సోహన్ సింగ్ భక్నా
సోహన్ సింగ్ భక్నా | |
---|---|
జననం | ఖుత్రాయ్ ఖుర్ద్, అమృత్‌సర్ జిల్లా | 1870 జనవరి 22
మరణం | 1968 డిసెంబరు 21 | (వయసు 98)
గదర్ పార్టీ, అఖిల భారత కిసాన్ సభ, భారత కమ్యూనిస్టు పార్టీ. | |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమం, 1907 పంజాబు ఆందోళన, గదర్ కుట్ర |
బాబా సోహన్ సింగ్ భక్నా (1870 జనవరి 22 - 1968 డిసెంబరు 21) [1] భారతీయ విప్లవకారుడు , గదర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను 1915 గదర్ కుట్రలో పాల్గొన్న బృందంలో ప్రముఖ సభ్యుడు. లాహోర్ కుట్ర విచారణలో అతనిపై విచారణ జరిపి, జైలుశిక్ష విధించారు. 1930 లో విడుదలయ్యే ముందు కుట్రలో పాల్గొన్నందుకు గాను సోహన్ సింగ్ పదహారు సంవత్సరాల ఖైదు అనుభవించాడు. తరువాత అతను భారతీయ కార్మిక ఉద్యమంలో పనిచేశాడు. భారతీయ కిసాన్ సభ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు గణనీయమైన సమయాన్ని కేటాయించాడు.
తొలి జీవితం
[మార్చు]సోహన్ సింగ్ 1870 జనవరి 22 న అమృత్ సర్‌కు ఉత్తరాన ఉన్న ఖుట్రాయ్ ఖుర్ద్ గ్రామంలో జన్మించాడు. ఇది అతని తల్లి రామ్ కౌర్ పుట్టినిల్లు. తండ్రి భాయ్ కరం సింగ్ అమృత్ సర్ కి నైరుతి దిశలో 16 కి.మీ. దూరంలో ఉన్న భక్నా గ్రామంలో నివసించేవాడు. సోహన్ సింగ్, బాల్యాన్ని భక్నాలో గడిపాడు. అక్కడి గురుద్వారా లోను, ఆర్య సమాజ్ లోనూ ప్రాథమిక విద్య నేర్చుకున్నాడు. చిన్న వయస్సులోనే పంజాబీ భాషలో చదవడం, రాయడం నేర్చుకున్నాడు. హిందూ, సిక్కు సంప్రదాయాల మూలాలగురించి కూడా తెలుసుకున్నాడు. సోహన్ సింగ్ కు పదేళ్ల వయసులో లాహోర్ సమీపంలోని భూస్వామి ఖుషాల్ సింగ్ కుమార్తె బిషన్ కౌర్‌తో పెళ్ళి జరిగింది. 1896 లో పదహారేళ్ల వయసులో సోహన్ సింగ్ ప్రాథమిక పాఠశాలను పూర్తి చేశాడు. అప్పటికి అతను ఉర్దూ, పర్షియన్ భాషలలో కూడా నిష్ణాతుడయ్యాడు.
సోహన్ సింగ్ 1900 లలో పంజాబ్‌లో ఉద్భవించిన జాతీయ ఉద్యమంలో, రతుల అందోళనలో పాల్గొన్నాడు. 1906-07లో వలసవాద వ్యతిరేక బిల్లు కోసం జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు. రెండు సంవత్సరాల తరువాత, 1909 ఫిబ్రవరిలో, అతను అమెరికా బయలుదేరాడు. రెండు నెలల ప్రయాణం తరువాత సింగ్, 1909 ఏప్రిల్ 4 న సీటెల్ చేరుకున్నాడు.
