సాయం వరద దాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేశభక్తుడు, స్వాతంత్య్రపోరాట కవి, స్వాతంత్య్రసమరయోధుడు

వరదదాసు గారి సంగ్రహ జీవిత చరిత్ర

కడప మండలము, ఒంటమిట్ట (ఏకశిలానగరము) కు సమీపమునగల కొండమాచుపురమున పుణ్యదంపతులైన శ్రీ వెంకటసుబ్బయ్య, నరసమ్మలకు నాల్గవ సంతానంగా సాయం వరదదాసు గారు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య. పువ్వుపుట్టగనే పరిమళించినట్లు చిన్ననాటినుండియే విద్య, దేశభక్తిలో చురుకైనవారు. బుద్ధికుశలతను గమనించి, ప్రాథమిక విద్యతదుపరి విద్యనేర్చుకొనుటకై, వాకమాడ అను గ్రామములో ప్రఖ్యాత విద్యావంతుడై “ జరఠశార్దూలము “అని బిరుదు వహించిన సర్వర్ సాహేబ్ వద్ద వరదయ్యను వదిలిపెట్టారు. వరదయ్య గురు సేవలు చేయుచు అన్ని పురాణ, ఇతిహాస, భారతీయ విద్యావిశేషాలను కూలంకషంగా అభ్యసించారు. వరదయ్య తన గురువు గారిపై చక్కని పద్యమును చెప్పగా వారు సంతోషించి , బుద్దికుశలతకు మెచ్చి వరదయ్యను కవియై,దేశభక్తుడవై,జ్ఞానివై, నిరంతర సేవానిరతి కలవానివై వర్ధిల్లమని ఆశీస్సులు అందజేశారు. విద్యాభ్యాసమైన తర్వాత వరదయ్య స్పురద్రూపమును, ఉత్సాహమును, విజ్ఞానము, కుశాగ్ర బుద్ధిని, నిష్కాపట్యచిత్తమును గమనించిన వెంకటప్పయ్య నాయుడు, తాను పనిచేయుచున్న శాఖలో వాక్సినేటర్ ఉద్యోగమిప్పించెను. కొంతకాలము తర్వాత నందలూరులో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి స్వాతంత్రయోద్యమ ఉపన్యాసమును విని తన దేశభక్తి, స్వాతంత్య్రసహజగుణమునకనుగుణముగా ఆ ఉపన్యాసముతో ప్రభావితుడై వాక్సినేటర్ వృత్తికి రాజీనామా చేసి, స్వాతంత్య్ర ఉద్యములో పాల్గొని, ఊరు వాడలా తిరుగుతూ విదేశీపాలనలోని దాస్యవృత్తి కబంధహస్తములనుండి స్వేచ్ఛ పొందుటకై తన గంభీరో పన్యాసములను ఇచ్చుచు, దేశభక్తి పద్యములను, గేయములను తన శ్రావ్య కంఠముతో వినిపించు చుండెను. కవితలల్లి , పాటలు , పద్యాలు పాడి ప్రజానీకాన్ని ఉత్తేజపరచిన కవి గాయక శిరోమణి , దేశభక్తుడు. మాధుర్యగుణాలు తొణికిసలాడే రచన వారిది. తిరుపతి వేంకటకవులు, వీరి సహజ కవితను విని సంతసించి “నీవే కవివి, మేము పండితులము మాత్రమే!” అని ప్రశంసించారు. ఆ సమయములో బ్రిటీషువారు వరదయ్యకు ప్రచార సమయములో సహకరించిన మిత్రులగు కాకర్ల సోదరులతో సహా ముగ్గురుని నిర్బంధించి రాజంపేట జైలుకు పంపారు. మరుసటిరోజు ఉదయము అచ్చట నుంచి వేలూరు జైలుకు పంపారు. జైలులోను తన దేశభక్తిని చాటుతూ అనేక పద్యాలను వ్రాసినారు. జైలర్ ముందు బంధీగా యున్నప్పుడు గూడా స్వతంత్ర దేశభక్తి నిండినవిధముగా తన సహజశైలిలో అప్పటికప్పుడే పద్యాలు చెప్పెడివారు. మూడునెలలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలై వచ్చినపుడు దారిలోగల చిత్తూరు, తిరుపతి, కోడూరు, నందలూరు స్టేషన్లలో తండోపతండములుగా ప్రజలు వచ్చి వారిని పూలదండలతోను, ప్రశంసలతోను, సన్మానములతోను, జయజయ ధ్వానాలతో ముంచెత్తారు. నిండు జాతీయ భావముతోను, వినెడివారిని ఉప్పొంగించునటులను, భావోద్రేకములు కట్టలు తెంచుకొని వచ్చునట్లును, ఉడుకు నెత్తురు ఉప్పొంగజేయునట్లును, రోమాంచములు నిక్కబొడుచుకొనునట్లును వారి ఉపన్యాసాలుండేవి. అది వారు వ్రాసిన స్వరాజ్య ఢంకాలో చూడవచ్చును. తాను కారాగారశిక్షలో నున్నపుడే గాంధీజీ గారు ఆంధ్రదేశములో పర్యటించారు. వారి హృదయము మహాత్ముని దర్శన భాగ్యమునకై పరితపించుచుండెను. బొంబాయి నగరము వెళ్లి రేవాశంకర్ జగజీవన్ వారి భవనంలో వారి దర్శనము పొంది, వారి ఉపదేశవాక్కులను విని మూడు రోజుల ఆ నగరంలోనే నివసించెను. అటునుండి 25 -1 -1922 వ తేదిన సబర్మతి ఆశ్రమునకు వెళ్లెను. అచ్చట గాంధీజీ గారి కుమారుడు రామదాసుగారు సబర్మతి నదికి తీసికెళ్ళగా స్నామాచరించి, తదుపరి లోకైకజనని కస్తూర్బా గాంధీ ఇచ్చిన రొట్టెల భుజించెను. ఆశ్రమ నిరాడంబరత, పవిత్రత, పరోపకారదీక్ష, భక్తిప్రపత్తులకు ముగ్దుడయ్యెను. అసమయములోనే వారు "వైష్ణవ జనతో " అను గుజరాతీ పాటను తెనుగున అనువదించెను. అచ్చటనుండి స్వగృహమునకు బయలుదేరెను. గయాకాంగ్రెస్ సభ సందర్శనము వరదయ్య గారు తన ధర్మపత్ని మరియొక ఇరువురతో కలసి గయాకాంగ్రెస్ సభను సందర్శించి విశేషాలను తెలిసికొనిరి. మూడురోజుల అచ్చట ఉండి తదుపరి ఫల్గుణీ నదిలో స్నానముచేసి గయా క్షేత్ర సందర్శన చేసారు. బౌద్ధక్షేత్రమును సందర్శించి అహింస విధానాలను గూర్చి కూలంకషముగా తెలిసికొన్నారు. తదుపరి కాశీ విశ్వేశ్వరుని సందర్శనము చేసికొన్నారు.

శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని సేవ వరదయ్య గారికి స్వరాజ్య సేవ చేసిన తదుపరి కొన్నాళ్ళకు కోదండరామస్వామి సేవ చేయాలనే తలుపుగల్గినది. రామసేవ నిరతుడైనది మొదలు వరదయ్య అనుటకు మారుగా వరదదాసు గారని పిలువబడుచుండిరి. హనుమపతాకమును గైకొని రామునిమదిలో దలచి జయ శ్రీరఘురామ హారే అనుచు భక్తులు గుంపులుగా తనవెంట రాగ, రయమున ఒంటిమిట్టకు భక్తిపరవశుడై బయలు దేరును. వారి బృందంలో ప్రముఖంగా మామిళ్ళ వెంకటరంగయ్య గారి రంగయ్య, మామిళ్ళ వెంకటస్వామి, జంధ్యం యానాది, వెంకటయ్య, సుబ్బయ్య మొదలైనవారు వారిని అనుసరించుచుండిరి. వారి ప్రబోధము వలన మాంసాహారమును విసర్జించి శాకాహారులైన వారిలో రంగయ్య గారు, వెంకటయ్య గారు ఉండిరి. కొండమాచుపల్లెలో కోదండరామ సేవాసమాజమును ఏర్పరచి రామునిపై భక్తి పెంపొందించిరి. కీర్తనలు, గేయాలు, పద్యాలూ వ్రాసి కోదండరామ భజనామృతమను పేర చిన్న పొత్తమును రచించిరి. కొండమాచుపల్లెకు దగ్గరలో ఉప్పరపల్లె సమీపములో ఉన్న పైడికొండరాయుడు ఆలయమునకు వెళ్లి భక్తితో సేవించెడివారు.

