Jump to content

స్వామినారాయణ

వికీపీడియా నుండి
స్వామి నారాయణ
"శిక్షాపత్రి"ని లిఖిస్తున్న స్వామినారాయణ
వ్యక్తిగతం
జననం
ఘనశ్యామ్ పాండే

3 ఏప్రిల్ 1781[1]
ఛపయ్యా, అవధ్ రాజ్యం (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, భారతదేశం)
మరణం1830 జూన్ 1(1830-06-01) (వయసు: 49)
గధడా, బరోడా రాష్ట్రం,(పస్తుతం గుజరాత్, భారతదేశం)
మతంహిందూమతం
Founder ofస్వామినారాయణ్ సంప్రదాయం
Senior posting
Guruస్వామీ రామానంద్
Successorఅయోధ్యప్రసాద్, రఘువీర[2]

స్వామినారాయణ (IAST: Svāmīnārāyaṇa; 3 ఏప్రిల్ 1781 – 1 జూన్ 1830), ఈయనే సహజానంద స్వామి అని కూడా ప్రసిద్ధుడు. ఈయన ఒక యోగి, సన్యాసి. ఇతని అనుచరులు ఈయనను శ్రీకృష్ణుడి అవతారంగా లేదా పురుషోత్తముడి (పరమాత్మ) అత్యున్నత స్వరూపంగా భావిస్తారు. ఈయన చుట్టూనే స్వామినారాయణ్ సంప్రదాయం అభివృద్ధి చెందింది.[3][4][5][6][7] 1800లో, తన గురువైన స్వామి రామానంద్ ద్వారా ఉద్ధవ సంప్రదాయంలోకి దీక్ష పొందాడు. ఈయనకు సహజానంద స్వామి అనే పేరు ఇవ్వబడింది. వ్యతిరేకత ఉన్నప్పటికీ, రామానంద్ తన మరణానికి ముందు 1802లో ఉద్ధవ సంప్రదాయ నాయకత్వ బాధ్యతలను ఇతనికి అప్పగించాడు.[6] స్వామినారాయణ్ సంప్రదాయం ప్రకారం, ఒక సభలో ఇతడు తన అనుచరులకు 'స్వామినారాయణ మంత్రాన్ని' బోధించిన తర్వాత, సహజానంద స్వామి 'స్వామినారాయణ్'గా ప్రసిద్ధి చెంది, ఉద్ధవ సంప్రదాయం స్వామినారాయణ్ సంప్రదాయంగా పిలవబడటం ప్రారంభమైంది. ఇతడు "నైతిక, వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి," అహింసకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు.[4][6] స్త్రీల సంక్షేమం కోసం, పేదల కోసం ఇతడు చేపట్టిన సంస్కరణల వల్ల, అలాగే భారీ స్థాయిలో అహింసాయుతమైన యజ్ఞాలను నిర్వహించినందుకు గాను ఆ సంప్రదాయంలో ఇతడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు.[8][9][10] తన జీవితకాలంలో, స్వామినారాయణ్ తన సిద్ధాంతాలను, నమ్మకాలను వివిధ మార్గాల్లో వ్యవస్థీకరించాడు.[11] తన అనుచరులు భగవంతుడిని భక్తితో ఆరాధించడానికి వీలుగా ఇతడు ఆరు మందిరాలను (దేవాలయాలను) నిర్మించాడు. అలాగే, 1826లో ఇతడు స్వయంగా రచించిన శిక్షాపత్రి వంటి గ్రంథాల ద్వారా ఒక ధార్మిక సంప్రదాయాన్ని ప్రోత్సహించాడు.[12][13][14][11][15][6][16] 1826లో, 'లేఖ్' అనే చట్టబద్ధమైన పత్రం ద్వారా స్వామినారాయణ లక్ష్మీ నారాయణ్ దేవ్ గాది (వడ్తాల్ గాది), నర నారాయణ్ దేవ్ గాది (అహ్మదాబాద్ గాది) అనే రెండు పీఠాలను ఏర్పాటు చేశాడు. ఈ పీఠాలకు తన ఇద్దరు మేనల్లుళ్లను దత్తత తీసుకుని, వారిని వారసత్వ ఆచార్యులుగా నియమించాడు. దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయడానికి, సన్యాసులకు దీక్ష ఇవ్వడానికి ఈ ఆచార్యులకు, వారి భార్యలకు అధికారం కల్పించాడు.[17][11]


జీవితచరిత్ర

[మార్చు]

ఘనశ్యామ్‌గా బాల్యం

[మార్చు]
ధర్మగ్రంథాల నుండి ఘనశ్యామ్ బోధిస్తున్న ధర్మదేవ్

స్వామినారాయణ 1781 ఏప్రిల్ 3న (చైత్ర శుద్ధ నవమి, విక్రమ శకం 1837), ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యకు సమీపంలోని ఛపయ్యా గ్రామంలో జన్మించాడు. అప్పట్లో ఈ ప్రాంతం అవధ్ నవాబు పాలనలో ఉండేది. సర్వరీయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇతనికి తల్లిదండ్రులు హరిప్రసాద్ పాండే (ధర్మదేవ్), ప్రేమవతీ పాండే (భక్తిమాత లేదా మూర్తిదేవి) ఘనశ్యామ్ పాండే అని నామకరణం చేశారు. స్వామినారాయణ జన్మదినం శ్రీరాముడు జన్మించిన శ్రీరామనవమి పర్వదినంతో కలిసి రావడం విశేషం. చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథిని స్వామినారాయణ అనుచరులు అటు శ్రీరామనవమిగానూ, ఇటు స్వామినారాయణ జయంతిగానూ జరుపుకుంటారు. ఈ వేడుక వారి మతపరమైన క్యాలెండర్‌కు ఆరంభ సూచికగా నిలుస్తుంది. స్వామినారాయణకు రామ్ ప్రతాప్ పాండే అనే అన్నయ్య, ఇచ్ఛారామ్ పాండే అనే తమ్ముడు ఉన్నారు.[18] ఇతడు ఏడు సంవత్సరాల వయస్సులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలలో ప్రావీణ్యం పొందాడని చెబుతారు.[19]

