సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | செம்மங்குடி ஸ்ரீநிவாஸ ஐயர் |
జననం | తిరుక్కోడివల్, తంజావూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, భారతదేశం | 1908 జూలై 25
మరణం | 2003 అక్టోబరు 31 మద్రాసు, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం | (వయసు 95)
సంగీత శైలి | కర్ణాటక సంగీతము |
వృత్తి | కర్ణాటక సంగీత గాయకుడు |
సెమ్మంగుడి రాధాకృష్ణ శ్రీనివాస అయ్యర్ (తమిళం: செம்மங்குடி ராதாக்ருஷ்ண ஸ்ரீநிவாஸ ஐயர்) (25 జూలై 1908 – 31 అక్టోబర్ 2003) కర్ణటక సంగీత గాత్ర కళాకారుడు (గాయకుడు). సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం 1947లో స్వీకరించి ఆ పురస్కారం పొందినవారిలో అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సాధించారు,[1] భారతప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్, [2] సంగీత నాటక అకాడమీ పురస్కారం (1953), తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇసై పెరరిఙ్గర్ and మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ సహా అనేక ఇతర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. శిష్యులు ఆయనను ఆప్యాయంగా "సెమ్మంగుడి మామ" అని పిలుచుకుంటూంటారు.[3] ఆయనను ఆధునిక కర్ణాటక సంగీత పితామహునిగానూ, ఆద్యునిగానూ భావిస్తూంటారు. 1979లో కేరళ విశ్వవిద్యాలయం నుంచి సెమ్మంగుడ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.[4]
తొలినాళ్ళ జీవితం, అభ్యాసం
[మార్చు]తంజావూరు జిల్లా తిరుక్కోడిక్కావల్ గ్రామంలో రాధాకృష్ణ అయ్యర్, ధర్మసంవర్ధిని అమ్మాళ్ దంపతుల మూడవ కుమారునిగా శ్రీనివాస అయ్యర్ జన్మించారు. నాలుగేళ్ళ వయసు వరకూ ఆయన మేనమామ వయొలిన్ విద్వాంసుడైన తిరుక్కోడిక్కావల్ కృష్ణ అయ్యర్ వద్ద పెరిగారు, కృష్ణ అయ్యర్ మరణానంతరం తిరువారూర్ జిల్లాలోని సెమ్మంగుడి వద్దకు తిరిగివచ్చారు. ఎనిమిదేళ్ళ వయసు నుంచి ఆయనకు వరుసకు అన్నయ్య అయిన సెమ్మంగుడి నారాయణస్వామి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత గొట్టువాద్యం విద్వాంసుడు తిరువిడైమరుతూర్ సఖరామారావు వద్ద కఠినమైన శిక్షణ తీసుకున్నారు, ఇదే సెమ్మంగుడి తన సంగీత జీవితంలో మలుపుతిప్పిన ఘటనగా భావిస్తారు. దీని వెంటనే వర్ణాలు, కృతుల్లో శ్రీనివాస అయ్యర్, నారాయణస్వామి అయ్యర్ వద్ద అభ్యాసం ఆరంభించారు. ఆపైన కర్ణాటక సంగీత రంగంలో ప్రఖ్యాతులైన రాజపురం విశ్వనాథ అయ్యర్ వద్ద శిష్యరికం ప్రారంభించారు. 1926లో కుంభకోణంలో ఆయన మొట్టమొదటి సంగీత ప్రదర్శన ప్రారంభించారు.[5] 1927లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభల్లో కచేరీ చేశారు, ఈ కచేరీతో ఆయన ఆ కాలపు పెద్ద విద్వాంసుల సరసన హఠాత్తుగా చేరినట్టైంది, సెమ్మంగుడి తన జీవితంలో దీన్ని మరో మలుపుగా పేర్కొంటారు. సెమ్మంగుడి అత్యంత సృజనాత్మకత, విపరీతమైన సనాతన భావాల సమ్మిశ్రమంగా అపురూపమైన సంగీతాన్ని తన అవిధేమైన స్వరంలోనే పలికించేవారు.
