలు వంటి దట్టమైన అటవీ రకాలలో, వాటి దట్టమైన నిర్మాణం వలన గడ్డి పెరుగుదల తగ్గుతుంది. అంచేత ఇక్కడ పశువులను మేపే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, బహిరంగ సవానాల్లో గుల్మకాండ పొర పెరగడానికి అనుమతిస్తుంది. ఇక్కడ సాధారణంగా పెంపుడు జంతువులను మేపడానికి ఉపయోగిస్తారు. ఫలితంగా, గొర్రెలు, మేకలు, పశువులు మేయడం వలన ప్రపంచంలోని చాలా సవానాలు పచ్చిక కూర్పులో మార్పుల నుండి కలప మొక్కల ఆక్రమణ వరకు మార్పులకు గురయ్యాయి.[23]

పశువులను మేపడం వలన గడ్డి తగ్గడం అటవీ వ్యవస్థలలోని కలప మొక్కల భాగాన్ని రెండు ప్రధాన మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. గడ్డి మొక్కలు పై మట్టిలోని నీటి కోసం కలప మొక్కలతో పోటీపడతాయి. పశువులను మేపడం ద్వారా దానిని తొలగించడంతో ఈ పోటీ తగ్గుతుంది. తద్వారా చెట్ల పెరుగుదలకు ప్రోత్సాహం లభిస్తుంది.[24] ఈ ప్రభావంతో పాటు, మండే పదార్థాన్ని తొలగించడం వల్ల కలప మొక్కల జాతులను నియంత్రించే మంటల తీవ్రత, తరచుదనం రెండూ తగ్గుతాయి.[25] మేత జంతువులు రుచికరమైన కలప జాతులను మేయడం ద్వారా కలప మొక్కలపై మరింత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సవానాలలో పశువులు మేయడం వల్ల, అంతగా రుచిగా ఉండని కలప మొక్కలు పెరిగాయనేందుకు ఆధారాలు ఉన్నాయి.[26] సాధారణంగా కలుపు మొక్కలతో పోటీపడి, వాటి స్థాపనను అడ్డుకునే మొక్కలను తొలగించడం లేదా తగ్గించడం ద్వారా సవానాలలో కలుపు మొక్కల వ్యాప్తిని కూడా పశువులను మేపడం ప్రోత్సహిస్తుంది.[18] దీనికి అదనంగా, ముళ్ల తుమ్మ, స్టైలో వంటి కలుపు జాతుల విత్తనాల వ్యాప్తిలో పశువులు, గుర్రాల ప్రమేయం ఉంది.[21] మేత వలన సవానా జాతుల కూర్పులో వచ్చే మార్పులు పర్యావరణ వ్యవస్థ పనితీరును మార్చగలవు. అతిగా మేపడం, పేలవమైన భూ నిర్వహణ పద్ధతుల వల్ల ఇవి మరింత తీవ్రమవుతాయి.
బయటి నుండి తెచ్చిన మేత జంతువులు, వాటి గిట్టల వలన నేల భౌతికంగా గట్టిపడటం, విడిపోవడం ద్వారా, అలాగే రక్షిత మొక్కల కవచాన్ని తొలగించడం వల్ల కలిగే కోత ప్రభావాల ద్వారా కూడా నేల పరిస్థితిని ప్రభావితం చేయగలవు. ఇటువంటి ప్రభావాలు పదేపదే, అధికంగా మేతకు గురయ్యే భూములలో ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది.[27] పశువులు ఎక్కువగా ఉండడం వలోన ఏర్పడే పోషణ ప్రభావాలు తరచుగా తక్కువ సారవంతమైన నేలల్లో, 500 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో చాలా వరకు నేల పోషకాలు ఉపరితలంపై కేంద్రీకృతమై ఉంటాయి, కాబట్టి నేలలో ఏ చిన్న కదలిక అయినా తీవ్రమైన క్షీణతకు దారితీస్తుంది. నేల నిర్మాణం, పోషక స్థాయిలలో మార్పులు మొక్కల జాతుల స్థాపనను, పెరుగుదలనూ, వాటి మనుగడనూ ప్రభావితం చేస్తాయి. తద్వారా అటవీ నిర్మాణం, కూర్పులో మార్పుకు దారితీయవచ్చు. అయినప్పటికీ, మేత జంతువుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. సవానాలపై ఏనుగుల ప్రభావాన్ని పరిశీలిస్తే, వర్షపాతం వలన, కంచెలు వేయడం వలనా మొత్తం ప్రభావం తగ్గింది.
