స్ఫోటాయన వ్యాకరణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు.

అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా మనియర్ విలియంస్ అను మహాశయుడు స్ఫోటసందర్భమున నిట్లు వ్రాసినాడు

" The eternal and imperceptible element of sound or words and the real vehicle of idea which bursts or flashes on the mind when a sound is uttered".

కక్షీరపర్వతముపై ఓశిజ నామము గల ఒక యోగి నిజగ్రంథమున శబ్దమున కుండెడి అర్ధప్రకాశకశక్తి విశేషమును ప్రపంచించి, దానికి స్ఫోటమని పేరిడినాడు. ఈనుతన నామము వలన అతనికి స్ఫోటాయనుడను పేరు ప్రసిద్ధమయినది. అతడు పాణిని కెంత ముదరివాడో తెలియదు. వ్యాసభగవానునకు తరువాతి వాడు మాత్రము అగును. మహాభారతము న స్ఫోట శబ్దము కనబడదు. కాని వ్యాసభాష్యమున స్ఫోటతాత్పర్యము విహితమగుటచే స్ఫోటాయనుడు వ్యాసుడు తరువాతివాడని చెప్పవచ్చును.

వ్యాసభాష్యము వేదవ్యాస ప్రణీతము (వ్రాయబడిన) కాదనియు, మహాభాష్యప్రవర్తి అనియు చాలమంది అంటారు.

"Yoga system of Patanjali" అను గ్రంథ భూమికలో Haughton Woods, "There is little room to doubt that Varshaganya was an older contemporary of Vasubandhu". అని వ్రాసినాడు. Professor Takakusu అను జపనీసు విద్వాంసుడు వసుబంధు సా.శ. 5,6 శతాబ్దములలోని వాడని నిర్ద్ధారణచేసాడు. కావున వ్యాసభాష్యము 5 వ శతాబ్దానికి ముందులేదని చెప్పవచ్చును.

స్ఫోట వాదము

[మార్చు]

స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్దేవిని గూర్చిన స్తోత్రాలు ఋగ్వేదంలోనే కనిపిస్తాయి. అయినా వ్యాకరణ సాంప్రదాయం ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్ఫోటాయనమహర్షి. భర్తృహరి, నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు.

నిత్యమైన స్ఫోట, లేక శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. పరా పశ్యంతీదశలలోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప మన సాధరణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం; శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అవాహత చక్రం మధ్యమా వాక్కు నెలవు. ఇది అంతర స్ఫోట. కంఠప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యస్ఫోట.

సర్వదర్శన సంగ్రహంలో పాణినీయదర్శనాన్ని వివరిస్తూ మాధవాచార్యస్వామి అంటాడు: "స్ఫోట అనబడే ఈ శబ్దం విభాగాలులేనిది; నిరవయవం; నిత్యమైంది; జగత్తు పుట్టుకకు కారణమైంది. నిజానికి ఇది బ్రహ్మపదార్ధమే!". భర్తృహరీ బ్రహ్మకాండలో ఇదేమాట అన్నాడు.

'''ఆకాశం''' అనగానే ఎత్తుగా నీలంగా, భూమిమీద బోర్లించిన కోళ్ళగంపలాగా కనిపించేదీ, మబ్బులకూ సూర్యచంద్రులకూ ఆధారంగా ఉన్నట్టు అనిపించేదీ మనకు స్ఫురిస్తేనే ఆమాట అర్ధమయినట్టు అనుకుంటున్నాము. ఇలా ఏశబ్దం తీసుకున్నా ఆశబ్దార్ధం వాక్యరూపంగానే మనకు స్ఫురిస్తున్నట్లు తేలుతుంది.

ఒకభాషలోని ఒకమాట ఆభాషతెలిసిన వ్యక్తి మనస్సులో ఒక అర్ధాన్ని, తెలియనివ్యక్తి మనస్సులో మరోఅర్ధాన్ని స్ఫురింపజేయగలదు.ఉదాహరణకి '''కాఫీ''' అనేమాట దక్షిణాదివారి మనస్సులో కఫీపానీయాన్ని స్ఫురింపజేస్తే హిందీ మాతృభాషగా గల ఉత్తరాదివారికి చాలు అనే అర్ధాన్ని బోధించవచ్చును.

ఇలాఒకేమాట వేరువేరుభాషల్లో వేరువేరు అర్ధాలని బోధించగల్గినట్లు, మానవులందరిలోనూ స్వతసిద్ధంగా ఒండే స్ఫోట ఏకరూపమే! ఒకేవ్యక్తికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చుననుకోండీ అప్పుడు '''మనిషి''' అన్నా man, అన్నా ఆద్మీ అన్నా అతనిమనస్సులో అభివ్యక్తమయ్యే స్ఫోటఏకరూపమే.

దీనినిబట్టి, మానవైంద్రియాదిశక్తులచేత పరిమితమై మానవుడి జననంతోపాటే అతడు గ్రహించదగిన జ్ఞానరాశిఅంతా సూక్ష్మరూపంలో అతడిలో సన్నద్దమై ఉంటుందనీ, అదే స్ఫోట అనీ తేలుతుంది. అందుకే స్ఫోట నిత్యం అన్నారు. అలా సన్నద్ధమై ఉన్న జ్ఞానాన్ని అభివ్యక్తం చేసే పరికరాలే భాషలోని శబ్దాలన్నీ. ఒక చీకటికొట్లో ఎన్నోవస్తువులండవచ్చును టార్చిలైటు దేనిమీద వేస్తే ఆవస్తువునే కనిపిస్తుంది. ఆసంగతి బాగా తెలుస్తుంది. స్ఫోటని మనం సంపూర్ణంగా నిర్వచించలేకపోయినా అది మనందరి నిత్యానుభవంలోనూ ఉన్నదే! ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మరొకడు అర్ధం చేసుకొన్న ప్రతిసందర్భం లోను స్ఫోట పనిచేస్తూనే ఉంది. ఈస్ఫోట లోపించడం మూలానే మరమనిషికి ఏదిపడితే అదిమాట్లాడగలదు ఏదిమాట్లాడినా బోధపరచుకోగలగడం సాధ్యంకాలేదు.

