సుజనరంజని
| సంపాదకులు | వింజమూరి కృష్ణమాచార్యులు బహుజనపల్లి సీతారామాచార్యులు కారుమంచి సుబ్బారాయలు నాయుడు |
|---|---|
| తరచుదనం | మాస పత్రిక ద్వైమాసికం |
| మొదటి సంచిక | 1862 |
| ఆఖరి సంచిక | 1867 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
సుజనరంజని, 19 వ శతాబ్దిలో మద్రాసు నుండి వెలువడ్డ పత్రిక. ఇది మాసపత్రికగా మొదలై ఆ తర్వాత ద్వైమాసికమైంది. ఈ పత్రికను 1862-67 మధ్య కాలంలో వింజమూరి కృష్ణమాచార్యులు, బహుజనపల్లి సీతారామాచార్యులు, కె.సుబ్బరాయలు నాయుడు సంయుక్త సంపాదకత్వంలో నడిపారు. సుజనరంజని పత్రికలో పరవస్తు చిన్నయ సూరి వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యాయి. సారస్వత విషయాలకు ప్రాధాన్యమిచ్చిన మొట్ట మొదటి పత్రిక సుజనరంజని.[1]
చరిత్ర
[మార్చు]సుజనరంజని సాహిత్యాంశాలకు ప్రాధాన్యత నిచ్చిన పత్రిక. అప్పట్లో ది మెడ్రాస్ జర్నల్ అఫ్ ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీషు మాసపతిక వెలువడేది. ఆ పత్రికను ఆదర్శంగా తీసుకుని సుజనరంజని వెలువడింది.[2] దీని ముఖపత్రంపై “యూనివర్శిటీ పరీక్షా విద్యార్థుల కుపకారము” ఆని తెలుగులోను, “A friend to the University students’ అని ఆంగ్లంలోనూ ముద్రించేవారు. సుజనరంజనిలో చిన్నయసూరి నీతి చంద్రికకు టిప్పణం, విశేషాంశ వివరణం వెలువడేది.
సుజనరంజని పత్రికను వింజమూరి కృష్ణమాచార్యులు, బహుజనపల్లి సీతారామాచార్యులు, కారుమంచి సుబ్బారాయలు నాయుడులు సంయుక్తంగా స్థాపించారు. సీతారామాచార్యులే ఆ తరువాతి కాలంలో నిఘంటువును రూపొందించిన గ్రంథకర్త. వింజమూరి కృష్ణమాచార్యులు జనవినోదిని అనే పత్రికను కూడా నడిపేవాడు. వింజమూరు కృష్ణమాచార్యులు, బహుజనపల్లి సీతారామాచార్యులు మద్రాసులో గవర్నమెంటు నార్మల్ స్కూల్‌లో తెలుగు పండితులుగా పనిచేసేవారు. సుబ్బరాయలు నాయుడు మద్రాసు లోని గోవిందప్పనాయని ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నయసూరి తన రచనలను, టీకా టిప్పణులను దీనిలో ప్రచురించాడు.[3]
రచనలు
[మార్చు]సుజనరంజని ఆ రోజుల్లో విద్యార్థులకూ వరీక్షలకు వెళ్ళే ప్రభుత్వోద్యోగులకూ చాలా ప్రయోజనకారిగా వుండేది. 1867 ఫిబ్రవరి సంచికలో 1866 నాటి మ్మెటిక్యులేషన్ పరీక్షకు సంబంధించిన తెలుగు పరీక్షాపత్రాన్ని ప్రచురించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని బట్టి అప్పట్లో పంచతంత్రం పాఠంగా ఉండేదని తెలుస్తోంది. పత్రిక ప్రచుఫ్రించిన ప్రశ్నాపత్రం లోని కొన్ని ప్రశ్నలు:
- రాముడయోధ్య విడిచి యడవికి బోయినప్పుడతని వయసెంత? ఆతడడవికి బోయిన ఎన్నిదినములకు దశరధుడు మృతినొందెను? దీనికి సప్రమాణముగ నుత్తరము వ్రాయము
- మాసత్వంబు కొలది దేవరకుందెలియనిదికాదు“ అనవుడు మృగేంద్రుడు వానింజూచి “దొరకినంతయె కానిండు - ఈ వాక్యములందు దత్సమము లెవ్వి? తద్భవము లెవ్వి?
- అండజము, బలిభక్కు - వీని వ్యుత్పత్తర్భమేమి?
ఆంగ్ల పారిభాషిక పదాలకు తెలుగు సమానార్థక పదాలు ప్రకటించేవారు. మనుచరిత్ర వంటి ప్రబంధాలకూ భాస్కర రామాయణానికీ లఘుటిప్పణి ప్రచురించారు. చిన్నయసూరి నీతిచంద్రిక లఘుటిప్పణి కూడ దీనిలో ప్రచురించారు.[1]
తెలుగు కవుల చరిత్ర అనే ఆలోచన సుజనరంజనికే మొదటిసారి కలిగినట్లనిపిస్తున్నది. పోతన్నను గూర్చి, పెద్దనను గూర్చి, అయ్యలరాజుల రామభద్రుడు గురించీ ఈ పత్రిక కాల, క్తర్హృత్వాల గురించి ప్రస్తావించింది. వ్యాకరణం, ఛందస్సు, సమాస ప్రకరణం మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉండేవి.[2]
ప్రశంస
[మార్చు]సుజనరంజని మూతబడినపుడు తత్త్వబోధిని పత్రికలో దాని గురించి ఇలా రాసారు. అది గత సంవత్సరం, 1867 లో నిలిచిపోయింది అని తెలియజేసి, "దినవర్తమాని యొక్కటి తప్ప ఆంధ్రమందు వేరొక పత్రికయు లేదు. శ్రీ యక్షిణి, హితవాది యను పత్రికలు రెండుండెనుగాని యిటీవల నవియు నస్తమించినట్లు కానంబడియెడి. ఈ మూడు పత్రికలు నుజనరంజనికి సమానములు గానేరవు" అని సుజనరంజని పత్రికను కొనియాడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తిరుమల, రామచంద్ర (1989). తెలుగు పత్రికల సాహిత్య సేవ. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. pp. 12–14.
- ↑ 2.0 2.1 వై.వి., కృష్ణారావు; ఏటుకూరి, ప్రసాద్; సురవరం, సుధాకరరెడ్డి; మల్లిక్, eds. (1989). ఆంధ్రప్రదేశ్ దర్శిని-2. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 534.
- ↑ సింగిరెడ్డి, నారాయణరెడ్డి; జె., చెన్నయ్య, eds. (2017). "భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో పత్రికా రచన". డా॥చేవులపల్లి రామానుజరావు గ్రంథావళి. హైదరాబాదు: తెలుగు సారస్వత పరిషత్తు. p. 456.
- ↑ నిడదవోలు, వెంకటరావు (1951). "తెనుగువచనరచన". In శివలెంక, శంభుప్రసాద్ (ed.). ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక పత్రిక. మద్రాసు: ఆంధ్రపత్రిక. p. 55.