చెట్లను తొలగించడం
[మార్చు]

ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా సవానాలలోని విస్తారమైన ప్రాంతాలలో చెట్లను నరికివేశారు. ఈ నరికివేత నేటికీ కొనసాగుతోంది. ఉదాహరణకు, భూమిని చదును చేయడం, ఫ్రాకింగ్ వలన ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ సవానాకు ముప్పు కలిగింది.[28] 2000వ దశకంలో క్వీన్స్‌లాండ్‌లో, ప్రధానంగా పశుగ్రాసం ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఏటా 4,800 km2 (1,900 sq mi) విస్తీర్ణంలో సవానాలను నరికివేస్తున్నారు.[18][29] గణనీయమైన సవానా ప్రాంతాల నుండి కలప వృక్షసంపదను తొలగించారు. ఈ రోజు మిగిలి ఉన్న చాలా ప్రాంతం గతంలో ఏదో ఒక సమయంలో నరికివేత లేదా పలుచబరచడం ద్వారా దెబ్బతిన్న వృక్షసంపదే.
పశువులకు అందుబాటులో ఉండే మేత యొక్క నాణ్యత, పరిమాణాన్ని పెంచడానికీ పశువుల నిర్వహణను మెరుగుపరచడానికీ మేత పరిశ్రమ చెట్లను తొలగిస్తోంది. సవానా భూమి నుండి చెట్లను తొలగించడం వలన అక్కడ ఉన్న గడ్డి నుండి నీటి కోసం పోటీ తొలగిపోతుంది. ఇది పచ్చిక ఉత్పత్తిలో రెండు నుండి నాలుగు రెట్లు పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే అందుబాటులో ఉన్న మేత నాణ్యతను మెరుగుపడుతుంది. పశువులను పోషించే సామర్థ్యం పచ్చిక దిగుబడితో బలంగా ముడిపడి ఉన్నందున, చెట్లను తొలగించడం వల్ల మేత నిర్వహణకు సహాయపడటం వంటి ప్రధాన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.[30] ఉదాహరణకు: దట్టమైన చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాలు మాంసాహారులకు ఆశ్రయం కల్పిస్తాయి, దీనివల్ల పశువుల నష్టాలు పెరుగుతాయి.[31] అదే సమయంలో, గొర్రెలు, పశువుల ప్రాంతాలలో కలప మొక్కల ఆచ్ఛాదన మందలను సమీకరించడానికి ఆటంకం కలిగిస్తుంది.[32]
సవానాలలో కలప మొక్కలను తొలగించడానికి లేదా చంపడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. తొలితరం పశుపోషకులు భూమిని చదును చేయడానికి చెట్లను నరికివేయడం, బెరడు, చెక్క యొక్క వలయాకార భాగాన్ని తొలగించడం వంటి పద్ధతులను ఉపయోగించారు.[33] 1950లలో, కాండంలోకి ఇంజెక్ట్ చేయడానికి అనువైన మందులను అభివృద్ధి చేసారు. యుద్ధంలో మిగిలిపోయిన భారీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కలపను నెట్టడానికి లేదా రెండు యంత్రాల మధ్య కట్టిన గొలుసును, బంతినీ ఉపయోగించి లాగడానికి వాడారు. కలప నియంత్రణకు సంబంధించిన ఈ రెండు కొత్త పద్ధతులు, అనేక కొత్త పచ్చిక గడ్డి, చిక్కుడు జాతుల పరిచయం, విస్తృత వినియోగంతో పాటు, చెట్లను నరికివేయడంలో పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించాయి. 1980లలో, ఒక్కో చెట్టుకూ ఇంజెక్ట్ చేసే అవసరం లేకుండా, నేల లోకి పంపి అనేక చెట్లను చంపగలిగే మందులు వచ్చాయి.
