సెప్సిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెప్సిస్ లేదా సెప్టిసిమియా అంటే మానవ శరీరంలో రక్తం విషపూరితం కావడం ద్వారా కలిగే ప్రాణాంతక పరిస్థితి. ఇది సంక్రమణ (ఇన్ఫెక్షన్) కు శరీరం ప్రతిస్పందన, ఇది శరీర కణజాలాలు, అవయవాలకు గాయం అయినప్పుడు ఉత్పన్నమవుతుంది. సెప్సిస్ బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు (ఫంగస్) తో సహా అనేక జీవుల వల్ల వస్తుంది. ప్రాథమిక సంక్రమణ ఊపిరితిత్తులు, మెదడు, మూత్ర నాళాలు, చర్మం ఇంకా ఉదర అవయవాల ప్రదేశాలలో ఉంటుంది. సెప్సిస్ సాధారణంగా 50% ఊపిరితిత్తులలో సంక్రమణగా ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి చాలా చిన్న పిల్లలు, వృద్ధులు, క్యాన్సర్, మధుమేహం రోగులలోను, పెద్ద గాయం తగిలిన వారు, కాలిన గాయాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో ఎక్కువ కనపడుతుంది.

వ్యాధి కారణాలు, కారకాలు[మార్చు]

సెప్సిస్‌కు దారితీసే అంటువ్యాధులు సాధారణంగా బాక్టీరియా వలన ప్రబలుతాయి. అయితే శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్లు కూడా కారణం కావచ్చు. 1950 లలో వ్యాధి జనక క్రిమి నాశకాలు (యాంటీబయాటిక్స్) ప్రవేశపెట్టడానికి ముందు గ్రామ్-పాజిటివ్ బ్యాక్టీరియా సెప్సిస్‌కు ప్రధాన కారణం అనుకున్నారు. తర్వాత, 1960ల నుండి 1980ల వరకు గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా సెప్సిస్‌కు ప్రధాన కారణం అని, 1980ల తర్వాత, గ్రామ్-పాజిటివ్ బాక్టీరియాలో సాధారణంగా స్టెఫిలోకాక్ 50% కంటే ఎక్కువ సెప్సిస్ రోగులకు కారణమవుతుందని భావించారు. స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్ (Streptococcus pyogenes), ఎస్చెరిచియా కోలి (Escherichia coli), సూడోమోనాస్ ఎరుగినోసా (Pseudomonas aeruginosa), క్లేబ్సియెల్లా (Klebsiella) జాతులు ఇంకా ఇతర బ్యాక్టీరియా కూడా కారకాలుగా కనుగొన్నారు . సుమారు 5% తీవ్రమైన సెప్సిస్, సెప్టిక్ షాక్ రోగులలో ఫంగల్ సెప్సిస్ కారణం, ఇది ఈస్ట్ యొక్క కాండిడా జాతికి చెందిన సంక్రమణం. సెప్సిస్‌కు పరాన్నజీవులు కూడా అత్యంత సాధారణ కారకాలు ఉదా. ప్లాస్మోడియం (ఇది మలేరియాకు దారితీస్తుంది).

వ్యాధి సంకేతాలు, లక్షణాలు[మార్చు]