నీలకంఠ వర్ణిగా ప్రయాణం

[మార్చు]
తన ప్రయాణాల సమయంలో నీలకంఠ వర్ణి

తల్లిదండ్రుల మరణం తర్వాత, ఘనశ్యామ్ పాండే 1792 జూన్ 29న (ఆషాఢ శుద్ధ దశమి, విక్రమ శకం 1849) తన 11వ ఏట ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు.[20] తన ప్రయాణంలో ఇతడు నీలకంఠ వర్ణి అనే పేరును స్వీకరించాడు. వేదాంతం, సాంఖ్యం, యోగం, పాంచరాత్రం వంటి ధర్మశాస్త్రాల పట్ల సరైన అవగాహన కలిగి ఉన్న ఆశ్రమం కోసం నీలకంఠ వర్ణి భారతదేశమంతటా, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలలో పర్యటించాడు.[21] అటువంటి ఆశ్రమాన్ని కనుగొనడానికి, నీలకంఠ వర్ణి ప్రాథమిక వైష్ణవ వేదాంత వర్గాలకు సంబంధించి ఈ క్రింది ఐదు ప్రశ్నలను అడిగేవాడు: [22]

  • జీవం అంటే ఏమిటి?
  • ఈశ్వర అంటే ఏమిటి?
  • మాయ అంటే ఏమిటి?
  • బ్రహ్మం అంటే ఏమిటి?
  • పరబ్రహ్మం అంటే ఏమిటి?

తన ప్రయాణంలో భాగంగా, నీలకంఠ వర్ణి గోపాల్ యోగి అనే వృద్ధ యోగాచార్యుని మార్గదర్శకత్వంలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అష్టాంగ యోగాన్ని అభ్యసించాడు.[23] నేపాల్‌లో ఆయన రాజు రణబహదూర్ షాను కలిసి, ఆయనకు ఉన్న కడుపు సంబంధిత వ్యాధిని నయం చేశాడని చెబుతారు. దీనికి ప్రతిఫలంగా, ఆ రాజు తాను బంధించిన సన్యాసులందరినీ విడుదల చేశాడు.[24] నీలకంఠ వర్ణి పూరీ జగన్నాథ ఆలయాన్ని అలాగే బద్రీనాథ్, రామేశ్వరం, నాసిక్, ద్వారకా, పంధర్పూర్ దేవాలయాలను సందర్శించాడు.[20] 1799లో, ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఒక యోగిగా నీలకంఠుని పర్యటనలు చివరకు గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న లోజ్ అనే గ్రామంలో ముగిశాయి. లోజ్‌లో, నీలకంఠ వర్ణి రామానంద్ స్వామి ప్రధాన శిష్యుడైన ముక్తానంద్ స్వామిని కలుసుకున్నాడు. నీలకంఠుడి కంటే 22 ఏళ్లు పెద్దవాడైన ముక్తానంద్ స్వామి, ఇతడు అడిగిన ఐదు ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.[25] రామానంద్ స్వామిని కలిసే అవకాశం కోసం నీలకంఠుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్‌కు వచ్చిన కొన్ని నెలల తర్వాత రామానంద్ స్వామిని కలుసుకున్నాడు.[26] కుటుంబం పట్ల ఉన్న శారీరక అనుబంధం పూర్తిగా తొలగిపోవాలనే ఉద్దేశంతో, తన శరీరంలోని తల్లికి సంబంధించిన రక్త, మాంస ఛాయలను (వంశ పారంపర్య సంబంధాలను) అణచివేయడానికి ఆ సమయంలో తాను కఠోరమైన తపస్సు చేసినట్లు ఇతడు తర్వాతి కాలంలో వచనామృత్లో పేర్కొన్నాడు.[21]

సహజానంద్ స్వామిగా నాయకత్వం

[మార్చు]
స్వామినారాయణ సంప్రదాయ విగ్రహారాధన చిత్రం

ఈ సంప్రదాయం ప్రకారం, పంచ-తత్వాల (ఐదు శాశ్వత అంశాలు) ఆధ్యాత్మిక, జ్ఞానమీమాంస సిద్ధాంతాలపై నీలకంఠుడికి ఉన్న అవగాహన, అలాగే ఇతని మానసిక, శారీరక క్రమశిక్షణ, జ్యేష్ఠ గురువులైన రామానంద్ స్వాములను ఎంతో ప్రేరేపించాయి. 20 అక్టోబర్ 1800న రామానంద స్వామి నుండి నీలకంఠ వర్ణి సన్యాస దీక్షను పుచ్చుకున్నాడు, దానితో అతని కొత్త స్థితిని సూచించడానికి సహజానంద స్వామి, నారాయణ ముని అనే పేర్లు ఇవ్వబడ్డాయి.[27] సహజానంద స్వామి తన 21వ ఏట, రామానంద స్వామి మరణానికి ముందే ఆయన ద్వారా ఉద్ధవ సంప్రదాయానికి వారసుడిగా, నాయకుడిగా నియమితులయ్యాడు.[27] ప్రారంభంలో ఈ వారసత్వాన్ని ఆ గుంపులోని కొందరు వ్యతిరేకించి విడిపోయినప్పటికీ, త్వరలోనే ఇతడిని సత్సంగానికి నాయకుడిగా, భగవంతుడి స్వరూపంగా అందరూ అంగీకరించారు.[28] అప్పటి నుండి ఉద్ధవ సంప్రదాయం స్వామినారాయణ సంప్రదాయంగా పిలవబడటం ప్రారంభమైంది.[29] ఆధారాల ప్రకారం, ఇతడు కృష్ణుడు లేదా నారాయణుడు అనే ఏకైక దైవాన్ని ఆరాధించాలని ఉద్బోధించాడు.[30] కృష్ణుడిని ఇతడు తన ఇష్టదైవంగా భావించేవాడు. రాధా-వల్లభ సంప్రదాయం వంటి ఇతర వైష్ణవ శాఖలతో పోలిస్తే, కృష్ణుడి యొక్క చంచలమైన లేదా విలాసవంతమైన స్వభావం కంటే, ఇతడు మరింత పవిత్రమైన, క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాడు. [31] స్వామినారాయణ్ కృష్ణ భక్తుడైనప్పటికీ, కృష్ణతత్వంలోని శృంగారభరిత అంశాలను తిరస్కరించాడి. దానికి బదులుగా, పూర్వ వైష్ణవ ఆచార్యులైన రామానుజాచార్యులు, యామునాచార్యుల వలె భగవంతుడిని వైభవపూర్వకమైన, పవిత్రమైన భావనతో ఆరాధించడాన్ని ఇతడు సమర్థించాడు.[32]

