సుహైబ్ ఇల్యాసీ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సుహైబ్ ఇల్యాసీ (8 సెప్టెంబరు 1966) భారతదేశానికి చెందిన టీవీ ప్రోగ్రాముల నిర్మాత, దర్శకుడు. దేశంలోనే తొట్టతొలిసారిగా నేరాల గురించిన కార్యక్రమం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. వ్యాఖ్యానంలో ఈయన చూపిన ప్రత్యేక శైలితో ఈ కార్యక్రమంతో దేశాన్ని ఉర్రూతలూగించాడు. బ్యూరోక్రసీ టుడే అనే పత్రికకు సంపాదకలు కూడా.
అప్పటికే యావత్ భారతదేశపు దృష్టిని ఆకట్టుకొన్న ఇల్యాసీ, 2000 లో తన భార్య అనుమానాస్పాద మృతితో వార్తలలోకి ఎక్కారు. వరకట్న వేధింపు/హత్య ల చట్టాల క్రింద అరెస్టు చేయబడ్డాడు.
ఇల్యాసీ అంజుల ప్రేమ వివాహం
[మార్చు]1989 లో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చదువుతున్న సుహైబ్ ఇల్యాసి, అంజు సింఘ్ లు పరస్పరం ప్రేమించుకొన్నారు. ఇరువురివైపు పెద్దలను వ్యతిరేకించి 1993లో వారు లండన్ లో మతాంతర వివాహం చేసుకొన్నారు. వారి విద్యాభ్యాసానికి అనుగుణంగా బ్రిటన్ లో బిబిసి చే ప్రసారం చేయబడుతున్న క్రైమ్ స్టాపర్స్ అనే కార్యక్రమం గురించి అభ్యసించారు.
ఇల్యాసీ అంజుల మధ్య మనస్పర్థలు
[మార్చు]1994లో తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆరు నెలల తర్వాత అంజు ఇల్యాసితో కలిసి ఉండటానికి ఇష్టపడక, లండన్ లో తమ్ముడు ప్రశాంత్ వద్దకు వెళ్ళి పోయింది. అంజు విడాకులు తీసుకోవాలని అనుకొంటున్నదని తెలపగా ప్రశాంత్ వారించాడు. ఇల్యాసీ లండన్ వెళ్లి వివాహ బంధాన్ని కొనసాగించటానికి అంజును ఒప్పించి భారతదేశానికి తీసుకువచ్చాడు. తర్వాత వారికి ఆలియా జన్మించింది.
రెండుమార్లు విడిపోయి రెండు మార్లు కలుసుకొన్న ఇల్యాసీ అంజులు
[మార్చు]క్రైమ్ స్టాపర్స్ వలె భారతదేశంలో కూడా జీ టీవీ ద్వారా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే కార్యక్రమాన్ని ఇల్యాసీ దంపతులు ప్రసారం చేయటం ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా అంజునే వ్యవహరించినా 1998 కల్లా ఇల్యాసీ కూడా వ్యాఖ్యాతగా ఎదగగా అంజుకు స్థానభ్రంశం కలిగినది. మరల ఇల్యాసీ-అంజుల మధ్య మనస్పర్థలు రావటంతో అంజు ఈ మారు కెనడాలోని తన సోదరి రష్మి సింఘ్ వద్దకు వెళ్ళినది. తర్వాత ఇల్యాసి ఆలియా సొల్యూషన్స్ పేరుతో సాఫ్టువేర్ సంస్థను స్థాపించాడు. అంజుకు సంస్థలో 25% షేర్లను ఇవ్వటంతో 1999 కల్లా ఆమె మరల భారతదేశానికి తిరిగివచ్చి ఇల్యాసీతో మరల జీవితాన్ని ప్రారంభించింది. 15 లక్షలకు ఢిల్లీలో ఇల్లు కొని ఇద్దరూ దానిని చక్కగా అలంకరించుకొన్నారు. డిసెంబరు 1999 లో గృహప్రవేశం చేశారు. 16 జనవరి 2000 లో అంజు జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపటానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
అంజు ఆత్మహత్య
[మార్చు]తాను నిర్వహిస్తోన్న ఒక కార్యక్రమాన్ని నిలిపివేయమని అండర్వరల్డ్ నుండి బెదిరింపులు రావటంతో రక్షణ కోరిన ఇల్యాసీ ఇంటి వద్ద ఇద్దరు రక్షకభటులు అతనికి పహారా కాస్తూ ఉండేవారు. 