సెప్సిస్
Other namesసెప్టిసిమియా
సెప్సిస్ వలన చర్మము పైన వాపు, మచ్చలు
Specialtyసంక్రమణ వ్యాధి
బ్లడ్ ఇన్ఫెక్షన్
Symptomsఅసాధారణ శరీర ఉష్ణోగ్రత
పెరుగుతున్న హృదయ స్పందన
తక్కువ రక్త పోటు
పెరిగిన శ్వాస వేగం
మూత్రం తక్కువ ఉత్పత్తి
నొప్పి, గందరగోళ పరిస్థితి
తెల్ల రక్త కణాల సంఖ్య.
Complicationsప్రాణాంతక పరిస్థితి.
అవయవాలు పనిచేయని స్థితి
Typesసెప్సిస్, తీవ్రమైన సెప్సిస్ సెప్టిక్ షాక్.
Causesసంక్రమణ (ఇన్ఫెక్షన్)కు శరీర ప్రతిస్పందన
బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు (ఫంగస్)
పరాన్నజీవులు (parasites)
Risk factorsచిన్న పిల్లలు, వృద్ధులు
కాన్సర్, మధుమేహం
ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు
శరీర కణజాలాలు, అవయవాలకు గాయాలు
కాలిన గాయాలు
, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు
Diagnostic methodప్రాథమిక సంక్రమణ సాధారణంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్ర నాళాలు, చర్మం ఇంకా ఉదర అవయవాల ప్రదేశాలలో ఉంటుంది.
Preventionతీవ్రమైన సెప్సిస్ వలన సంభవించే మరణాలను తగ్గించడానికి ముందుగా రోగనిర్ధారణ చేసి, వేగంగా చికిత్సను ప్రారంభించడం కీలకం.
Treatmentఒక గంటలోపు వ్యాధి జనక క్రిమి నాశకాలు, రక్త సంవర్ధనాలు, లాక్టేట్ , హిమోగ్లోబిన్ నిర్ధారణ, మూత్ర విసర్జన పర్యవేక్షణ,
ప్రాణవాయువు, సిరలలోనికి ద్రవాలు పంపడం
3 గంటలలోపు యాంటీబయాటిక్స్ సిరలలోనికి ద్రవాలను ఇవ్వాలి.
రక్త సంవర్ధనాలు సేకరించాలి
రక్తపోటు రక్త సరఫరా పర్యవేక్షించాలి,
ఉదర ఎక్స్-రే లేదా CT స్కాన్‌, ఛాతీ ఎక్స్-రేలు
 వ్యాధి సోకిన అవయవాలకు శస్త్రచికిత్స, తగిన ఇతర చికిత్సలు చేయాలి
Deathsప్రతి 1000 మందికి 0.2 నుండి 3 మంది
మరణాలు 30%
తీవ్రమైన సెప్సిస్ 50%
సెప్టిక్ షాక్ 80%

సాధారణంగా సెప్సిస్ యొక్క ఈ ప్రారంభ దశ రోగనిరోధక వ్యవస్థను అణచివేయడంతో మొదలవుతుంది. అధిక వాపుతో వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణిస్తూ దీర్ఘకాలం కొనసాగవచ్చు.[1] సెప్సిస్‌లో జ్వరం అనేది సర్వసాధారణమైన లక్షణం. ఇంకా జ్వరం, పెరిగిన హృదయ స్పందన వేగము, పెరిగిన శ్వాస వేగము, స్పృహ స్థాయిలో మార్పు, గందరగోళ పరిస్థితి ఉంటుంది. నిర్దిష్ట సంక్రమణ లక్షణాలు అంటే న్యుమోనియాతో కూడిన దగ్గు లేదా మూత్రపిండాల సంక్రమణం (కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌) తో బాధాకరమైన మూత్రవిసర్జన వంటివి కూడా ఉండవచ్చు. చాలా చిన్నపిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ఈ నిర్దిష్ట సంక్రమణ లక్షణాలు ఉండకపోవచ్చు. మరోవైపు, ఏ సంక్రమణం లేని వ్యక్తులలో కూడా సంభవిస్తుంది, ఉదాహరణకు, కాలిన గాయాలు, పాలీట్రామా లేదా ప్యాంక్రియాటైటిస్, కెమికల్ న్యుమోనైటిస్‌ ప్రారంభ స్థితిలో ఉన్నవారిలో కూడా. తీవ్రమైన సెప్సిస్ లో అవయవ వైఫల్యం వలన అవయవాల పనితీరు బలహీనమైనముగా ఉండి రక్త ప్రవాహం సక్రమంగా జరగదు. అధిక రక్త చక్కెర. తక్కువ రక్తపోటు, సెప్టిక్ షాక్, రక్తంలో అధిక లాక్టికామ్లం, తక్కువ మూత్ర విసర్జన వంటి లక్షణాలు శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని సూచించుతాయి. ఇది ద్రవం భర్తీ తర్వాత కూడా మెరుగుపడదు.[2] సెప్సిస్‌లో కనిపించే రక్తపోటులో తగ్గుదల వలన కొంచెం తలనొప్పి లక్షణం కూడా కనపడవచ్చు. సెప్సిస్‌ సానుకూల SIRS ప్రమాణాలు, ఒక మోస్తరుగా సెప్సిస్‌కు సంభావ్యత ఉన్నట్టు సూచిస్తాయి. అవి - అసాధారణ శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన వేగం, శ్వాస తీసుకోవడంలో వేగం, లేదా తెల్ల రక్త కణాల సంఖ్య.