వారి జీవిత చరిత్రను వ్రాసిన సాయం నారాయణచరణం, బొడిచెర్ల ప్రహ్లాదుగార్లు రచించిన పద్యాలను ఒకసారి గమనించిన వారి భక్తి, కోదండరాముని సేవా పారవశ్యమేమిటో తెలుస్తుంది. పాడును పిచ్చివానియటు పద్దెములల్లును రాముపేరుతో

వీడును చుట్టుపట్టుగల వేలజనాలనొకప్డు ప్రేమన ల్లాడును రాముఁజూచుటకునై తగగంతులువైచు నొక్కటన్ జూడగా జోద్యమౌను మనసున్ రఘురాముని జేర్చు నాతనిన్ .

కవిత రాముపథాన కలనిస్వనము దేల రామనామామృత ప్రేమమునిగె పల్కెనా? శ్రీరామభక్త చరిత్రలన్ బల్కు నన్యంబును బల్కడెపుడు విన్నవించుకపోవు వేర్వరుకష్టాల నతిభక్తి రాముపాదాల కడకె చిరుతల జేపట్టి చిందులద్రొక్కుచు పచరించు రాముపై పాటబాడి

అన్నిటన్ జూచి రామమయమ్ము గాగ మదిని భావించి దేహమున్ మరచిపోవు రామనామమె జీవితారాధ్యమనుచు దలచి ఆనందమగ్నుడై దనరు నితడు పరగ కోదండరాముని పేరుతోడ చిన్ని పొత్తము రచియించె వన్నెగాంచె.

వరదదాసు గారు శ్రీరామునిపైగల భక్తి పారవశ్యముచే పద్యాలు, పాటలు పిచ్చిపట్టినవానివలె పాడుచుండెడివారు. మరొకప్పుడు చుట్టుప్రక్కగల వేలజనాలతో కలసి ఒంటిమిట్ట రామా దర్శనానికి బయలుదేరెడివారు. రామనామామృతమును వర్షించునట్లు, మిక్కిలి భక్తితో చిందులు ద్రొక్కుచు అన్యవాంఛలులేక రామపాదముల దగ్గరకు వెళ్లెడివారు. తండోపతండములుగా పరిసర ప్రజలు వారిని అనుసరించెడివారు. శ్రీ రామ సంబంధమైన సేవాకార్యక్రమాలు నిర్వహించెడివారు. కొండమాచుపల్లెలో నున్న రామాలయము అట్టి సేవాకార్యక్రమాలు నిర్వహించుచు ప్రసిద్ధికెక్కినది. మంచి భజనమండలి అభివృద్ధిచెంది అన్ని దైవకార్యక్రమాలలో పాల్గొనెడివారు