10 జనవరి 2000 న రాత్రి గం 11:15 ని లకు అంజు తనని తాను కత్తితో పొడుచుకొన్నదని, ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళాటానికి అంబులెన్సును పట్టుకురమ్మని రక్షకభటులకు ఇల్యాసీ తెలిపాడు. అంజును తాత్కాలితంగా దగ్గరలో ఉన్న నర్సింగ్ హోంకు తరలించి, తర్వాత AIIMS కీ తీసుకువెళ్ళినా, అక్కడికి వెళ్ళే లోపే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. తనను తాను పొడుచుకొన్నట్లే కనబడుతున్న, ఉదరభాగంలో ఉన్న రెండు కత్తిపోట్ల (ఒకటి క్రింది దిశగా, మరొకటి వెనుక వైపుకు) వలన అయిన గాయాల వల్ల అధిక రక్తస్రావం జరగటంతో అంజు మరణించినదని, ఇది హత్య కాకపోవచ్చునని ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదిక తెలిపినది. అయితే తాను ధరించిన టీ-షర్టు పై ఎటువంటి కన్నీటి మరకలు దొరకలేదు. తాము ఇటీవలె గొడవ పడుతోన్నది వాస్తవమే అని, అయితే ఆలియాతో మరో గదిలో తాను ఆడుకొంటూ ఉండగా, అంజు, దిగుమతి చేసుకొన్న ఒక బుచర్స్ నైఫ్ (కసాయి ఉపయోగించే కత్తి) తో తనని తాను పొడుచుకొన్నదని తెలిపాడు. ఆ సమయంలో అంజు తల్లి రుక్మా కెనడాలో ఉన్నారు. మరణించటానికి కొద్ది గంటల ముందే అంజు తండ్రి కె.పి.సింఘ్ ను కలిసినది. అంజు తల్లిదండ్రులు, సోదరుడు ఇల్యాసీ సహృదయుడనే తెలిపారు.
సింఘ్ ప్రకారం
మా అమ్మాయి ముక్కోపి , కోపం వచ్చినపుడు అంజు తనపై తాను నియంత్రణ కోల్పోతుంది. ఇది హత్య అనే అనుమానం నాకు లేదు.
అంజు కుటుంబాన్ని ఓదార్చటానికి ఇల్యాసీ వారి ఇంటికి మకాం మార్చాడు. 17 జనవరి న అంజుది ఆత్మహత్యేనని పోలీసులు కేసు కట్టారు.
సుహైబ్ అరెస్టు
[మార్చు]15 ఫిబ్రవరి 2000 న కెనడాలో మాంటిస్సోరీ పాఠశాలను నడిపే అంజు అక్క రష్మి సింఘ్ భారతదేశానికి వచ్చింది.[1] అంజు మరణించే ముందు రష్మితో ఫోన్ లో మాట్లాడినది. సుహైబ్ వరకట్న వేధింపులకు గురి చేయటం వలనే అంజు మరణించినదని తెలుపుతూ రష్మి పోలీసులను ఆశ్రయించింది. 28 మార్చి 2000 న సుహైబ్ ను వరకట్న హత్య (ఐపీసీ సెక్షను 304బి), మానసిక వేదన (ఐపీసీ 498ఏ), సాక్ష్యాలను లేకుండా చేయటం (ఐపీసీ 201) చట్టాల క్రింద కేసులు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.[2] జీ టీవీ నుండి దూరదర్శనుకు మారిన ఇల్యాసీ, వ్యాఖ్యాతగా వ్యవహరించవలసిన కార్యక్రమం 30 మార్చి 2000న ప్రసారం అవ్వలేదు. పున:ప్రసారం అవుతుందో లేదో కూడా దూరదర్శను చెప్పలేకపోయింది. అరెస్టు తర్వాత అంజు కుటుంబ సభ్యులు తమ మనసు మార్చుకొన్నారు. కె పి సింఘ్, ప్రశాంత్ లు ఇల్యాసీ అమాయకుడేనని నమ్మినా, రష్మి, రుక్మాలు వారితో పోట్లాడి, బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు అంజు బాధాకరమైన వివాహబంధాన్ని అనుభవించినది అని రష్మి తెలిపినది. 1997లో ఇల్యాసీ అంజుపై దాడి చేసినది తన కళ్ళతో చూసినట్లు రష్మి తెలిపినది. ఇల్యాసీ దంపతులు సొంతం చేసుకొన్న ఫ్లాటు తన డబ్బుతో కొన్నదని, అంజు భద్రత కోసమే తాను ఆమెకు ఆ ఇల్లు కొని ఇచ్చినదని మొదట తెలిపిన రష్మి తర్వాత ఆ మాటను ఉపసంహరించుకొన్నది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కేవలం ఒక ఊహామాత్రంగానే ఉన్నపుడు, దానిని కార్యాచరణలో పెట్టించింది రష్మినే అని, ఇది కార్యరూపం దాల్చటానికి రష్మి కొన్ని ఆర్థిక వనరులను కూడా సమకూర్చినదని విశ్వసనీయ వర్గాల భోగట్టాగా ఇండియా టుడే తెలిపినది. అయితే కె పి సింఘ్, ప్రశాంత్ ల అనుగ్రహం పొందటానికి ఇల్యాసీ వారికి ఖరీదైన బహుమతులను ఇచ్చాడని, కానీ రష్మిని మాత్రం విస్మరించటంతో తన వాటాను పొందటానికే ఆమె ఈ కేసు కట్టినట్లు కనిపిస్తోన్నదని ఇవే వర్గాలు తెలిపినవి.[3]
ఇల్యాసీ ప్రకారం -
"This is not a conspiracy against me but against my programme."