దైవస్వరూపుడనే నమ్మకం

[మార్చు]

స్వామినారాయణ సంప్రదాయం ప్రకారం, రామానంద్ స్వామి మరణించిన పదిహేను రోజుల తర్వాత ఫనేనిలో జరిగిన ఒక సభలో సహజానంద స్వామి "స్వామినారాయణ" మంత్రాన్ని బోధించాడు. ఆ తర్వాతే ఇతడు 'స్వామినారాయణ'గా ప్రసిద్ధి చెందాడు.[33] ఈ సంప్రదాయం ప్రకారం, ఇతడు తన అనుచరులకు తమ నిత్య ఆచారాలలో జపించడానికి 'స్వామినారాయణ మంత్రం' అనే ఈ కొత్త మంత్రాన్ని ప్రసాదించాడు.[27] ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు, కొందరు భక్తులు సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. ఆ స్థితిలో తాము తమ ఇష్టదైవాలను దర్శించుకోగలుగుతున్నామని వారు పేర్కొనేవారు.[34][23][35][36] 1804వ సంవత్సరం నాటికే, అనేక అద్భుతాలు చేశాడని ప్రతీతి పొందిన స్వామినారాయణను, అతని శిష్యుడైన పరమహంస నిష్కులానంద్ స్వామి తన మొదటి రచనలో భగవంతుని అవతారంగా అభివర్ణించాడు. [27][37] 'యమ దండ' అని పిలవబడే ఈ గ్రంథం, స్వామినారాయణ సంప్రదాయంలో వెలువడిన మొట్టమొదటి సాహిత్య రచన.[38] 1825లో కలకత్తా లార్డ్ బిషప్ రెజినాల్డ్ హెబర్‌తో జరిగిన ఒక సమావేశంలో, స్వామినారాయణ్ స్వయంగా తాను భగవంతుని అవతారమని సూచించినట్లు చెప్పబడింది.[39] :81 స్వామినారాయణ అనుచరులలో కొందరు ఇతడిని శ్రీకృష్ణుడి అవతారంగా నమ్ముతారు. ఈ సంప్రదాయంలోని ప్రార్థనా పద్ధతులలో స్వామినారాయణ, శ్రీకృష్ణుడి చిత్రాలు, కథలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. స్వామినారాయణ జన్మవృత్తాంతం, భాగవత పురాణంలోని శ్రీకృష్ణుడి జన్మవృత్తాంతాన్ని పోలి ఉంటుంది.[40] ఇతడి అనుచరులలో అత్యధికులు స్వామినారాయణను కేవలం ఒక అవతారంగా మాత్రమే కాకుండా, నారాయణుడు లేదా పురుషోత్తమ నారాయణుడి (పరమాత్మ) సంపూర్ణ స్వరూపంగా భావిస్తారు. ఇతర అవతారాలన్నింటి కంటే ఇతడే అత్యున్నతమైన దైవమని వారు విశ్వసిస్తారు.[27] తమ స్థాపకుడు సాక్షాత్తూ పరమాత్మ అవతారమని అనేకమంది అనుచరులు నమ్మడం విమర్శలకు కూడా దారితీసింది.[41] ప్రొఫెసర్ రేమండ్ బి. విలియమ్స్ ప్రకారం, స్వామినారాయణ ప్రపంచాన్ని త్యజించి సన్యాస దీక్ష తీసుకున్నప్పటికీ, తన అనుచరుల నుండి భారీ బహుమతులు స్వీకరించడం, ఒక మహారాజులా వస్త్రధారణ చేస్తూ ప్రయాణించడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి స్వామినారాయణ స్పందిస్తూ, తన అనుచరుల విముక్తి (మోక్షం) కోసమే తాను ఆ బహుమతులను స్వీకరిస్తున్నానని సమాధానమిచ్చాడు.[42]

బోధనలు

[మార్చు]

స్వామినారాయణ తన అనుచరులు భక్తిని, ధర్మాన్నీ మిళితం చేస్తూ ఒక పవిత్రమైన జీవితాన్ని గడపాలని ప్రోత్సహించాడు. హిందూ గ్రంథాలను, ఆచారాలను తన సంస్థకు పునాదిగా చేసుకున్న స్వామినారాయణ, తర్వాతి శతాబ్దాలలో గుజరాతీ మూలాలతో కూడిన ఒక బలమైన అంతర్జాతీయ సంస్థను స్థాపించాడు.[43] ఆలయాలలో స్త్రీ పురుషులు వేర్వేరుగా ఉండాలనే నిబంధనను ఇతడు చాలా ఖచ్చితంగా అమలు చేసేవాడు.[44] మాంసం, మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం, వ్యభిచారం, ఆత్మహత్య, జంతు బలి, నేర కార్యకలాపాలు, దయ్యాలు, తాంత్రిక ఆచారాలను బుజ్జగించడాన్ని స్వామినారాయణ వ్యతిరేకించాడు.[45][46][47][48] ఔషధ ప్రయోజనాల కోసం కూడా మద్యం సేవించడాన్ని ఇతడు నిషేధించాడు.[49] ఇతని శిష్యులుగా మారడానికి ముందు చాలామంది అనుచరులు ప్రత్యేక నియమాలను పాటిస్తామని ప్రమాణాలు చేసేవారు. అంతిమ మోక్షం సిద్ధించాలంటే ధర్మం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే నాలుగు అంశాలను సాధించాలని ఇతడు పేర్కొన్నాడు. సిద్ధాంతపరంగా, స్వామినారాయణ 11వ శతాబ్దపు దార్శనికుడు రామానుజాచార్యుల విశిష్టాద్వైతానికి దగ్గరగా ఉండేవాడు. ఆదిశంకరాచార్యుల 'అద్వైత' సిద్ధాంతాన్ని (పరమాత్మ నిరాకారుడని, జీవాత్మ-పరమాత్మ ఒక్కటేనని చెప్పే వాదం) ఇతడు విమర్శించాడు. స్వామినారాయణ్ తత్వశాస్త్రం ప్రకారం పరమాత్మ నిరాకారుడు కాదు; భగవంతుడు ఎల్లప్పుడూ ఒక దివ్యమైన రూపాన్ని కలిగి ఉంటాడని ఇతడు నొక్కి చెప్పాడు. స్వామినారాయణ్ సిద్ధాంతం పరబ్రహ్మం, అక్షరబ్రహ్మం అనేవి రెండు విభిన్నమైన, శాశ్వతమైన సత్యాలని స్పష్టం చేస్తుంది.

