సారంగు తమ్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారంగు తమ్మయ్య
జాతీయతభారతదేశం
వృత్తికవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వైజయంతీ విలాసము

సారంగు తమ్మయ్య[మార్చు]

ఈప్రాంతములయందు సారంగువారు సాధారణముగా మాధ్వులుగా నున్నారు. ఈకవి తనవంశమును వర్ణించుచు,

 ఉ. త మ్మనయంబు బ్రోచుటకు ధారుణిబంధులు బంధుపారిజా
త మ్మన రామభక్తి గలతార్కికు లెల్లను వీనిదౌర చి
త్త మ్మన జూపులం దనిసి ధార్మికు లీతని దెంతమంచివృ
త్త మ్మన నాగిరిప్రభునితమ్మన మించె నుదంచితస్థితిన్.

గీ. తమ్మమంత్రి గాంచె దిమ్మాయియందు నం
   దనుల శౌర్యసింహు నారసింహు
   జతురబుద్ధిచంద్రు సత్కళాగుణచంద్రు
   గిరిచమూవరేంద్రు గీర్తిసాంద్రు.

తనతాతను రామభక్తునిగా జెప్పుటచేతను, అతని భార్యను తిమ్మాయియని చెప్పుటచేతను కూడా నితడు మాధ్వవంశజు డేమోయని యూహింప దగియున్నను.

క. సారమతి యానృసింహుడు
   వారాశిగభీరు డతులవై భవమున గౌ
   రీరమణి నీశు డుంబలె
   నారూడాన్వయ వరించె నక్కమసాధ్విన్.

ఈకవి నియోగిబ్రాహ్మణుడని తెలుపు ఆధారములు[మార్చు]

అని తనతల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో బోల్చుట చేతను తనపూర్వుల కమాత్యాదిపదములను జేర్చుచు వచ్చుటచేతను కవి నియోగిబ్రాహ్మణుడని తోచుచున్నది. ఇత డాపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; నరసింహమంత్రిపుత్రుడు; సారంగు తమ్మయామాత్యపౌత్రుడు. ఈకవి వైజయంతివిలాస మనునాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇందు విప్రనారాయణుడనెడి యాళ్వారుచరిత్రము వర్ణింపబడినందున, దీనికి విప్రనారాయణ చరిత్రమనియు నామాంతరము గలదు. ఈవిప్రనారాయణునికే తొండరడిప్పొడియాళ్వా రని యఱవపేరు.

ఈగ్రంధమునందలి కావిత్వము[మార్చు]

ఈపుస్తకము లోని కవిత్వము మనోహరముగానే యుండునుగాని యందందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు కానబడుచున్నవి. కథయు మిక్కిలి యింపుగా నుండును. విప్రనారాయణుడను వైష్ణవబ్రహ్మచారి కావేరితీరమునందు శ్రీరంగ క్షేత్రమునందు వసించుచు మాధుకర వృత్తిచే జీవించుచు భక్తితో శ్రీరంగనాయకునకు తులసిమాలల నర్పించుచు కాలము గడుపుచుండెను.

శా. స్వాధ్వాయంబు బఠించు సాంగకముగా సంధ్యాద్యనుష్ఠానముల్
   విధ్యుక్తక్రియ నాచరించు దఱితో వ్రేల్చుం బ్రపూతాత్ముడై
   మధ్యేరంగశయానమూర్తి కిడు సమ్యద్భక్తి దోమాలికల్
   మధ్యాహ్నంబున గుక్షి బిక్ష దనుపు న్మాధూకరప్రక్రియన్.

ఇట్లుండగా మధురవాణియు దేవదేవియు ననువేశ్య లక్కచెలియం డ్రిద్ద ఱాతనిని దేవాలయములో జూచి యాతనినిష్ఠ కద్భుతపడి భక్తితో మ్రొక్కగా నతడు వారిమ్రొక్కు గైగొనకపోయెను. అప్పుడు దేవదేవి యలిగి యప్పతో

ఉ. మ్రొక్కిన నెవ్వ రే మనడు; మో మటువెట్టుక చక్కబోయె; నీ
   దిక్కును జూడడాయె; నొకదీవనమాటయు నాడడాయె; వీ
   డెక్కడి వైష్ణవుండు ? మన మేటికి మ్రొక్కితిమమ్మ ? యక్కటా!
   నెక్కొని వెఱ్ఱిబుద్ధి యయి నిద్దురవోయినవానికాళ్ళకున్.