("ఈ కుట్ర జరిగినది నా పై కాదు, నా కార్యక్రమం పైన.")
అంజు సోదరుడు ప్రశాంత్ ప్రకారం -
"My sister (Rashmi) has ganged up with the administration to nail Suhaib. Some people have hatched a conspiracy against Suhaib and played on the emotions of my sister and my mother[4]."
("యంత్రాంగంతో చేతులు కలిపిన నా సోదరి (రష్మి) సుహైబ్ ను ఇరికించాలని చూస్తున్నది. నా తల్లి, సోదరి ల భావోద్వేగాలతో ఆడుకొని కొందరు సుహైబ్ పై ఈ కుట్ర పన్నారు.")
విచారణ
[మార్చు]2000
[మార్చు]ఇల్యాసీ వద్ద రెండు వేర్వేరు పేర్లతో పాస్ పోర్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 1982 లో ఇచ్చిన పాస్ పోర్టు ప్రకారం అతని పేరు మొహమ్మద్ సుహైబ్ గా, 1991 లో ఇచ్చిన మరొక పాస్ పోర్టు ప్రకారం అతని పేరు సుహైబ్ ఇల్యాసీగా ఉన్నాయి. ఇంతే కాక అతని వద్ద ఒక నకిలీ పోస్టు గ్ర్యాడ్యుయేషన్ పట్టా, ఇతర నకిలీ డాక్యుమెంట్లు ఉన్నట్లుగా తెలిపారు. అంజు అతని గుట్టు రట్టు చేస్తానని బెదిరించటంతోనే ఇల్యాసీ ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిపారు. క్రెడిట్ కార్డుతో జరిగే లావాదేవీల కోసమే ఈ పాస్ పోర్టులు ఇల్యాసీ ఉపయోగించేవాడని, తర్వాత పైకం కట్టవలసిన సమయానికి తాను విదేశాలలో ఉన్నందు వలన ఇప్పుడే కట్టటం కుదరదని తెలిపేవాడు అని పోలీసులు నిర్ధారించారు. ఇల్యాసీ తల్లిదండ్రులు, రెండున్నర ఏళ్ళ వయసు ఉన్న ఆలియాను అంజు కుటుంబ సభ్యులు కెనడాకు తీసుకెళ్ళే ప్రమాదం ఉన్నదన్న భయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14 న రష్మి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఆలియాను తీసుకొనబోమని స్పష్టం చేసినది.[5] ఆలియాను ఢిల్లీ పరిధులను దాటించవద్దని కోర్టు ఆజ్ఞాపించింది. 2 జూన్ న రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే విలువగల ఇరువురు సాక్షుల పూచీకత్తు పై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇల్యాసీకి బెయిలు మంజూరు చేసినది.[6] అతని పాస్ పోర్టు స్వాధీనం చేసుకొనటమే కాక, అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి పోరాదని, సాక్షులను భయాందోళనలకు గురి చేయకూడదని, సాక్ష్యాధారాలను తారుమరు చేయకూడదని అతనిని ఆజ్ఞాపించింది.
2 జూలై నుండి ఆలియా ఇల్యాసీ వద్దనే పెరుగుతున్నది. మరల ఇల్యాసీ ఆలియా భద్రత పై అనుమానం వ్యక్తం చేశాడు. ఆలియా సంరక్షణ బాధ్యతలను వారికి ఇవ్వకుంటే సాక్షులను భయాందోళనలకు గురి చేశామని కోర్టుకు చెబుతాం అని తనని బెదిరిస్తున్నట్లు తెలిపాడు. 11 జూలై న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆలియా సంరక్షణను రష్మి, రుక్మాలు బలవంతంగా తీసుకోలేరని, కావాలనుకొంటే ఈ ప్రక్రియలో వారు న్యాయపరంగా ముందుకెళ్ళవచ్చునని తెలిపినది.
2001
[మార్చు]29 మే 2001 న ఢిల్లీ హై కోర్టు ఇల్యాసీని ఢిల్లీ బయటికి వెళ్ళటానికి అనుమతినిచ్చింది. ముంబాయికి పని పైన వెళ్తున్నాని చెప్పటంతో కోర్టు అనుమతించింది. రెండు రోజుల ముందు కోర్టుకు తెలిపి తాను వెళ్ళవచ్చునని తెలిపినది.[7]
2002
[మార్చు]3 అక్టోబరు 2002 న ఇల్యాసీ పై వరకట్న వేధింపుల ఛార్జి ష్టీటు దాఖలు అయ్యింది.
