సింగరాజు రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగరాజు రామకృష్ణయ్య
సింగరాజు రామకృష్ణయ్య
జననంసింగరాజు రామకృష్ణయ్య
జూలై 1 1911
మరణంఆగష్టు 27 , 2002
ఇతర పేర్లుసింగరాజు రామకృష్ణయ్య
వృత్తిఉపాధ్యాయుడు,
ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి
ప్రసిద్ధిఉపాధ్యాయ ఉద్యమ రథసారధి
శాసన మండలి సభ్యులు

సింగరాజు రామకృష్ణయ్య (జూలై 1, 1911 - ఆగష్టు 27, 2002) ప్రముఖ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపిటిఎఫ్‌) పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. 1960 తర్వాత ఉపాధ్యాయ ఉద్యమం ప్రాంతాల వారీగా, యాజమాన్యాల వారీగా, కేడర్ల వారీగా చీలిపోయింది. టీచర్ల సమస్యలు పరిష్కారం కాక ఎక్కడివక్కడే ఉండిపోయాయి. అంతవరకు పొందిన రాయితీలు, సౌకర్యాలూ పోయాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై కనీసం ఉపాధ్యాయ సంఘాలని ఒకే వేదిక పైకి తెచ్చి సమస్యల పరిష్కారానికి ఫ్యాప్టో నిర్మాణానికి సింగరాజు కృషి చేశారు. ఫ్యాప్టో ఉపాధ్యాయుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు, సాధించిన ఫలితాలు చారిత్రాత్మకమైనవి. సింగరాజు ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్- ఎపిటిఎఫ్-కు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రధాన కార్యదర్శిగా, రెండుదశాబ్దాలపాటు శాసనమండలి సభ్యులుగా, ఐక్య వేదికలైన యుఏసి, ఫ్యాప్టో, జెసిఇ, జేఏసి వంటి వాటిల్లో నాయకత్వ పాత్ర వహించి నిబద్ధతతో, ఆదర్శంగా పనిచేసి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి, హక్కులకోసం ఎనలేని కృషి సాగించారు. జాతీయ, అంతర్జాతీయ ఉపాధ్యాయ సంఘాలతో సంబంధాలు పెట్టుకోవడమే కాక వాటిల్లోను పాత్ర వహించి ఉపాధ్యాయుల ఆశయాలకోసం పనిచేశారు.

విద్యాభ్యాసం[మార్చు]

ఒకనాటి నెల్లూరు జిల్లాకు చెందిన కనిగిరి తాలూకా తలకొండపాడు గ్రామంలో (ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది) సింగరాజు రామకృష్ణయ్య జూలై 1 1911 న జన్మించారు. తన ఏడవ ఏటనే తల్లిని కోల్పోయి చిత్తూరు జిల్లా కాళహస్తి లో ఉన్న పెత్తల్లి గారింటికి చేరారు. అక్కడే ప్రాథమిక పాఠశాలలో 3 వ తరగతిలో ప్రవేశించారు. పెద్దన్న అండతో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువు పోర్తి చేశారు. విద్యార్థి దశలో తన చురుకుదనం, కుశాగ్రబుద్ధితో ఉపాధ్యాయుల, తోటి విద్యార్థుల అభిమానం చూరగొని తరగతి నాయకుడయ్యాడు. వార్షికోత్సవాల సందర్భంలో జరిగిన ఆంగ్లవ్యాస రచన, పద్య పఠనం పోటీలలో ప్రథమ బహుమతి సాధించారు.

పెద్దన్న జాతీయవాది, స్వాతంత్ర్యోధ్యమ అభిమాని కావడంతో వారి ప్రభావంతో ఖద్దరు వస్త్ర ధారన చేశారు. గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సాగిన విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు. మద్యపాన వ్యతిరేక ప్రచారం, కల్లుదుకాణాల వద్ద పికెటింగ్ వగైరా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా యవ్వనం తొలిదశలోనే దేశభక్తిని అలవరచుకొని స్వచ్ఛందం సేవకుడుగా పరిణామం చెందారు.

