సుర్కంద దేవి
| సుర్కంద దేవి ఆలయం | |
|---|---|
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 30°24′41″N 78°17′19″E / 30.411383°N 78.2887°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
| జిల్లా | తెహ్రీ గర్హ్వాల్ |
| ఎత్తు | 2,756 మీ. (9,042 అ.) |
| సంస్కృతి | |
| దైవం | సుర్కంద దేవి |
| ముఖ్యమైన పర్వాలు | గంగా దసరా |
సుర్కంద దేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలోని కనాతల్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం. ఇది ధనౌల్తి నుండి 8 కి.మీ దూరంలో 2756 మీటర్ల ఎత్తులో ఉంది.[1] దీనికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన డెహ్రాడూన్, రిషికేశ్ నగరాలు ఉన్నాయి. ఇక్కడ గంగా దసరా పండుగను ప్రతి సంవత్సరం మే - జూన్ మధ్య జరుపుకుంటారు. ఈ ఆలయం చుట్టూ ఎక్కువగా రౌన్స్లీ చెట్లు ఉన్నాయి. ఈ ఆలయం సంవత్సరంలో ఎక్కువగా పొగమంచుతో కప్పబడి ఉంటుంది.
చరిత్ర
[మార్చు]దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు అతను సతీదేవి, శివుడిని ఆహ్వానించలేదు. పిలువకపోయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. ఆ యజ్ఞం కేవలం శివుని మీద ద్వేషంతో చేస్తున్నాడని, అలా శివుడు లేని యజ్ఞం చేయడం లోకవినాశనానికి దారి తీస్తుందని, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని శివుడిని శరణుకోరమని చెప్తుంది. అందుకు ఆగ్రహించిన దక్షుడు శివుని మీద ద్వేషంతో శివుడిని దూషిస్తాడు. ఆ అవమానం భరించలేక సతీదేవి కోపంతో అగ్నిలో ఆహుతి అవుతుంది. సతీదేవి శరీరాన్ని వదిలేసింది అని తెలుసుకొని శివుడు దుఃఖంతో సతీదేవి శరీరాన్ని భుజం పైన వేసుకొని తాండవం చేయగా లోకాలన్నీ కంపిస్తాయి, ఇది గమనించిన దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి శివుడిని శాంతింపచేయమని కోరతారు. అప్పుడు విష్ణువు అమ్మవారి శరీరం దూరం అయితే శివుడు శాంతిస్తాడు అని చెప్తాడు. శివుడిని శాంతిపచేయడం కోసం సతీదేవి శరీరాన్ని విష్ణువు సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు.[2] అలా చేసినపుడు సతీదేవి తల ఈ ప్రదేశంలో పడడం వలన ఈ ఆలయానికి సిర్ఖండ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ ప్రదేశాన్ని సర్కుండ లేదా సుర్కంద అని పిలుస్తున్నారు.[3]
ఆలయానికి చేరుకోవడం
[మార్చు]ఈ ఆలయానికి కద్దుఖల్ నుండి రెండు కిలోమీటర్ల ట్రెక్ ద్వారా చేరుకోవచ్చు. ఈ ట్రెక్ చాలా నిటారుగా ఉంటుంది, పూర్తి చేయడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. నడవడం సాధ్యం కాకపోతే గుర్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయం ముస్సోరి నుండి 37 కి. మీ. ల దూరంలో ఉంది. ఇక్కడ రోప్‌వే సేవ కూడా ఏప్రిల్ 2022 నుండి ప్రారంభించబడింది. ఈ రోప్ వే 502 మీటర్ల పొడవు ఉంటుంది, ఇది గంటకు 500 మంది పర్యాటకులను తీసుకెళ్లగలదు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Surkanda Devi Temple Dhanaulti Uttarakhand | Travel Guide | Mythololgy". www.euttaranchal.com. Retrieved 2025-03-26.
- ↑ Kamal (2024-07-06). "Daksha Yagnam-దక్షయజ్ఞం/శక్తి పీఠాల ఆవిర్భావం". Spiritual Vikas. Retrieved 2025-03-26.
- ↑ "Surkhanda Devi - Travelling and Trekking".
- ↑ temple, surkanda. "surkanda temple".