చాలా విధాలుగా "కృత్రిమ" పద్ధతిలో చెట్లను తొలగించడం, ముఖ్యంగా చెట్లను పీకివేయడం, మంటల వఒలన కలిగే ప్రభావం లాగానే ఉంటుంది. అగ్నిప్రమాదం తర్వాత పునరుత్పత్తికి అనువుగా ఉండే సవానాలలో, చాలా క్వీన్స్‌లాండ్ సవానాల వలె, అగ్నిప్రమాదం తర్వాత జరిగే దానికి సమానమైన ప్రతిస్పందన ఉంటుంది.[34] అనేక సవానా సముదాయాలలో చెట్లను తొలగించడం వలన, నేల అడుగు భాగం వైశాల్యం, పందిరి విస్తీర్ణంలో గణనీయమైన తగ్గుదల ఏర్పడినప్పటికీ, తరచుగా అధిక శాతం కలప మొక్కలు సజీవంగా మిగిలిపోతాయి. అవి ప్రభావితం కానంత చిన్న మొలకలుగా లేదా లిగ్నోట్యూబర్‌లు, విరిగిన మొద్దుల నుండి తిరిగి చిగురించగల మొక్కలుగా ఉంటాయి. యూకలిప్టస్ సముదాయాలను పీకివేసిన తర్వాత, 5 m (16 ft) అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న చెట్లన్నింటినీ పూర్తిగా వేళ్లతో సహా పెకిలించినప్పటికీ, అసలు సంఖ్యలో సగం లేదా అంతకంటే ఎక్కువ కలప మొక్కల జనాభా మిగిలే ఉంటుంది.
సవానా పర్యావరణ ప్రాంతాలు
[మార్చు]సవానాను సులభంగా రెండు రకాలుగా విభజించవచ్చు: ఒకటి, గడ్డి ఎక్కువగా ఉండి, చెట్లు అరుదుగా ఉండే బహిరంగ సవానా; రెండవది చెట్లు అత్యంత దట్టంగా ఉండి, బహిరంగ అటవీ ప్రాంతానికి లేదా అడవికి సరిహద్దుగా ఉండే అటవీ సవానా. అనేక విభిన్న రకాల నిర్దిష్ట సవానా పర్యావరణ ప్రాంతాలలో ఇవి ఉన్నాయి:
- ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల సవానాలను, ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల గడ్డిభూములు, పొదలతో కలిపి 'ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల గడ్డిభూములు, సవానాలు, పొదల బయోమ్'గా వర్గీకరించారు. వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన సెరెంగెటితో సహా ఆఫ్రికాలోని సవానాలు ఈ రకానికి విలక్షణమైనవి. దాని విలక్షణమైన, విభిన్నమైన వృక్షజాలానికి ప్రసిద్ధి చెందిన బ్రెజిలియన్ సవానా ( సెర్రాడో ) కూడా ఈ వర్గంలో చేర్చబడింది. ఇతర ఉదాహరణలలో కింబర్లీ ఉష్ణమండల సవానా, సెంట్రల్ జాంబెజియన్ మియోంబో వుడ్‌ల్యాండ్స్, గినియన్ ఫారెస్ట్-సవానా మొజాయిక్, కేప్ యార్క్ పెనిన్సులా ఉష్ణమండల సవానా, సోమాలి అకేసియా-కొమ్మిఫోరా బుష్‌ల్యాండ్స్, థికెట్స్, సదరన్ అకేసియా-కొమ్మిఫోరా బుష్‌ల్యాండ్స్, థికెట్స్, టెరాయ్-డువార్ సవానా, గడ్డిభూములు, విక్టోరియా బేసిన్ ఫారెస్ట్-సవానా మొజాయిక్ ఉన్నాయి.
