సుచేత భిడె ఛపేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుచేత భిడె ఛపేకర్
జననం (1948-12-06) 1948 డిసెంబరు 6 (వయసు 75)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుసుచేత భిడే
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు

సుచేత భిడె ఛపేకర్ (జ.1948) ఒక భరతనాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఈమె 1948, డిసెంబరు 6వ తేదీన విశ్వనాథ్ భిడే, వీణ దంపతులకు పూణేలో జన్మించింది. మొదట ఈమె భరతనాట్యాన్ని ముంబైలో పార్వతీ కుమార్ వద్ద నేర్చుకుంది. తరువాత కె.పి.కిట్టప్ప పిళ్ళై వద్ద తంజావూరు బాణీలో భరతనాట్యాన్ని అభ్యసించింది.[2] మద్రాసులో తిలంబాళ్ కృష్ణన్ వద్ద కర్ణాటక సంగీతాన్ని 8 సంవత్సరాలు నేర్చుకుంది. హిందుస్థానీ సంగీతంలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించింది. ఈమె బాంబే యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్ (నాట్యం) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింది. జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పి.హెచ్.డి., గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లైడ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.[3]

వృత్తి[మార్చు]

నర్తకిగా[మార్చు]

ఈమె తన తొలి నృత్య ప్రదర్శన 1963లో చేసింది. అది మొదలు ఈమె సవై గంధర్వ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్, ఎల్లోరా ఫెస్టివల్, శారదోత్సవ, పొంగల్ ఫెస్టివల్, కాళిదాస్ ఉత్సవం, ధరణికోత్సవం, గంగా మహోత్సవం వంటి అనేక నృత్యోత్సవాలలో పాల్గొన్నది. ఈమె మన దేశంలోని పూణే, ఔరంగాబాద్, ఆగ్రా, చెన్నై, నాగపూర్, కొచ్చిన్, వారణాశి, ముంబై, గోవా, ఢిల్లీ, కోల్‌కాతా, హైదరాబాదు వంటి నగరాలతో పాటు కెన్యా, లండన్, పారిస్, రోటర్‌డామ్‌, మ్యూనిచ్, బెర్లిన్, సైప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, బ్రెజిల్ మొదలైన విదేశీ ప్రాంతాలలో తన నృత్యాన్ని ప్రదర్శించింది. 1980లలో ఈమె అనేక నృత్యప్రదర్శనలను మహారాష్ట్రలోని అనేక పట్టణాలు, గ్రామాలలో ఇచ్చింది. ఈ సందర్భంలో భరతనాట్యానికి రాష్ట్రంలో ఎక్కువ ఆదరణ లేదని గుర్తించింది. దానితో ఈమె మరాఠీ, హిందీ పాటలకు తన ప్రదర్శనలలో భరతనాట్యశైలిలో నృత్యం చేయసాగింది. ఆ విధంగా ఈమె భరతనాట్యానికి ఆ రాష్ట్రంలో ప్రజాదరణను కల్పించింది. ఈమె దూరదర్శన్‌లో టాప్ గ్రేడ్ కళాకారిణిగా జాతీయ, ప్రాంతీయ కేంద్రాలనుండి అనేక కార్యక్రమాలను నిర్వహించింది.

గురువుగా[మార్చు]