  • అసాధారణ శరీర ఉష్ణోగ్రత <36 0C (96.8 0F) లేదా 38 0C (100.4 0F)
  • హృదయ స్పందన వేగము >90/ని.
  • శ్వాసలో వేగము >20/ని.
  • తెల్ల రక్త కణాల సంఖ్య <4 X 109 /L (<4000/mm3), >12X 109/L (>12000/mm3 )
సెప్సిస్ దశలు: సెప్సిస్ దశల పురోగతిని బోధించే సాధనం

SIRS ప్రకారం, సెప్సిస్ వివిధ స్థాయిలలో కనపడుతుంది. సెప్సిస్, తీవ్రమైన సెప్సిస్, సెప్టిక్ షాక్.

  • సెప్సిస్ వ్యాధి సంక్రమణ ప్రక్రియకు ప్రతిస్పందనగా పేర్కొంటారు.
  • తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్-ప్రేరిత అవయవ పనిచేయకపోవడం లేదా కణజాల హైపోపెర్ఫ్యూజన్ (హైపోటెన్షన్, ఎలివేటెడ్ లాక్టేట్ లేదా తగ్గిన మూత్రవిసర్జనగా వ్యక్తీకరించడం) సెప్సిస్‌గా నిర్వచించబడింది. తీవ్రమైన సెప్సిస్ అనేది చాలా అవయవాలు పనిచేయని స్థితి (మల్టిపుల్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్) [2]తో సంబంధం ఉన్న ఒక అంటు వ్యాధి స్థితి.
  • సెప్టిక్ షాక్ అనేది తీవ్రమైన సెప్సిస్, సిరలలోనికి ద్రవాలు ఇచ్చినప్పటికీ, నిరంతరంగా తక్కువ రక్తపోటు .[2]

వ్యాధి నిర్ధారణ[మార్చు]

తీవ్రమైన సెప్సిస్ వలన సంభవించే మరణాలను తగ్గించడానికి ముందుగా రోగనిర్ధారణ చేసి, వేగంగా చికిత్సను ప్రారంభించడం కీలకం. ఈ వ్యాధి నియంత్రణ కొరకు వ్యాధి జనక క్రిమి నాశక ఔషదాలు (యాంటీబయాటిక్స్) ప్రారంభించే ముందు రక్త సంవర్ధనం (బ్లడ్ కల్చర్) చేయాలని సిఫార్సు చేస్తారు. సంక్రమణం సోకిన ప్రదేశం కనుగొనడానికి ప్రస్తుత పరిస్థితిని తెలుపు రేఖాపటము (మెడికల్ ఇమేజింగ్) సహాయపడుతుంది. ఇతర సంకేతాలు, లక్షణాల సంభావ్య కారణాలుగా అనాఫిలాక్సిస్, అడ్రినల్ లోపం, తక్కువ రక్త పరిమాణం, గుండె వైఫల్యాన్ని చెప్పవచ్చు.

రక్త సంవర్ధనం (బ్లడ్ కల్చర్) సీసాలు: వాయురహితులకు (యానోరొబ్స్) నారింజ రంగు మూత, వాయుహితులకు (ఏరోబ్స్) కోసం ఆకుపచ్చ రంగు మూత పిల్లల రక్త నమూనాల కోసం పసుపు రంగు మూత[3]