ఇతర మతాలతో, బ్రిటిష్ ప్రభుత్వంతో సంబంధాలు

[మార్చు]
1822లో అహ్మదాబాద్లో బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించబడిన మొదటి స్వామి నారాయణ మందిరం

స్వామినారాయణ ఇతర మతాల నాయకులతో సత్సంబంధాలను కొనసాగించేవాడు. ఇతని అనుచరులలో ముస్లింలు, పార్సీలు కూడా ఉండేవారు. అలాగే ఇతని వ్యక్తిగత సహాయకులలో కొందరు ఖోజా ముస్లింలు ఉండటం విశేషం. 1825లో అప్పటి క్రైస్తవ మతగురువు బిషప్ రెజినాల్డ్ హెబర్‌తో ఇతడు భేటీ అయ్యాడు. ఇద్దరు మతపెద్దలు తమ అంగరక్షక సైన్యాలతో కలిసిన ఈ సమావేశం ఇరువురి మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించింది.

అప్పట్లో అధికారంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంతో కూడా ఇతనికి మంచి సంబంధాలు ఉండేవి. అహ్మదాబాద్‌లో ఇతడు నిర్మించిన మొదటి ఆలయానికి ప్రభుత్వం 5,000 ఎకరాల భూమిని ఇచ్చింది. దాని ప్రారంభోత్సవ సమయంలో 101 తుపాకుల గౌరవ వందనం సమర్పించింది. 1830లో బాంబే గవర్నర్ సర్ జాన్ మాల్కమ్‌ను కలిసినప్పుడు, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో స్వామినారాయణ చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించాడు. ఆ సమయంలో ఇతడు గవర్నర్‌కు బహుకరించిన 'శిక్షాపత్రి' ప్రతి ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బోడ్లియన్ లైబ్రరీలో భద్రపరచబడింది.

గుజరాత్‌లో హింసను అరికట్టి శాంతిని నెలకొల్పడంలో బ్రిటిష్ పాలన, స్వామినారాయణ్ సంప్రదాయం సమాంతరంగా పనిచేశాయని చరిత్రకారులు భావిస్తారు. ఇతడు చేపట్టిన సామాజిక సంస్కరణలను బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎంతగానో గౌరవించింది.

స్థానిక కాథీ పాలకులతో సంబంధాలు

[మార్చు]

స్వామినారాయణ్ కతియావాడ్ పాలకులైన కాథీలతో సన్నిహితంగా ఉంటూ, వారి సంస్కృతిని అనుసరించడం వల్ల "కాథియా భగవాన్" అని పిలవబడ్డాడు. స్థానిక మతపరమైన వ్యతిరేకత నుండి కాథీలు ఇతడికి రక్షణ కల్పించడమే కాకుండా, ఇతడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆశ్రయమిచ్చారు. ముఖ్యంగా దేవాలయాల నిర్మాణ సమయంలో ఎదురైన రాజకీయ అడ్డంకులను తొలగించడంలో వారు కీలక పాత్ర పోషించారు; ఉదాహరణకు, భావ్‌నగర్ పాలకుల వ్యతిరేకతను అధిగమించి గధడాలోని గోపీనాథ్‌జీ మందిర నిర్మాణం పూర్తయ్యేలా కాథీ నాయకులు సహకరించారు.

దేవాలయాలు, సన్యాసులు

[మార్చు]
గదడాలో స్వామినారాయణతో పరమహంసలు

స్వామినారాయణ తన జీవితకాలంలో ఆరు భారీ ఆలయాలను స్వయంగా నిర్మించి, వాటిలో రాధాకృష్ణ, నర-నారాయణ, లక్ష్మీనారాయణ వంటి దేవతా మూర్తులను ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహాలు ఇతని కృష్ణ భక్తికి నిదర్శనం. ఇతడు 1822లో అహ్మదాబాద్‌లో మొదటి ఆలయాన్ని నిర్మించగా, ఆ తర్వాత భుజ్ (1823), వడ్తాల్ (1824), ధోలేరా (1826), జునాగఢ్ (1828), గధడా (1828)లలో ఆలయాలను పూర్తి చేశాడు. వీటితో పాటు హోలీ, జన్మాష్టమి వంటి పండుగలను 'రాసలీల' వంటి జానపద నృత్యాలతో నిర్వహించే సంప్రదాయాన్ని ఆయన ప్రవేశపెట్టాడు.

ఈ సంప్రదాయ అభివృద్ధిలో సన్యాసులు కీలక పాత్ర పోషించారు. స్వామినారాయణ ఒకే రాత్రిలో 500 మంది సన్యాసులకు 'పరమహంస' దీక్షను ఇచ్చాడని ప్రతీతి. ముక్తానంద్ స్వామి, గోపాలానంద్ స్వామి, బ్రహ్మానంద్ స్వామి వంటి ప్రముఖ పరమహంసలు ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ, ఈ ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

అహ్మదాబాద్, వడ్తాల్ గాది

[మార్చు]