2003
[మార్చు]29 మార్చి 2003 న ట్రయల్ కోర్టు సెక్షను 498 ఏ, 304 బీ ల క్రింద అభియోగాలు మోపింది.
17 జూలై 2003 న హత్యా అభియోగం చేర్చబడింది.
2005
[మార్చు]ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని రుక్మా సింఘ్ దిగువ న్యాయస్థానంలో అప్పీలు చేసుకొన్నది. ఐదేళ్ళ తర్వాత ఏ సరైన కారణం లేకుండానే సిబిఐ విచారణ కోరటం, కేవలం కేసును పొడిగించే ఉద్దేశ్యమేనని కోర్టు ఈ అప్పీలును తిరస్కరించింది.[8]
2010
[మార్చు]2010 లో పోస్టు మార్టం చేసిన డాక్టరు ఇది హత్య కాదని చెప్పలేకపోయారనే వాదాన్ని రుక్మా సింఘ్ తీసుకువచ్చినది.[9] ఇల్యాసీ తాను అంజు నుండి కత్తిని లాగివేసే ప్రయత్నం చేశానని బుకాయిస్తున్నా, అతనివి గానీ, అంజువి గానీ వేలిముద్రలు కత్తిపై దొరకలేదని కోర్టు గమనించాలని తెలిపారు. పోస్టు మార్టం నిర్వహించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్న డాక్టరును నమ్మలేమని, సరిగా పని చేయలేకపోతున్నాడనే ఆరోపణ పై అతడిని తర్వాత మార్చురీ డిపార్టుమెంటుకు బదిలీ చేశారని సుహైబ్ తెలిపాడు.
2011
[మార్చు]ఏ సరిక్రొత్త సాక్ష్యాధారాలు లేకపోవటంతో ఈ దిశగా ఎటువంటి పురోగతి లేదని ఇల్యాసీపై వరకట్న హత్య ఆరోపణలు వేయాలన్న రుక్మా అప్పీలును కోర్టు తిరస్కరించినది.[10]
2012
[మార్చు]పదిహేనేళ్ళ ఆలియా సంరక్షణను సొంతం చేసుకోవాలనే దురుద్దేశ్యంతోనే అతనిపై నేరారోపణలు వేయాలని చూస్తున్నారని ఒక ఇంటర్యూలో సుహైబ్ తెలిపాడు. అంజును తాను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడని, పైసా కట్నం కూడా తాను తీసుకోలేదని, పైగా పెళ్ళి ఖర్చులు కూడా తానే భరించానని తెలిపాడు. భారతదేశపు వరకట్న వేధింపు చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని మరొక ఇంటర్వ్యూలో సుహైబ్ తెలిపాడు.
అంజుకు అయ్యిన కత్తి గాయాలపై విచారణ జరపటానికి సరిక్రొత్త మెడికల్ బోర్డు ఏర్పాటు.
2013
[మార్చు]అదివరకటి మెడికల్ బోర్డు అంజుది హత్యా/ఆత్మహత్యా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వెలువరించటంతో, పోలీసులు క్రొత్త మెడికల్ బోర్డును ఏర్పరచి విచారణ చేపట్టారు. ఇల్యాసీ తరపు న్యాయవాదులు కోర్టు అనుమతి లేకుండానే ఈ క్రొత్త మెడికల్ బోర్డును ఏర్పరచారని, ఇది కోర్టును ధిక్కారమేనని (Contempt of Court) తెలిపారు. అందుకుగాను, జనవరి 2013లో ఈ తదుపరి విచారణను నిలిపివేయాలని ఢిల్లీ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసినది. మార్చి 2013న ఈ తదుపరి విచారణ పై స్టే ఆర్డర్లు వెలువరించింది. దీనిపై రుక్మా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది క్రొత్త మెడికల్ బోర్డును నియమించటానికి పోలీసులకు సకల హక్కులు కలవని వాదించారు. సరైన ప్రక్రియను అనుసరించకుండా క్రొత్త మెడికల్ బోర్డును నియమించారన్న ఇల్యాసీ వాదనను ఉన్నత న్యాయస్థానం త్రోసిపుచ్చినది.[11] క్రొత్త బోర్డును విచారణను పూర్తి చేయమని ఆజ్ఞాపించింది. దీంతో ఇల్యాసీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్నే సమర్థించినది.[12]
2014
[మార్చు]12 ఆగష్టు 2014 న హై కోర్టు ఇల్యాసీపై హత్యా అభియోగాలు మోపటానికి అనుమతిని ఇచ్చింది. ఇల్యాసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
21 ఆగష్టు 2014 ఇల్యాసీ అభ్యర్థనను సుప్రీం కోర్టు త్రోసి పుచ్చింది.