- సమశీతోష్ణ సవానాలు అనేవి మధ్య అక్షాంశాలలో ఉండే సవానాలు. ఇక్కడ వేసవిలో తేమ ఎక్కువగాను, శీతాకాలంలో పొడిగాను ఉంటుంది. వీటిని సమశీతోష్ణ సవానాలు, పొదలతో కూడిన భూములతో కలిపి సమశీతోష్ణ గడ్డిభూములు, సవానాలు, పొదల జీవప్రాంతంగా వర్గీకరించారు. ఉదాహరణకు, ఇవి ఆగ్నేయ ఆస్ట్రేలియా, ఉత్తర భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, ఆగ్నేయ అర్జెంటీనా, ఉరుగ్వేలోని చాలా మైదానాలను ఆవరించి ఉన్నాయి. ఉపఉష్ణమండల, సమశీతోష్ణ సవానాలకు ఉదాహరణలు : ఆగ్నేయ ఆస్ట్రేలియా సమశీతోష్ణ సవానా, అర్జెంటైన్ ఎస్పినల్, పాంపస్, కంబర్‌ల్యాండ్ ప్లెయిన్ వుడ్‌ల్యాండ్, సదరన్ కోన్ మెసొపొటేమియన్ సవానా, న్యూ ఇంగ్లాండ్ పెప్పర్‌మింట్ గ్రాసీ వుడ్‌ల్యాండ్, ఉరుగ్వేయన్ సవానా .
- మధ్యధరా సవానాలు అనేవి మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలలో ఉండే మధ్య అక్షాంశ సవానాలు. ఇక్కడ తేలికపాటి, వర్షపు శీతాకాలాలు, వేడి, పొడి వేసవికాలాలు ఉంటాయి. ఇవి మధ్యధరా అడవులు, వృక్ష ప్రాంతాలు, పొద జీవవైవిధ్యంలో (బయోమ్) ఒక భాగం. కాలిఫోర్నియా చాపరల్, వుడ్‌ల్యాండ్స్ ఎకోరీజియన్‌లో భాగమైన కాలిఫోర్నియాలోని ఓక్ చెట్ల సవానాలు ఈ వర్గంలోకి వస్తాయి. యూకలిప్టస్‌లు ఉండే దక్షిణ ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ గడ్డి మైదానం కూడా ఇందులో ఉంది. మధ్యప్రాచ్య స్టెప్పీలోని కొన్ని భాగాలు, తూర్పు మధ్యధరా కోనిఫర్–స్క్లెరోఫిలస్–బ్రాడ్‌లీఫ్ అడవుల్లో కూడా సవానా లాంటి భూములు ఉండవచ్చు.
- వరద సవానాలు అంటే కాలానుగుణంగా లేదా ఏడాది పొడవునా వరదలకు గురయ్యే సవానాలు. వీటిని వరద గడ్డిభూములు, సవానాల బయోమ్‌గా వర్గీకరిస్తారు. ఇది ఎక్కువగా ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఎవర్గ్లేడ్స్, మెసొపొటేమియన్ మార్షెస్, పంతనాల్, నైలు డెల్టా వరద సవానా, చాడ్ సరస్సు వరద సవానా, జాంబెజియన్ వరద గడ్డిభూములు, సుడ్.
- మోంటెన్ సవానాలు అనేవి మధ్యస్థం నుండి అధిక ఎత్తులో ఉండే సవానాలు. ఇవి ప్రపంచంలోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి. మోంటెన్ గడ్డిభూములు, పొదలు గల జీవవైవిధ్యంలో భాగం. బొగోటా సవానా, సగటున 2,550 metres (8,370 ft) ఎత్తులో ఉంది.ఆల్టిప్లానో కుండిబోయాసెన్స్, తూర్పు ఆండీస్ శ్రేణులలోని 1,000 మీటర్ల (3,300 ఎత్తులో ఉన్న సవానా పర్వత సవానాకు ఒక ఉదాహరణ.[35] అంగోలన్ స్కార్ప్ సవానా, వుడ్‌ల్యాండ్స్ ఎకోరీజియన్‌లోని సవానాలు 1,000 metres (3,300 ft) వరకు తక్కువ ఎత్తులో ఉన్న ఉదాహరణ. ఇతర ఉదాహరణలలో అల్ హజార్ పర్వత అడవులు, తూర్పు అనటోలియన్ పర్వత స్టెప్పీ యొక్క దక్షిణ భాగం ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Werner, Patricia A.; B. H. Walker; P. A Stott (1991). "Introduction". In Patricia A. Werner (ed.). Savanna Ecology and Management: Australian Perspectives and Intercontinental Comparisons. Oxford: Blackwell Publishing. ISBN 978-0-632-03199-3.