వారిది బీద కుటుంబం కావటంతో పై చదువులకు వెళ్లలేక నెల్లూరు సెకండారీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలులో ప్రవేశించారు. తన క్రియాశీలత వల్ల ఉపాధ్యాయుల, తోటి విద్యార్థుల గుర్తింపు పొందడమే కాక టీచర్ ప్యూపిల్ లీడర్స్ అసోషియన్ లీడర్ గా ఎన్నికై పలు కార్యక్రమాల్లో పాల్గొని వారికి అభిమానపాతృడయ్యాడు.

ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశం[మార్చు]

ఉపాధ్యాయ శిక్షణ అనంతరం 1931 లో కాళహస్తి తాలూకా మోదుగుపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియామకమైనారు. తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చి, 1933 లో పామూరు జిల్లా బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడ నుండి పాతకమూరు, దర్శి పాఠశాలల్లో 1947 వరకు పనిచేశారు.

పై మూడు ప్రదేశాలలోనే ఆదర్శ ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహించడమే గాక సంఘసేవా కార్యక్రమాలు కూడా సాగించారు. పాతకమూరులో బీద విద్యార్థుల వసతి గృహం యేర్పాటు చేశారు. దర్శిలో స్థానిక అధికారుల సహకారంతో తాలూకా భవన నిర్మాణానికి కృషిచేశారు. క్లబ్ కార్యదర్శిగా, స్థానిక కో ఆపరేటివ్ స్టోర్సు కార్యదర్శిగా పనిచేశారు. వారికి సంగీతంలో నాటకాలలో అభిరుచి కారణంగా కొన్ని సాంఘిక నాటకాల ప్రదర్శనకు కృషిచేశారు. వాటిల్లో కొన్ని పాత్రలు కూడా దర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ జిల్లా బోర్డు ఆదేశం ప్రకారం పాతకమూరు పాఠశాల స్టాప్ బుక్ లో మూసివేసినట్లు నమోదు చేసి ధైర్యంగా తన దేశభక్తిని ప్రదర్శించారు. ఆ జిల్లాలో అలా మూసివేసిన స్కూలు అది మాత్రమే కావటం విశేషం.

ఏ.పి.టి.యఫ్ లో ప్రవేశం - బాద్యతలు స్వీకారం[మార్చు]

1948 లో చెన్నుపాటి లక్ష్మయ్య నాయకత్వాన గుంటూరులో టీచర్స్ ఫెడరేషన్ పునరుద్దరణ జరిగినపుడు అందులో సభ్యత్వాన్ని స్వీకరించటమే కాక దర్శి తాలూకా ప్రదాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1948 లో ఉపాధ్యాయ పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పత్రికా నిర్వహణలో పాల్గొన్నారు.

శెభాష్ కనిగిరి[మార్చు]

1948 లో కనిగిరి తాలూకా మహాసభలో విద్యాశాఖాధికారి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మాణిక్యాంబ, సింగరాజు గార్ల నాయకత్వంలో వందలాది మంది ఉపాధ్యాయులను సమీకరించి, సాగించిన ఉద్యమం "సెభాష్ కనిగిరి" ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఉజ్వల ఘట్టంగా నిలిచించి. ఈ ఉద్యమమే సింగరాజు గారి ఉపాధ్యాయ ఉద్యమ జీవితానికి మలుపు తిప్పింది.

ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక[మార్చు]

1949 లో నర్సారావు పేటలో జరిగిన ఎ.పి.టి.యఫ్ జనరల్ కౌన్సిల్ సమావేశం ప్రథమంగా సింగరాజు గారిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఆనాటి నుండి ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగి 1992 లో విజయవాడలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.1949 నుండి 1992 వరకు ఎ.పి.టి.యఫ్‌కు ప్రధాన కార్యదర్శిగా 43 సంవత్సరాల పాటు పనిచేశారు.

1947 లో ఏపిటియఫ్ ఆవిర్భావం నుండే ఫెడరేషన్ సభ్యులుగా చేరి నెల్లూరు జిల్లా దర్శి తాలూకా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు 1947 లో ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్నపుడు వేతనాల పెంపుదల తలపెట్టిన సమ్మె కార్యక్రమాలల్లో ఉధృతంగా పనిచేశారు. ఉపాధ్యాయుల వాణిని బలంగా వినిపించేవారు. విద్యా-ఉపాధ్యాయ సమస్యలనె గాక పలు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళారు. సమస్యలను విశ్లేషించి వివరించడంలో, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో చక్కటి వాగ్దాటితో పరిణితిని చూపించేవారు. 1947, మే 17 న రాజీ కుదిరి వేతనాల పెంచబడ్డాయి.