2017
[మార్చు]20 డిసెంబరు 2017 న ఇల్యాసీ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఋజువైనాయని కోర్టు నిర్ధారించినది.[13] దీనికి ఇల్యాసీ 2 లక్షల జరిమానా, అంజు తల్లిదండ్రులకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించవలెనని తీర్పునిచ్చినది.[14][15]
దీనిపై స్పందిస్తూ ఇల్యాసీ అత్తగారు రుక్మా సింఘ్, "అతను శిక్షించబడ్డాడు, అన్నింటికన్నా అదే ముఖ్యమైంది" (He has been convicted, and that is the most important thing) అని వ్యాఖ్యానించింది.
2018
[మార్చు]13 మార్చి 2018న తనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాలు హై కోర్టులో సవాలు చేశారు.
15 మార్చి 2018న హై కోర్టు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.
26 ఏప్రిల్ 2018న హై కోర్టు ఇల్యాసీకి నాలుగు వారాల తాత్కాలిత బెయిలుకు అనుమతినిచ్చింది.
14 మే 2018న తాత్కాలిత బెయిలు పొడగింపుకు హై కోర్టు తిరస్కరించింది.
31 మే 2018న సుప్రీం కోర్టు తాత్కాలిత బెయిలుకై ఇల్యాసీని హై కోర్టును ఆశ్రయించమని కోరింది.
17 ఆగష్టు 2018న తీర్పును తమ అధీనంలోకి తీసుకొంది.
స్నేహితుడు సయ్యద్ మక్దూం ఆత్మాహుతి
[మార్చు]అహ్మదాబాద్ కు చెందిన, కెనడాలో స్థిరపడిన సయ్యద్ మక్దూం ఇల్యాసీ స్నేహితుడు. మక్దూంకు, భారతదేశానికి చెందిన ముస్కాన్ సెర్ అనే ఒక స్త్రీతో షాది.కాంలో పరిచయమైనది.[16] ఆమె కోసం అతను కెనడా వదిలి భారతదేశానికి వచ్చి ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. వారికి ఒక కుమారుడు (సయ్యద్ రెయ్యాన్). అయితే అంతకు ముందే ఆమెకు వివిధ పేర్లతో నాలుగు మార్లు వివాహములైనవని, నాలుగు మార్లూ వరకట్న వేధింపు చట్టాలతోనే ఆమెకు వారితో విడాకులవటమే కాక పలుమార్లు తాను అబార్షన్ చేయించుకొన్నదని మక్దూంకు తెలిసింది. ముస్కాన్ యొక్క అసలు రంగు మక్దూంకు తెలియటంతో ఆమె అతనిపై మరల ఈ చట్టాల దుర్వినియోగానికి ఒడిగట్టినది. దీనితో వారు విడిపోయారు. మక్దూంను మానసికంగా వేధించి అతని ఆస్తిపాస్తులను సొంతం చేసుకోవాలనే దురుద్దేశ్యంతోనే ముస్కాన్ తో సహా ఆమె కుటుంబసభ్యులందరూ కలిసి అతనిని కుమారునికి దూరం చేశారు. ఆమె రెయ్యాన్ ఆలన-పాలనలపై సరిగా ధ్యాస చూపేది కాదని, బాలుడిని శారీరకంగా హింసించేదని కూడానని ఒక లేఖలో మక్దూం పేర్కొన్నాడు. స్వాభావికంగానే పిల్లలంటే ఇష్టపడే మక్దూం, తాము విడిపోయినా తన రక్తం పంచుకుపుట్టిన రెయ్యాన్ పై గల అమితమైన ప్రేమను మాత్రం చంపుకోలేకపోయాడు. రెయ్యాన్ ను చూడకుండా ఉండలేకపోయాడు. రెయ్యాన్ ను చూడటానికి మక్దూం చేయని ప్రయత్నం లేదు.
"I fell at her feet and begged to see my son. But to no avail." [17]
("మా అబ్బాయిని చూడనివ్వమని ఆమె కాళ్ళపై పడి నేను ప్రాధేయపడ్డాను. కానీ ఫలితం లేకపోయినది.")
పాషాణ హృదయురాలైన ముస్కాన్ ఏ మాత్రం కరగకపోవటంతో మక్దూం వకీలును ఆశ్రయించాడు. కానీ మక్దూం యొక్క ప్రేమాభిమానాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోలేని తన వకీలు కేసును సాగదీయటం తప్ప మరేమీ చేయలేకపోయాడని వాపోయాడు. రెయ్యాన్ ను తనకు చూపించటానికి సహాయపడమని తన భార్యను, ఆ సామాజిక వర్గాన్ని ప్రాధేయపడుతూ 2009లో మక్దూం తన పై తనే ఒక వీడియో తీసుకొన్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ దానిని యూట్యూబ్ లో ఎక్కించి ఆత్మహత్య చేసుకొన్నాడు.[18]
ఇల్యాసీ ప్రతిస్పందనలు
[మార్చు]మక్దూం తన కుటుంబ పరిస్థుతులు ఇల్యాసీకి తెలుపుతూ, సలహాలు సూచనలు కోరేవాడు. అయితే ఇవే సమస్యలు అతని జీవితాన్నే బలిగొంటాయని అనుకోని ఇల్యాసీని అతని మరణం కలచివేసినది. స్వీయ జీవితంలో తను అనుభవించిన ఈ బాధ కంటే, తన స్నేహితుడు అనుభవించిన వేదన, క్షోభలు మరింత దయనీయమైనవని, దాని ప్రేరణతోనే తాను 498A: The Wedding Gift అనే విమర్శాత్మక లఘుచిత్రాన్ని నిర్మిస్తున్నానని ఇల్యాసి తెలిపాడు.