అని యతని నిరాకరించి పలికెను. మధురవాణి చెల్లెలి నూరార్చుచు,

ఉ. చూచిన నేమి? నీవలను చూడకయుండిన నేమి? పూజ్యులం
   జూచిన భక్తి మ్రొక్కుటయె శోభన; మీతడు బ్రాహ్మణుండు;ధా
   త్రీచరులందు బ్రాహ్మణుండు దేవుడు; దేవుడు నీవు మ్రొక్కినన్
   జూచునొ? పల్కునో? యటుల సుమ్మితడున్ నరసీరుహాననా!

అని శాంతచిత్తను జేసి యతనివై రాగ్యమును గొంత ప్రశంసించెను. అప్పు డప్పమాట లంగీకరింపక,

చ. ప్రకటజితేంద్రియుల్ ధర బరాశరకౌశికులంతవారు స్త్రీ
   లకు వశు, లంతకంటె మిగులన్ దృడమౌమగకచ్చ బిగ్గ గ
   ట్టుకొనగ నీత డెంత? శుకుడో? హనుమంతుడొ? భీష్ముడో? వినా
   యకుడొ? తలంచుకో నరసిజాయతలోచన నెమ్మనంబునన్.


క. ఈనిష్ట లింతతారస | మైనందాకానెసూ! సదాచారి యటం
టే, నబ్బినదాకనె యగు,|మౌనిజనవిడంబనములు మనమెఱుగనివే?

క. ఇటువంటయ్యలె కారా
   చిటుకు మనక యుండ సందెచీకటివేళన్
   ఘట చేటీవిటులై యీ
   కటకంబున దిరుగువారు? కంజదళాక్షీ!

గీ. నిర్జితేంద్రియుండు నిష్ఠాపరుం డంచు
   నప్ప సారెసారె జెప్పెదీవు;
   వీని బ్రతినచెఱిచి విటుజేసితెచ్చిన
   గలదె పందె మనిన గాంతపలికె.

క. నీ వీవైష్ణపు విటునిం | గావించిన, లంజెతనపుగడ నే విడుతున్;
   గావింప లేక యుండిన | నీవు న్విడిచెదవెయనిన నెలతుక యొప్పెన్.

చెల్లె లావీరవైష్ణవుని విటుని జేయవచ్చు ననియు, అప్ప యతని నట్లు చేసినయెడల తాను వేశ్యావృత్తిని విడిచెద ననియు వివాదపడిన మీదట దేవదేవి తా నావైష్ణవబ్రహ్మచారిని విటునిజేసి యింటికి దేలేకపోయినపక్షమున దాను వేశ్యావృత్తిని విడిచెదనని పంతము పలికి తనరత్నాభరణములను, కస్తూరీతిలకమునుదీసి తులసిపూసల పేరులును తిరుమణినామములును వేసి సానివేషము బాసి దాసరిసాని యయి తిన్నగా విప్రనారాయణు డున్న యారామమునకు బోయి యాతనికి నమస్కారము చేసి, హేయభాజనమయిన వేశ్యావృత్తిపై విరక్తి పొడమినట్టు నటించి,

గీ. * * హేయభాజన మెన్నిట నెన్నిచూడ
   వేశ్యజన్మంబు జన్మమే విప్రవర్య

ఉ. ఒక్కని బిల్వనంపి, మఱియొక్కనిచేత బసిండిపట్టి, వే
   ఱొక్కనియింటి కేగుచు, మఱొక్కని నానడుచక్కి నొక్క-
   బొక్కికలంచి చూడ భ్రమబొంది విటుల్తెలియంగ లేరుగా
   కెక్కడిసత్య మేడవల పెక్కడినేమము వారకాంతకున్?

మూలాల జాబితా[మార్చు]

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు......... సారంగు తమ్మయ్య