Jump to content

సురవరం సుధాకర్ రెడ్డి

వికీపీడియా నుండి
సురవరం సుధాకర్ రెడ్డి
సురవరం సుధాకర్ రెడ్డి

సురవరం సుధాకర్ రెడ్డి


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1942-03-25) 1942 March 25 (age 83)
కొండ్రావుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 22 ఆగస్టు 2025
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి
జీవిత భాగస్వామి డాక్టర్‌ బీవీ విజయలక్ష్మి
సంతానం నిఖిల్, కపిల్‌

సురవరం సుధాకర్ రెడ్డి (1942 మార్చి 25 - 2025 ఆగస్టు 22), భారతీయ వ్యవపాయదారుడు, పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త. ఆయన రెండుసార్లు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సీపీఐ పార్టీ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి సీపీఐ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు.

సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐకి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుండి నాయకత్వం వహించిన రెండవ నాయకుడు. ఆయన 25 సంవత్సరాలు సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సురవరం సుధాకర్ రెడ్డి సొంతూరు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా​లోని జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలండలం కంచుపాడు. ఆయన తన అమ్మమ్మగారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి దంపతులకు జన్మించాడు. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు వెంకట్రామిరెడ్డి. వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నాడు. కర్నూల్‌లోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్‌లలో విద్యాభ్యాసం ఆయన కొనసాగింది. 1964లో కర్నూల్‌లో బీఏ పూర్తిచేసి, 1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాడు.

అయన తన చదువు కోసం కర్నూలు వెళ్లి 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్‌ బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే సుధాకర్​ రెడ్డి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1974 ఫిబ్రవరి 19న ఆయనకు విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్‌, కపిల్‌ ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1960లో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
  • 1962లో వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజులపాటు సమ్మెకు నాయకత్వం వహించాడు.
  • 1964లో కర్నూలులో బీఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యాడు.
  • 1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకొని ఆ తర్వాత హైదరాబాద్‌ న్యాయ కళాశాలలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించాడు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాడు.
  • 1970లో ఏఐఎస్‌ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
  • 1974 నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశాడు.
  • 1980, 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
  • 1994లో కర్నూలులోని డోన్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి కోట్ల విజయ్‌ భాస్కర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.
  • 1998లో నల్గొండ నుండి 12వ లోక్‌సభకు మొదటిసారి ఎన్నికయ్యాడు.
  • 2000లో ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకమయ్యారుడు.
  • 2004లో నల్గొండ నుండి 14వ లోక్‌సభకు రెండవసారి ఎన్నికయ్యాడు.
  • 2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు.
  • 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన సీపీఐ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న స్వయంగా తప్పుకున్నాడు.

మరణం

[మార్చు]

సురవరం సుధాకర్ రెడ్డి కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వయసులో 2025 ఆగస్టు 22న మరణించాడు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "కమ్యూనిస్టు దిగ్గజం సురవరం కన్నుమూత". Eenadu. 23 August 2025. Archived from the original on 23 August 2025. Retrieved 23 August 2025.
  2. "సురవరం ఇక లేరు". Andhrajyothy. 23 August 2025. Archived from the original on 23 August 2025. Retrieved 23 August 2025.
  3. "కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్‌ రెడ్డి కన్నుమూత - సీఎం సహా ప్రముఖుల సంతాపం". ETV Bharat News. 23 August 2025. Archived from the original on 23 August 2025. Retrieved 23 August 2025.