సెప్సిస్ వ్యాధి అనుమానము ఉన్నప్పుడు, మొదటి మూడు గంటల్లో, రోగనిర్ధారణ కొరకు తెల్ల రక్త కణాల సంఖ్య, సీరం లాక్టేట్‌ కొలతను, వ్యాధి జనక క్రిమి నాశక మందులు ప్రారంభించే ముందు తగిన రక్త సంవర్ధనం వివరాలను సేకరించాలి. ఇన్ఫెక్షన్ యొక్క ఇతర మూలాలు అనుమానించ తగినట్లయితే, మూత్రం, మెదడు వెన్నెముక నుండి (సెరెబ్రోస్పైనల్ ) స్రావాలు, గాయాలు లేదా శ్వాసకోశ స్రావాల సంవర్ధనాలను కూడా సేకరించాలి. ఆరు గంటలలోపు, ప్రారంభ ద్రవాల పునరుజ్జీవనం ఉన్నప్పటికీ రక్తపోటు లేదా ప్రారంభ లాక్టేట్ తక్కువగా ఉంటే, కేంద్ర సిరల ఒత్తిడి, కేంద్ర సిర ప్రాణవాయు సంతృప్తతను కొలవాలి. ప్రారంభ లాక్టేట్ పెరిగినప్పటికీ లాక్టేట్ మళ్లీ కొలవాలి. పన్నెండు గంటలలోపు, ఏదైనా సంక్రమణ మూలాన్ని నిర్ధారించడం లేదా మినహాయించడం చాలా అవసరం. ఉదర ఎక్స్-రే లేదా CT స్కాన్‌, ఛాతీ ఎక్స్-రేలు సంక్రమణ ఉనికిని సూచించవచ్చు.[4]

జీవ సంబంధిత గుర్తులు (బయోమార్కర్లు) సెప్సిస్ రోగనిర్ధారణకు ఉనికి లేదా తీవ్రతను గుర్తించడములో సహాయపడతాయి. యురోకినేస్-రకం ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ రిసెప్టర్ (SuPAR) అను బయో మార్కర్ అధిక స్థాయిలు ఉన్నవారిలో సెప్సిస్ మరణాల పెరుగుదల ఎక్కువ ఉంటోంది. లాక్టేట్ స్థాయిల కొలత సుమారు ప్రతి 4 నుండి 6 గంటలకు ఒక సారి, క్రమంగా తీసుకున్నప్పుడు అది చికిత్సకు సహాయకారిగా ఉంటుంది. ఈ విధంగా సెప్సిస్‌లో మరణాలతో తగ్గించవచ్చు.[5]

నవజాత శిశువులలో మొదటి నెలలో సెప్సిస్ (నియోనాటల్ సెప్సిస్) అనేది మెనింజైటిస్, న్యుమోనియా, పైలోనెఫ్రిటిస్, లేదా గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి బాక్టీరియల్ రక్త ప్రవాహ సంక్రమణను సాధారణంగా సూచిస్తుంది, అయితే శిలీంధ్రాలు, వైరస్‌లు లేదా సంక్రమణ వల్ల కూడానియోనాటల్ సెప్సిస్ కావచ్చు.

చికిత్స, సంరక్షణ[మార్చు]

ఇంట్రావీనస్ ద్రవాలు ఇవ్వబడతాయి

వ్యాధిని ముందుగా గుర్తించడము కేంద్రీకృత నిర్వహణ సెప్సిస్‌లో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. దీని కోసం గుర్తించిన ఒక గంటలోపు వ్యాధి జనక క్రిమి నాశక ఔషదాలు, రక్త సంవర్ధనాలు, లాక్టేట్, హిమోగ్లోబిన్ నిర్ధారణ, మూత్ర విసర్జన పర్యవేక్షణ, అధిక-ప్రవాహ ప్రాణవాయువును, సిరలలోనికి ద్రవాలు పంపడం అవసరం. మొదటి మూడు గంటలలోపు వ్యాధి జనక క్రిమి నాశక ఔషదాలు సిరలలోనికి (ఇంట్రావీనస్) ద్రవాలుగా ఇవ్వాలి. తక్కువ రక్తపోటు లేదా అవయవాలకు సరిపడని రక్త సరఫరా (లాక్టేట్ యొక్క పెరిగిన స్థాయికి రుజువు) ఉన్నట్లు రుజువులు ఉంటే; రక్త సంవర్ధనాలు కూడా ఈ సమయంలో సేకరించాలి . రక్తపోటు, అవయవాలకు రక్త సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలి, లాక్టేట్ ప్రారంభంలో పెరిగినట్లయితే మళ్లీ కొలవాలి. ఆరు గంటల తర్వాత రక్తపోటు తగినంతగా ఉండాలి.

