Jump to content

సుస్మితా బెనర్జీ

వికీపీడియా నుండి
సుస్మితా బెనర్జీ
పుట్టిన తేదీ, స్థలంసుస్మితా బెనర్జీ
కోల్‌కతా, భారతదేశం
మరణం4/5 సెప్టెంబరు 2013 (aged 48–49)
పక్తికా ప్రావిన్స్, ఆఫ్ఘానిస్తాన్
గుర్తింపునిచ్చిన రచనలుKabuliwalar Bangali Bou
("A Kabuliwala's Bengali Wife")
జీవిత భాగస్వామిజాన్‌బాజ్ ఖాన్

సుస్మితా బెనర్జీ ఒక భారతీయ రచయిత్రి. 2013 సెప్టెంబరు 5న అఫ్ఘానిస్థాన్‌లో మిలిటెంట్ల తూటాలకు బలైంది.

నేపధ్యము

[మార్చు]

అఫ్ఘాన్‌కు చెందిన వ్యాపారవేత్త జాన్‌బజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న సుస్మితా, భర్తతో కలిసి ఉండడానికి 2013లో తిరిగి అక్కడి వెళ్లింది.సుస్మిత ప్రస్తుతం అప్ఘాన్‌లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. స్థానిక పేదల జీవితాలను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో మిలిటెంట్ల చెర నుంచి తప్పించుకున్న ఆమె, ఆ సంఘటనపై పుస్తకాన్ని కూడా రాశారు. ఇది ఇతివృత్తంగా బాలీవుడ్‌లో 'ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్' అనే పేరుతో 2003లో సినిమా తీశారు.

వివాహము, హింస

[మార్చు]

ఒక నాటకం దగ్గర కాబూలీవాలా తెగకు చెందిన జాన్‌బజ్ ఖాన్, సుస్మిత రిహా ర్సల్స్ దగ్గర మొదటిసారి చూసుకుని ఇష్టపడ్డారు. వారి వివాహం 1988 జూలై 2న కోల్‌కతాలోనే గుట్టుగా జరిగింది. ఈ పెళ్ళిని సుస్మిత తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిం చారు. విడాకులు ఇప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే సుస్మితను తీసుకుని జాన్‌బజ్ అప్ఘాన్ (స్వగ్రామం పటియా) వెళ్లాడు. రవీంద్ర కవీంద్రుడి కాబూలీవాలా కథలో కనిపించే కాబూలీవాలాలాగే జాన్‌బజ్ కోల్‌కతాలో వడ్డీ వ్యాపారమే చేసేవాడు. కానీ కథలో కాబూలీవాలా అంతటి ఉన్నతుడు కాదు. ఆ సంగతి సుస్మితకు అత్తింట అనుభవానికి వచ్చింది. ఆమె అత్తవారింట గుమ్మంలో అడుగుపెడుతుండగానే రష్యన్ సేనలకు, తాలిబన్లకు మధ్య కాల్పులు మొదలైనాయి. ఒక రాయి చాటున ఆరు గంటలు భర్తతో నిశిరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపింది. తెల్లవారాక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకో బాంబు సిద్ధంగా ఉంది. జాన్‌బజ్‌కు అప్పటికే పెళ్లయింది. ఆమె పేరు గుల్‌గుట్టి. 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అయినా సవతితో, కుటుంబంతో సఖ్యంగా ఉండడానికే సుస్మిత అలవాటు పడింది. ఆమెను అక్కడే వదిలి జాన్‌బజ్ వ్యాపారం కోసం తిరిగి కోల్‌కతా చేరాడు.

దాంతో అక్కడ సుస్మిత ఆగచాట్లు మొదలయినాయి. తాలిబన్ల ఆధిపత్యం ఉన్న ఆ ప్రాంతంలో స్త్రీలపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆ ప్రాం తం నుంచి ఎంపికైన తొలి మహిళా ఎంపీని కూడా తాలిబన్లు కిడ్నాప్ చేశారు. వైద్యానికి కూడా స్త్రీలు నోచుకోవడం లేదు. దీనితో సయీదా కమల్ (సుస్మిత ఇస్లాంలోకి మారిన తరువాతి పేరు) తోటి స్త్రీల సాయంతో రహస్యంగా ఒక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంగతి 1995 మేలో తాలిబన్లకు తెలిసి, సుస్మితపై దాడి చేసి తీవ్రంగా హింసించారు. దానితో ఆమె ఆఫ్ఘన్ విడిచిపోవాలని రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి సరిగ్గా ఇస్లామాబాద్ వచ్చి భారత దౌత్య కార్యాలయం గుమ్మం వరకు వచ్చాక భర్త వైపు బంధువులు పట్టుకుని తీసుకుపోయారు.