- ↑ Manoel Cláudio da Silva Jánior, Christopher William Fagg, Maria Cristina Felfili, Paulo Ernane Nogueira, Alba Valéria Rezende, and Jeanine Maria Felfili 2006 "Chapter 4. Phytogeography of Cerrado Sensu Stricto and Land System Zoning in Central Brazil" in "Neotropical Savannas and Seasonally Dry Forests: Plant Diversity, Biogeography, and Conservation" R. Toby Pennington, James A. Ratter (eds) 2006 CRC Press
- ↑ Erika L. Geiger, Sybil G. Gotsch, Gabriel Damasco, M. Haridasan, Augusto C. Franco & William A. Hoffmann 2011 "Distinct roles of savanna and forest tree species in regeneration under fire suppression in a Brazilian savanna" Journal of Vegetation Science 22
- ↑ Scholz, Fabian G.; Bucci, Sandra J.; Goldstein, Guillermo; Meinzer, Frederick C.; Franco, Augusto C.; Salazar, Ana. 2008 "Plant- and stand-level variation in biophysical and physiological traits along tree density gradients in the Cerrado", Brazilian Journal of Plant Physiology
- ↑ Abdullahi Jibrin 2013 "A Study of Variation in Physiognomic Characteristics of Guinea Savanna Vegetation" Environment and Natural Resources Research 3:2
- ↑ "Savanna". Ask a Biologist. 25 May 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 August 2022.
- ↑ 7.0 7.1 "The grassland biome". UCMP. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 August 2022.
- ↑ David R. Harris, ed. (1980). Human Ecology in Savanna Environments. London: Academic Press. pp. 3, 5–9, 12, 271–278, 297–298. ISBN 978-0-12-326550-0.
- ↑ Roger C. Anderson; James S. Fralish; Jerry M. Baskin, eds. (1999). Savannas, Barrens, and Rock Outcrop Plant Communities of North America. Cambridge University Press. pp. 157. ISBN 978-0-521-57322-1.
- ↑ David L. Lentz, ed. (2000). Imperfect balance: landscape transformations in the Precolumbian Americas. New York City: Columbia University Press. pp. 73–74. ISBN 978-0-231-11157-7.
- ↑ 11.0 11.1 11.2 Cotton, C.A.. "The Theory of Savanna Planation".
- ↑ (2022-12-01). "Global drivers of change across tropical savannah ecosystems and insights into their management and conservation".
- ↑ "Use of Fire by Native Americans". The Southern Forest Resource Assessment Summary Report. Southern Research Station, USDA Forest Service. the original నుండి 5 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2008.
- ↑ 14.0 14.1 14.2 Flannery, Timothy Fridtjof (1994). The Future Eaters: An Ecological History of the Australasian Lands and People. Frenchs Forest, New South Wales: Reed New Holland. ISBN 978-0-8076-1403-7.
- ↑ Saha, S.. "Patterns in woody species diversity, richness and partitioning of diversity in forest communities of tropical deciduous forest biomes".
- ↑ Pyne, Stephen J. (1997). Vestal Fire: An Environmental History, Told through Fire, of Europe and Europe's Encounter with the World. Seattle: University of Washington Press. ISBN 978-0-295-97596-2.
- ↑ Palmer, Jane (29 March 2021). "Fire as Medicine: Learning from Native American Fire Stewardship". eos.org.
- ↑ 18.0 18.1 18.2 18.3 18.4 Wilson, B., S. Boulter, et al. (2000). Queensland's resources. Native Vegetation Management in Queensland. S. L. Boulter, B. A. Wilson, J. Westrupet eds. Brisbane, Department of Natural Resources ISBN 0-7345-1701-7.
- ↑ 19.0 19.1 Lunt, I. D.. "Effects of European colonisation on indigenous ecosystems: post-settlement changes in tree stand structures in Eucalyptus–Callitris woodlands in central New South Wales, Australia".