సెప్సిస్‌కు సిరల (రక్తనాళాలు) ద్వారా ద్రవాలు, సూక్ష్మజీవుల నాశన కారులు, నిరోధకాలు (యాంటీమైక్రోబయాల్స్‌) వంటి మందులతో తక్షణ చికిత్స అవసరం. ఈ సంరక్షణ తరచుగా అత్యవసర చికిత్సా విభాగము (ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌) లో కొనసాగుతుంది. రక్తపోటును పెంచడానికి ద్రవాల భర్తీ సరిపోకపోతే, మందుల వాడకం అవసరం అవుతుంది. పీల్చే గాలి యాంత్రిక ప్రసారము (మెకానికల్ వెంటిలేషన్), రక్త శుద్ధి (డయాలసిస్) ప్రక్రియల ద్వారా ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. రక్తప్రవాహాన్ని అందుకోడానికి, చికిత్సకు వీలుగా కేంద్ర సిరల, ధమనుల కాథెటర్‌ను (ఆహారము, ద్రవాలు పంపేందుకు ఉపయోగించే గొట్టం) ఉంచుతారు. సెప్సిస్‌తో బాధపడుతున్న వ్యక్తుల సిరలలో రక్తం గడ్డకట్టడం, ఒత్తిడి లేదా పీడనం వలన ఏర్పడిన పుండ్లు కోసం నివారణ చర్యలు అత్యవసరం. ఇన్సులిన్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం జరగాలి. కార్టికోస్టెరాయిడ్స్ వినియోగం కొంతమంది రోగులలో ప్రయోజనాన్ని ప్రయోజనం కలగచేస్తున్నా, సాధారణ వాడకం మాత్రం వివాదాస్పదంగా ఉంది.

ద్రవపదార్థాలు, యాంటీబయాటిక్స్ సకాలంలో అందించడమే కాకుండా, సెప్సిస్ వ్యాధి సోకిన ద్రవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, అవయవాలు పనిచేయకపోతే తగిన చికిత్స చేయాలి. ఇందులో కిడ్నీ ఫెయిల్యూర్‌లో హీమోడయాలసిస్, ఊపిరితిత్తుల పనిచేయకపోవడంలో యంత్రాల సహాయంతో ప్రాణవాయువు ప్రసారం, రక్త ఉత్పత్తుల మార్పిడి, ప్రసరణ వైఫల్యానికి మందులు, ద్రవ్యాలతో చికిత్స వంటివి ఉండవచ్చు. దీర్ఘకాల అనారోగ్యం సమయంలో పోషకాహారాన్ని తగినంతగా ప్రేగులలోనికి ఆహారం పంపడం (ఎంటరల్ ఫీడింగ్), అవసరమైతే, సిరల ద్వారా పోషక పదార్ధాలను (పేరెంటరల్ న్యూట్రిషన్) పంపడం ఏంతో ముఖ్యమైనది.[4] సిరలలో రక్తం గడ్డకట్టడం (డీప్ వెయిన్ థ్రాంబోసిస్), పొట్టలో పుండ్లు (గ్యాస్ట్రిక్ అల్సర్‌లను) నివారించడానికి మందులు ఉపయోగించుతారు.[4]

వాసోప్రెసర్లు (vasopressors) : వ్యక్తికి తగినంత ద్రవం పునరుజ్జీవింపబడినప్పటికీ, సగటు ధమనుల పీడనం 65 కంటే ఎక్కువ లేకపోతే mmHg, వాసోప్రెసర్లు సిఫార్సు చేస్తారు. నోర్‌పైన్‌ఫ్రైన్ (నోరాడ్రినలిన్) ఔషధాన్ని ప్రారంభంగా ఇస్తారు. సెప్టిక్ షాక్ సమయంలో వాసోప్రెసర్ థెరపీని ప్రారంభిస్తారు.[6] ఇన్ఫెక్టివ్ మూలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్సా విధానాలు అవసరమయితే సెప్సిస్ ఉన్న వ్యక్తులకు సాధారణ అనస్థీషియా ఇస్తారు.

చరిత్ర, అవగాహన[మార్చు]

క్రీ. పూ. 4వ శతాబ్దంలో "σήψις" (సెప్సిస్) అనే పదాన్ని హిప్పోక్రేట్స్ ప్రవేశపెట్టారు. ఇది సేంద్రీయ పదార్థం క్షయం అవడం లేదా కుళ్ళిపోయే ప్రక్రియను సూచిస్తుంది. పదకొండవ శతాబ్దంలో, అవిసెన్నా తీవ్రమైన చీముపట్టే (ప్యూరెంట్) ప్రక్రియతో ముడిపడి ఉన్న వ్యాధులకు "రక్తం (Blood) రాట్" అనే పదాన్ని ఉపయోగించారు. శరీరం తీవ్రమైన విషపూరిత స్థితి గమనించబడినప్పటికీ, ఈ పరిస్థితికి, 19వ శతాబ్దంలో మాత్రమే నిర్దిష్ట పదం "సెప్సిస్"ను ఉపయోగించారు.