స్వామినారాయణ తన మరణానికి ముందే, తన వారసులుగా ఆచార్యుల వ్యవస్థను నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆయన 1825 నవంబర్ 21న నర నారాయణ్ దేవ్ గాది (అహ్మదాబాద్),లక్ష్మీ నారాయణ్ దేవ్ గాది (వడ్తాల్) అనే రెండు పీఠాలను (గాది) ఏర్పాటు చేశాడు. తన సందేశాన్ని ప్రచారం చేయడానికి, స్వామినారాయణ్ సంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఈ పీఠాలకు ఆచార్యులను నియమించాడు. తన కుటుంబ సభ్యుల కోసం ఉత్తరప్రదేశ్‌లో వెతికించి, తన అన్నదమ్ముల కుమారులను ఇతడు దత్తత తీసుకున్నాడు. తన పెద్దన్నయ్య రామప్రతాప్ కుమారుడైన అయోధ్యాప్రసాద్‌ను అహ్మదాబాద్ పీఠానికి, చిన్న తమ్ముడు ఇచ్చారామ్ కుమారుడైన రఘువీరను వడ్తాల్ పీఠానికి ఆచార్యులుగా నియమించాడు. ఈ ఆచార్య పదవి వారసత్వంగా ఉండాలని, తద్వారా తన కుటుంబ రక్తసంబంధం కొనసాగాలని ఇతడు ఆదేశించాడు. ఈ రెండు పీఠాల పరిధిని, పరిపాలనా విభజనను వివరిస్తూ ఇతడు 'దేశ్ విభాగ లేఖ్' అనే పత్రాన్ని స్వయంగా రూపొందించాడు. భక్తులు, సన్యాసులందరూ ఈ ఇద్దరు ఆచార్యులతో పాటు, సంప్రదాయానికి ప్రధాన స్తంభంగా భావించబడే ప్రధాన సన్యాసి గోపాలానంద్ స్వామి ఆజ్ఞలను పాటించాలని ఇతడు నిర్దేశించాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ గాదికి కౌశలేంద్రప్రసాద్ పాండే, వడ్తాల్ గాదికి అజేంద్రప్రసాద్ పాండే ఆచార్యులుగా ఉన్నారు.

మరణం

[మార్చు]
ధోలేరాలోని స్వామినారాయణ స్థాపించిన (1818-26) మందిరంలో మదన్ మోహన్ (మధ్య), రాధ (క కుడి)తో పాటు హరికృష్ణ (ఎడమ) రూపంలో స్వామినారాయణ

1830లో స్వామినారాయణ తన అనుచరులను సమీకరించి తన నిష్క్రమణను ప్రకటించాడు. తరువాత ఇతడు 1830 జూన్ 1(జ్యేష్ఠ శుద్ధ దశమి, విక్రమ శకం 1886)న మరణించాడు. స్వామినారాయణ మరణించిన సమయంలో, ఈ భూలోకాన్ని విడిచి తన శాశ్వత నివాసమైన 'అక్షరధామ్'కు చేరుకున్నాడని ఇతని అనుచరులు విశ్వసిస్తారు.[50][23][51] హిందూ సంప్రదాయాల ప్రకారం, గధడాలోని లక్ష్మీ వాడిలో ఇతని అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి..[52]

సామాజిక దృక్పథం

[మార్చు]

మహిళలు

[మార్చు]

ఆ కాలంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, విద్య అనేది మహిళలతో సహా అందరి ప్రాథమిక హక్కు అని ఇతడు నొక్కి చెప్పాడు. దీనివల్ల ఇతని అనుచరులలో మహిళా అక్షరాస్యత పెరిగి, వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే స్థాయికి ఎదిగారు. సతీసహగమనాన్ని ఇతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అది వేద సమ్మతం కాదని, అది కేవలం ఆత్మహత్యతో సమానమని వాదించాడు. ఆడపిల్లల శిశుహత్యలను నిరోధించడానికి, పేద తల్లిదండ్రులకు వరకట్న ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించాడు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అప్పటి కొన్ని సంప్రదాయాలను ఈయన విమర్శించాడు. సన్యాసులు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి వీలుగా, స్త్రీ పురుష సన్యాసుల మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదని కఠినమైన నియమాలను విధించాడు. దేవాలయాలలో మహిళలకు ప్రత్యేక విభాగాలు కేటాయించాడు. అలాగే రుతుసమయంలో పూజలకు దూరంగా ఉండటం వంటి నియమాలను ప్రవేశపెట్టాడు. విధవలు పునర్వివాహం చేసుకునేందుకు ఇతడు అనుమతించాడు. నిష్ఠగా ఉండాలనుకునే వారికి కుటుంబంలోని పురుషుల పర్యవేక్షణలో ఉండాలని సూచించాడు. ఇది అప్పటి సామాజిక పరిస్థితుల్లో వారికి గౌరవప్రదమైన,సురక్షితమైన స్థానాన్ని కల్పించింది.

కుల వ్యవస్థ, పేదరికం

[మార్చు]
పేదలకు ఆహార ధాన్యాల పంపిణీలో స్వామినారాయణ

ఇతడు నిరుపేదలకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కరువు కాలంలో ప్రజలకు ఆహార, నీటి సదుపాయాలను స్వయంగా నిర్వహించాడు. స్వామినారాయణ కులవివక్షను రూపుమాపడానికి ప్రయత్నించాడని, అందరినీ తన సంప్రదాయంలోకి ఆహ్వానించాడని కొందరు పేర్కొంటారు. బ్రిటిష్ అధికారి విలియమ్సన్ ఇతడిని "కులాల సంకెళ్లను తెంచినవాడు" అని అభివర్ణించాడు. ఇతడు తన పరమహంసలను (సన్యాసులను) సమాజంలోని అన్ని వర్గాల నుండి భిక్ష స్వీకరించమని ఆదేశించాడు. అలాగే అణగారిన వర్గాల వారిని తన వ్యక్తిగత సహాయకులుగా నియమించుకున్నాడు. ఇతడు దళితులను, తక్కువ కులాల వారిని ప్రార్థనా స్థలాలను సందర్శించడానికి అనుమతించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో దళితులను ఆలయాల నుండి దూరంగా ఉంచడం వంటి పరిమితులు ఉండేవి. తక్కువ కులాల వారు నుదుట పూర్తి తిలకాన్ని ధరించడంపై కూడా అప్పట్లో నిషేధాలు ఉండేవి. కలకత్తా బిషప్ రెజినాల్డ్ హెబర్ గమనికల ప్రకారం స్వామినారాయణ శిష్యులు కులమతాలకు అతీతంగా ఉండేవారు. "వారంతా సోదరుల్లా జీవిస్తారు" అని ఆయన రాశాడు. కుల విభేదాల గురించి అడిగినప్పుడు... లోకంలో ప్రజలు విడివిడిగా తిన్నా, పైన (స్వర్గంలో) ఇటువంటి వ్యత్యాసాలు ఉండవని స్వామినారాయణ సమాధానమిచ్చాడు. మోక్షం అనేది అందరికీ సాధ్యమేనని, ఆత్మకు స్త్రీ, పురుష భేదం కానీ, కుల పట్టింపు కానీ ఉండదని ఇతడు బోధించాడు.