వేలూరు జైలు జీవితమునుండి గాంధీ మహాత్ముని దర్శనము, గయాకాంగ్రెస్, మహాత్ముని ఉపవాసదీక్ష కాలము వరకు గల్గిన భావాలను ప్రథమ భాగము స్వరాజ్యపద్యగేయసుమదామ నామముతో ముద్రించబడి కాకినాడ కాంగ్రెస్ సభలో 6 గంటల వ్యవధిలో 500 ప్రతులు ఖర్చు కాబడినవి. తదుపరి రెండవ భాగముతో కలిపి వరదదాసు విరచిత రాజకీయ రాజయోగసారసమ్మిళిత ‘ స్వరాజ్య ఢంకా’ అను గాంధీమత గ్రంథము 1924 లో మొదటిసారిగా తాడిపత్రి రెడ్డి ముద్రణాలయములో ముద్రితమైనది. ఇది గాంధీజీవిత విశేషాలు, దేశభక్తి, రాట్నము, ఖద్దరు ప్రాముఖ్యత, పోరాటం తీరుతెన్నులు త్యాగముచూపుటకిదే సమయము, గాంధీ మత బడబాగ్ని, ప్రతిజ్ఞ, స్వరాజ్యరథము, సత్యఢంకా నినాదం మొదలగు శీర్షికలతో అత్యంత మనోజ్ఞముగా రచించబడింది. సత్యాగ్రహ సింహనాదము నాలకించి నిరంకుశ వైఖరితో పోరాడి జయించి భరతమాత బంధనముల త్రెంచి విజయభేరి మ్రోగించాలని ఉద్బోధించారు. మద్యపాన నిషేధోద్యమప్రచారము. వీరి హితబోధవలన, వారియెడల గల గౌరవమువలన కొండమాచుపల్లె, చుట్టుప్రక్కల గ్రామములోనివారు మద్యపానము నిషేధ ప్రచారము ప్రారంభించిన 1926 సంవత్సరమునుండి దాని జోలికి పోక నియమనిష్ఠలతో ఉండిరి. వారి వాక్కు వేదవాక్కుగా పరిగణించబడెను. ఉప్పు సత్యాగ్రహోద్యమము 1930 సంవత్సరము, మార్చినెలలో వరదదాసు గారు బందరు రోడ్డులో పతాకమెత్తి తన కవితా శంఖారావంతో ఘర్జించారు. పట్టుదలతో ప్రసంగించుచు, సభికులలో శౌర్యము హెచ్చునట్లు చేసెను . పోలీసులు అడ్డుకొని, ఆ జాతీయ పతాకమును పెరికి పారవేసి, లాఠీ జులిపించి, జనములను తరిమివేసి అట్టహాసము చేసారు. 30 మంది పోలీసులు భుజముపై నెత్తురు కారునట్లు కొట్టగా వీరుడు వరదదాసు స్మృతి తప్పి క్రిందపడిపోయారు.వరదదాసును అచ్చటున్న సోదరురులు తీసికొనిపోయి చికిత్స చేయించారు. దానికి బెదరక మరుసటినాడు మరల పతాకము చేతబట్టి ప్రసంగించుచుండగా వారిని పోలీసులు వచ్చి, అరెస్టు చేసి బందరు జైలుకు పంపిరి . ఆరునెలలు కారాగారశిక్ష విధించిరి. అచ్చటనుండి రాజమండ్రి జైలుకు, పిదప బళ్లారి జైలుకు మార్చిరి. స్వతంత్ర స్వరాజ్యపోరాటములో కారాగారశిక్షననుభవించు సమయములోనే ఆత్మస్వారాజ్య ఆధ్యాత్మ ధ్యానఫలమును పొందిన మహనీయుడు వరదదాసు గారు. కారాగారశిక్షననుభవించు సమయములోనే ఆత్మా రామతత్త్వామృతమును రచించిరి. విడుదలైన తర్వాత శ్రీ వ్యాసాశ్రమమును చేరి తన గురువగు శ్రీ మలయాళ స్వామి సన్నిధిలో ఉండిరి. అది మొదలు వరదదాసు అను నామము వరదదాస స్వామిగ ప్రసిద్ధినొంది పిలువబడు చుండిరి. అసమయములో వేంకటగిరి జీవకారుణ్య సంఘమువారు వరదదాసు ఆశ్రమములో నున్నది తెలుసుకొని జాతరలో జీవబలిని నివారించుటకై ఆహ్వానించిరి. వరదదాసు వెళ్లి తన కంఠమును ఆసాదివాని కత్తిక్రిందపెట్టి తనను బలి ఇవ్వమనగా, చేతులు వణకుతూ కత్తి క్రిందపెట్టినాడు. ఆ సంవత్సరము జాతరలో జీవబలిని నివారించగల్గినారు. తెనాలి శ్రద్ధానంద హరిజన పాఠశాల తెనాలి శ్రద్ధానంద హరిజన పాఠశాల 20.6. 33 వ తేదిన వరదదాస స్వామి వారిచే ప్రారంభించబడింది. సుమారు వందమంది సవర్ణులు, హరిజనులు కలసి చదువుచున్నారు. హరిజనులొక్కరు, బ్రాహ్మణులొక్కరు ఉపాధ్యాయులుగా యున్నారు. తదుపరి అది 23 -12 -33 వ తేదిన గాంధీమహాత్మునిచే హరిజనగురుకులముగా మార్చబడింది. వరదదాస స్వామి ఆ సందర్భమును పురస్కరించుకొని హరిజన సేవామృతము అను చిన్న పొత్తమును రచించి ఆ పాఠశాలకు అంకితమిచ్చారు. సన్న్యాస స్వీకారము తన ధర్మపత్ని సావిత్రమ్మగారి అనుమతితో గురువులైన మలయాళస్వామి వారి నుండి పరబ్రహ్మానందగిరి స్వామి అనుపేరుతో సన్న్యాసమును స్వీకరించారు . తదుపరి మూల్పూరు గ్రామములో ఆత్మబోధాశ్రమము నెలకొల్పి జిజ్ఞాసువులకు గీతను, ఆత్మ తత్త్వమును, సద్గురువుల అపార జ్ఞానమును, గాంధీగారి కర్మయోగ నిష్ఠ ప్రభావమును గూర్చి బోధించుచు ఉండిరి . ఆ సమయమున ఆత్మబోధోపనిషత్తును తెలుగులో ద్విపదగా రచించిరి. వరదదాసు గారు బహుముఖప్రజ్ఞాశాలి. దేశభక్తుడు, పోరాట కవి, స్వాతంత్య్రసమరయోధుడు, ప్రచారారోద్యమకర్త, ఆధ్యాత్మికవేత్త, మహోపన్యాసకులు, నటకుడు, నాటకకర్త, గాయకుడు, సహజ కవి,, రచయిత. కలకత్తాలో 1937 లో తనువు చాలించి బ్రహ్మలీనులైనారు. వరదదాసు గారి రచనలు. శ్రీ మలయాళ సద్గురు స్మరణామృతము, భజగోవిందం - తెలుగు తోహరలతో అనువాదం, శ్రీ నమశ్శివాయ గేయామృతము, శ్రీ సాంబశివ గేయామృతము, అహింసా పుష్పము, శ్రీ కృష్ణ ప్రేమామృతము, శ్రీ రామకృష్ణ ప్రేమామృతము, శ్రీ మన్నారాయణ గేయామృతము, వేదాంతసారామృతము, ఆత్మారామతత్త్వామృతము, శ్రీ లక్ష్మీతులసి బృందావనము, స్వరాజ్య ఢంకా, సరస్వతి అమ్మగారి జీవిత చరిత్రము, అమృతబిందుఉపనిషత్తు - తోహరలతో, నాటకాలు : సజ్జనక, లక్ష్మణమూర్ఛ, కోదండభజనామృతము.