అమెరికాలో
[మార్చు]సియాటిల్ నగరానికి సమీపంలో నిర్మిస్తున్న కలప మిల్లులో సోహన్ సింగ్ కూలీగా చేరాడు. 1900 ల మొదటి దశాబ్దంలో, ఉత్తర అమెరికాలోని పసిఫిక్ తీరానికి పెద్ద ఎత్తున భారతీయులు వలస వెళ్ళారు. వలస వచ్చినవారిలో అధిక శాతం మంది ప్రధానంగా ఆర్థిక మాంద్యం, వ్యవసాయ అశాంతిని ఎదుర్కొంటున్న పంజాబ్ నుండి వెళ్ళినవాళ్ళే. కెనడాలో దక్షిణ ఆసియన్ల ప్రవేశాన్ని పరిమితం చేయడానికి, అప్పటికే దేశంలో ఉన్నవారి రాజకీయ హక్కులను పరిమితం చేయడానికీ కెనడా ప్రభుత్వం అనేక శాసనాలు చేసింది. పంజాబీ కమ్యూనిటీ ఇంతవరకు బ్రిటిషు సామ్రాజ్యానికి కామన్వెల్త్‌లకు విధేయంగా ఉండేది. బ్రిటిషు ప్రభుత్వం, కామన్వెల్త్ ప్రభుత్వాల నుండి తమపట్ల నిబద్ధతను చూపి, తమకు సమాన స్వాగత హక్కులను ఇచ్చి గౌరవించాలని ఆ సమాజం ఆశించింది. ఆ చట్టాల వలన సమాజంలో అసంతృప్తి, నిరసనలు, వలస వ్యతిరేక భావాలు పెరగడానికి దోహదమయ్యాయి. పెరుగుతున్న క్రమేణా క్లిష్ట పరిస్థితులు పేరుగుతోంటే, పంజాబీ సమాజం రాజకీయ సమూహాలుగా ఏర్పడటం ప్రారంభించింది. పంజాబీలు పెద్ద సంఖ్యలో అమెరికాకు కూడా వెళ్లారు. అక్కడా వారు ఇలాంటి రాజకీయ, సామాజిక సమస్యలనే ఎదుర్కొన్నారు. ఈ సమూహాలలో తొలి కృషి 1908 లో పిఎస్ ఖంఖోజే, పండిట్ కాన్షి రామ్, తారకనాథ్ దాస్, భాయ్ భగవాన్ సింగ్ వంటి భారతీయ విద్యార్ధులు, పంజాబీ వలసదారులు చేసారు. వాళ్ళు రాజకీయ ఉద్యమం దిశగా పని చేసారు. ఖంఖోజే ఒరెగాన్‌లోని పోర్ట్ ల్యాండ్‌లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను స్థాపించాడు. ఈ సమయంలో సోహన్ సింగ్ భారతీయ వలసదారులలో రూపుదిద్దుకుంటున్న ఈ రాజకీయ ఉద్యమంతో పెనవేసుకుపోయాడు. అతను చేసిన కృషి వలన, ఆ సమయంలో అమెరికాలో ఉన్న ఇతర భారతీయ జాతీయవాదులకు అతడిని దగ్గర చేశాయి.
ఇదిలా ఉండగా, 1910 ప్రాంతాలకు తూర్పు తీరంలో ఇండియా హౌస్, భారతీయ విద్యార్థుల జాతీయవాద కార్యాచరణ క్రమేణా క్షీణించడం ప్రారంభమైంది. ఇది క్రమంగా పశ్చిమాన శాన్ ఫ్రాన్సిస్కోకు మారింది. ఈ సమయంలో యూరప్ నుండి హర్ దయాళ్ రావడంతో న్యూయార్క్ లోని మేధావి ఆందోళనకారులకు పశ్చిమ తీరంలో పంజాబీలు ప్రధానంగా ఉన్న కార్మిక కార్మికులు వలసదారులకూ మధ్య అంతరం తగ్గింది. ఇది గదర్ ఉద్యమానికి పునాదులు వేసింది. 1913 వేసవిలో, కెనడా, అమెరికాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రతినిధులు స్టాక్‌టన్‌లో సమావేశమయ్యారు. అక్కడ, పసిఫిక్ తీరపు హిందూస్తానీ కార్మికులు అనే సంస్థను స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారు. 1913 లో హర్ దయాళ్, పిఎస్ ఖంఖోజే, సోహన్ సింగ్ భక్నా నాయకత్వంలో పసిఫిక్ కోస్ట్ హిందూస్థాన్ అసోసియేషన్ ఏర్పడింది. భక్నా దాని అధ్యక్షుడు. ఇందులో భారతీయ వలసదారులు - ఎక్కువగా పంజాబీలు - సభ్యులుగా చేరారు. దాని సభ్యుల్లో చాలా మంది బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందినవారు. దయాళ్, తారక్ నాథ్ దాస్, కర్తార్ సింగ్ శరభ, VG పింగ్లే లు వారిలో కొందరు. భారతీయ ప్రవాసులలో ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆసియాలో ఉన్నవారిలో పార్టీ త్వరగా మద్దతు పొందింది. లాస్ ఏంజిల్స్, ఆక్స్‌ఫర్డ్, వియన్నా, వాషింగ్టన్, DC, షాంఘైలలో గదర్ సమావేశాలు జరిగాయి.
