Jump to content

స్పిగ్మోమానోమీటరు

వికీపీడియా నుండి
స్పిగ్మోమానోమీటరుతో రక్త పీడనాన్ని కొలుస్తున్న వైద్యులు
ఎలక్ట్రానిక్ స్పిగ్మోమానోమీటర్ లో చూపుతున్న రక్త పీడనం 120/74 mmHg

రక్తపోటును (రక్తపీడనం) కొలిచే పరికరాన్ని స్పిగ్మోమానోమీటరు అంటారు. దీన్ని రక్తపీడన మీటరు, స్పిగ్మోమీటర్ అని కూడా అంటారు. రక్తం ప్రహించేటప్పుడు కలిగే ఒత్తిడిని కొలిచే సాధనం ఇది. ఇందులో పాదరసం లేదా యాంత్రిక ద్రవపీడన మాపకాన్ని ఉపయోగిస్తారు.[1] రక్త ప్రవాహం ఆటంకాలు లేకుండా సాఫీగా జరగడానికి వీలుగా మోచేతికి పైభాగాన ఈ పరికరాన్ని అమర్చి రక్త పోటును కొలుస్తారు.

వ్యుత్పత్తి, చరిత్ర

[మార్చు]

స్పిగ్మోమానోమీటర్ అనే పదం స్పిగ్మో- + మానోమీటర్ అను పదాల మిళితం. గ్రీకుపదం స్పిగ్మోస్ (σφυγμός) అంటే "నాడి" (పల్స్) అని అర్ధం. శాస్త్రీయ పదం మానోమీటర్ (ఫ్రెంచ్ మనోమెట్రే నుండి), అంటే "పీడన మీటర్". ఇందులో మానోస్ (μανός) అంటే "సన్నని", "అరుదైన" అని, మెట్రాన్ (μέτρον) అంటే "కొలత" అనీ అర్థం.[2] 20వ శతాబ్దంలో స్పిగ్మోమానోమీటర్లు డయల్ రూపంలో గానీ పాదరసం గొట్టాలతో ఉండే యాంత్రిక గేజ్‌ల లాగా గానీ ఉండేవి. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి, "మీటర్", "మానిటర్" వంటి పేర్లు కూడా వాడుకలోకి వచ్చాయి. ఈ పరికరాలు స్వయంచాలకంగా రక్తపోటును నిరంతరం పర్యవేక్షించగలవు. 1881లో సామ్యూల్ సీగ్‌ఫ్రైడ్ కార్ల్ రిట్టర్ వాన్ బాష్ మొదట ఈ స్పిగ్మోమానోమీటర్‌ను కనిపెట్టాడు.[3]

రకాలు

[మార్చు]

ప్రస్తుతం మానవీయంగా ఉపయోగించే మీటర్లు, డిజిటల్ మీటర్లు రెండూ వాడుతున్నారు. ఖచ్చితత్వం, సౌలభ్యం పరంగా ఈ రెండింటిలోనూ తేడాలు ఉన్నాయి.

మానవీయంగా పనిచేసే మీటర్లు

[మార్చు]

మానవీయంగా పనిచేసే (మాన్యువల్) స్పిగ్మోమానోమీటర్ ను స్టెతస్కోప్‌తో పాటు ఉపయోగిస్తారు. శిక్షణ పొందిన వైద్యులు ఈ మీటర్లను ఉత్తమంగా ఉపయోగించగలరు. దీంట్లో ఆస్కలేషన్ అంటే శరీరంలోని, ముఖ్యంగా రక్త ప్రసరణ, శ్వాసక్రియకు సంబంధించిన ధ్వనులను గుండె, ఊపిరితిత్తుల నుంచి పరిశీలిస్తారు. స్పిగ్మోమానోమీటర్‌లో గాలితో నిండిన కఫ్, కొలిచే పరికరం (పాదరసం మానోమీటర్, లేదా అనరాయిడ్ గేజ్) ఉంటాయి. ఇది మానవీయంగా పనిచేసే బల్బ్, వాల్వ్ లేదా విద్యుత్తుతో పనిచేసే పంపు కావచ్చు.