మహారాజా స్వాతి తిరునాళ్ రామవర్మ కృతులను స్వరపరచడానికి హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్ తో పాటుగా సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కృషిచేశారు.[5] 1934లో ఆయన చేసిన ఒకానొక కచేరీకి తిరువితాంకూరు (ట్రావెన్కోర్) మహారాణి సేతు పార్వతీబాయి హాజరైనప్పుడు ఆయన ప్రతిభ, విద్వత్తులు ఎంతగానో ఆకట్టుకోవడంతో సెమ్మంగుడిని తిరువనంతపురం ఆహ్వానించి స్వాతి తిరునాళ్ కృతులను స్వరపరచడం, వాటికి సంపాదకత్వం వహించడం, ప్రాచుర్యం తీసుకురావడం వంటివి చేయమని కోరారు. ఆయన హరికేసనల్లుర్ ముత్తయ్య భాగవతర్ నుంచి తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాల ప్రధానాచార్య పదవిని స్వీకరించి 23 సంవత్సరాల పాటు నిర్వహించారు. 55 సంవత్సరాల వయసు వరకూ నిర్వహించిన ఆ ఉద్యోగాన్ని మరో కర్ణాటక సంగీత దిగ్గజం జి.ఎన్.బాలసుబ్రమణియం. భారత ప్రభుత్వ ఉత్తర్వుతో 1957 నుంచి 1960 వరకూ ఆలిండియా రేడియో కర్ణాటక సంగీతపు ప్రధాన నిర్మాత అయ్యారు. తర్వాతికాలంలో కచేరీలు, యువకళాకారులకు సంగీత పాఠాలు వంటివాటిపైనే దృష్టిపెట్టారు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన కచేరీలు చేశారు.
కచేరీ ప్రదర్శనలు
[మార్చు]సెమ్మంగుడి కచేరీల్లో పరిణతి చెందిన విద్వాంసునిగా విస్తృతంగా పేరొందారు. కృతులు, రాగాలు, కాలవ్యవధి వంటివాటితో సహా క్షుణ్ణంగా ప్రణాళికవేసుకుని కచేరీ చేస్తారని పేరుపొందారు. కీర్తనలో మనోధర్మాన్ని ప్రవేశపెట్టి, నెరువులు వేస్తూ అభివృద్ధి చేయడంలో ఆయన నిష్ణాతులు.
సంగీత రసజ్ఞులకు అనేక కారణాల వల్ల ఆయన కచేరీలు గుర్తుండిపోయాయి. వాటిలో అత్యంత ప్రధానమైనవి కృతుల ఎంపిక, స్వరాలాపనలో వేగం, ఎంపిక, వేగం వంటివాటిని భక్తితో కలపడం. ఆయన కచేరీల్లో చలోక్తులు, హాస్యోక్తులు జోరుగా సాగేవి, వాటిని శ్రోతలు తరచు తలచుకుంటూంటారు. ఆయన గాత్రానికి తోడుగా పక్కవాద్యాల్లో కచేరీలను విజయవంతం చేసిన కొందరు వయొలిన్, మృదంగం వాద్యకారుల్లో ఉమయాళ్పురం కె. శివరామన్, లాల్గుడి జయరామన్, టి.రుక్మిణి నాగర్కోయిల్ ఎస్. గణేశయ్యర్, తిరుచి శంకరన్, గురువాయూర్ దొరై, వెల్లూర్ జి.రామభద్రన్, పాల్గాట్ మణి అయ్యర్ వంటివారు ఉన్నారు. సెమ్మంగుడి గాత్రంలో శ్రీరంజని రాగంలోని మరుబల్క కీర్తన బాగా ప్రాచుర్యం పొందింది.