శ్రీ వరదదాసు గారి కమనీయ కవితకు ఉదాహరణలు (స్వరాజ్య ఢంకా) చక్కని వేలూర మ్రొక్కులందిన కాల

నొగి లోహకడియంబు నూనినాడ

తగ పూల హారముల్ దాల్చిన మెడలోన

కొయ్య బిళ్ళను కట్టికొన్నవాడ

చిత్తూరు పౌరుల చేవిందు గను నోట

తగని చోడంబలి ద్రాగినాడ 

పూని శ్రీగాంధీటోపీని దాల్చిన తల

నడరి ఖైదీ టోపీ నిడినవాడ 

ఉడుపులునుమారె కష్టంబు లొందినాడ కష్టముల బొంది సుఖముల గాంచవలెనొ సుఖముజెంది కష్టంబును చూడవలెనొ తెలియబల్కవె నాతోడ తెల్లముగను శ్రీ రమానాథ ! లోకైకవీర ! వరద!

ఖద్దరు శక్తి సర్వమతంబుల సామరస్యముతోడ

నైకమత్యము గూర్చి యలరుటొకటి

అంటుబట్టలు మ్రగ్గు నందాకసుంతేని

క్రొత్తమాయని మంచి గుణమునొకటి 
మాంచెష్టరాదిగా మల్లుపట్టణముల
గడగడలాడించు కార్యమొకటి 

బీదసాదలకెల్ల పెట్టనిభిక్షమై

కడుపునిండించెడి ఘనతయొకటి

ఇన్ని మేల్లు, ఖద్దరునందె యిమిడియుండ తెలియజాలక, కన్నులు తేలవేసి చింత సేయంగ నేటికి చెలగినేడే భరతపుత్ర, ఖద్దరుదీక్ష బట్టుమయ్య!