"సెప్టిసిమియా", "సెప్టిసిమియా", "బ్లడ్ పాయిజనింగ్" అనే పదాలు రక్తంలోని సూక్ష్మజీవులు లేదా వాటి విషపదార్థాలను సూచిస్తాయి. 2013 వరకు USలో వాడుకలో ఉన్న ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అండ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ (ICD) వెర్షన్ 9, "స్ట్రెప్టోకోకల్ సెప్టిసిమియా" వంటి విభిన్న రోగ నిర్ధారణల కోసం అనేక మాడిఫైయర్‌లతో సెప్టిసిమియా అనే పదాన్ని ఉపయోగించింది. "స్ట్రెప్టోకోకస్ కారణంగా వచ్చే సెప్సిస్" వంటివి ICD-10లో మళ్లీ ఆ మాడిఫైయర్‌లతో ఆ నిర్ధారణలన్నీ సెప్సిస్‌గా మార్చబడ్డాయి.[7]

19వ శతాబ్దం చివరి నాటికి, సూక్ష్మజీవులు క్షీరదాల శరీరాల (హోస్ట్‌) ను గాయపరిచే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని, ఇన్‌ఫెక్షన్ సమయంలో విడుదలయ్యే కరిగే (టాక్సిన్‌) విషపదార్ధాలు తీవ్రమైన సంక్రమణ సమయంలో సాధారణ జ్వరం, ఇంకా షాక్‌కు కారణమవుతాయని గ్రహింపబడింది.

వ్యాధి తీవ్రత అనుసరించి ఫలితం ఉంటుంది.[8] సెప్సిస్ రోగులలో సుమారు 24.4% మందికి ప్రాణాంతకం అని, 34.7% మంది వ్యక్తులలో 30 రోజులలోపు (32.2%, 38.5% 90 రోజుల తర్వాత) ప్రాణాంతకం అవుతుంది అని కనుగొన్నారు. లాక్టేట్ అనేది 4 mmol/L కంటే ఎక్కువ స్థాయిని కలిగి ఉన్న వారితో  మరణాలు 40%, 2 mmol/L కంటే తక్కువ స్థాయి మరణాలు 15% కంటే తక్కువ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రతి సంవత్సరం 1000 మందికి సుమారుగా 0.2 నుండి 3 మంది వ్యక్తులు సెప్సిస్ ద్వారా ప్రభావితమవుతున్నారు, సెప్సిస్ నుండి మరణించే ప్రమాదం 30% వరకు ఉంటుంది, అయితే తీవ్రమైన సెప్సిస్ పరిస్థితిలో ఇది 50%, సెప్టిక్ షాక్ కు లోనైన వారిలో 80% వరకు ఉంటుంది.[8][9][10]

సెప్సిస్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సెప్సిస్ యొక్క కొత్త కేసుల సంఖ్య సంవత్సరానికి 18 మిలియన్ కేసులుగా అంచనా వేయబడింది. 2013లో అమెరికాలో దాదాపు 1.3 మిలియన్ల మంది ఆసుపత్రిలో చేరిన వారి కోసం మొత్తం $23.6 బిలియన్ల ఖర్చుతో సెప్సిస్ అత్యంత ఖరీదైన వ్యాధిగా పరిగణింపబడింది. 2017లో సెప్సిస్ ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది, 11 మిలియన్ల మరణాలు (ప్రపంచవ్యాప్తంగా 5 మరణాలలో 1 సెప్సిస్ వలన) నమోదయ్యాయి.[11] అమెరికాలో సెప్సిస్ 1,000 మందిలో 3 మందిని ప్రభావితం చేస్తోంది. తీవ్రమైన సెప్సిస్ సంవత్సరానికి 200,000 కంటే ఎక్కువ మరణాలకు దారితీస్తోంది.