విచ్ఛలవిడిగా దుర్వినియోగం చేయబడుతున్న చట్టాల గురించి, తనపై జరిగిన కుట్రల గురించి, తన లఘుచిత్రం గురించి, వివిధ సందర్భాలలో మృదుభాషి అయిన ఇల్యాసి ప్రతిస్పందనలు -
"These are the dangers when you try to nab criminals. We exposed men with strong political connections, this is how I paid for it. People accused me of forcing my wife to commit suicide and the show ended, leaving a lot of people relieved. Some wrong men wanted me to lose my credibility[19]."
("నేరస్థులని పట్టించటం వలన ఇలాంటి ప్రమాదాలే ఎదురౌతాయి. బలమైన రాజకీయ సంబంధాలు కల వారి గురించి మేము బట్టబయలు చేశాం, దానికి నేను ఈ విధంగా మూల్యం చెల్లించుకొన్నాను. నా భార్యను ఆత్మహత్య చేసుకొనేలా నేనే చేశానని ప్రజలు నమ్మటంతో కార్యక్రమం ముగిసింది. చాలా మంది తప్పించుకొన్నారు. కొందరు తప్పుడు మనుషులు నాపైనున్న నమ్మకాన్ని వమ్ము చేయాలని చూశారు.")
"The society as a whole believes that it is only the women that bear all the atrocities[20]."
("ఈ మొత్తం సమాజం దుర్మార్గాలనన్నింటినీ మహిళ మాత్రమే సహిస్తుంది అని నమ్ముతుంది.")
"A police officer who was one of the investigating officer in the case, still interferes with the judicial and enquiry processes despite the fact that he is deployed as DCP in the Prime Minister's security contingent[21]."'
("ఇదివరకు ఈ కేసును విచారణ చేస్తున్న ఒక పోలీసు అధికారి, ప్రస్తుతం ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే డిసిపి స్థానానికి బదిలీ అయినా, ఇంకా ఆయన ఈ కేసు యొక్క న్యాయపరమైన విచారణలలో ఎందుకో అనవసరంగా జోక్యం చేసుకొంటుంటారు.")
"I wrote the story because it was coming from my heart. But it is not my story at all. My film is not an attempt to show my innocence[22]."'
("నా గుండెల్లోనుండి పెల్లుబుకుతోంది కాబట్టే, ఈ కథను వ్రాశాను. కానీ ఇది నా కథ మాత్రం కానే కాదు. నా అమాయకత్వాన్ని ఋజువు చేసుకొనే ప్రయత్నంలో నేను ఈ చిత్రాన్ని తీయటం లేదు.")
"I believe we need strict laws against dowry. It is a thousand-year-old custom and there are greedy people in our society. Women are killed and men are cruel. That is the reality. But we need to amend the law so that innocent men do not suffer when the law is misused. That is the sole purpose of my film - to stop this ordeal[23]."
"(కఠినమైన వరకట్న వ్యతిరేక చట్టాలు ఉండాలని నేను నమ్ముతున్నాను. ఇది ఒక వెయ్యి సంవత్సరాల పురాతన సంప్రదాయం, పైగా సంఘంలో చాలా మంది దురాశపరులే ఉన్నారు. క్రూరులైన మగాళ్ళ వలనే వివాహిత స్త్రీలు హత్యలకు గురవుతున్నారు. ఇది వాస్తవమే. కానీ, ఈ చట్టం దుర్వినియోగం వలన ఏ అమాయక పురుషుడూ బాధించబడకుండా ఉండేలా దీనిని సవరించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. నా లఘుచిత్రం యొక్క ఏకైక లక్ష్యం - పురుషజాతి ఎదుర్కొంటున్న ఈ కఠిన పరీక్షకు చరమగీతం పాడటమే.)"
"Through film we are asking to introduce a gender neutral law with amendments and provisions.
"(ఈ లఘుచిత్రం ద్వారా సవరణలు చేయబడ్డ, వెసులుబాట్లు కల లింగ వివక్ష లేని చట్టాలను తీసుకురావాలని మేము అభ్యర్థిస్తున్నాం.)"
"Every morning I wake up with a wish that all that happened was just a dream and I would see my lovely wife sleeping next to me. And I wake her up to share the nightmare I had. But that's not the reality[24].