ఖద్దరు ప్రాముఖ్యము 

అతిభోగి మోతిలా లంతటి వృద్ధుండు

ఖద్దరు వస్త్రమే గట్టుచుండ 

ఆంగ్లాదేశీయులా యాండ్రుసు ముఖ్యులు

ఖద్దరు ధోవతుల్ గట్టుచుండ 

అబలాశిరోమణు లతిసుకుమారులు

ఖద్దరు చీరలే గట్టుచుండ

యోగులు, భోగులు, త్యాగులెయ్యెడలను

ఖద్దరు గుడ్డలే గట్టుచుండ
నీవు భారతీయుడవు కానేరవో, వి 

లాసమో ? దయా రహితమో? దోసగుణమొ తెలుపుమయ్య, దేశహితంబు వెలయ నేడె భరతపుత్ర, ఖద్దరుదీక్ష బట్టుమయ్య!

తాతలు తండ్రులు దాల్చిన ఖద్దరు

దాల్పకుంటివిదేమి ధర్మమయ్య 

బీదల రక్షింప బేర్గన్న ఖద్దరు

వేయకుంటివిదేమి న్యాయమయ్య

అలలోకగురునిచే వెలసినఖద్దరు

బూనకుంటి విదేమి జ్ఞానమయ్య

ద్రవ్యార్జనమునకు దారియైఖద్దరు

గట్టకుంటివి దేమి కర్మమయ్య

ధర్మ మార్గంబు సుంతేని దలపలేవె ? న్యాయమగురీతి నింతేని నడువలేవె? తెలుపుమయ్య దేశహితంబు వెలయనేడె ? భరతపుత్ర, ఖద్దరుదీక్ష బట్టుమయ్య!

రాట్నము 

భారతంబున కూడా పాండవుం డశ్వమున్

క్రొత్తముట్టున గట్టి పుత్తుననియె 

కదురాడితే చాలు కదలింతు గోల్కొండ

నని యొక్కస్త్రీ రత్నమమర బలికె

మన దేశవస్త్రముల్ గని ఫ్రాన్సువారును

బెగడి భట్టులమాడ్కి బొగడిరయ్య 

పూని ఢక్కామజి లీనువస్త్రంబును

పొదిగిరి నస్యపు బుఱ్ఱలోన 

పూర్వకాలంబును బుద్ధి నూహింపుడీ

మనదేశ మెంతటి మహిమ గనెనొ 

మేము బాపలమంచు మేము రాజులమంచు

మేము వైశ్యులమంచు మిడుకవలదు 

చేతకాదని కాని చెడిపోవునని కాని

సంశయ మొందంగ జనదు సనదు

సాధనంబున పను ల్సమకూరు ననునీతి

విన్నవారలె పెద్ద పిన్నవారు

అల విదేశీయ యంత్రఘోరాసురులకు దివ్య విష్ణుచక్రంబున తేజరిల్లు రాట్నము ద్రిప్ప బూనుడీ రాత్రిబవలు సాలుకెనుబదికోట్ల రూప్యాలి మిగులు నిదియె గాంధీమహాత్ముని యెత్తుగనుడు పుణ్యధనులార! భారత పుత్రులార!

రాటము త్రిప్పాలంటూ మేల్కొలిపిన పద్యము

అతి భాగ్యవంతురా లాసరళాదేవి 
విడువక రాట్నంబు వడుకుచుండ

రాణివాసంబున రహిగుల్కు నెలతలు

మెప్పుగా రాట్నముల్ ద్రిప్పుచుండ 

భుజబలాధిక్యత గజవైరులను బోలు

పురుషులు రాట్నముల్ పూనియుండ

తుదకు లోక గురుండు పదపడి రాట్నమే

వడకెడు ఘనదీక్ష బట్టియుండ

మాకుచేతగాదంచు, నేమారు బలుక నతివలార? మీ కెట్లు నోరాడునమ్మ సాధనము చేయగ పనుల్ జరుగునమ్మ తెగువ రాట్నముల్ క్రిందికి దింపుడమ్మ మానవతులార! భూరికల్యాణులార!

మహాత్ముని గుజరాతీ వైష్ణవ జనతోగేయమునకు తెనుగు

శ్రీ రాగము . ఆది తాళము

గుజ !! వైష్ణవ జనతో, తేనే కహియే, జో పీడపరాయీ జానారె, పరదుఃఖే ఉపకారకరితో,

ఏమన అభిమానవ ఆనేరే!! వై !!