సంఘ స్వాతంత్ర్య సాధన[మార్చు]

1947 లో ఆవిర్భవించిన ఏ.పి.టి.యఫ్ వేగవంతంగా పెరుగుతూ విస్తరిస్తూ ఉపాధ్యాయుల ఛాంపియన్ గా రూపొందుతున్న దశను పాలకులు గమనించారు. సంఘ స్వాతంత్ర్యాన్ని హరించే 416 జీ.వోను ఆధరంగా తీసుకుని ఆనాటి మద్రాసు ప్రభుత్వం, నెల్లూరు జిల్లా బోర్డు కుమ్మక్కై సింగరాజుని ఉపాధ్యాయ ఫెడరేషన్ నుండి దూరం చేయాలని బెదిరించారు. వారి బెదరింపులకు సింగరాజు బెదరలేదు. సరికదా 416 జి.వో రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అది చెల్లదని మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి, అందరినీ బోను ఎక్కుంచారు. వాద ప్రతివాదనల తర్వాత 1951, అక్టోబరు 19 న హైకోర్టు సదరు 416 జి.వొను రద్దు చేసి, ఉపాధ్యాయులకు సంఘ స్వతంత్ర హక్కు వుందని చారిత్రాత్మకమైన తీర్పు నిచ్చింది. ఈ విధంగా ఉపాధ్యాయులకు సింగరాజు సంఘ స్వాతంత్ర్యాన్ని సాధించటంలో ప్రధాన పాత్ర వహించారు. ఆనాడు ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అభినందించింది. ఈ తీర్పును పతాక శీర్షికతో టీచర్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రచురించింది.

అణచివేత - నిర్బంద విధానాలు[మార్చు]

1950 దశకంలో కమ్యూనిష్టు పార్టీ పైన ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలపైన తీవ్ర అణచివేత - నిర్బంధ విధానాలు సాగాయి. ఆనాడు ఏ.పి.టి.యఫ్ కూడా ఆ విధానాలకు గురైంది. రాష్ట్రవ్యాపితంగా ముఖ్య కార్యకర్తలందరి సర్టిఫికేట్లు రద్దు చేయటం, వారిని నిర్భందించడం విచ్చలవిడిగా సాగింది. విజయవాడలో ఏ.పి.టి.యఫ్ కేంద్ర కార్యాలయాన్ని నిర్వహించుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు కార్యాలయాన్ని, పితామహులు చెన్నుపాటి లక్ష్మయ్య గారి కుటుంబాన్ని ఆనాడు సింగరాజు పనిచేసే సింగరాయకొండకు తరలించారు. సంవత్సరంపాటు సింగరాయకొండను కేంద్రంగా చేసుకుని చెన్నుపాటి, సింగరాజు గార్లు ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ కాలంలో నిర్భందాన్ని ఎదుర్కొంటూనే ఎదురైన ఆటంకాలను, దుర్భరమైన ఆర్థిక పరిస్థితులని అధిగమించి, ఏ.పి.టి.యఫ్ ను కంటికి రెప్పలా కాపాడారు. సింగరాజుకు వచ్చే ఆనాటి పరిమితమైన వేతనంతోనే వారిద్దరి కుటుంబాలను పోషించుకొంటు విరాళాలు సేకరించి ఉపాధ్యాయ పత్రికను కూడా వెలువరించారు.

శాసనమండలి సభ్యునిగా ఎన్నిక[మార్చు]

ఉపాధ్యాయులకు విద్యారంగానికి సింగరాజు చేసిన సేవలను గుర్తించిన ఉపాధ్యాయులు అధ్యాపకులు 1952 లో మద్రాసు శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎం.ఎల్.సిగా ఎన్నుకున్నారు. ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ కు వారు నేతగా ఉన్నా సదరు ఉపాధ్యాయులకు ఓటు లేకపోయినా ఉన్నత పాఠశాలల, కళాశాలల, వృత్తి సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు సింగరాజును ఎం.ఎల్.సిగా ఎన్నుకోవటం ఏ.పి.టి.యఫ్ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1955,1964,1970 సంవత్సరాల్లో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఏ.పి.టి.యఫ్ అభ్యర్థిగా ఘనవిజయం సాధించారు.శాసనమండలి సభ్యునిగా విద్యా రంగానికి, ఉపాధ్యాయ తరానికి, అనేక ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేసి, ఆదర్శంగా సేవలందించారు.