జంతు బలులు, యజ్ఞాలు

[మార్చు]

స్వామినారాయణ జంతుబలిని వ్యతిరేకించాడు.[53] ఈ సమస్యను పరిష్కరించడానికి, స్వామినారాయణ వారణాసికి చెందిన పూజారులతో కూడిన అనేక యజ్ఞాలను పెద్ద ఎత్తున నిర్వహించాడు. అటువంటి యజ్ఞాల ద్వారా అహింసను పునరుద్ధరించడంలో స్వామినారాయణ విజయవంతమయ్యాడు. స్వామినారాయణ తన అనుచరులలో శాకాహరాన్ని ప్రోత్సహించాడు. మాంసాహార భక్షణను ఖచ్చితంగా నిషేధించాడు; ఈ నియమాలను ఇతడు తన శిక్షాపత్రిలో కూడా పొందుపరిచాడు.[49][54][55][56]

పవిత్ర గ్రంథాలు

[మార్చు]
గదడా వేప చెట్టు కింద స్వామినారాయణ

స్వామినారాయణ సాధారణ హిందూ ధర్మగ్రంథాలను ప్రచారం చేశాడు.[43] ముఖ్యంగా ఇతడు భాగవత పురాణానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చాడు.[57] అయినప్పటికీ, స్వామినారాయణ్ స్వయంగా రాసినవి లేదా ఆయన అనుచరులు రచించినవి కూడా ఈ సంప్రదాయంలో 'శాస్త్రాలు' లేదా పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడతాయి.ఈ విభాగంలో అత్యంత ప్రసిద్ధ గ్రంథాలు శిక్షాపత్రి , వచనామృత్‌ తో పాటుగా ఇతర ముఖ్యమైన గ్రంథాలలో సత్సంగి జీవన్, స్వామినారాయణ అధీకృత జీవిత చరిత్ర, ముక్తానంద్ కావ్య, నిష్కులానంద్ కావ్య, భక్త చింతామణి మొదలైనవి ఉన్నాయి.[58]

శిక్షాపత్రి

[మార్చు]

స్వామినారాయణ 1826 ఫిబ్రవరి 11న శిక్షాపత్రి వ్రాశాడు.[59] అసలు సంస్కృత వ్రాతప్రతి అందుబాటులో లేనప్పటికీ, దీనిని స్వామినారాయణ మార్గదర్శనంలో నిత్యానంద స్వామి గుజరాతీలోనికి అనువదించాడు.[49]ఈ గ్రంథాన్ని ఆ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. 'గెజిటీర్ ఆఫ్ ది బాంబే ప్రెసిడెన్సీ' దీనిని భక్తులు పాటించవలసిన సామాజిక నియమాల పుస్తకంగా అభివర్ణించింది. ఇది ధర్మాచరణ, అవగాహనపై రాసిన వ్యాఖ్యానం. ఈ చిన్న పుస్తకంలో 212 సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. తన అనుచరులు క్రమశిక్షణతో కూడిన, నైతిక జీవితాన్ని గడపడానికి పాటించవలసిన ప్రాథమిక సూత్రాలను స్వామినారాయణ ఇందులో వివరించాడు. ఈ గ్రంథం యొక్క అత్యంత పురాతన ప్రతి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బోడ్లియన్ లైబ్రరీలో భద్రపరచబడింది. సహజానంద స్వామి స్వయంగా అందించిన అతికొద్ది ప్రతులలో ఇది ఒకటి. స్వామినారాయణ ఈ శిక్షాపత్రిలో పలుచోట్ల శ్రీకృష్ణుడిని అత్యున్నత దైవంగా వర్ణించాడు.

వచనామృత్

[మార్చు]

వచనామృత్ అనేది 1819 నుండి 1829 వరకు స్వామినారాయణ బోధించిన 273 ఆధ్యాత్మిక ప్రసంగాల సంకలనం. ఇది స్వామినారాయణ్ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంత గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇతని ప్రధాన శిష్యులు నలుగురు దీనిని క్రోడీకరించగా, స్వామినారాయణ స్వయంగా దీనిని సమీక్షించి ఆమోదించాడు. అనుచరులు స్వామినారాయణను సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపంగా నమ్ముతారు కాబట్టి, వచనామృతాన్ని భగవంతుని ప్రత్యక్ష వాణిగా భావిస్తారు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర హిందూ ధర్మగ్రంథాలకు ఇది అత్యంత ఖచ్చితమైన వ్యాఖ్యానమని వారి విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామినారాయణ్ దేవాలయాలలో ప్రతిరోజూ ఈ గ్రంథ పఠనం, దీనిపై ప్రసంగాలు నిర్వహించబడతాయి.[60][61] : 21–27 :21–27

సత్సంగి జీవన్

[మార్చు]

సత్సంగి జీవన్ అనేది స్వామినారాయణ్ యొక్క అధికారిక జీవిత చరిత్ర.[62] ఈ గ్రంథం ఆయన జీవిత విశేషాలను, బోధనలను వివరిస్తుంది. దీనిని శతానంద్ స్వామి రచించగా, విక్రమ శకం 1885లో పూర్తి చేయబడింది. దాదా ఖాచర్, ఆయన సోదరీమణుల కోరిక మేరకు స్వామినారాయణ గధడాను తన శాశ్వత నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే శతానంద్ స్వామిని తన జీవిత విశేషాలపై ఒక పుస్తకాన్ని రాయవలసిందిగా స్వామినారాయణ ఆదేశించాడు. శతానంద్ స్వామికి స్వామినారాయణ్ బాల్యం నుండి జరిగిన విషయాలన్నీ తెలిసేలా, ఆయనకు 'సంజయ్ దృష్టి' (అతీతమైన భూతకాల దర్శన శక్తి)ని ప్రసాదించాడు. శతానంద్ స్వామి ఈ గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత, స్వామినారాయణ్ స్వయంగా దానిని చదివి, సరిచూసి ధృవీకరించాడు. ఆ పుస్తకం పట్ల ఇతడు ఎంతో సంతృప్తి చెందాడు. తన భక్తులందరినీ 'సత్సంగి జీవన్' పారాయణ చేయవలసిందిగా స్వామినారాయణ సూచించాడు.[60]