తెను!! పరోపకారి, భక్తుడెవడో, వాడే చూడగ వైష్ణవుడూ

మేలుంజేసియు, నేజేసితినని, మిగులఁగ బల్కనివాడెవడో !!ప !!

గుజ !! సకల లోకమా, సౌనే వందే, నిందా నకరేకేనీరే, వాచకాచమన,

నిశ్చలరాఖే, ధనధనజననీ తేనీరే !! వై !!

తెను!! సర్వ ప్రపంచపు, మానవకోటికి, సాష్టాంగముగా దండమిడి, నిందలు జేయక

తనుమాన భాషల, నిశ్చలుడయిన వాడెవడో !!ప !!

గుజ !! సమ దృష్టీనే, తృష్ణా త్యాగీ, పరస్త్రీ జేనేమాతారే జిహ్వా ధకి, అసత్య నబొలో,

పర ధన నవ ఝలే హ ధరే !! వై !!

తెను!! సర్వ జీవముల నెల్లవేళల దన సమానముగ మదిలో నెంచీ పర ధన,

పర స్త్రీ దూరత సత్యము, వెరవక బతికెడు వాడెవడో !!ప !!

గుజ !! మోహ మాయవ్యాపేనహి జానే, దృఢ వైరాగ్యజ నామనమారే రామనామ

మాతాలిలాగీ, సకలతీర ధతె సేవకరే !! వై !!

తెను!! మాయల జేయక మోహము నొందక, మదిలో వైరాగ్యము బూని, రాముని నామము,

చెవి బడినంతనె, రంజిలుమదిగలవాడెవడో !!ప !!

గుజ !! వనలోభీ నేక వట రహితచే, కామ క్రోధ నివార్యేభణే

నరసంయోతే సుందర్శన, కార్టాంకులయె కొతేరా తార్యారే !! వై !!

తెను!! కామ క్రోధా, లోభ మాదిగాగల శత్రువులను బరిమార్చి, ఘనుడౌ భక్తుడె

పూజ్యుడు, వానిగన్న తరింతురు ఈ ధరణిన్ !!ప !!

తెను!! గాంధి మహాత్ముడు జైలునకేగుచు, గానము చేసిన గేయమిదీ,

గాంధి మహాత్ముని శిష్యుల పాలిటి కల్పవృక్షమై తనరునిదీ,
ఉపవాసంబును దీర్చిన రోజున యొప్పుగ పాడిన పా టయిదీ, 
అపురూపంబై వరదాసుని ఆనందంబున ముంచునిదీ !! వై !!

మీ విద్యాతపస్వి మామిళ్ల లోకనాథం M.Sc., M.Ed., Dip Sc.Ed (Lond) CPE (Lond) Principal (Retd) Govt DIET 9703426059 Now in Hyderabad.

1.శ్రీ నమశ్శివాయ గేయమృతము, గ్రంథ కర్త : శ్రీ సాయం వరద దాసు, ప్రకాశకులు, శ్రీ వ్యాసాశ్రమము, ఏర్పేడు, చిత్తూరు జిల్లా పిన్ 517621

2.శ్రీ రామకృష్ణ ప్రేమామృతము, గ్రంథ కర్త : శ్రీ సాయం వరద దాసు, ప్రకాశకులు, శ్రీ వ్యాసాశ్రమము, ఏర్పేడు, చిత్తూరు జిల్లా పిన్ 517621

3.సాయం వరద దాస గ్రంథావళి, సంపాదకుడు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, M . A . ప్రకాశకులు, శ్రీ వ్యాసాశ్రమము, ఏర్పేడు, చిత్తూరు జిల్లా పిన్ 517621

4.శ్రీ విద్యానందగిరి స్వాములవారి జీవిత చరిత్ర, రచన : సలదాగు పాండురంగయ్య, ప్రకాశకులు, శ్రీ వ్యాసాశ్రమము, ఏర్పేడు, చిత్తూరు జిల్లా పిన్ 517621

5. 75 స్వాతంత్ర్య సమర వీరులు, భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు, రచన: మామిళ్ల.వెం.లోకనాధం ప్రచురణ: 2021, కమలాకర భారతి ట్రస్ట్, హైదరాబాద్