"(నిద్రలేచే ప్రతి ఉదయం, జరిగినదంతా ఒక పీడకల అయితే బాగుండును అని అనుకొంటుంటాను. నా ప్రియమైన భార్య ఇంకా నా ప్రక్కనే నిదురిస్తోందనే భావిస్తూ ఉంటాను. తనను నిద్రలేపి నాకు వచ్చిన పీడకల గురించి చెప్పాలి అని అనుకొంటూ ఉంటాను. కానీ ఇదంతా అవాస్తవం అనే నేను కళ్ళు తెరవవలసి వస్తుంది.)"
తుది తీర్పు
[మార్చు]5 అక్టోబరు 2018 న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇల్యాసీ తన భార్యను హత్య చేశాడనే వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేనందున అతనిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కత్తి పోట్లతో అలమటిస్తోన్న భార్యకు వైద్య సహాయం అందించటంలో కావాలని ఆలస్యం చేశాడని నమ్మటానికి తమ వద్ద ఆధారాలు లేవని పేర్కొంది. అంతకు ముందు కోర్టు ఇల్యాసీని దోషిగా ప్రకటిస్తూ చేసిన తీర్పు మొత్తం 'భావనలు, అభిప్రాయాల ' తోనే గానీ సాక్ష్యాధారాలతో కాదు అని ప్రకటించింది. [25]
"తాను తప్పు చేశానని గాయాలపాలైన అంజు తెలపటం, ఇది ఆత్మహత్యే అనే సూత్రానికి తావు ఇస్తోంది. ఇల్యాసీ ఈ హత్య చేయాటానికి గల ఉద్దేశానికి తగిన వాదనలు లేవు. ఘటన జరిగిన రెండు గంటల ముందే ఇల్యాసీతో సంతోషంగా ఉన్న అంజు, తర్వాత వచ్చిన అభిప్రాయ భేదంతోనే ఆత్మహత్యాప్రయత్నం చేసింది అని నమ్మకుండా ఉండటానికి ఎటువంటి వాదనలు లేవు." అని కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
తుది తీర్పు పై ఇల్యాసీ అత్తగారి స్పందన
[మార్చు]అంజు తల్లి, ఇల్యాసీ అత్తగారైన రుక్మా సింఘ్ తుది తీర్పుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.[26] వృద్ధాప్యపు సమస్యలతో తుది తీర్పు వినటానికి ఆమె కోర్టుకు హాజరు కాలేకపోయారు. ఈ న్యాయపోరాటాన్ని తాము సుప్రీం కోర్టు వరకు తీసుకువెళ్ళటానికి నిర్ధారించుకొన్నట్లు తెలిపారు. 17 ఏళ్ళు న్యాయపోరాటం చేసినా తాము అలసిపోలేదని తెలిపారు. తన మనవరాలు ఆలియా నుండి ఈ కబురు విన్నట్లు ఆమె తెలిపారు. ట్రయల్ కోర్టు ముందు తాము ప్రవేశపెట్టిన వాస్తవాలను హై కోర్టు తుంగలో త్రొక్కిందని, కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అంజు ఎలా మాట్లాడగలుగుతుందని ప్రశ్నించారు. తీర్పు వాస్తవాధారితంగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. బేటి బచావో, బేటీ పడావో అనే ప్రభుత్వం నిర్భయ హంతకులను ఇంకా శిక్షించలేక పోయిందని, ఆడపిల్లకు న్యాయం జరగలేదని వాపోయారు.
తుది తీర్పు పై ఇల్యాసీ కుమార్తె ఆలియా స్పందన
[మార్చు]ప్రాసిక్యూషన్ హత్య జరిగినట్లు సాక్షాధారాలు చూపించలేకపోవటంతో హై కోర్టు ఇల్యాసీని నిర్దోషిగా ఇచ్చిన తీర్పు పై ఇల్యాసీ-అంజుల కుమార్తె హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. "నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రస్తుతానికి నన్ను నేను ఎక్కువగా వ్యక్తపరచుకోలేకపోతున్నాను. తీర్పు రావలసి ఉండటం వలన ఇన్ని రోజులు మేము మౌనం పాటించాము. మేము చాలా మథనపడ్డాము, నేను నా తండ్రిని ఇప్పటికీ/ఎప్పటికీ నమ్ముతాను." అని తెలిపింది.[27]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ కెనడా నుండి అంజు సోదరి భారతదేశం రావటంతో కథ మలుపు తిరిగినది (ఇండియా టుడే - 10 ఏప్రిల్ 2000)
- ↑ ఇల్యాసీపై ప్రయోగించబడిన ఐపీసీ సెక్షనులు 304బి, 498ఏ, 201 ల చట్టాలు, ఇల్యాసీ అరెస్టు (ట్రిబ్యూన్ ఇండియా - 29 మార్చి 2000)
- ↑ "విస్మరించబడటం వలనే కేసు కట్టిన రష్మి (తెహెల్కా - 2 ఏప్రిల్ 2005)". Archived from the original on 2015-05-21. Retrieved 2015-09-11.