వారసత్వం

[మార్చు]

చీలికలు

[మార్చు]

స్వామినారాయణ మరణించిన దశాబ్దాల తర్వాత, వారసత్వానికి సంబంధించిన విభిన్న అవగాహనల కారణంగా ఈ సంప్రదాయంలో పలు విభాగాలు ఏర్పడ్డాయి. వీటిలో బోచాసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) ప్రధానమైనది; దీని స్థాపకుడు 1905లో వడ్తాల్ గాది నుండి విడిపోయాడు. అలాగే మణినగర్ స్వామినారాయణ్ గాది సంస్థాన్ స్థాపకుడు 1940లలో అహ్మదాబాద్ గాది నుండి బయటకు వచ్చాడు. BAPS అనుచరులు గుణాతీతానంద్ స్వామిని స్వామినారాయణకు ఆధ్యాత్మిక వారసుడిగా నమ్ముతారు. స్వామినారాయణ స్వయంగా పలు సందర్భాలలో గుణాతీతానంద స్వామిని సాక్షాత్తూ 'అక్షరబ్రహ్మ' స్వరూపంగా భక్తులకు వెల్లడించారని వారు వాదిస్తారు. స్వామినారాయణ ఆచార్యులకు కేవలం పరిపాలనాపరమైన నాయకత్వాన్ని ఇచ్చారని, గుణాతీతానంద స్వామికి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అప్పగించారని BAPS విశ్వసిస్తుంది. ప్రస్తుతం BAPS సంస్థకు మహంత్ స్వామి మహారాజ్ ఆధ్యాత్మిక, పరిపాలనా నాయకుడిగా ఉన్నాడు. మరోవైపు, మణినగర్ స్వామినారాయణ్ గాది సంస్థాన్ అనుచరులు గోపాలానంద్ స్వామిని స్వామినారాయణ వారసుడిగా పరిగణిస్తారు. ఈ విభాగానికి ప్రస్తుతం పురుషోత్తంప్రియదాస్జీ మహారాజ్ నాయకత్వం వహిస్తున్నాడు.[63]

అభివృద్ధి

[మార్చు]
అహ్మదాబాద్లోని మొదటి స్వామినారాయణ ఆలయంలో స్వామినారాయణ స్థాపించిన నారనారాయణ.

జీవితచరిత్రకారుడు రేమండ్ విలియమ్స్ ప్రకారం, స్వామినారాయణ మరణించినప్పుడు, ఆయనకు 18 లక్షల మంది అనుచరులు ఉన్నారు. 2001లో, నాలుగు ఖండాల్లో స్వామినారాయణ కేంద్రాలు ఉండేవి. ఈ భక్తుల సంఖ్య ఐదు మిలియన్లుగా నమోదు చేయబడింది. వీరిలో ఎక్కువ భాగం గుజరాత్ మాతృభూమిలో ఉన్నారు.[64][65] హిందూ మతానికి చెందిన స్వామినారాయణ శాఖ సభ్యులు 2007లో ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా (2 కోట్లు) ఉన్నారని వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ అంచనా వేసింది.[66]

స్పందనలు, విమర్శలు

[మార్చు]

స్వామినారాయణ్ సిద్ధాంతాలు, ఆయన భగవంతుని అవతారమనే నమ్మకంపై హిందూ సంస్కరణవాద నాయకుడు దయానంద సరస్వతి (1824–1883) విమర్శలు గుప్పించాడు. స్వామినారాయణను పరమాత్మగా అంగీకరించడాన్ని ఆయన ప్రశ్నించాడు. స్వామినారాయణ దర్శనం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుందనే భావనను తప్పుబట్టారు. వేద మార్గం నుండి వైదొలిగారని ఆయన ఆరోపిస్తూ, అనుచరులు అక్రమంగా సంపదను సేకరిస్తున్నారని, "మోసపూరిత విద్యలను" ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 1875లో ప్రచురితమైన దయానంద సరస్వతి అభిప్రాయాల ప్రకారం, అనుచరులను ఆకర్షించడానికి స్వామినారాయణ తనను తాను నారాయణుడిగా అలంకరించుకోవడం ఒక "చారిత్రక వాస్తవం".

1918లో మహాత్మా గాంధీ తన మేనల్లుడికి రాసిన లేఖలో, స్వామినారాయణ విలువలు తన వైష్ణవ తత్వానికి పూర్తిస్థాయిలో సరిపోలడం లేదని, స్వామినారాయణ బోధించిన ప్రేమ కేవలం "భావోద్వేగపూరితమైనది" అని అభిప్రాయపడ్డాడు. గాంధీ దృష్టిలో, స్వామినారాయణ్ అహింస యొక్క అసలు సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. అయితే, 1924లో గాంధీ తన అభిప్రాయాన్ని మారుస్తూ, స్వామినారాయణ కృషిని అభినందించాడు. "గుజరాత్‌లో సహజానంద్ (స్వామినారాయణ్) ఒక్కరే సాధించిన దానిని, ప్రభుత్వ అధికారం కూడా సాధించలేకపోయింది" అని ఆయన కొనియాడాడు.[67]