వైయా కరణాంగీ కృతమగు వాదమునకే స్ఫోట వాదము ని పేరు. ఈ స్ఫోట వాదము పాణినికి ముందున్నదో లేదో చెప్పటము కష్టము.స్ఫోటాయనుడను పేరు పాణినీయమున ఉంది.ఈతడే స్ఫోట వాదమునకు కర్త. స్ఫుటత్యర్ధో స్మాదితి స్ఫోటః దీని వలన అర్ధము స్ఫుటమగును కావున స్ఫోటమనియు తెలియును.వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కును విభజించిరి.పరావాక్కు మూల చక్రస్థము, పశ్యంతి నాభి సంస్థితము.ఈరెండును యోగులకే అనుభవనీయము.హృదయ దేశమందలి వాక్కు మధ్యమ అనబడును.కంఠదేశమందలి వాక్కు వైఖరీ వాక్కు.ఈ మధ్యమ వాక్కునకే స్ఫోట శబ్దమని వ్యవహారము.ఇది నిత్యము, అఖండము, అవికారము, అచలము ఇదే బ్రహ్మ స్వరూపము.ఈ సిద్ధాంతులకే స్ఫోట బ్రహ్మవాదులని లేదా శబ్ద బ్రహ్మ వాదులని పేరు. వీరు శబ్దమునే బ్రహ్మముగా భావింతురు.మనము శ్రవణేంద్రియముచే గ్రహించు శబ్దముకాక, దానిచే అభివ్యక్తమై బుద్ధినిష్ఠమగు శబ్దమే స్ఫోటము.అదియే అర్ధమును ప్రకాశింపజేయును.అది నిత్యము.అది పదరూపమున కాని, వాక్య రూపమునకాని యుండును.వాక్యస్ఫోటమె ముఖ్య సిద్ధాంతము.

భర్తృహరి ముఖ్యముగా ప్రతిపాదించిన వాక్యజాతి స్ఫోట. అయినను తరువాతి వైయాకరణుల అష్ట విధములగు స్ఫోటల నీరీతిగా నిరూపించిరి. వర్ణములను మాత్రలుగను, పదములను ప్రకృతి ప్రత్యయములనుగాను, వాక్యమును పదములుగాను విభజించి అర్ధములేర్పరుచుట వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించిన విషయము.వ్యవహారము ఉపయుక్తములగు పదములకు అఖండ పదస్ఫోటను కొందరు పేర్కొనిరి.ఏమైనను నవ్యులు అఖండ స్ఫోటమే ముఖ్యమందురు.ప్రాచీనులు వాక్యజాతి స్ఫోట ముఖ్యమని భావింతురు.వ్యక్తిస్ఫోట, జాతిస్ఫోటయను విభేదమును గూర్చి చాల వివాదము ఉంది. ప్రాచీన వైయాకరణులు జాతి స్ఫోట వాదులని, నవీన వైయాకరణులు వ్యక్తి స్ఫోట వాదులని ప్రసిద్ధి. భర్తృహరి జాతి స్ఫోటనే ప్రతిపాదించి బలపరిచెను.జాతి స్ఫోట తాత్వికముగా ఉన్నా ఆచరణయోగ్యము కాదని నవీనుల అభిప్రాయము.వ్యక్తి మూలముననే జాతి గ్రహింపబడును.వ్యక్తులన్నింటి యందుండు సమాన ధర్మమే జాతి.అందువలన చివరకు ఆధునిక విమర్సకులు వ్యక్తి జాతి స్ఫోటలు రెండును అవినాభావములని నిర్ణయించిరి.

పాశ్చాత్యదర్శన మనశాస్త్రాలలో స్ఫోటవాదంతో పోలికలు ఉన్నటు అనిపించే కొన్ని భావాలను మనం గుర్తించవచ్చును. గ్రీకుల '''లాగాస్''' (logos) కాంట్ ప్రతిపాదించిన కారణాత్పూర్వజ్ఞాన సిద్ధాంతం (apriori) మనశాస్త్రంలోని-స్ఫురణ (intuition) వంటివి. ప్లేటొ లాగాస్ ప్రంచానికి మూలరూపం అన్నాడు.అంటే లాగాస్ నుంచే ప్రపంచం అంతా వచ్చిందని. ఫైలో (philo) దేవుడికీ, ప్రపంచానికీ మధ్య అనుసంధానం కలిగించేది లాగాస్ అన్నాడు.హొరక్లైటస్ (Heraclitus) భౌతిక జగత్తునంతటనీ లాగాస్ ద్వారానే మనం గ్రహిస్తున్నామన్నాడు.

మూలాలు

[మార్చు]

[1]

[2]

  1. 1948 భారతి సంచిక-వ్యాస కర్త శ్రీ వేలూరి శివశంకరశాస్త్రి
  2. 1963 భారతి సంచిక-వ్యాసము స్ఫోట వాదము- వ్యాసకర్త - శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తము