సెప్సిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రచారం చేయడానికి తద్వారా సెప్సిస్‌ ఫలితాలను మెరుగుపరచడానికి " సర్వైవింగ్ సెప్సిస్ క్యాంపెయిన్ " ( "Surviving Sepsis Campaign") పేరుతో ఒక పెద్ద అంతర్జాతీయ సహకార సంస్థ 2002 లో స్థాపించబడింది. తీవ్రమైన సెప్సిస్ నిర్వహణ వ్యూహాల యొక్క సాక్ష్యం-ఆధారిత సమీక్షను (an evidence-based review of management strategies for severe sepsis) ఈ సంస్థ ప్రచురించింది, తదుపరి సంవత్సరాల్లో పూర్తి మార్గదర్శకాలను ప్రచురించే లక్ష్యంతో. 2016లో [12], మళ్లీ 2021లో [13] మార్గదర్శకాలు నవీకరించబడ్డాయి.  

అదనపు వ్యాసాలు, లంకెలు[మార్చు]

  • SIRS, Sepsis, and Septic Shock Criteria Archived 17 ఫిబ్రవరి 2015 at the Wayback Machine
  • "Sepsis". MedlinePlus. U.S. National Library of Medicine.
  • Gyawali B, Ramakrishna K, Dhamoon AS. Sepsis: The evolution in definition, pathophysiology, and management. SAGE Open Med. 2019 Mar 21;7:2050312119835043. doi: 10.1177/2050312119835043. PMID 30915218; PMCID: PMC6429642.
  • Jarczak D, Kluge S, Nierhaus A. Sepsis-Pathophysiology and Therapeutic Concepts. Front Med (Lausanne). 2021 May 14;8:628302. doi: 10.3389/fmed.2021.628302. PMID 34055825; PMCID: PMC8160230.
  • Thompson, Kelly, Balasubramanian Venkatesh, Finfer, Simon. Sepsis and septic shock: current approaches to management. Internal Medicinal Journal. 49/2. 12 February 2019. https://doi.org/10.1111/imj.14199
  • Pant, A., Mackraj, I. & Govender, T. Advances in sepsis diagnosis and management: a paradigm shift towards nanotechnology. J Biomed Sci 28, 6 (2021). https://doi.org/10.1186/s12929-020-00702-6
  • Edward J Septimus, Sepsis Perspective 2020, The Journal of Infectious Diseases, Volume 222, Issue Supplement_2, 15 August 2020, Pages S71–S73, https://doi.org/10.1093/infdis/jiaa220
  • Sepsis: What you need to know. Medical News Today. https://www.medicalnewstoday.com/articles/305782

ప్రస్తావనలు[మార్చు]

  1. (October 2019). "Pathological alteration and therapeutic implications of sepsis-induced immune cell apoptosis".
  2. 2.0 2.1 2.2 (February 2013). "Surviving sepsis campaign: international guidelines for management of severe sepsis and septic shock: 2012".
  3. "Blood Culture Collection" (PDF). WVUH Laboratories. 7 April 2012. Retrieved 23 March 2020.
  4. 4.0 4.1 4.2 (February 2013). "Surviving sepsis campaign: international guidelines for management of severe sepsis and septic shock: 2012".
  5. (July 2013). "Early recognition and management of sepsis in adults: the first six hours".
  6. (October 2014). "Early versus delayed administration of norepinephrine in patients with septic shock".
  7. "Understand How ICD-10 Expands Sepsis Coding – AAPC Knowledge Center". AAPC (in అమెరికన్ ఇంగ్లీష్). 8 April 2011. Retrieved 2020-02-06.
  8. 8.0 8.1 (June 2012). "Assessing available information on the burden of sepsis: global estimates of incidence, prevalence and mortality".
  9. (April 2016). "Varying Estimates of Sepsis Mortality Using Death Certificates and Administrative Codes--United States, 1999-2014".
  10. (October 2016). "Ending preventable maternal and newborn deaths due to infection".
  11. (January 2020). "Global, regional, and national sepsis incidence and mortality, 1990-2017: analysis for the Global Burden of Disease Study".
  12. (March 2017). "Surviving Sepsis Campaign: International Guidelines for Management of Sepsis and Septic Shock: 2016".
  13. (November 2021). "Surviving Sepsis Campaign: International Guidelines for Management of Sepsis and Septic Shock 2021".
"https://te.wikipedia.org/w/index.php?title=సెప్సిస్&oldid=4076052" నుండి వెలికితీశారు