మూలాలు

[మార్చు]
  1. Williams (2001), p. 13.
  2. Williams (2001), p. 35.
  3. Kim (2010).
  4. 1 2 Jones (2005).
  5. Olson (2007).
  6. 1 2 3 4 Williams (2018).
  7. Singleton, Mark; Goldberg, Ellen (2013). Gurus of modern yoga. New York, NY. ISBN 978-0-19-993871-1. OCLC 861692270.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  8. Raval (2012).
  9. Mangalnidhidas (2016).
  10. Paramtattvadas, Williams & Amrutvijaydas (2016).
  11. 1 2 3 Schreiner (2001).
  12. S.Patel (2017).
  13. Trivedi (2015).
  14. Hatcher (2020).
  15. Paramtattvadas (2017).
  16. Parikh (2016).
  17. Williams (2001).
  18. Makarand R. Paranjape (2005). Dharma and development: the future of survival. Samvad India. p. 111. ISBN 978-81-901318-3-4. Retrieved 12 September 2009.
  19. M. Gupta (2004). Let's Know Hindu Gods and Goddesses. Star Publications. p. 33. ISBN 978-81-7650-091-3. Retrieved 15 May 2009.
  20. 1 2 "Sampradat history: Nilkanth Varni". Harrow, England: Shree Kutch Satsang Swaminarayan Temple. Archived from the original on 30 June 2009. Retrieved 2009-07-06.
  21. 1 2 Williams (2001)
  22. Williams (2001)
  23. 1 2 3 Dinkar Joshi; Yogesh Patel (2005). Glimpses of Indian Culture. Star Publications. pp. 92–93. ISBN 978-81-7650-190-3. Retrieved 7 May 2009.
  24. Gujarat (India) (1969). Gujarat State Gazetteers: Bhavnagar. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. p. 577. Retrieved 15 May 2009.
  25. Williams (2001)
  26. Williams (2001)
  27. 1 2 3 4 5 Williams (2001)
  28. Williams 2018, p. 17-18.
  29. Williams (2001)
  30. Tribes and Castes of the Central Provinces of India. Vol. 1. Asian Educational Services, India. 1995. p. 326. ISBN 978-81-206-0833-7.
  31. Guy L. Beck (24 March 2005). Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity. SUNY Press. pp. 65–. ISBN 978-0-7914-6415-1.
  32. Aldwinckle, Russell Foster (1976). More than man: a study in christology. Grand Rapids, Mich: Eerdmans. p. 223. ISBN 978-0-8028-3456-0.
  33. Anil Kumar Sarkar (1997). Yoga, mathematics, and computer sciences: in change confronting the dawn of the twenty-first century. South Asian Publishers. p. 53. ISBN 978-81-7003-204-5. Retrieved 12 September 2009.
  34. Williams (2001)
  35. Kirin Narayan (1992). Storytellers, Saints and Scoundrels. Motilal Banarsidass Publ. p. 141. ISBN 978-81-208-1002-0. Retrieved 8 May 2009.
  36. Williams (2001)
  37. Takashi Shinoda (2002). The other Gujarat. Popular Prakashan. p. 9. ISBN 978-81-7154-874-3. Retrieved 27 June 2009.
  38. Williams (2001)
  39. Raymond Brady Williams (2004). Williams on South Asian religions and immigration. Ashgate. ISBN 978-0-7546-3856-8. OL 9414082M. Retrieved 7 May 2009.
  40. Williams (2001)
  41. Schmidt, Richard M. (2015). Sages, Saints, and Seers: A Breviary of Spiritual Masters. Morehouse Publishing. p. 114. ISBN 9780819229267.
  42. Williams (2001)
  43. 1 2 Cybelle Shattuck; Nancy D. Lewis (2003). The pocket idiot's guide to Hinduism. Alpha Books. pp. 163–165. ISBN 978-0-02-864482-0. Retrieved 12 September 2009.
  44. Robert Vane Russell (2009) [1916]. The Tribes and Castes of the Central Provinces of India. BiblioBazaar. p. 404. ISBN 978-0-559-11371-0. Retrieved 12 September 2009.
  45. Rohit Barrot (1987). Richard Burghart (ed.). Caste and sect in Swaminaran Movement. Vol. Hinduism in Great Britain. Routledge. pp. 67–70. ISBN 978-0-422-60910-4. Retrieved 8 May 2009.
  46. Williams (2001)
  47. David Gordon White (2001). Tantra in practice. Motilal Banarsidass Publ. p. 269. ISBN 978-81-208-1778-4. Retrieved 12 September 2009.
  48. Williams (2001)
  49. 1 2 3 M. G. Chitkara (1997). "Swaminarayan, Pramod Mahajan, Bal Thackeray". Hindutva. APH Pub. Corp. pp. 227–228. ISBN 978-81-7024-798-2.
  50. Williams (2001)
  51. Williams (2001)
  52. Williams (2001)
  53. Christopher John Fuller (2004). The camphor flame. Princeton University Press. p. 171. ISBN 978-0-691-12048-5. Retrieved 8 May 2009.
  54. M M Rahman (2006). Encyclopaedia of Historiography. Anmol Publications Pvt. Ltd. pp. 145, 146. ISBN 978-81-261-2305-6. Retrieved 10 June 2009.M M Rahman (2006). Encyclopaedia of Historiography. Anmol Publications Pvt. Ltd. pp. 145, 146. ISBN 978-81-261-2305-6. Retrieved 10 June 2009.
  55. Williams (2001)
  56. Prema A. Kurien (2007). A place at the multicultural table: the development of an American Hinduism. Rutgers University Press. p. 105. ISBN 978-0-8135-4056-6. Retrieved 8 May 2009. Page 105
  57. Julius Lipner (1998). Hindus: Their Religious Beliefs and Practices. Routledge. p. 124. ISBN 978-0-415-05182-8. Retrieved 12 September 2009.
  58. Williams (2001)
  59. "Shikshapatri". BAPS Swamiranayan Sanstha. Retrieved 10 February 2012.
  60. 1 2 "The resource cannot be found". Archived from the original on 27 May 2011. Retrieved 27 July 2016.
  61. Brear, Douglas (1996). Williams, Raymond Brady (ed.). Transmission of a Swaminarayan Hindu scripture in the British East Midlands (Columbia University Press ed.). New York: Columbia University Press. ISBN 0-231-10779-X. OCLC 34984234.
  62. "Shree Swaminarayanw Temple Cardiff – Scriptures". Archived from the original on 15 సెప్టెంబర్ 2008. Retrieved 15 మే 2026. {{cite web}}: Check date values in: |archive-date= (help). Archived from the original on 15 September 2008.
  63. "Guruparampara". Swaminarayangadi.com.
  64. Williams (2001)
  65. Rinehart, Robin (2004). Contemporary Hinduism. ABC-CLIO. p. 215. ISBN 978-1-57607-905-8. Retrieved 10 May 2009.
  66. "Niche Faiths". Indian Express. 2007-05-26. Retrieved 2009-05-06.
  67. Mahatma Gandhi (1967). The Collected Works of Mahatma Gandhi: Mar. 1922-May 1924. p. 469.

 

మరింత చదవండి

[మార్చు]