సింహాద్రి నారసింహ శతకము
సింహాద్రి నారసింహ శతకము | |
---|---|
250px వరాహ నరసింహ స్వామి వారు, సింహాచలం | |
కవి పేరు | గోగులపాటి కూర్మనాధ కవి |
ఆంగ్లంలో పేరు | Simhaadri NaaraSimha Satakam |
వ్రాయబడిన సంవత్సరం | 18వ శతాబ్దం |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! |
విషయము(లు) | నారశింహుని కీర్తిస్తూ |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | వృత్తములు |
మొత్తం పద్యముల సంఖ్య | 101 |
అంతర్జాలం లో | వికీసోర్సు లో సింహాద్రి నారసింహ శతకము |
అంకితం | నారసింహుడు |
కీర్తించిన దైవం | నారసింహుడు |
శతకం లక్షణం | భక్తి శతకం |
సింహాద్రి నారసింహ శతకము 18వ శతాబ్దంలో రచించబడిన భక్తి శతకము. దీనిని గోగులపాటి కూర్మనాధ కవి రచించెను. దీనిలోని 101 పద్యాలు వైరి హర రంహ ! సింహాద్రి నారసింహ ! అనే మకుటంతో ముగుస్తాయి. వైరి హర రంహ అనగా శత్రువులను సంహరించుటలో వేగము గలవాడా అని అర్ధము.
కూర్మనాథ కవి[మార్చు]
గోగులపాటి కూర్మనాధ కవి సింహాచలం లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా సింహాద్రి నారసింహ శతకాన్ని రచించారు. ఈతడు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో సుమారు 1720 ప్రాంతంలో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. చివరి కాలంలో గజపతినగరం తాలూకాలోని దేవుపల్లి గ్రామం (ప్రస్తుతం బొండపల్లి మండలం) లో ఉండేవారు.
ప్రారంభం[మార్చు]
సీ: శ్రీమద్రమారమణీ మణీరమణీయ
సరస చిత్తాబ్జ బంభర ! పరాకు
శంఖ చక్రగదాసి శార్జ చపాది భా
సురదివ్య సాధనకర ! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర ! పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర ! పరాకు
తే: నీకు సాష్టాంగ వినతు లనేక గతుల
జేసి విన్నప మొనరింతు జిత్తగింపు
చెనటి వీడని మదిలోన గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !
కొన్ని ఉదాహరణలు[మార్చు]
సీ: పొదలలో దాగెనో పొట్నూరులో నున్న
రమణీయ కోదండ రామమూర్తి
యెక్కడికేగెనో యెఱుగంగరాదుగా
పటుభీమసింగి గోపాలమూర్తి
సాధ్వసోద్వృత్తి నెచ్చటికేగి యుండెనో
జామి జనార్ధనస్వామి మూర్తి
యెన్నిపాట్లను బడుచున్నాడో చోడవ
రంబులో గేశవ రాఘమూర్తి
ఆ: నిబిడ యవనుల భయశంక నీవు నింక
బరుల కగపడకుండు, మీ ప్రక్కనున్న
గాయ మిప్పటికిని మానదాయె నయయొ !
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !
సీ: కారుణ్య దృష్టిచేగని మిమ్ము రక్షింప
నీరజేక్షణ నేడు నీవు పంప
బారసీకుల దండుపై గొండలోనుండి
గండు తుమ్మెదలు నుద్దండలీల
గల్పాంతమున మిన్నుగప్పి భీకరమైన
కాఱుమేఘంబులు గలసినట్లు
దాకి భోరున రక్తదారలు గురియగా
గఱచినెత్తురు పీల్చి కండలెల్ల
తే: నూడిపడ మూతుల వాడిమెఱసి
చించిచెండాడి వధియించె జిత్రముగను
నొక్కొకని చుట్టుముట్టి బల్ మిక్కుటముగ
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !
గీ: అరుల బరిమార్చి వైశాఖ పురసమీప
గిరి బిలంబున డాగె బంభరము లెల్ల
అది మొదలు తుమ్మెదల మెట్ట యంద్రు దాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !
ముగింపు[మార్చు]
సీ: తిరుమల పెద్దింటి ధీర సంపత్కుమా
రార్య సద్వేంకటాచార్య శిష్యు
సురుచిరాపస్తంబ సూత్రు మౌద్గల్యస
గోత్రు, గోగులపాటి కులజు, గౌర
మాంబికాశ్రిత బుచ్చనా మాత్య వరపౌత్త్రు
కూర్మ దాసాఖ్యునన్ గూర్చి నీదు
చరణదాస్య మొసంగి సంతరించితి భళీ !
యే రచించిన యట్టి యీశతకము
తే: వినిన జదివిన వ్రాసిన వివిధ జనుల
కాయురారోగ్య మైశ్వర్య, మతిశుభంబు,
కరుణ దయచేసి పాలింపు కమల నాభ !
వైరి హర రంహ ! సింహాద్రి నారసింహ
మూలాలు[మార్చు]
- శ్రీ సింహాద్రి నారసింహ శతకము: శ్రీ గోగులపాటి కూర్మనాధకవి విరచితము, శ్రీ సింహాచల దేవస్థానము, సింహాచలం.