  • పాదరసం స్పిగ్మోమానోమీటర్లను అత్యున్నత ప్రమాణంగా పరిగణిస్తారు. ఇవి, ఓ పాదరసం స్తంభంలో పీడనాన్ని చూపిస్తాయి. దీనికి క్యాలిబరేషను అవసరం లేదు.[4] వాటి ఖచ్చితత్వం కారణంగా, వాటిని ఔషధాల క్లినికల్ ట్రయల్స్‌లో, గర్భిణీ స్త్రీలు, ఇతర అధిక-ప్రమాదకర రోగుల క్లినికల్ మూల్యాంకనాలలో ఉపయోగిస్తారు. గోడపై అమర్చిన పాదరసం స్పిగ్మోమానోమీటర్‌ను 'బౌమనోమీటర్' అని కూడా పిలుస్తారు.[5]
  • అనరాయిడ్ స్పిగ్మోమానోమీటర్లు (డయల్‌తో కూడిన యాంత్రిక సాధనాలు) కూడా ఉపయోగంలో ఉన్నాయి; పాదరసం మానోమీటర్ల వలె కాకుండా వాటికి క్యాలిబరేషను అవసరం కావచ్చు. అనరాయిడ్ స్పిగ్మోమానోమీటర్లు పాదరసం స్పిగ్మోమానోమీటర్ల కంటే సురక్షితమైనవిగా పరిగణిస్తారు. అయితే వీటిల్లో చవకైనవి, ఖచ్చితమైన ఫలితాలు చూపించవు.[2]

డిజిటల్ మీటర్లు

[మార్చు]

డిజిటల్ మీటర్లు ఓసిల్లోమెట్రిక్ కొలతలు, ఎలక్ట్రానిక్ గణనలను ఉపయోగిస్తాయి. అవి మానవీయం లేదా ఆటోమేటిక్ ఇన్‌ఫ్లేషన్‌ను ఉపయోగించవచ్చు, కానీ ఈ రెండు రకాలు ఎలక్ట్రానిక్, శిక్షణ లేకపోయినా పనిచేయడం సులభం. అవి ఓసిల్లోమెట్రిక్ డిటెక్షన్ ద్వారా సిస్టోలిక్, డయాస్టొలిక్ పోటు లెక్కిస్తాయి. అవి సగటు ధమని రక్తపోటును అంచనా వేస్తాయి, పల్స్ రేటును కొలుస్తాయి. ఖచ్చితత్వం మాన్యువల్ మీటర్ల కంటే తక్కువ. ఆర్టెరియోస్క్లరోసిస్, అరిథ్మియా, ప్రీక్లాంప్సియా, పల్సస్ ఆల్టర్నన్స్, పల్సస్ పారడాక్సస్ వంటి రోగాలకు, ఆయా రోగుల్లో డిజిటల్ ఓసిల్లోమెట్రిక్ మానిటర్లు అనుకూలం కాకపోవచ్చు, ఎందుకంటే వాటి కొలతలు ఈ అనారోగ్య పరిస్థితులకు సరైనవి కాకపోవచ్చు. ఈ సందర్భాలలో, శిక్షణ పొందిన వ్యక్తి ఉపయోగించినప్పుడు అనలాగ్ స్పిగ్మోమానోమీటర్ మంచిది.

డిజిటల్ పరికరాల్లో కఫ్‌ను పై చేయికి గానీ, మణికట్టుకు గాని, వేలుకు గానీ చుట్టవచ్చు. అవి చూపే రీడింగులో కూడా ఖచ్చితత్వం ఇదే వరుసలో, పైచేయి వద్ద అత్యుత్తమంగాను, వేలు వద్ద అతి పేలవం గానూ ఉంటుంది. కఫ్‌ను అమర్చుకునే వీలు మాత్రం దీనికి విలోమ క్రమంలో ఉంటుంది. ఇటీవల, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని పరిశోధకుల బృందం రక్తపోటును అంచనా వేయడానికి ఓసిల్లోమెట్రీని ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేసింది.[6]

ప్రయోజనాలు

[మార్చు]