- ↑ నా సోదరి రష్మి పన్నాగం పన్నినది - ప్రశాంత్ (ట్రిబ్యూన్ ఇండియా - 2 ఏప్రిల్ 2000)
- ↑ కోర్టు ఉత్తర్వులు లేనిదే ఆలియా సంరక్షణను తీసుకోబోనని స్పష్టం చేసిన రష్మి (ట్రిబ్యూన్ ఇండియా - 15 ఏప్రిల్ 2000)
- ↑ "ఇల్యాసీకి షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసిన ఢిల్లీ హై కోర్టు (ద హిందూ - 3 జూన్ 2000)". Archived from the original on 2015-09-19. Retrieved 2015-09-11.
- ↑ ఇల్యాసీ ఢిల్లీ బయటకి వెళ్ళటానికి అనుమతించిన కోర్టు (ట్రిబ్యూన్ ఇండియా - 30 మే 2001)
- ↑ సీబీఐతో విచారణ జరిపించాలన్న రుక్మా అప్పీలును తిరస్కరించిన కోర్టు (రెడిఫ్ - 5 ఆగష్టు 2005)
- ↑ పోస్టు మార్టం రిపోర్టు హత్య కాదని నిరూపించలేకపోయినదని తెలిపిన రుక్మా (టైమ్స్ ఆఫ్ ఇండియా - 20 ఆగష్టు 2010)
- ↑ ఇల్యాసీపై నిరాధార హత్య నేరారోపణలను తిరస్కరించిన కోర్టు (డి ఎన్ ఏ ఇండియా - 23 ఫిబ్రవరి 2011)
- ↑ క్రొత్తగా ఏర్పరచిన మెడికల్ బోర్డును విచారణ పూర్తి చేయమని చెప్పిన కోర్టు (టైమ్స్ ఆఫ్ ఇండియా - 13 ఆగష్టు 2014)
- ↑ ఇల్యాసీ వాదనను త్రోసిపుచ్చిన సుప్రీం కోర్టు (డి ఎన్ ఏ ఇండియా - 22 ఆగష్టు 2014)
- ↑ ఆరోపణలు నిజం (ద హిందూ - 16 డిసెంబరు 2017)
- ↑ జరిమానా, నష్టపరిహారం (ద టైంస్ ఆఫ్ ఇండియా - 20 డిసెంబరు 2017)
- ↑ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడమైనదని నిర్ధారించిన న్యాయస్థానం (న్యూ యార్క్ టైంస్ - 22 డిసెంబరు 2017)
- ↑ 10 ఏప్రిల్ 2009, టైమ్స్ ఆఫ్ ఇండియా
- ↑ 16 ఏప్రిల్ 2009, మిడ్ డే
- ↑ సయ్యద్ అహ్మద్ మక్దూం చివరి సందేశం యూట్యూబ్ లంకె
- ↑ సంఘ సంస్కరణ చేస్తున్నందుకు భారీ మూల్యాన్నే చెల్లించుకొన్నాను అని తెలిపిన ఇల్యాసీ (ద సండే గార్డియన్ - 26 జూన్ 2011)
- ↑ సహించేది, భరించేది కేవలం మహిళే అనేది దురభిప్రాయం అని తెలిపిన ఇల్యాసీ (డి డబ్ల్యు - 1 అక్టోబర్ 2012)
- ↑ ప్రమేయం లేని పోలీసు అధికారులు కూడా తన కేసులలో అనవసర జోక్యం కలుగజేసుకొంటున్నారని తెలిపిన ఇల్యాసీ (టైమ్స్ ఆఫ్ ఇండియా - 13 జనవరి 2013)
- ↑ ఈ కథ నా ఒక్కడిది కాదు అని తెలిపిన ఇల్యాసీ (టైమ్స్ ఆఫ్ ఇండియా - 6 మే 2013)
- ↑ వరకట్న వేధింపులు వాస్తవాలే, కానీ ఈ చట్టాల వలన అమాయక పురుషులు బలి కాకూడదన్న ఇల్యాసీ (సిడ్నీ మార్నింగ్ అవర్ - 10 ఏప్రిల్ 2012)
- ↑ ఇదంతా ఒక పీడకల అయితే బావుండును: ఇల్యాసీ (ట్రిబ్యూన్ ఇండియా - 18 మార్చి 2012)
- ↑ ఇల్యాసీ నేరస్థుడిగా నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేనందున అతడిని నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ హై కోర్టు: టైంస్ ఆఫ్ ఇండియా (6-అక్టోబరు-2018)
- ↑ తుది తీర్పుపై రుక్మా సింఘ్ అసంతృప్తి
- ↑ తన తండ్రిపై తనకు నమ్మకం ఉందని తెలిపిన ఆలియా