ఇంట్లో అతిథులు వేచి ఉండే గదిలో పదిహేను మంది తాలిబన్లు తనను ఏ విధంగా విచారించినదీ, మరణ దండన (1995 జూలై 22 ఉదయం పదిన్నరకు) విధిస్తూ తీర్పు చదివిన తీరు సుస్మిత ‘ఓ కాబూలీవాలా బెంగాలీ భార్య’లో చిత్రించారు. అయితే ఆ గ్రామ పెద్ద, సవతి, ఇంకొందరు బంధువుల సహకారంతో సుస్మిత ఇంటి గోడ బద్దలుకొట్టుకుని బయటపడి ఆగస్టు 12, 1995న కోల్‌కతాలో ఉన్న భర్త దగ్గరకు చేరుకుంది. పద్దెనిమిది సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ సమయంలోనే ఆమె రచయితగా మారింది. 1998 జనవరిలో వెలువడిన ‘ఓ కాబూలీవాలా భార్య’ బెంగాలీ రచన ఏడు లక్షల ప్రతులు, దాని ఆంగ్లానువాదం లక్ష ప్రతులు అమ్ముడుపోయాయి. దీని కొనసాగింపు ‘తాలిబన్, ఆఫ్ఘన్, నేను’ (2012) ఐదు లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. ‘ఒక్క మాటా అబద్ధం కాదు’ ఈ ఏడాదే వెలువడింది. ‘ఓ కాబూలీవాలా భార్య’ ఆధారంగా బాలివుడ్ దర్శకుడు ఉజ్జ్వల్ చటర్జీ ‘ఎస్కేప్ ఫ్రం తాలిబన్’ (2003) పేరుతో మనీషా కొయిరాలా కథానాయికగా సినిమా నిర్మించారు.

మరణం

[మార్చు]

పక్తికా ప్రావిన్స్‌లోని ఆమె ఇంట్లోకి చొరబడిన మిలిటెంట్లు... భర్త, ఇతర కుటుంబ సభ్యులను తాళ్లతో బంధించారు. అనంతరం సుస్మితను ఇంటి బయటికి తీసుకొచ్చి కాల్చి చంపారు. మృతదేహాన్ని అక్కడి పాఠశాలకు సమీపంలో వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు[1][2][3].

దాదాపు ఇరవై తూటాలతో ఛిద్రమైన సుస్మిత (49) మృతదేహం పటియా గ్రామ సమీపంలోనే ఉన్న పక్‌టికా ప్రాంత రాజధాని షారానాలో కనుగొన్నారు. ఆమె రచనలు, చేసిన సంఘ సేవ, బుర్ఖా సంప్రదాయాన్ని పాటించకపోవడం, ఆఖరికి భారతీయ స్త్రీ కావడం-వీటిలో ఏ కారణంతోనైనా దుండగులు ఆమెను చంపి ఉండవచ్చునని పోలీసులు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు తీవ్రవాదులను 2013 సెప్టెంబరు 9, అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు పక్నిక గవర్నర్ అధికార ప్రతినిధి మెక్లిస్ ఆఫ్ఘాన్ 2013 సెప్టెంబరు 10 మంగళవారం వెల్లడించారు. ఆమె రచన ద్వారా తాలిబన్లను ఆగౌరవ పరిచిందని, ఈ నేపథ్యంలో సుష్మితను చంపమని తమకు పై నుంచి ఆదేశాలు అందాయని తీవ్రవాదులు ఇద్దరు తమ విచారణలో వెల్లడించారని ఆఫ్ఘాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నేట్ ద్వారా ఆమె ఆఫ్ఘాన్ దేశ రహస్యాలను భారత్ కు చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతోందని వారు ఆరోపించినట్లు తెలిపారు.

నిందితులు తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానికి చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నామన్నారు. పక్నిక ప్రావెన్స్ రాజధాని సహర్నలో వీరిని సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు[4]

మూలాలు

[మార్చు]
  1. http://www.ndtv.com/article/india/sushmita-banerjee-the-woman-who-had-said-the-way-i-fought-against-taliban-every-woman-should-too-415032?curl=1378484031
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-07. Retrieved 2013-09-06.
  3. http://news.oneindia.in/international/indian-author-sushmita-banerjee-shot-dead-in-afghanistan-1300296.html[permanent dead link]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-11. Retrieved 2013-09-11.

బయటి లంకెలు

[మార్చు]

సుస్మితా బెనర్జీ జీవిత చరిత్ర