ఈమె గత 25 సంవత్సరాలుగా భరతనాట్యాన్ని అనేక మందికి నేర్పిస్తూ ఉంది. "కళావర్ధిని ఛారిటబుల్ ట్రస్ట్" పేరుతో ఒక సంస్థను ప్రారంభించి దానిద్వారా ఐదు సంవత్సరాల బేసిక్ సర్టిఫికెట్ కోర్సును, రెండు సంవత్సరాల అడ్వాన్స్ కోర్సును ప్రారంభించి వాటికి సిలబస్‌ను, వార్షిక పరీక్షలను రూపొందించి వాటిని గట్టిగా అమలు పరుస్తున్నది. ప్రస్తుతం ఈ కోర్సులను మహారాష్ట్ర, గోవాలలో 30కి పైగా విద్యాసంస్థలలో నేర్పిస్తున్నారు. ఈమె పూణే యూనివర్సిటీ అప్లైడ్ ఆర్ట్స్ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఈమె అనేక మంది యువ కళాకారిణులకు, గురువులకు, నృత్యదర్శకులకు శిక్షణను ఇచ్చింది. ఈమె మార్గనిర్దేశంలో అనేక మంది పరిశోధనలు చేసి నృత్యంలో డాక్టరేట్ సంపాదించారు. ఈమె శహాజీ రాజు స్వరపరిచిన కొన్ని అపురూపమైన మరాఠీ, హిందీ, సంస్కృత గీతాలను తంజావూరులోని సరస్వతీ మహల్‌ గ్రంథ భాండాగారం నుండి వెలికి తీసింది. సంగీత నాటక అకాడమీ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన గ్రాంటును మంజూరు చేసింది. ఈమె అనేక వ్యాసాలను ఇంగ్లీషు, మరాఠీ, హిందీ భాషలలో రచించి అనేక పత్రికలలో ప్రచురించింది. ఈమె "నృత్యాత్మిక" అనే శాస్త్రీయ నాట్యానికి సంబంధించిన వ్యాస సంకలనాన్ని ప్రచురించింది. మరాఠీ భాషలో ఈ తరహా మొదటి పుస్తకం ఇదే. ఈమె అనేక ప్రతిష్ఠాత్మకమైన సదస్సులలో పరిశోధనా పత్రాలను సమర్పించి, ప్రసంగాలను చేసింది. ఈమె ఢిల్లీ లోని కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ఆర్థిక సహకారంతో మహారాష్ట్రలోని మధ్యయుగానికి సంబంధించిన నాట్యశిల్పాలను, నాట్యశాస్త్ర సంప్రదాయంతో వాటికి గల సంబంధాల గురించి విస్తృతంగా పరిశోధనలు జరిపింది.

కొరియాగ్రాఫర్‌గా[మార్చు]

ఈమె తన గురువుల నుండి నేర్చుకున్న అనేక భాషలలోని శాస్త్రీయ నృత్యాలకు దర్శకత్వం వహించింది. దాదాపు 80 హిందుస్థానీ సంగీత పాటలతో ఈమె "నృత్యగంగ" అనే భరతనాట్య రూపకాన్ని ప్రదర్శించింది.[4]తన కళావర్ధిని శిష్యులతో కలిసి "నాయిక", "లీలాదరు" వంటి నృత్య నాటికలను రూపొందించింది. నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా "ఫ్రమ్‌ డార్క్‌నెస్ టు డాన్" అనే నృత్యనాటకానికి దర్శకత్వం వహించింది. బ్యాటరీ ప్రొడక్షన్స్, న్యూయార్క్ వారి "సాంగ్స్ ఆఫ్ టాగూర్"కు రెండు పాటలకు నృత్యాన్ని సమకూర్చింది.

అవార్డులు[మార్చు]

  • 1993లో “మహరాష్ట్ర గౌరవ్ పురస్కారం”
  • 1993లో సుర్ సింగార్ సంసద్ ముంబై వారిచే “నృత్య విలాస్”
  • మహారాష్ట్ర సేవా సంఘ్, ములుంద్ వారిచే ”ఎస్.ఎల్.గడ్రే" అవార్డు
  • స్త్రీ విమోచన్ ట్రస్ట్ పూనే వారిచే "మహిళా జీవన్ గౌరవ్" అవార్డు
  • పూణే రోటరీ క్లబ్ వారిచే “పూణే'స్ ప్రైడ్”
  • 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 2015లో గణేష్ నృత్యాలయ వారిచే "శ్రేష్ఠ కళా ప్రచారక్" బిరుదు.
  • 2015లో పూణే నగర కార్పొరేషన్ వారిచే పండిత రోహిణి భాటే అవార్డ్.

కుటుంబం[మార్చు]

ఈమెకు 1974లో డా౹౹ విజయకుమార్ ఛపేకర్‌ను వివాహం చేసుకుంది. వీరికి అరుంధతి పట్వర్ధన్ అనే కుమార్తె ఉంది. ఆమె తన తల్లి వద్దనే శిష్యరికం చేసి ఒక మంచి నర్తకిగా, గురువుగా, కొరియోగ్రాఫర్‌గా నిరూపించుకుంది.

మూలాలు[మార్చు]

  1. web master. "Sucheta Bhide Chapekar". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  2. "Dr. Sucheta Bhide Chapekar: 60th birthday celebrations at Pune". narthaki.com. 5 January 2009. Retrieved 16 March 2016.
  3. web master. "Dr. Sucheta Bhide – Chapekar". Kalavardhini. Retrieved 30 April 2021.
  4. Paul, Debjani (15 June 2013). "Blue Eyed Girl". Indian Express. Pune. Retrieved 31 July 2014.