సాయిలు కంపాటి
సాయిలు కంపాటి ఒక తెలుగు సినిమా దర్శకుడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, స్వంత అనుభవాలను కథలుగా మలిచి సినిమాగా తెరకెక్కించిన యువ దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైంది.[1][2][3]
ప్రారంభ జీవితం
[మార్చు]సాయిలు కంపాటి తెలంగాణ రాష్ట్రంలోని భభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలంలోని కొమరారం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పదో తరగతి వరకు స్వగ్రామంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్ పూర్తి చేశారు.
చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సాయిలు, ప్రముఖ నటులైన ఎన్.టి.రామారావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు సినిమాలను ఎక్కువగా చూసేవారు. సినిమాలపై ఉన్న మక్కువే ఆయనను ఈ రంగంలోకి తీసుకొచ్చింది.
సినీ ప్రస్థానం
[మార్చు]చదువుకునే రోజులలోనే స్నేహితులతో కలిసి ఒక వీడియో కెమెరా తో షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ ప్రయత్నానికి గ్రామస్థుల నుంచి ప్రశంసలు రావడంతో తనలో దర్శకత్వ ప్రతిభ ఉందని నమ్మకం కలిగింది.
బీటెక్ పూర్తయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చారు. మొదట జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి సినిమా షూటింగ్ బస్సు నుంచి సీట్లు లేవన్న కారణంతో దిగబెట్టివేయడం, మరోసారి టీవీ కార్యక్రమంలో భోజనం కూడా చేయనివ్వకపోవడం వంటి అనుభవాలు ఆయనను మానసికంగా కఠినంగా మార్చాయి.
అసిస్టెంట్ దర్శకుడిగా
[మార్చు]2015లో అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించింది. జా చిత్రానికి పనిచేశారు. అనంతరం నారప్ప చిత్రంలో అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశారు. దర్శకుడు వేణు ఊడుగుల ప్రభావం సాయిలుపై బలంగా పడింది.
రాజు వెడ్స్ రాంబాయి
[మార్చు]2004 లో తన చిన్నతనంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా సాయిలు రాజు వెడ్స్ రాంబాయి కథను రచించారు. ఈ కథను అనేక మంది నిర్మాతలకు వినిపించినా, ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వేణు ఊడుగుల కథను విని కొన్ని మార్పులు సూచించి ఆమోదించారు.
2024 ఆగస్టులో షూటింగ్ ప్రారంభమై, 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. మహబూబాబాద్ సమీపంలోని కాచనపల్లిలో సినిమా మొత్తం చిత్రీకరించబడింది. ఈ చిత్రం 2025 లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.
ఈ సినిమాలో పరువు హత్యలు కేవలం పై వర్గాల్లోనే కాకుండా అణగారిన వర్గాల్లో కూడా జరుగుతాయనే సామాజిక వాస్తవాన్ని చూపించారు.
వ్యక్తిగత దృక్పథం
[మార్చు]సాయిలు కంపాటి ప్రతి సినిమాను ఒక పాఠంగా భావిస్తారు. సినిమాలు చూడటం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆయన నమ్మకం. ఒకసారి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో సినిమా టికెట్ కొనలేకపోయిన సంఘటనను ఆయన తన జీవితంలోని కీలక అనుభవంగా పేర్కొన్నారు.
చిత్రసంపుటి
[మార్చు]- రాజు వెడ్స్ రాంబాయి (దర్శకుడు)
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2025-11-23). "Sailu Kampati | చదువుకునే రోజుల్లోనే షార్ట్‌ఫిల్మ్.. ఇప్పుడు ప్రేమకథతో మీ ముందుకు..!". www.ntnews.com. Retrieved 2026-01-10.
- ↑ "Saailu Kampati: మన ఆత్మ స్క్రిప్ట్‌లో కనిపిస్తేనే..." EENADU. Retrieved 2026-01-10.
- ↑ "చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది.. అందుకే నా చేయి అలా అయిపోయింది - సాయిలు". Samayam Telugu. Retrieved 2026-01-10.