ఏ.పి.టి.యఫ్ విధానపత్రం రూపకల్పన[మార్చు]

1947 లో ఆవిర్భవించిన ఏపిటియఫ్ క్రమక్రమంగా ఉపాధ్యాయుల గుర్తింపు పొందడమే గాక హృదయాలను చూరగొన్నది. ఈ విధంగా ఏ.పి.టి.యఫ్ ఎదగడాన్ని సహించలేని పాలకులు, అధికార్లు సంస్థపై రకరకాల ముద్రలు వేశారు. విష ప్రచారాలు సాగించారు. ఉఅపధ్యాయులను సంస్థకు దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపిటియఫ్ కు నిర్థిష్టమైన విధాన పత్రాన్ని రూపొందించాలని నాయకత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు చెన్నుపాటి, సింగరాజు విజయ రామరాజుల నాయకత్వ త్రయం రూపొందించిన విధాన పత్రాన్ని 1953 లో కాకినాడలో జరిగిన ఏపిటియఫ్ మహాసభ చర్చించి, ఆమోదించింది. ఆనాటి నుండి ఆ విధాన పత్రానికి అనుగుణ్యంగా ఏపిటియఫ్ ను నడిపించడంలో, తీర్చిదిద్దడంలో సింగరాజు ప్రధాన పాత్ర వహించాడు. 1953 లో రూపొందించిన ఆ విధాన పత్రాన్ని ఏపిటియఫ్ మౌలికంగా యిప్పటికీ అనుసరిస్తూనే ఉంది.

ఒంటిపూట బడుల విధానం రద్దు[మార్చు]

మాడిఫైడ్ విద్యావిధానం పేరుతో ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలాచారి ఒంటి పూట బడుల స్కీమును తీసుకువచ్చారు. ఈ స్కీక్ములో ప్రాథమిక పాఠశాలల బాలబాలికలందరూ ఒక పూట మాత్రమే పాఠశాలలో చదువుకోవాలి. రెండవపూట తల్లిదండ్రుల వృత్తి నేర్చుకోవాలి. ఈ అభివృద్ధి నిరోధక విద్యా విధానం రద్దుకు ఏ.పి.టి.యఫ్ రాష్ట్రవ్యాపితంగా ఉద్యమాలను సాగించింది. అంతే గాక ఆనాడు ఎం.ఎల్.సి.గా ఉన్న సింగరాజు ప్రతిపక్ష-ప్రభుత్వపక్ష ఎం.ఎల్.ఏ లను కలిసి, రాజాజీ స్కీము ప్రమాదాన్ని గురించి వివరించారు. దీనితో శాసనసభలో యీ స్కీము అమలు జరపాలన్న తీర్మానాన్ని శాసన సభ్యులు ఓడించారు. ఇందులో సింగరాజు ప్రధాన పాత్ర వహించారు.

ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం[మార్చు]

ఆనాడు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఉద్యోగ రక్షణ లేదు. బోర్డు పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు సమానమైన వేతనం - సౌలభ్యాలు లెవు. ఈ పరిస్థితుల్లో యీ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేయించడానికి అటు యాజమాన్యాలను యిటు ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఎపిటియఫ్ నిర్వహించిన ఉద్యమంలో సింగరాజు ముఖ్య పాత్ర వహించి, 1956 నుండి 1959 నాటికి 3 సంవత్సరాల కాలంలో విజయవంతం చేశారు.

