స్వదేశ్
స్వదేశ్ | |
---|---|
దర్శకత్వం | అశుతోష్ గోవారికర్ |
రచన | అశుతోష్ గోవారికర్ |
నిర్మాత | అశుతోష్ గోవారికర్ |
తారాగణం | షారుక్ ఖాన్, గాయత్రి జోషి |
విడుదల తేదీ | డిసెంబరు 17, 2004 |
భాష | హిందీ |
స్వదేశ్ అనేది 2004లో అశుతోష్ గోవారికర్ రూపొందించిన హిందీ సినిమా. ఇద్దరి ప్రవాస భారతీయుల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, గాయత్రి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.[1]
కథ
[మార్చు]మోహన్ భార్గవ (షారుక్ ఖాన్) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తుంటాడు. తాను పుట్టి పెరిగిన ఉత్తర ప్రదేశ్ లో చిన్నతనంలో తన ఆలనా పాలనా చూసుకున్న కావేరి అమ్మ గురించి మోహన్ అప్పుడప్పుడూ బాధ పడుతూ ఉంటాడు. మోహన్ తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్ళిపోయి ఒక వృద్ధాశ్రమంలో చేరడంతో ఆమె ఆచూకీ తెలియకుండా పోతుంది. మోహన్ ఎప్పుడైనా భారతదేశానికి వెళ్ళి ఆమెను తనతోబాటు అమెరికాకు తీసుకురావాలనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు తన ఆఫీసులో సెలవు తీసుకుని భారత్ కు బయలుదేరుతాడు. ఢిల్లీ చేరుకుని ఆమె చేరిన వృద్ధాశ్రమంలో వాకబు చేస్తాడు కానీ ఆమె అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితమే చరణ్ పూర్ అనే ఊరికి వెళ్ళిపోయినట్లుగా తెలుసుకుంటాడు. తర్వాత మోహన్ ఉత్తరప్రదేశ్ లోని చరణ్ పూర్ కి వెళ్ళాలనుకుంటాడు.
తనకు కావలసిన సౌకర్యాలు ఆ కుగ్రామంలో దొరక్కపోవచ్చేమోనని భయపడి ఒక కారవాన్ ని అద్దెకు తీసుకుంటాడు. చరణ్ పూర్ చేరుకుని కావేరి అమ్మను కలుసుకుంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన గీత (గాయత్రి జోషి) తన తల్లిదండ్రులు చనిపోవడంతో తనకు పెద్దదిక్కుగా ఉంటుందని కావేరి అమ్మను అక్కడికి రప్పించిందని తెలుసుకుంటాడు. గీత అదే ఊర్లో ఒక చిన్న పాఠశాల నడుపుతూ విద్య నేర్పడం ద్వారా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఊర్లో కులం, సాంప్రదాయాల కట్టుబాట్లు బాగా వేళ్ళూనికుని ఉంటాయి. మోహన్ అక్కడికి రావడం గీతకు పెద్దగా ఇష్టం ఉండదు. అతను ఎక్కడ కావేరి అమ్మను తనతో తీసుకెళ్ళిపోతే తాను, తన తమ్ముడు చిక్కు అనాథలు మిగిలిపోతామో అని ఆమె భయం. కావేరీ అమ్మ కూడా గీతకు ముందు పెళ్ళి చేసే పంపించడం తన బాధ్యత అని చెబుతుంది. గీతకు మహిళా సాధికారత అంటే ఆసక్తి. తాను పెళ్ళైనా కూడా ఉద్యోగం చేయడానికి ఎటువంటి అడ్డంకులూ ఉండకూడదనుకుంటుంది. అందుకోసం కొన్ని సంబంధాలు కూడా వదులుకుంటుంది. ఈ లక్షణాలన్నీ చూసి మోహన్ ఆమె ప్రేమలో పడతాడు. అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించేలా ఒప్పించడానికి తన వంతు కృషి చేస్తాడు.
మోహన్ తన సెలవును మరో మూడు వారాలు పొడిగించుకుంటాడు. చరణ్ పూర్ లో కరెంటు సరిగా ఉండదని తెలుసుకుంటాడు. దగ్గర్లో ఉన్న ఒక కొండ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఉపయోగించి చిన్న జల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలనుకుంటాడు. తన స్వంత ఖర్చులతో అందుకు కావలసిన పరికరాలన్నీ కొనుగోలు చేసి గ్రామస్థులనందరినీ శ్రమదానం ద్వారా ఆ ప్రాజెక్టు నిర్వహణలో భాగస్వామ్యం చేస్తాడు. అది విజయవంతం కావడంతో ఆ ఊరికి సరిపడా విద్యుత్ లభిస్తుంది.
నాసాలో మోహన్ నేతృత్వం వహిస్తున్న ప్రాజెక్టు కీలక దశలకు చేరుకోవడంతో అతన్ని వాళ్ళు అక్కడికి రమ్మని తొందరపెడుతుంటారు. కావేరీ అమ్మ తాను మలి వయసులో కొత్త దేశానికి అలవాటు పడలేక అక్కడ రాలేనని చెబుతుంది. గీత కూడా తనతో బాటు వచ్చి పరాయి దేశంలో స్థిరపడ్డానికి ఒప్పుకోదు. మోహన్ అన్యమనస్కంగానే ప్రాజెక్టు పూర్తి చేయడానికి అమెరికా తిరుగు ప్రయాణమవుతాడు. అక్కడికి వెళ్ళినా అతన్ని చరణ్ పూర్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. తను నేతృత్వం వహించిన ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుంది. మోహన్ భారత్ కి తిరిగి వచ్చి విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పనిచేయడానికి నిర్ణయించుకుంటాడు. అక్కడి నుంచి కూడా నాసాతో పనిచేయవచ్చని అనుకుంటాడు. మోహన్, గీతను పెళ్ళిచేసుకుని చరణ్ పూర్ లో స్థిరపడినట్లు చూపడంతో కథ పూర్తవుతుంది.
తారాగణం
[మార్చు]- మోహన్ భార్గవ గా షారుక్ ఖాన్
- గీత గా గాయత్రి జోషి
- కావేరి అమ్మ గా కిషోరి బల్లాళ్[2]
- పోస్టు మాస్టర్ నివారణ్ గా రాజేష్ వివేక్
- మేలారాం గా దయాశంకర్ పాండే
- దాదాజీ గా లేఖ్ టాండన్
- ఫకీరు గా మకరంద్ దేశ్ పాండే
మూలాలు
[మార్చు]- ↑ https://www.indiatimes.com/lifestyle/self/meet-aravinda-and-ravi-the-inspiration-behind-shahrukh-khan-s-movie-swades-249108.html
- ↑ "Kannada Movie Actress Kishori Ballal - Nettv4u". nettv4u.com. Archived from the original on 30 ఆగస్టు 2017. Retrieved 23 February 2020.