సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా
సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా | |
|---|---|
2018లో సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా | |
| రాజ్యసభ సభ్యుడు | |
| In office 2010 ఏప్రిల్ 9 – 2022 ఏప్రిల్ 9 | |
| తరువాత వారు | హర్భజన్ సింగ్ |
| నియోజకవర్గం | పంజాబ్ |
| పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ | |
| In office 2004–2009 | |
| అంతకు ముందు వారు | సిమ్రంజిత్ సింగ్ మాన్ |
| తరువాత వారు | విజయ్ ఇందర్ సింగ్లా |
| నియోజకవర్గం | సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1936 ఏప్రిల్ 9 ఉభవల్, సంగ్రూర్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 2025 మే 28 (వయసు: 89) మొహాలి, పంజాబ్, భారతదేశం |
| రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీ దళ్[1] |
| జీవిత భాగస్వామి | హర్జిత్ కౌర్ |
| సంతానం | పర్మిందర్ సింగ్ ధిండ్సా తో సహా ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు |
| పురస్కారాలు | పద్మ భూషణ్ పురస్కారం (2019) |
సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా (ఆంగ్లం: Sukhdev Singh Dhindsa; 1936 ఏప్రిల్ 9 - 2025 మే 28) రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పంజాబ్ రాజకీయ నాయకుడు. శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) కు ఆయన ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. రంజిత్ సింగ్ బ్రహ్మంపుర నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (డెమోక్రటిక్), శిరోమణి అకాలీదళ్ (తక్సాలి)ల విలీనం ద్వారా ఇది ఏర్పడింది. 2024 మార్చిలో తన పార్టీని తిరిగి శిరోమణి అకాలీదళ్ రాజకీయ పార్టీలో విలీనం చేసాడు. గతంలో ఆయన పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ 14వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు. 2019 జనవరి 26న భారత ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఆయనకు పద్మభూషణ్ లభించింది. అయితే, 2020–2021 భారత రైతుల నిరసన సందర్భంగా ఆయన దానిని వెనక్కి ఇచ్చేసాడు.
2000 నుండి 2004 వరకు వాజ్‌పేయి మూడో మంత్రివర్గంలో క్రీడా, రసాయనాలు, ఎరువుల మంత్రిగా ఆయన పనిచేసాడు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2] ఆయన కుమారుడు పర్మిందర్ సింగ్ ధిండ్సా 2012 నుండి 2017 వరకు పంజాబ్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]
సంగ్రూర్ లో సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా తన గ్రాడ్యుయేషన్ సంవత్సరాల్లో చురుకైన విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన రణబీర్ కళాశాల విద్యార్థుల మండలికి మొదటిసారిగా ఎన్నికైన కార్యదర్శి. ఆ తరువాత, మండలికి అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. గ్రాడ్యుయేషన్ తరువాత అతను సంగ్రూర్ జిల్లాలోని తన స్వగ్రామమైన ఉభావల్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాడు. దీంతో మొత్తం జిల్లాలో సర్పంచి అయిన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నికైన సర్పంచులలో ఆయన సంగ్రూర్ బ్లాక్ సమితికి చైర్మన్ అయ్యాడు. ఆ తరువాత, సంగ్రూర్ జిల్లా సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరుగా ఎన్నికయ్యాడు. 1972లో ధనౌలా శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన, సంత్ హర్చంద్ సింగ్ లోంగోవాల్ మార్గదర్శకత్వం, ప్రేరణతో శిరోమణి అకాలీదళ్లో చేరాడు. ఆయన మళ్లీ శిరోమణి అకాలీదళ్ టిక్కెట్ పై సునం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ కాలంలో ఆయన, రవాణా, క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, పౌర విమానయాన శాఖలను కలిగి ఉన్న రాష్ట్ర మంత్రి (స్వతంత్ర ఛార్జ్) గా చేసాడు. 1980లో ఆయన సంగ్రూర్ సీటు నుండి పంజాబ్ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1985లో ఆయన సునం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తరువాత 1986లో, ఆపరేషన్ బ్లాక్ థండర్ సమస్యపై సుర్జీత్ సింగ్ బర్నాలా ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయి, ఆపరేషన్ బ్లాక్ థండర్ కు ప్రతీకారంగా ఆయన ప్రకాష్ సింగ్ బాదల్ వర్గంలో చేరాలని నిర్ణయించుకున్నాడు.
మరణం
[మార్చు]సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా 2025 మే 28న 89 సంవత్సరాల వయసులో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sukhdev Singh Dhindsa proclaims himself as SAD chief Archived 2022-02-26 at the Wayback Machine. 8 July 2020. The Tribune. Retrieved 11 July 2020.
- ↑ Sukhdev Singh Dhindsa Biography, Sukhdev Singh Dhindsa Bio, Sukhdev Singh Dhindsa Photos, Videos, Wallpapers, News
- ↑ "Parminder Singh Dhindsa". PTC News (in ఇంగ్లీష్). 2022-02-01. Retrieved 2023-07-28.
- ↑ Veteran Akali leader Sukhdev Singh Dhindsa dies at 89