గదర్ ఉద్యమం
[మార్చు]గదర్ పార్టీ పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ నుండి ఉద్భవించింది. సాయుధ విప్లవం ద్వారా భారతదేశంలో బ్రిటిషు వలసరాజ్యాల అధికారాన్ని కూలదోయడమే గదర్ పార్టీ అంతిమ లక్ష్యం. ఇది, కాంగ్రెసు పార్టీ చేసిన ప్రధాన స్రవంతి ఉద్యమం, దాని రాజ్యాంగ పద్ధతులూ మరీ మెతకగనంతో ఉన్నాయని భావించింది. భారత సైనికులను తిరుగుబాటుకు పురికొల్పడం గదర్ ముందున్న వ్యూహం. ఆ దిశగా, 1913 నవంబరులో గదర్, శాన్ ఫ్రాన్సిస్కోలో యుగాంతర్ ఆశ్రమ ప్రెస్‌ను స్థాపించింది. హిందూస్థాన్ గదర్ వార్తాపత్రికను, ఇతర జాతీయవాద సాహిత్యాన్నీ అది ఉత్పత్తి చేసింది.
ఈ సమయంలో సోహన్ సింగ్ భక్నా ఆధ్వర్యంలోని గదర్ నాయకత్వం తిరుగుబాటు కోసం వారి మొదటి ప్రణాళికలను రచించింది. కోమగట మారు సంఘటనతో ముడిపడి ఉన్న భావోద్వేగాలు గదర్ పార్టీకి సహాయపడ్డాయి. సోహన్ సింగ్, బర్కతుల్లా, తారకనాథ్ దాస్‌తో సహా గదర్ నాయకులు దీనిని ఉపయోగించుకుని, ఉత్తర అమెరికాలో అనేక మంది అసంతృప్త భారతీయులను పార్టీలోకి తీసుకువచ్చారు. 1914 జూలై లో ఘర్షణలు మొదలైనవని తెలుసుకుని సోహన్ సింగ్, స్వయంగా కొమగత మారును యోకోహామాలో సంప్రదించి బాబా గుర్దిత్ సింగ్కు ఆయుధాలను అందేలా చేసాడు. ఐరోపాలో యుద్ధం గదర్ ప్రణాళికలను వేగవంతం చేసింది. అప్పటికే జర్మనీలోని భారతీయ విప్లవకారుల తోటి, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ కాన్సులేట్ తోటీ గదర్ పార్టీ సంపర్కంలో ఉంది. గదర్ పార్టీకి ఆగ్నేయాసియాలో కూడా సభ్యులు ఉన్నారు. ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్న భారత విప్లవకారులతో సంబంధాలు ఉన్నాయి. అమెరికా నుండి, ఆగ్నేయాసియా నుండి భారతదేశానికి నిధులను, ఆయుధాలనూ రవాణా చేయడం కోసం విస్తృతమైన ప్రణాళికలు రూపొందించింది. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని అంటారు. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన తిరుగుబాటు కోసం 1914 చివరిలో లేదా 1915 ప్రారంభంలో వీటిని ఉపయోగించాలనేది వారి ప్రణాళిక. ఈ తిరుగుబాటు ప్రణాళికనే గదర్ కుట్ర అని అంటారు. గదర్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒకడైన సోహన్ సింగ్, యుద్ధం ప్రారంభమైన సమయంలో, భారతదేశంలో తిరుగుబాటును నిర్వహించడానికి, నిర్దేశించడానికి కోమగత మారు సంఘటనల నేపథ్యంలో, ఎస్‌ఎస్ నామ్‌సంగ్‌లో భారతదేశానికి ప్రయాణమయ్యాడు, అయితే, బ్రిటిషు నిఘా వర్గాలు అప్పటికే విప్లవకారుల కుట్ర జాడలను సేకరిస్తున్నాయి. భారతదేశానికి వచ్చాక సింగ్‌ను కలకత్తాలో 1914 