ఉద్యమ విజయాలు[మార్చు]

ఉపాధ్యాయ సమస్యలు ఇసుక పాతర చందం లాంటిది. ఎన్ని సమస్యలకు పరిష్కారం లభించినా కొత్త సమస్యలు పుట్టుకు వస్తుంటాయని సింగరాజు చెప్తుండేవారు. ఇసుక పాతర వంటి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పటిష్ఠమైన నిర్మాణం ఉండాలని పదే పదే ఉద్బోధించేవారు. అందుకు ఆయన దృష్టంతా కొత్తగా చేరుతున్న ఉపాధ్యాయులను మెరికల్లాంటి కార్యకర్తలుగా రూపొందించడానికి శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు విరివిగా నిర్వహించాలనే వారు. సింగరాజు శత జయంతి సంవత్సరంలో కూడా ఉపాధ్యాయుల స్థితి ఉన్నత శిఖరాలల్లో ఉండాలనే ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. పైగా మరింతగా దిగజారింది. ఆయన జీవించి ఉన్న కాలంలో జరిగిన విధంగా ఉపాధ్యాయ ఉద్యమం ఎట్లా చీలికలు, పీలికలై ఉందో ఇప్పడు కూడా ప్రభుత్వాల పాలకుల విభజించు - పాలించు విధానాల వలన ఉపాధ్యాయ ఉద్యమం మరింత దిగజారింది. ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలు ముక్కలై, ఐక్య వేదికలు చీలికలై బలమైన ఐక్య ఉద్యమం చేపట్టే దశ ఈనాడు లేకుండా పోయింది. 60 సంవత్సరాలు పోరాడి సాధించిన రాయితీలు ఒక్కొక్కటి కోల్పోతున్న పరిస్థితి ఉంది.

రెండు దశాబ్దాల నూతన ఆర్థిక విధానాల అమలు ఫలితంగా విద్యా రంగ ప్రైవేటీకరణ చట్టబద్ధంగా జరుగుతోంది. సరళీకృత విధానాల వలన పాఠశాల విద్యా రంగంలో 40 శాతం విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరుతున్నాయి. సింగరాజు కలలుగన్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, నాయకత్వం వహించి, సాధించిన పెన్షన్‌ సౌకర్యం కల్లలైనాయి. ఉద్యోగ భద్రత లేని విద్యా వాలంటీర్లు, పారా టీచర్లు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనికి వచ్చారు. పోరాడి సాధించిన పెన్షన్‌ సౌకర్యం రద్దయి నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పద్ధతి వచ్చి, పదవీ విరమణ తర్వాత భద్రత లేని వృద్ధాప్య జీవితం రానున్నది.

యితర విశేషాలు[మార్చు]