ఈ సాధనాలని ఉపయోగించేవారు నియంత్రణ వాల్వ్‌తో గాలి పీడనాన్ని విడుదల చేస్తూ, పాదరసం కాలమ్ లేదా అనరాయిడ్ గేజ్ పాయింటర్‌ గమనించడం ద్వారా, mmHgలో రక్తపోటు విలువలను గమనిస్తారు. ధమనులలో గరిష్ట పీడనం (సిస్టోలిక్ పీడనం), అత్యల్ప పీడనం (డయాస్టొలిక్ పీడనం) కొలిచే ధమనిపై తేలికగా వర్తించే స్టెతస్కోప్‌ను ఆస్కల్టేటరీ పద్ధతిలో ఉపయోగిస్తారు. సిస్టోలిక్ పీడనం (మొదటి దశ) నిరంతర కోరోట్‌కాఫ్ శబ్దాలలో మొదటిదానితో గుర్తిస్తారు. కోరోట్‌కాఫ్ శబ్దాలు అదృశ్యమైన క్షణంలో (ఐదవ దశ) డయాస్టొలిక్ పీడనం తెలుస్తుంది. అధిక రక్తపోటు నిర్ధారణ లోను, చికిత్సలోను, ఇంకా అనేక ఇతర ఆరోగ్య సంరక్షణ సందర్భాలలోనూ రక్తపోటు కొలత అవసరం పడుతుంది.

వైద్యుల సూచనలు

[మార్చు]

ఈ పరికరాలను వాడినపుడు వాడకంలో కొలతలల్లో తేడాలు లేకుండా ఉండడానికి వైద్యులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.[7]

  • దుస్తులపై బిపి కఫ్ కట్టడం వలన రక్త పోటు (సిస్టాలిక్ / డియాస్టాలిక్) యూనిట్లలో తేడా వస్తుంది.
  • పరికరం వాడేటప్పుడు మాట్లాడకూడదు.
  • చేతిని గుండెకు సమాంతరంగా ఉంచాలి. కూర్చునే భంగిమ సక్రమంగా ఉండాలి.
  • ఆహారం తీసుకున్న 30 నిముషాల లోపు రక్తపోటు కొలవకూడదు. వ్యాయామం, డ్రైవింగ్, స్నానం చేసిన వెంటనే కూడా బిపి కొలవకూడదు.
  • మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.
  • నిద్ర చాలక పోయినా, ఆల్కహాల్, ధూమపానం, కెఫీన్ పదార్ధాలు తీసుకుంటున్నా బిపి కొలతలలో తేడా ఉంటుంది .
  • బిపి చూసుకునే ముందు ప్రశాంతంగా ఆందోళన లేకుండా ఉండాలి
  • నిముషం తేడాలో 3 సార్లు బిపి చూసుకొని వాటి సగటుని పరిగణన లోకి తీసుకోవాలి.
  • మనిషి సాధారణ రక్త పోటు 120/80 ఉండేలా చూసుకోవాలి.

మూలాలు

[మార్చు]
  1. Booth, J (1977). "A short history of blood pressure measurement". Proceedings of the Royal Society of Medicine. 70 (11): 793–9. doi:10.1177/003591577707001112. PMC 1543468. PMID 341169.
  2. 2.0 2.1 Harper, Douglas. "sphygmomanometer". Online Etymology Dictionary.
  3. Booth, J (1977). "A short history of blood pressure measurement". Proceedings of the Royal Society of Medicine. 70 (11): 793–9. doi:10.1177/003591577707001112. PMC 1543468. PMID 341169.
  4. "Comparing Mercury and Aneroid Sphygmomanometers". Sustainable Hospitals / Lowell Center for Sustainable Production. 2003. Archived from the original on 2 మార్చి 2013. Retrieved 23 February 2015.
  5. "Turning Mercury Into Solid Gold". The New York Times. 27 March 2005. Retrieved 5 July 2018.
  6. "Oscillometry, Explanation of oscillometric detection in Medical Electronics, N Townsend, p48-51" (PDF). Archived from the original (PDF) on 22 May 2013. Retrieved 10 February 2013.
  7. డా. శ్రీ భూషణ రాజు (2025-12-07). "ఆ అంకెలు..ఆందోళనా?". ఈనాడు.