Jump to content

సిరిసంపదలు

వికీపీడియా నుండి
సిరిసంపదలు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి ,గిరిజ ,వాసంతి
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, జిక్కి
గీతరచన శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, దాశరథి
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

సిరిసంపదలు పి.పుల్లయ్య దర్శకత్వంలో 1962, సెప్టెంబర్ 16న విడుదలైన తెలుగు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.పుల్లయ్య
  • నిర్మాత: వి.వెంకటేశ్వర్లు
  • ఛాయాగ్రహణం: మాధవ్ బుల్‌బులే
  • రచన: పినిశెట్టి
  • సంగీతం: మాస్టర్ వేణు
  • కళ: కృష్ణారావు

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ ఆత్రేయ మాస్టర్ వేణు ఘంటసాల, ఎస్.జానకి
ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో శ్రీశ్రీ మాస్టర్ వేణు ఘంటసాల, పి.సుశీల
వేణుగానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే దాశరథి మాస్టర్ వేణు పి.సుశీల, జిక్కి, ఎస్.జానకి
కొండమ్మో బంగారపు కొండమ్మో పిలిచినపుడు కొసరాజు మాస్టర్ వేణు పిఠాపురం, స్వర్ణలత
గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా ఆత్రేయ మాస్టర్ వేణు పి.సుశీల
చిట్టి పొట్టి పాపలు చిరుచిరునవ్వుల పూవుల ఆత్రేయ మాస్టర్ వేణు పి.శాంతకుమారి బృందం
పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను పులకరించి ఈ జగము నవ్వెను ఆత్రేయ మాస్టర్ వేణు ఎస్.జానకి
వారానికొక్కటే సండే కుర్రాళ్ళకంతా అది ఆత్రేయ మాస్టర్ వేణు పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి, కె.రాణి బృందం

రఘుపతినాయుడు జమీందారీ వంశంలో పుట్టి పూర్వీకుల వలనే దేహి అన్నవానికి లేదనకుండా దానధర్మాలు చేస్తూ పేరుపొందాడు. జగపతినాయుడు అతని కుమారుడు. పార్వతమ్మ కుమార్తె. పార్వతమ్మను చక్రధరానికి ఇచ్చి పెళ్ళిచేశారు. అతడు వారి ఇంట్లోనే ఉండి ఇంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. వారికి ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. జగపతినాయుడుకు పద్మ, లత, రమ అని ముగ్గురు కూమర్తెలు. వారి తల్లి చనిపోయింది. అయితే తన అన్న కుమార్తెలను పార్వతమ్మే పెంచింది. పద్మను చిన్నప్పటి నుంచి ప్రసాద్‌కిచ్చి పెళ్లిచేయాలనే అనుకుంటూ ఉండేవారు.

కృష్ణాష్టమికి రఘుపతినాయుడుగారి ఇంటిలో మామూలుపద్ధతిలో దానధర్మాలు ఘనంగా జరిగాయి. ఈ దానధర్మాలు మితిమీరి పోతున్నందున తగ్గించవలసిందని చక్రధరం మామకు చెబుతాడు. దానికి ఆయన సమ్మతించడు. దానితో చక్రధరం తనకిక ఆ ఆజమాయిషితో నిమిత్తం లేదని తాను కుటుంబంతో వెళ్ళిపోతానని అంటాడు. రఘుపతినాయుడు వద్దని వారించినపుడు జరిగిన ఘర్షణలో క్రిందపడి మరణిస్తాడు. "నా తండ్రి మరణానికి కారకుడవు నువ్వే. ఇక బయటకు పో" అని జగపతినాయుడు కేకలు వేస్తాడు. ఇంటిలోంచి వెళ్ళిపోయిన చక్రధరం తన స్వస్థానం చేరుకున్నా మామగారి మరణానికి తానే కారణమన్న నింద భరించలేక బెంగతో మరణిస్తాడు.

అక్కడ పార్వతమ్మ పెంపులో పెరిగిన జగపతినాయుడు కుమార్తెలు పద్మ, లత, రమ తమ లాలనపాలనలు చూసేవారు లేక అమితమైన దైన్యస్థితిలో పడిపోతారు. వారిని పట్నంతీసుకు వెళ్ళి జగపతినాయుడు కాన్వెంటులో చేర్పిస్తాడు.

జగపతినాయుడుకూడా తండ్రివలే పరువుప్రతిష్టల కోసం ప్రాకులాటలో తలకు మించిన అప్పులు చేస్తాడు. అప్పులిచ్చేది సార్థకనామధేయుడైన భుజంగం. జగపతినాయుడు గుమాస్తా గంటయ్య తన యజమాని ఆసుపాసులన్నీ భుజంగానికి తెలియజేస్తూ ఉండేవాడు.

భుజంగం కుమారుడు మధు జగపతినాయుడు కుమార్తె లతను ప్రేమిస్తాడు. కాలేజీలో పరిచయమైన ప్రసాద్, పద్మను లతను రమను తల్లివద్దకు తీసుకురాగానే ఆమె వారు తన అన్నకుమార్తెలన్న విషయం గ్రహిస్తుంది. పద్మ ప్రసాద్ ప్రేమించుకుని పెళ్లిచేసుకోవాలనుకొంటారు. కాని జగపతినాయుడు సమ్మతించడు.

మధు తనకు బాకీదారుడైన జగపతినాయుడు కుమార్తె లతను పెళ్ళాడ నున్నాడని తెలుసుకుని ఆగ్రహావేశపరుడై భుజంగం పెళ్ళిసంబంధం గురించి మాట్లాడటానికి వచ్చిన జగపతినాయుణ్ణి అవమానిస్తాడు. జగపతినాయుడు భుజంగాన్ని కొట్టి జైలుపాలవుతాడు. జైల్లోఉన్నసమయంలో భుజంగం దావావేసి జప్తు చేయడానికి రాగా ప్రసాద్ అడ్డుకుని తానే ఆ ఇంటిని వేలంపాట పాడి కొని పద్మను, లతను, రమను ఆదరిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న జగపతినాయుడు మేనల్లుని మంచితనానికి సంతోషించి పద్మనిచ్చి పెళ్ళిచేస్తాడు.

భుజంగం కుమారుడు మధుకు, లతకు వివాహం జరుగుతుంది. జగపతినాయుడు, పార్వతమ్మల కుటుంబాలు ఏకమౌతాయి. కథ సుఖాంతమౌతుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. రాధాకృష్ణ (28 September 1962). "చిత్ర సమీక్ష - సిరిసంపదలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 25 October 2020. Retrieved 24 February 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటిలింకులు

[మార్చు]