అక్టోబరు 13 న అరెస్టు చేసారు. విచారణ కోసం లుధియానా పంపారు. ఆ తరువాత అతన్ని ముల్తాన్ లోని సెంట్రల్ జైలులో పెట్టారు. ఆ తరువాత లాహోర్ కుట్ర కేసులో విచారించి అతని ఆస్తి జప్తు చేసి, మరణశిక్ష విధించారు. అండమాన్‌లో ఉండగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 1915 డిసెంబరు 10 న అతను అక్కడికి చేరుకున్నాడు. ఖైదీలకు మెరుగైన వసతుల కోసం అతను వరుసగా అనేక నిరాహార దీక్షలు చేపట్టాడు. [2]
మలి జీవితం
[మార్చు]1921 లో, సోహన్ సింగ్‌ను కోయంబత్తూర్ జైలుకు, ఆ తరువాత యరవాడకు బదిలీ చేసారు. అక్కడ, సిక్కు ఖైదీలు తమ మత చిహ్నాలైన తలపాగాలు మొదలైనవాటిని ధరించనీయనందుకు నిరసనగా సింగ్ నిరశ్న దీక్ష చేసాడు. 1927 లో, అతన్ని లాహోర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ అతను 1928 జూన్‌లో నిరాహార దీక్షను చేపట్టాడు. 1929 లో, ఖైదీగా ఉండగానే, భగత్ సింగ్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేశాడు. 1930 జూలై ప్రారంభంలో విడుదలయ్యే ముందు మొత్తం పదహారు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
విడుదలైన తర్వాత, అతను జాతీయవాద ఉద్యమంలో కార్మిక రాజకీయాలలో పని చేసాడు. అతని రచనలు భారత కమ్యూనిస్ట్ పార్టీ రచనలకు దగ్గరగా ఉండేవి, కిసాన్ సభలను నిర్వహించడానికి తన సమయాన్ని ఎక్కువగా కేటాయించాడు. అతను తన రాజకీయ పనిలో ఖైదులో ఉన్న గదర్ పార్టీ కార్యకర్తలను విడుదల చేయడాన్ని ఒక కీలక భాగంగా చేసుకున్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, రెండవసారి ఖైదు చేసారు. అప్పుడతన్ని రాజస్థాన్‌లోని దేవ్‌లి క్యాంపులో ఖైదు చేసారు. అతను దాదాపు మూడు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. స్వాతంత్య్రానంతరం అతను భారత కమ్యూనిస్టు పార్టీ లో చేరాడు. అతన్ని 1948 మార్చి 31 న అరెస్టు చేసారు, కానీ 1948 మే 8 న విడుదలయ్యాడు. కానీ, మళ్లీ పట్టుబడ్డాడు. భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జోక్యంతో చివరకు అతనికి జైలు జీవితం ముగిసింది. వయస్సుతో కుంగిపోయి న్యుమోనియా బారిన పడిన బాబా సోహన్ సింగ్ భక్నా 1968 డిసెంబరు 21 న అమృత్‌సర్‌లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Josh, Sohan Singh (1970). Baba Sohan Singh Bhakna :life of founder of Ghadar party. People Publishing House. pp. ii.
- ↑ Gill, M. S. (2007). Trials that Changed History: From Socrates to Saddam Hussein (in ఇంగ్లీష్). New Delhi: Sarup & Sons. pp. 92–99. ISBN 978-81-7625-797-8.