- ↑ Archer S, (1994.) "Woody plant encroachment into southwestern grasslands and savannas: Rates, patterns and proximate causes." pp. 13–68 in Vavra, Laycock and Pieper (eds.) Ecological Implications of Livestock Herbivory in the West. Society For Range Management, Denver ISBN 1-884930-00-X.
- ↑ 21.0 21.1 Pressland, A. J., J. R. Mills, et al. (1988). Landscape degradation in native pasture. Native pastures in Queensland their resources and management. W. H. Burrows, J. C. Scanlan and M. T. Rutherford. Queensland, Queensland Government Press ISBN 0-7242-2443-2.
- ↑ Dyer, R., A. Craig, et al. (1997). Fire in northern pastoral lands. Fire in the management of northern Australian pastoral lands. T. C. Grice and S. M. Slatter. St. Lucia, Australia, Tropical Grassland Society of Australia ISBN 0-9590948-9-X.
- ↑ Winter, W. H. (1991). "Australia's northern savannas: a time for change in management philosophy". In Patricia A. Werner (ed.). Savanna Ecology and Management: Australian Perspectives and Intercontinental Comparisons. Oxford: Blackwell Publishing. pp. 181–186. ISBN 978-0-632-03199-3.
- ↑ Burrows, W. H., J. C. Scanlan, et al. (1988). Plant ecological relations in open forests, woodlands and shrublands. Native pastures in Queensland their resources and management. W. H. Burrows, J. C. Scanlan and M. T. Rutherford eds. Brisbane, Department of Primary Industries ISBN 0-7242-2443-2.
- ↑ Smith, G., A. Franks, et al. (2000). Impacts of domestic grazing within remnant vegetation. Native Vegetation Management in Queensland. S. L. Boulter, B. A. Wilson, J. Westrupet al. Brisbane, Department of Natural Resources ISBN 0-7345-1701-7.
- ↑ Florence, R. G. (1996). Ecology and silviculture of eucalypt forests. Collingwood, CSIRO Publishing ISBN 0-643-10252-3.
- ↑ Foran, B. D. (1984). Central arid woodlands. Management of Australia's Rangelands. G. N. Harrington and A. D. Wilson. Melbourne, CSIRO Publishing ISBN 0-643-03615-6.
- ↑ Murphy, Brett; Ritchie, Euan; Woinarski, John (2023-06-29). "Land clearing and fracking in Australia's Northern Territory threatens the world's largest intact tropical savanna". The Conversation (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-07-10.
- ↑ "Deforestation explained". Wilderness Society (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-07-10.
- ↑ Harrington, G. N., M. H. Friedel, et al. (1984). Vegetation ecology and management. Management of Australia's Rangelands. G. N. Harrington and A. D. Wilson. Melbourne, CSIRO Publishing ISBN 0-643-03615-6.
- ↑ Harrington, G. N., D. M. D. Mills, et al. (1984). Semi-arid woodlands. Management of Australia's Rangelands. G. N. Harrington and A. D. Wilson. Melbourne, CSIRO Publishing ISBN 0-643-03615-6.
- ↑ Harrington, G. N., D. M. D. Mills, et al. (1984). Management of Rangeland Ecosystems. Management of Australia's Rangelands. G. N. Harrington and A. D. Wilson. Melbourne, CSIRO Publishing ISBN 0-643-03615-6.
- ↑ Partridge, I. (1999). Managing grazing in northern Australia. Brisbane, Department of Primary Industries ISBN 0-7345-0035-1.
- ↑ Scanlan, J. C. (1988). Managing tree and shrub populations. Native pastures in Queensland their resources and management. W. H. Burrows, J. C. Scanlan and M. T. Rutherford. Queensland, Queensland Government Press ISBN 0-7242-2443-2.
- ↑ Pérez Preciado, Alfonso (2000). La estructura ecológica principal de la Sabana de Bogotá (PDF) (in స్పానిష్). Sociedad Geográfica de Colombia. pp. 1–37. the original (PDF) నుండి 11 December 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2017.