Jump to content

స్వరాజ్య (1908 నాటి పత్రిక)

వికీపీడియా నుండి
స్వరాజ్య
సంపాదకులుగాడిచర్ల హరిసర్వోత్తమరావు
తరచుదనంవారపత్రిక
ప్రచురణకర్తబోడే నారాయణరావు
స్థాపకులుపింగళి లక్ష్మీనారాయణ
మొదటి సంచిక1907
ఆఖరి సంచిక1908
దేశంభారతదేశం
కేంద్రస్థానంవిజయవాడ
భాషతెలుగు

స్వరాజ్య, 1907 లో విజయవాడ నుండి వెలువడ్డ వారపత్రిక.[1] దీన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావులు స్థాపించారు. చిత్తూరులో శ్రీనివాసాచార్యులు నడిపిన వెంకటేశపత్రిక అనే పత్రికను తీసుకొని ఇలా పేరు మార్చి విజయవాడ నుండి నడపడం మొదలుపెట్టారు.[2] స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిషు ప్రభుత్వం వీరిద్దరినీ జైలుకు పంపడంతో ఈ పత్రిక, 16 సంచికల తరువాత, 1908 జూలైలో మూతబడింది.[3]

చరిత్ర

[మార్చు]

1908 లో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేజిస్ట్రేట్‌ను కాల్చి చంపిన కేసులో చిదంబరం పిళ్ళెకు యావజ్జీవ కారాగారనాస శిక్ష విధించారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా మద్రాసులో జరిగిన నిరసన ప్రదర్శనలో ఒక తెల్లవాడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఆ సంఘటనపై గాడిచర్ల హరిసర్వోత్తమరావు పత్రిక సంపాదకీయంలో "క్రూరాతి క్రూరమైన ఆంగ్లేయ పులి ఇద్దరు భారతీయుల ప్రాణాలు బలిగొన్నది" అని రాసాడు.

దీనిపై ప్రభుత్వం, 1908 జూలై 18 న ఆయననూ నారాయణరావునూ అరెస్టు చేసింది. కృష్ణా జిల్లా సెషన్సు కోర్టు నారాయణరావుకు తొమ్మిది నెలలు, గాడిచర్లకు ఆరు నెలలూ ఖైదు విధించింది. కానీ ప్రభుత్వం ఆ తీర్పుపై మద్రాసు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అక్కడ గాడిచర్ల శిక్షను మూడేళ్ళకు పెంచింది. తొలితీర్పు ఇచ్చిన సెషన్సు కోర్టు జడ్జిని ఆ పదవి నుండి తప్పించి, దానికంటే నిమ్నపదవి అయిన జిల్లా కలెక్టరు పదవికి తగ్గించి నరసరావుపేటకు బదిలీ చేసింది. విధంగా ఆంధ్రులలో వారిద్దరూ ప్రప్రథమ రాజకీయ ఖైదీలయ్యారు.[1][4] ఈ కేసులో మునగాల రాజా హరిసర్వోత్తమరావు తరపున సాక్ష్యం చెప్పగా,[1] కందుకూరి వీరేశలింగం పంతులు, గాడిచర్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు.[5]

ఇదే పేరుతో ఇతర పత్రికలు

[మార్చు]

స్వరాజ్య పేరుతో పలు పత్రికలు వచ్చాయి. తెలుగు లోనే ఇది కాక మరో 2 పత్రికలు వచ్చాయి. 1923 ప్రాంతంలో విజయవాడ నుండి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి సంపాదకత్వంలో స్వరాజ్యపత్రిక అనే వారపత్రిక ఒకటి వచ్చేది (ఈ పుస్తకం గురించి వేసిన ప్రకటన[6]). 1921 నుండి మద్రాసు నుండి టంగుటూరి ప్రకాశం సారథ్యంలో స్వరాజ్య పత్రిక వచ్చేది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. విజయవాడ: కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం. p. 18.
  2. ఆరుద్ర (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 4 (in Telugu). ఐదరాబాదు: తెలుగు అకాడమీ. p. 625.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. విజయవాడ: కృష్ణాజిల్లా స్యాతంత్ర్య సమరయోధుల సంఘం. p. 40.
  4. "Modern Period". AP Online. Archived from the original on 26 సెప్టెంబరు 2011. Retrieved 1 March 2015.
  5. దిగవల్లి, వేంకట శివరావు (1986). వీరేశలింగం వెలుగు నీడలు. విజయవాడ: వేమన వికాస కేంద్రం. p. 25.
  6. Sasanasabhyalu. svk.{{cite book}}: CS1 maint: others (link)