ఆయన ఉద్యమ నేతగా ఎంత ఉన్నతుడో వ్యక్తిగా కూడా అంతే ఉన్నతుడు. నిరాడంబరత, స్వచ్ఛమైన మానవీయత, నిజాయితీ, నిస్వార్ధము, ప్రజాస్వామిక స్వభావము ఆయన వ్యక్తిత్వ విశిష్టతలు. కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సోదర ప్రజాసంఘాలు, ప్రజల మన్ననలను ఆదరాభిమానాలను అపూర్వంగా చూరగొన్న ఉదాత్తమైన మనిషి సింగరాజు. ఆయన నాయకత్వంలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం. ఉపాధ్యాయ ఉద్యమంలో తన సకల శక్తులను ఒడ్డి ఒక జీవిత కాలం పోరాడిన మహాయోధుడు సింగరాజు. ఆయన జీవితమే ఒక ఉద్యమం. బతకలేని బడిపంతులు అన్న నానుడిని అబద్ధం చేయడానికి జీవితకాలం ఉద్యమించి జయించిన ఉద్యమకారుడు. ఉద్యమ నిర్మాణం, ఐక్య సంఘటనల నిర్వహణలో ఆయన సాటిలేని ఉద్యమ శక్తియుక్తులను సృజనాత్మకతను ప్రదర్శించారు. ఉపాధ్యాయ ఉద్యమ ఐక్యతను ఆయన గాఢంగ కోరినారు. ఆ కృషిలో ఫెడరేషన్ తనవంతు కర్తవ్యాలను నెరవేర్చే విధంగా వ్యవహరించారు. చట్టసభల్లో ఉపాధ్యాయుల ప్రతినిధిగా వ్యవహరించిన తీరు ఆదర్శనీయమైనది. ఉపాధ్యాయుల సర్వీసు సమస్యల పరిష్కారంలో పైరవీలను అడ్డదారులను సహించేవారు కాదు. ఉద్యమ బలంతోనే వాటిని పరిష్కరించుకోవాలని ఉద్బోధించేవారు. ఉపాధ్యాయులు ఉన్నత నైతిక విలులను ఆచరించాలని చెప్పేవారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధ్యాయుల్లోకి చొరబడుతున్న స్వార్ధ, సంకుచిత భావాల పట్ల సింగరాజుఆందోళన చెందారు. వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.ప్రజాసంఘంగా ఉపాధ్యాయ ఫెడరేషన్‌ను తీర్చిదిద్దడంలో సింగరాజుగారు సల్పిన కృషి అద్భుతమైనది. ఉద్యమకారుడిగా ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు అది నిదర్శనం. విద్యారంగంలో సాధించుకోవలసిన ప్రజాతంత్ర, పరివర్తనకు అనుగుణంగా విశాల ఉపాధ్యాయ లోకాన్ని ఉద్యమంలోకి సమీకరించడానికి వీలుగా నిర్మాణము, విధానాలు ఉండాలని నిర్వహించి ఆచరించారు. జాతీయ, ప్రజాతంత్ర, శాస్ర్తియ విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. మాతృభాషలో విద్యాబోధన, పాఠశాల విద్యవౌలిక ప్రాధాన్యమును ఆయన స్పష్టపరిచారు. ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే అశేష భారత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల సాఫల్యం పట్ల దృష్టిపెట్టాలని బోధించారు.విద్యార్థి, యవజన కార్మిక కర్షక రచయితల సంఘీభావం ఉండే విధంగా ఆయన ఫెడరేషన్ పని విధానాన్ని తీర్చిదిద్దారు. విద్యారంగంలో జరగాల్సిన వౌలిక ప్రజాతంత్ర పరివర్తన, సామాజిక వ్యవస్థలో భూస్వామిక, సామ్రాజ్యవాద ప్రాబల్యాల నిర్మూలనతో ముడివడి వుందని విశ్వసించారు. అందుకే ఉపాధ్యాయ వృత్తి సంఘాలలోను, విద్యా రంగంలోను చేపట్టవలసిన కర్తవ్యాలపట్ల అత్యంత స్పష్టతను క్రియాశీలతను ప్రదర్శించగలిగారు. నేడు విద్యారంగంలో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలు దేశభవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసాయి. ప్రైవేట్, కార్పొరేట్ స్వార్ధ గుత్త్ధాపత్య శక్తుల కబంధ హస్తాల్లోకి విద్యారంగాన్ని నెట్టారు. రాధాకృష్ణన్, కొఠారి వంటి విద్యావేత్తలు నాయకత్వం వహించిన విద్యా కమిషన్‌ల స్థానంలో టాటా, బిర్లా, అంబానీల వంటి కార్పొరేట్ శక్తులచేతిలోకి విద్యారంగ విధాన నిర్ణయాలను అప్పచెప్పారు. చదువు అంటే ప్రభుత్వ విద్యాలయాలే అన్న భావనలననుండి ప్రైవేటు, కార్పొరేట్ విదేశీయ సంస్థల ఆధిపత్యము, నియంత్రణలవైపు పరిణామాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. దేశీయ అవసరాలకోసం కాకుండా గుత్త పెట్టుబడి, సామ్రాజ్యవాద సంస్థల అవసరాలు తీర్చేవిధంగా విద్యారంగాన్ని మలస్తున్నారు. విద్య ఖరీదైన సరుకైంది. కలిగినవారికే విద్య. లేనివారికి అది మిథ్యగానే పరిణమించింది. ఉపాధ్యాయ వృత్తి యాంత్రికం కావించబడింది. ఉద్యమాల్లో అవకాశవాదం, రాజీ ధోరణలు ప్రబలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో మేరునగర ధీరుడైన మహోపాధ్యాయ సింగరాజు రామకృష్ణయ్య జీవితంనుండి స్ఫూర్తి పొందుతూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ విద్యారంగంలో ప్రజానుకూల విధానాలకోసం ఇప్పటికంటే ఎక్కువగా పోరాడాల్సిన అవసరమున్నది.

ఆయన ఆగష్టు 27, 2002 న తుదిశ్వాస విడిచారు.

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]