పరిశోధన
[మార్చు]ప్రముఖ వాగ్గేయకారుడు, ట్రావెన్కోర్ సంస్థానాధీశుడు స్వాతి తిరునాళ్ సంగీతాన్ని, సాహిత్యాన్ని గురించి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన కృతులను పరిష్కరించి ప్రచురించారు. ఈ పరిశోధన తర్వాత స్వాతి తిరునాళ్ సంగీతం కర్ణాటక సంగీత ప్రపంచంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.[6]
కంఠస్వరం
[మార్చు]కర్ణాటక సంగీతంలోని ప్రతి ప్రాముఖ్యం కలిగిన గాయకుడూ ధీర గంభీరమైన కంఠస్వరంతో పాడేందుకు ప్రయత్నిస్తున్న కాలంలో సెమ్మంగుడి అస్వాభావికంగా ముక్కుతో పాడే లక్షణంతో ప్రాచుర్యం పొందారు.[7] ఆయన యువకునిగా ఉన్నరోజుల్లో, ప్రఖ్యాత కంజీరా విద్వాంసుడు దక్షిణామూర్తి పిళ్ళై సెమ్మంగుడి గురువు, అన్నతో, "కొబ్బరి చిప్పను రాతిపై గీస్తే ఏమాత్రం మాధుర్యంగా ఉంటుందో అతని స్వరం అంతే మాధుర్యంగా ఉంది. గాత్రంలో ఇతనికి అభ్యాసమిచ్చే శ్రమ తీసుకోవద్దు. వయొలిన్ వాయించడం నేర్పండి" అన్నాడు.[8] అలాంటి విమర్శలు ఎదురైనా, సెమ్మంగుడి తన గాత్రాన్ని మెరుగుపరచుకునేందుకు తీవ్రంగా శ్రమించి, కఠోరమైన అభ్యసం చేశారు. చివరకు సంగీతం పట్ల ఆయనకున్న సహజ ప్రతిభ అతని కంఠస్వరంలోని లోపాన్ని జయించింది, ఆయన స్వరం కర్ణాటక సంగీత ప్రపంచంలో కొత్త పద్ధతిగా రూపొందింది.
ఆయన గానశైలిని విస్తారంగా అనుసరిస్తున్నారు. పలువురు ప్రఖ్యాతులైన ఆయన శిష్యుల్లో: సంగీత కళానిధి పురస్కృతులు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి, ఆమె సవతి కూతురు రాధ విశ్వనాథన్, టి.ఎం.త్యాగరాజన్, సుగుణ పురుషోత్తమన్, వయొలిన్ విద్వాంసుడు ఆచార్య టి.ఎన్.కృష్ణన్ మొదలైన వారు ఉన్నారు. పాలై సి.కె.రామచంద్రన్, సీతా రాజన్, మావేలిక్కర ప్రభాకర వర్మ, ఆచార్య కుమార కేరళ వర్మ, కె. జె. ఏసుదాసు, పి.ఎస్.నారాయణస్వామి, వి.సుబ్రమణియం, కె.ఆర్. కేదారనాథన్, కదయనల్లూర్ వెంకటరామన్, వి.ఆర్.కృష్ణన్, సీతాలక్ష్మి వెంకటేశన్, రాధా నంబూద్రి, విశాలాక్షి శ్రీరామచంద్రన్, టి.ఎం.కృష్ణ వంటి విద్వాంసులు ఆయన వద్ద ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.
కుటుంబం
[మార్చు]చిన్న వయసులోనే, తయ్యు అమ్మాళ్ తో ఆయనకు వివాహమైంది.
- కొడుకులు – స్వామినాథన్, గోపాలస్వామి, రాధాకృష్ణన్
- కుమార్తెలు – శాంత, ధర్మ.
- మనవలు – జయరామన్, హరిహరన్, శ్రీరామన్, లక్ష్మణన్, యోగ, బాల, పద్మ, ఆనంది, శంకర్, జయశ్రీ, శ్రీనివాస్, వివేకానందన్, విద్య, జగన్నాథ్
మూలాలు
[మార్చు]- ↑ "Article by Mohan Ayyar". Archived from the original on 2015-09-23. Retrieved 2015-10-18.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
- ↑ "Article-The Hindu". Archived from the original on 2003-11-20. Retrieved 2015-10-18.
- ↑ "D.Litt for Yesudas after Muthia and Semmangudi from Kerala University". The Hindu. Chennai, India. 29 March 2003. Archived from the original on 1 అక్టోబరు 2013. Retrieved 18 అక్టోబరు 2015.
- ↑ 5.0 5.1 "The Hindu-Article". Archived from the original on 2007-02-25. Retrieved 2015-10-18.
- ↑ హెచ్., రమేష్ బాబు (16–31 జూలై 2002). "స్వాతి తిరునాళ్ కీర్తనలు ప్రాచుర్యంలోకి తెచ్చిన సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్". హాసం-హాస్య సంగీత పత్రిక. 1 (20): 30.
{{cite journal}}
: CS1 maint: date format (link) - ↑ "Interview in Frontline, Issue Dated 24-Oct-1998". Archived from the original on 2005-01-20. Retrieved 2015-10-18.
- ↑ "Article -The Hindu". Archived from the original on 2007-02-25. Retrieved 2015-10-18.
- Articles containing Tamil-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1908 జననాలు
- 2003 మరణాలు
- కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు